జ్ఞాపకాల పందిరి-40

54
10

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

మా కోసం.. మా అమ్మాయి..!!

[dropcap]ఆ[/dropcap]డపిల్ల అనగానే అనేక కుటుంబాలలో మరీ చిన్నచూపు. అది ఇంట్లో తల్లిదండ్రులతోనే ప్రారంభం  కావడం మరీ విశేషం. ఆడపిల్ల అంటే చిన్నపిల్లగా వున్నప్పటినుంచే అన్నిరకాలుగానూ వివక్షత చూపించే కుటుంబాలు ఇప్పటికీ ఉండడం దురదృష్టకరం. ఆహారం దగ్గర నుంచి, బట్టలు, చిన్న చిన్న కోర్కెలు, చదువు, ఇలా అన్నింటి విషయంలోనూ  “ఆడపిల్లవు నీకెందుకు?” అనే ప్రశ్న, బాణమై గుచ్చుకుని సున్నితమైన హృదయాలకు గాయం చేస్తుంది. పెళ్లి విషయం వచ్చేసరికి మరిన్ని సమస్యలు స్వాగతం పలుకుతాయి. అయితే ఇది అందరికీ వర్తించదు, కానీ చాలామందిలో ఉంటుంది.

ఈ రోజుల్లో ఆడ – మగ అంటూ తేడా ఏమీ లేదు, ఒక లింగభేదం తప్ప.

మాకు రెండవ సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాలతో పండగ చేసుకున్నంత పని చేసాం. చిన్నప్పటి నుంచి ఆమెను వేరుగా కాదు, ప్రత్యేకంగా పెంచాము. ఇద్దరు పిల్లలని సమానంగా పెంచాము, చదివించాము.

అనుకోని రీతిలో అబ్బాయి పై చదువులకోసం అమెరికా వెళ్ళాడు. నాకు ఇష్టం లేకపోయినా అబ్బాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నేను రాజీపడ్డాను. కానీ మానసిక వ్యథకు గురి అయ్యాను. అన్న బాటలోనే చెల్లెలు కూడా అమెరికా వెళ్లి అక్కడ తన ముఖ్యాంశం ‘జెనెటిక్స్’లో పరిశోధన చేసి అక్కడే స్థిరపడిపోవాలనుకుంది. కానీ నా మానసిక పరిస్థితిని అంచనా వేసింది. డిగ్రీలో ఉండగా అనుకున్న నిర్ణయం పోస్ట్-గ్రాడ్యుయేషన్‌కు వచ్చేసరికి మనసు (నిర్ణయం) మార్చేసుకుంది.

తానూ ఎక్కడికీ పోననీ, ఉద్యోగం చేసినా, పెళ్లి చేసుకున్నా, మాకు దరిదాపుల్లోనే ఉంటానని హామీ ఇచ్చింది. నా(మా) కోసం త్యాగం చెయ్యొద్దని చెప్పినా వినిపించుకోలేదు. చదువు పూర్తి అయింది, ఉద్యోగం సంపాదించుకుంది, మొదట సాఫ్ట్‌వేర్ సంబంధాలు చూడొద్దన్న అమ్మాయి, మాకు దగ్గరగా ఉండడం కోసం సాఫ్ట్‌వేర్ అబ్బాయినే ఎంచుకుని పెళ్లి చేసుకుంది. ఉద్యోగంలో భాగంగా మొదట నిజామాబాద్ పోస్టింగ్ వచ్చింది.

కలలో కూడా ఊహించని రీతిలో ఒక సంవత్సర కాలంలోనే తన వూరు వరంగల్‌కు బదిలీ అయి వచ్చేసింది. తల్లిదండ్రులుగా మా ఆనందానికి కొలబద్ద లేకుండా పోయింది. అమెరికాలో వున్న అన్న సూచనలతో సర్వం తానే అయి, మా.. సంరక్షకురాలి అవతారం ఎత్తింది. తన చిన్నారి కూతురితో పాటు మేము ఇప్పుడు ఆమెకు ముగ్గురు పిల్లలం తయారయ్యాము.

“కరోనా వచ్చింది, మీరెవరూ ఇల్లు కదలడానికి వీలు లేదు” అన్నది.

లాక్‌డౌన్ మార్గదర్శక సూత్రాలు పాటిస్తూ, తన ఉద్యోగ బాధ్యతలు క్రమశిక్షణతో నిర్వహిస్తూ, ఇంట్లో మాకు కావలసినవన్నీ సమకూరుస్తూ కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుకుంటున్నది మా కూతురు. ఈ పని మగాళ్లు మాత్రమే చేయాలి/చేస్తారు అన్న పాత చింతకాయ పచ్చడి కబుర్లకు భిన్నంగా ఆమె నిత్య కార్యక్రమాలు నిష్ఠగా, ధైర్యంగా చేసుకుంటూ పోతున్నది. అందుకే ఆడపిల్లలు కూడా ఉండాలి, ఇల్లు ఆనందనిలయంగా మారాలి. ఇది నా కూతురు గురించి మాత్రమే కాదు, ఇలాంటి కూతుళ్ళున్న అదృష్టవంతులైన తల్లిదండ్రులు ఎంతోమంది మన సమాజంలో వున్నారు. అందుచేత ఆడపిల్లలను తక్కువగా అంచనా వేయవలసిన కాలం కాదిది.

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, మా జీవిత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కనీ, వినీ, ఎరుగని సమస్య, సామాన్యుడి నుంచి, సామ్రాట్టులను, వారి జీవితాలను అతలాకుతలం చేసింది ‘కోవిడ్-19’. అంతేకాదు మనిషి జీవితంలో తెలుసుకోవలసిన విషయాలను తెలియజెప్పింది. ఎలా చెబితే మనిషి వింటాడో ఇప్పుడు అందరికీ అర్థం అయింది. పెద్దవాళ్ళ శేష జీవితంలో పిల్లలు ఎలా ప్రవర్తించాలో ముందుగానే తెలియజెప్పింది. పరిశుభ్రత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు వున్నవాళ్లు బయటి ప్రపంచంలో ఎలా మసులుకోవాలో, రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలో, నిత్యం నడక, వ్యాయామం, యోగా అవసరం ఎంత ఉందో, భౌతిక దూరం ఆవశ్యకత ఎలాంటిదో, మాస్క్ ఎందుకు, ఎలా, వాడుకోవాలో మొదలైన ముఖ్య అంశాలను మనిషికి అవగాహన కలిగే పరిస్థితిని తీసుకు వచ్చింది. ఇలా మనిషికి జ్ఞానోదయం అయ్యే పరిస్థితిని కలిగించింది.

అపారమైన ప్రాణ నష్టం జరిగినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులకు ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపింది. శానిటైజర్ విలువ తెలిసింది. మనిషి జాగ్రత్త తప్ప, మందులతో పెద్దగా పనిలేదని స్పష్టం చేసింది. బయటి నుండి తెచ్చిన వస్తువుల పట్ల తీసుకొనవలసిన జాగ్రత్తలు, ఆవిరి పట్టడంలో అంది వచ్చే ఆరోగ్యం గురించి గుచ్చి.. గుచ్చి మరీ చెప్పింది.

ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరి నెల నుండి నన్ను గేటు కూడా దాటకుండా కట్టడి చేసింది మా అమ్మాయి. నా ప్రాక్టీసుకి గుడ్ బై చెప్పించింది.

మార్కెట్టు ఎరగని మా అమ్మాయి, సూపర్ బజార్ చూడని అమ్మాయి అన్నీ తానే చేసుకుంటోంది. ఇంటి నుండే పని చేసే సౌకర్యం ఉండడం వల్ల, అల్లుడు వినోద్ కూడా మాతోనే ఉండడం వల్ల అమ్మాయి అప్పుడప్పుడు అతని సహకారం తీసుకుంటూ, సర్వం తానై పని చేసుకోవడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు పని అంతా తన భుజాలమీద మోపుతున్నాననే గిల్టీ ఫీలింగ్ కూడా వస్తూనే వుంది. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. అమ్మాయి ప్రేమలో ఇలా ఆనందంగా గడిపేస్తున్నాం. ఉద్యోగ రీత్యా ఇప్పటివరకూ మా అమ్మాయి మా దగ్గర ఉండడం, దానికి మా అల్లుడు సహకరించడం, నిజంగా మా అదృష్టమే!

ఇంతకీ మా అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా! ఆకాశవాణి, వరంగల్ కేంద్రంలో ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నిహర కానేటి. మా అల్లుడు వినోద్ కుమార్ నల్లి (ఇన్ఫోసిస్). ఇద్దరు కొడుకులకు సమానం మా అమ్మాయి.. అని చెప్పడం అతిశయోక్తి కానే కాదు!

మా అమ్మాయి నిహార కానేటి.
అల్లుడు వినోద్ కుమార్ నల్లి.
అబ్బాయి రాహుల్ కానేటి. బోస్టన్.. అమెరికా
మనవరాలు ఆన్షి తో మేమిద్దరం.
మా ఇల్లు, హనంకొండ

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here