జ్ఞాపకాల పందిరి-43

52
11

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నారీమణి – నష్ట పరిహారం!!

[dropcap]కొ[/dropcap]న్ని అనుభవాలు వింతగా, గమ్మత్తుగా, మరచిపోలేనంతగా ఉంటాయి. జీవిత పుటల్లో అవి చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి సన్నివేశం ఎక్కడైనా పునరావృతం అయితే, మన ఆలోచనలు ఒక్కసారి వెనక్కిమళ్లి గతాన్ని ఓమారు సింహావలోకనం చేసుకునేలా చేస్తాయి. అప్పటి సన్నివేశాలు మన కళ్ళముందు బొమ్మ కట్టిస్తాయి. ఇలాంటి వాటిగురించి పట్టించుకునే వాళ్ళు, సేపు ఆలోచిస్తారు, మిగతా వాళ్ళతో సమస్యే లేదు. కానీ.. కుటుంబ పరమైన జ్ఞాపకాలు ఒక ఎత్తైతే, వృత్తి -ప్రవృత్తి పరమైన అనుభవాలు లేదా జ్ఞాపకాలు మరో ఎత్తు!

వృత్తి పరమైన అనుభవాలు సాధారణంగా మరచిపోలేనివే అయి ఉంటాయి. బహుశః సందార్భాలను బట్టి అలా ఉండవచ్చు. అందుకే అవి ఎవరికైనా బాగా గుర్తుండి పోతాయి. పైగా ఇవి పరులతో ముడిపడి ఉంటాయి కనుక మరచిపోలేనంతగా మస్తిష్కంలో ముద్రపడిపోయి ఉంటాయి. ముఖ్యంగా ఆసుపత్రుల్లో పని చేసే వారికి రకరకాల సమస్యలు ఉత్పన్న మవుతాయి. ప్రజలతో సంబంధాలు డైరెక్టుగా వున్న కార్యాలయాల్లో ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి. ఆసుపత్రుల్లో వైద్యులకు – నర్సులకు మధ్య, నర్సులకు మగ సిబ్బందికి మధ్య, సిబ్బందికి – బయటివారికి మధ్య వింత -వింత సమస్యలు తలెత్తవచ్చు. అవి కొన్ని అప్పటికప్పుడు మర్చిపోయేవిగా, మరికొన్ని ఎప్పుడూ మర్చిపోలేని అనుభవాలు ప్రోది చేసుకుంటాయి.

దంతవైద్యుడిగా, నేను మొత్తం నాలుగు ఆసుపత్రుల్లో పనిచేసాను. ప్రతి ఆసుపత్రిలోనూ ఒక ప్రత్యేకమైన అనుభవం ఎదురైంది. ఇప్పుడు నేను అవన్నీ ఇక్కడ ప్రస్తావించ దలచుకోలేదు, కానీ జనగాంలో ఎదురైన ఒక చిక్కు అనుభవాన్ని ఇక్కడ మీకు అందిస్తాను. వైద్యులను గానీ, ఆసుపత్రీ సిబ్బందిని గానీ ఎలా ఇబ్బంది పెట్టవచ్చునో, నేను చెప్పబోయే ఈ కథలో మీకు తెలుస్తుంది.

నేను జనగాం ఆసుపత్రిలో 2005లో డెంటల్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. అంతా కొత్త ప్రదేశం, కొత్త స్టాఫ్, కొత్త ప్రజలు. ఎవరెవరోవచ్చి పరిచయం చేసుకుంటున్నారు. ఈలోగా తెల్లని లాల్చీ పైజామా, నల్లకళ్ళ జోడు వున్న వ్యక్తి హడావుడిగా వచ్చి నా ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. “నమస్తే సార్” అని పలకరించాడు. ఆసుపత్రి స్టాఫ్‌నే పిలిచి నాలుగు ఛాయ్‌లు తెమ్మన్నాడు. ఎవరో రాజకీయ నాయకుడు అనుకున్నాను. ఇలాంటి ఘరానా నాయకులతో కొన్ని వింత అనుభవాలు గతంలో నేను పనిచేసిన మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నాకు వున్నాయి. అందుకే ఏమీ స్పందించకుండా సంయమనంతో ఓపిగ్గా కూర్చుని గమనిస్తున్నాను. టీలు తాగడం అయ్యాక ఆ వ్యక్తి తనకు తానే పరిచయం చేసుకున్నాడు. తనకు ఆసుపత్రి ఎదురుగా మందుల దుకాణం ఉందని తప్పక సహకరించాలని చాలా సౌమ్యంగా అభ్యర్థించాడు.

ఆ మాటలు విన్నాక మనిషి మంచివాడిలా ఉన్నట్టు అనిపించింది. నేను అక్కడికి వెళ్ళాక నా విభాగం ఔట్ పేషేంట్ సంఖ్య పెరిగింది. వాళ్లకు అవసరం అయిన మందులన్నీ ప్రభుత్వం సరఫరా చేయలేదు కనుక అప్పుడప్పుడు కొన్ని మందులు బయటికి రాయక తప్పేది కాదు. అది కూడా అవసరాన్ని విశదీకరించి, కొనుక్కునే స్థాయి వున్న వారికే బయటికి మందులు రాస్తూండేవాడిని. ఆ వ్యక్తి షాపులోనే వాళ్ళు మందులు కొనుక్కోవడం కూడా నేను గమనించక పోలేదు. ఎందుచేత నంటే, నేను బయటికి నేను మందులు రాస్తే తప్పక నాకు చూపించి తీసుకు వెళ్లాలని నియమం పెట్టేవాడిని. కొంతమంది అనేక కారణాల వాళ్ళ నాకు చూపించక పోయినా, ఎక్కువ శాతం మంది చూపించేవారు. అలా నేను చూసిన సందర్భాలలో నేను రాసిన మందులు కాకుండా వేరే కంపెనీ మందులు ఇస్తున్నట్టు గమనించాను. అంతమాత్రమే కాదు, నేను వ్రాసినవి ఇవ్వక పోవడమే కాక నేను రాయని టానిక్కులూ, విటమినులు, అవసరం లేకపోయినా అంటగట్టేవారు. ఇది నాకు చికాకు కలిగించడమే కాదు, కోపాన్ని కూడా తెప్పించింది. (ఇలాంటి సంఘటనలు తర్వాత, కరీంనగర్‌లో కూడా కొన్ని రోజులు జరిగాయి.) ఇక సహించ లేక, మెడికల్ షాపు యజమానికి చెప్పడం ఇష్టం లేక, నా పద్ధతిలో నేను ఒక ప్రయోగం చేసాను. బయటికి మందులు రాస్తే కనుక దూరమైనా వేరే షాపుకు వెళ్లి కరెక్టు మందులు తెచ్చుకుని చూపించమని చెప్పాను.

కొద్దీ రోజుల్లోనే నా ప్రయోగం ఫలితాలను చూపించింది, విషయం అతగాడికి అర్థమయి పోయింది. ఊహించినట్టు గానే, ఒకరోజు ఆతను నా దగ్గరకు వచ్చాడు, “అన్యాయం సార్!” అన్నాడు. “ఏది అన్యాయం” అన్నాను. “మీరు రాసిన చిట్టీలు నా దగ్గరికి రావడం లేదు సార్” అన్నాడు.

“నేను రాసిన మందులు నీ దగ్గర వుండవు కదా ఎందుకు వస్తారు?” అని నేను ఎదురు ప్రశ్న వేసాను. “మీరు చెబితే పెట్టించేవాడిని కదా సార్” అన్నాడు. “మందులు రాసానంటే పెట్టించమనే కదా అర్థం!” అన్నాను. “ఇక పెట్టిస్తాను.. దయచేసి నాకు అన్యాయం చేయకండి సార్” అని చేతులు జోడించాడు. తర్వాత సాఫీగానే సాగిపోయింది.

ఆ.. తర్వాత అతని షాపు ప్రక్కనే నా క్లినిక్కు కూడా పెట్టించాడు, అది వేరే విషయం!

ఇక అసలు విషయానికి వస్తే, నేను చెప్పబోయేది పై సంఘటనలకు కొనసాగింపే! నేను జనగాం నుండి బదిలీ కావడానికి కొద్దీ నెలల ముందు నా డిపార్ట్‌మెంట్‌కు ఒక యువ దంత వైద్యుడిని కాంటాక్ట్ పద్దతిలో పోస్ట్ చేశారు. అతను నాకంటే ఎక్కువ చదువుకున్నవాడు. ఆర్థోడాంటిక్స్.. అతని ప్రత్యేకత. అంటే ఎం.డి.ఎస్.. చదూకున్నాడు అన్నమాట. చాలా సౌమ్యుడు. సహృదయుడు. పని తప్పించుకునే మనస్తత్వం అసలే కాదు. నన్ను పని చేయనిచ్చేవాడు కాదు. ఆయనే.. డా. కళాధర్ రెడ్డి. హన్మకొండ వాసి, ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు.

అతనికంటే వయసులో, అనుభవంలో పెద్దవాడిగా నన్ను చాలా బాగా గౌరవించేవాడు.

ఒకరోజు ఒక స్త్రీమూర్తి పంటి బాధతో వచ్చింది. పాత పేషేంట్ ఆమె. నాకు బాగా పరిచయం. చాలా సంవత్సరాలుగా, ఆమె నాకు బాగా తెలుసు. ఆమె చిల్లర దుకాణం నడుపుకుంటున్నట్టు విన్నాను, 40 సంవత్సరాల వయస్సు ఉండచ్చు. డా. కళాధర్ రెడ్డి వున్న కాలంలో వచ్చి అతనితో ఆమె బాధ చెప్పుకుంది. అతను ఆమె దంతాలు అన్నీ పరీక్ష చేసి, ఆమె ఏ పన్నుతో బాధపడుతుందో, అది వ్యాధిగ్రస్థమై కదిలి పోతుందని, దానిని త్వరగా తీయించుకోవాలని సలహా ఇచ్చి కొన్ని మందులు వాడి తర్వాత రమ్మని బయటికి మందులు రాసి ఇచ్చాడు. విచిత్రం ఏమిటంటే అదే పన్నుకు నేను మందులు చాలా కాలంగా రాస్తున్నా, మందులు వాడుతుంది కానీ, పన్ను తీయించుకోవడానికి సాహసించడం లేదు. ఇప్పుడు కళాధర్ రెడ్డి కూడా పదే.. పదే.. అదే విషయం చెబుతూ వస్తున్నాడు. మామూలుగానే కళాధర్ రెడ్డి రాసిన మందులు.. ఆ మందుల షాపులో ఉండేవి కాదు. ఆ షాపు యజమాని నాకు చెప్పినట్టుగానే, అతనికి చెప్పాడు కానీ, డాక్టర్ రాసిన మందులు అతను తెప్పించడం లేదు. పైగా డా. రెడ్డి మీద కసి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ మందుల షాపు యజమాని ఆ లేడి పేషేంటును, డా. కళాధర్ రెడ్డి మీదికి ఉసి గొల్పాడు. అది మాకు తెలీదు. మేము ఊహించలేని విషయం.

ఒక రోజు వచ్చి పన్ను తీయించుకుంటానని అడిగింది ఆ మహిళ. డా. కళాధర్ రెడ్డి మరోసారి పరీక్ష చేసిన తర్వాత, ఆమె చేత కూడా ఫలానా పన్ను రూఢి చేయించుకుని, పన్ను తీసి ఆమెకు చూపించాడు. ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు పన్ను తీయడానికి డాక్టరు ఇబ్బంది పడింది లేదు, పేషేంట్ అయిన ఆమె బాధపడింది లేదు, ఎందుకంటే అది కదులుతున్న పన్ను కాబట్టి.

డా.కళాధర్ రెడ్డి, హైదారాబాద్.

ఒక వారం రోజుల తర్వాత ఒక రోజు నేను సెలవు పెట్టాను. డా. కళాధర్ రెడ్డి ఒక్కడే వున్నాడు. ఆ రోజు సెలెక్ట్ చేసుకుని హాస్పిటల్‌కి వెళ్ళింది మహిళ. ఓపీ లో పేషేంట్స్ చాలామంది వున్నారు. ఆ సమయంలో అక్కడ ఆమె గొడవ చేయడం మొదలు పెట్టింది. తాను ఒక పన్ను తీయమంటే డాక్టరు మంచి పన్ను తీసేశాడని,అది తనకు చాలా విలువైన పన్ను అని, అది లేనందువల్ల ఆహారం తినలేని పరిస్థితి ఏర్పడిందని, కనుక తనకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని గోల.. గోల చేసి వెళ్ళిపోయింది. ఆ.. కథనం మరునాడు దినపత్రికలో వచ్చింది. నిజానికి ఆ మహిళ అలాంటిది కాదు. ఆమె చేత ఎవరో చేయించారన్న విషయం నాకు అర్థమయింది. డాక్టర్ కళాధర్‌ను భయపడనక్కర లేదని, ఆ విషయం నేను చూసుకుంటానని భరోసా ఇచ్చాను. ఆమె ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూసాను. కొన్ని రోజులు ఆగి, ఆమె ఇల్లు దగ్గరే కాబట్టి, ఒకసారి హాస్పిటల్‌కు రమ్మని కబురు పెట్టాను. అప్పుడే కాదు, నేను అక్కడ పనిచేసిన కాలంలో ఎప్పుడూ రాలేదు. ఆమె చేత అలా ఎవరు చేయించారో నాకు తెలిసింది. చదువుతున్న మీకు కూడా తెలిసే ఉంటుంది.

మనం పనిచేసే చోట అనేక రకాల గ్రామ దేవతలు వుంటారు. వాళ్ళు ఎప్పుడు ఏమి చేస్తారో తెలీదు, మనం అప్రమత్తంగా ఉండాలి అంతే! వాళ్ళ స్వార్థంతో మన జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కటి మాత్రం నిజం! మన మంచి ప్రవర్తన, మంచి మాట, మంచి పనులూ ఎప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటాయి. ఇవే మనకి గొప్ప రక్షక కవచాలు. సున్నిత మనస్కులు మొదట కొద్దిగా బాధపడవచ్చు గానీ తర్వాత అన్నీ సర్దుకుపోతాయి. అందరికీ ఇలా జరుగుతాయని చెప్పడం కాదు నా ఉద్దేశం! నేను ఇక్కడ చెప్పదలచుకున్నది ఏమిటంటే ఇలాంటి సంఘటనలు కూడా ఎదురుకావచ్చునని అప్రమత్తం చేయడమే! లెక్కలేనన్ని రాజకీయ పార్టీలు, దానికి సంబంధించిన చోటా -మోటా లీడర్లు ఇలా అందరూ ఉద్యోగుల మీద పెత్తనం చెలాయించేవారే! అందుచేత ప్రతి ఉద్యోగి జాగ్రత్తగా ఉండవలసిందే. ప్రజలు – ఉద్యోగులను, ఉద్యోగులు – ప్రజలను నమ్మలేని దౌర్భాగ్యపు స్థితి ఏర్పడింది. ఎవరి జాగ్రత్తలో వారు ముందుకు సాగవలసిందే.. ఇది జీవితం!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here