జ్ఞాపకాల పందిరి-47

44
10

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

మరక పడ్డ స్నేహం..!!

[dropcap]స్నే[/dropcap]హం గురించి చాలామంది చాలా రకాలుగా నిర్వచించారు, ఇంకా అనేక నిర్వచనాలు మనం చూస్తాం/వింటాం కూడా! ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా దానిని నిర్వచించ గల సామర్థ్యం మనకు లేదు. ఎంత చెప్పినా ఇంకా ఏదో తక్కువగానే చెప్పిన భావన మనకు కలుగుతుంటుంది. ఒక్కోసారి కొన్ని నిర్వచనాలు అపహాస్యం పాలవుతుంటాయి. దానికి కారణం స్నేహానికి సరైన నిర్వచనం తెలియకపోవడం, స్నేహం పేరుతో సరైన స్నేహితునితో స్నేహం కుదరకపోవడం. స్నేహం పేరుతో తమ జీవితాన్నే త్యాగం చేసేవారు కొందరైతే, స్నేహాన్ని అడ్డుపెట్టుకుని వంచించే వారూ, మోసం చేసేవారూ మరికొందరు. స్నేహం పేరుతో, స్నేహమంటే ఏమిటో తెలియక,ఘోరంగా మోసపోయి, సుఖంగా సాగవలసిన జీవితాలు ,అర్ధాంతరంగా ముగిసిపోయిన సంఘటనలు కూడా వున్నాయి.

బాల్యంతో కలసి నడిచిన స్నేహాలు, స్నేహం మీద అపారమైన నమ్మకం, గౌరవం ఇరుపక్షాల వున్నస్నేహాలు సజావుగా బ్రతికి బట్టకడతాయేమో గానీ, మిగతావన్నీ జీవిత కాలాన్ని లెక్కగట్ట వీలులేని స్నేహాలే! ఇద్దరు స్నేహితుల స్నేహం చిలువలు పలువులు చేసి ప్రచారం చేసే మూడో రకం వ్యక్తులు వుంటారు. ఆ స్నేహితులు ఆడ – మగ అయితే ఇక చెప్పేదేముంది? గోరంతలు కొండంతలు అయిపోతాయి. పూర్వాపరాలు తెలియకుండానే రకరకాల ఊహాగానాలకు, అనుమానాలు తోడై వారి వారి స్నేహాలను వక్రీకరించి ప్రచారం చేయడం ఇంచు మించు అందరికీ తెలిసిన విషయమే! అందుకే.. విలువైన ఈ స్నేహాన్ని జీవితాంతమూ స్వేచ్ఛగా ఆస్వాదించే అవకాశం వున్నవాళ్లు చాలా అదృష్ట వంతులే అని చెప్పాలి.

ఒక్కోసారి అన్నెంపున్నెం ఎరుగని స్వచ్ఛమైన స్నేహితులపై విరుచుకుపడే అభాండాలు ఎంతో వ్యథను కలిగిస్తాయి. ఇలాంటి సమస్యలు జీవితంలో, చాలా మందికి ఎదురవుతాయి. దానికి నేను కూడా ఏమాత్రమూ అతీతుడిని కాను. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల జీవితాలను కొన్ని రకాల అభాండాలు ఎలా ప్రభావితం చేస్తాయో తెలుస్తుంది. పదండి మరి ముందుకు —

నేను 1982లో మహబూబాబాద్ తాలూకా ఆసుపత్రి (ఇప్పుడు జిల్లా ఆసుపత్రి)లో చేరినప్పుడు, నా సహా వైద్య మిత్రులు, డా. జె. సురేందర్ రెడ్డి, డా. వై. ఆర్. అప్పారావు, డా. వకుళాదేవి గార్లు ఉండేవారు. డా. సురేందర్ రెడ్డి గారు ఇంచార్జి డిప్యూటీ సివిల్ సర్జన్‌గా ఉండేవారు. అంటే నాకు బాస్ అన్నమాట. అందరిలోనూ డా. అప్పారావు గారూ, ఆయన శ్రీమతి లక్ష్మీ ఛాయ, నన్ను చాలా బాగా చూసుకునేవారు. లక్ష్మి (మాధవి నిక్ నేమ్) నన్ను అన్నయ్యా.. అని ఎంతో ఆత్మీయంగా పిలిచేది.

ఇక్కడ మాధవి గురించి కొంత చెప్పాలి. ఆ అమ్మాయి అందంగా ఉండేది. దానికితోడు, బాగా మేకప్ వేసుకునేది. అప్పుడు మహబూబాబాద్ పల్లెటూరు వాతావరణంలో,ఈ అమ్మాయి ఆ జనంలో ప్రత్యేకంగా కనపడేది. ఎక్కువగా రెండో ఆట సినిమాకు వెళ్లేవారు. ఆ దంపతులకు ఒక మగపిల్లవాడు, ఇద్దరు ఆడ పిల్లలు ఉండేవారు. ఆడ – మగ అన్న తేడా లేకుండా అందరి కళ్ళూ మాధవిపైనే ఉండేవి. డాక్టర్ గారిని ఆసుపత్రిలో కలవవలసిన మెడికల్ రిప్రజెంటేటివ్‌లు, ప్రత్యేకంగా ఈ అమ్మాయిని చూడడానికని, ఇంటికి వెళ్లి మందుల సాంపిల్స్, మంచి గిఫ్టులు ఇస్తుండేవారు. ఇక నాతో చాలా కలివిడిగా ఉండేవారు ఇద్దరూ. అప్పటికి నేను బ్రహ్మచారిని కనుక, తరచుగా ఆదివారాలు నన్ను భోజనానికి పిలిచేవారు. నాకు భోజనం వండి పెట్టడానికి, ఇంట్లో పనులు చేయడానికి పని మనిషిని కూడా వాళ్ళే మాట్లాడి పెట్టారు. డా. పండరి నాథ్ గారి ఇంట్లో ఉండేవాడిని. తర్వాత 1983లో నాకు పెళ్లి కావడం, నా శ్రీమతి అరుణ మహబూబాబాద్ రావడం జరిగిపోయింది.

హైదరాబాదులో ద్వారకా హోటల్‌లో నా పెళ్లి  రిసెప్షన్‌లో శ్రీమతి & డా.వై.ఆర్.అప్పారావు 
నా పెళ్లి  రిసెప్షన్‌లో డా.సురేందర్ రెడ్డి, డా.వై.ఆర్. అప్పారావు దంపతులు

డా. అప్పారావు గారి కుటుంబంతో మా స్నేహం ముందుకంటే ఎక్కువ కొనసాగింది. చాలా సంతోషంగా గడిపేవాళ్ళం. కొన్నాళ్ల తర్వాత ఒక విచిత్ర సన్నివేశం జరిగింది. అది చాలా దురదృష్టకరమైన సన్నివేశమే! అప్పుడు ఏమి జరిగిందో ఇప్పటికీ తెలియదు. అదొక వింత అనుభవం. నన్ను ఎంతగానో కలవరపెట్టి మానసిక వ్యథకు గురిచేసిన సంఘటన.

ఒక రోజు అర్ధరాత్రి మా ఇంటికి కబురు వచ్చింది డా. అప్పారావు గారికి ఒంట్లో బాగోలేదని, ఒకసారి రమ్మనీను. డాక్టర్ గారి ఇంటికి నేను అద్దెకుంటున్న ఇల్లు చాలా దగ్గర. హుటాహుటీన బయలుదేరి వెళ్లాను. అప్పటికే మా సీనియర్ డా. సురేందర్ రెడ్డి గారు అక్కడ వున్నారు. అప్పారావు గారికి ఛాతి నొప్పి వచ్చినట్టు, అన్నం సరీగా జీర్ణం కాలేదని మందులు వేశామని చెప్పారు. కాస్త బాగుందని, వెళ్లిపొమ్మని అప్పారావు గారు చెప్పడంతో తిరిగి ఇళ్లకు వచ్చేసాము. మళ్ళీ తెల్లవారు ఝామున కబురు వచ్చింది. నేను వెళ్లేసరికి డా. సురేందర్ రెడ్డి గారు పరీక్ష చేసి అంతా బాగానే ఉన్నట్టు చెప్పారు. ఇద్దరం బయట కూర్చున్నాం. ఇద్దరినీ నిశ్శబ్దం ఆవరించింది. మాట  పలుకు లేకుండా కూర్చున్నాం. కాసేపటికి ఇంట్లోనుండి పెద్ద ఏడుపు వినిపించింది. ఇద్దరం పరిగెత్తుకుని లోపలికి వెళ్లాం. సురేందర్ రెడ్డి గారు వెంటనే గుండె పరీక్ష చెసారు. అప్పటికే అప్పారావుగారు చనిపోయారు. ఆయన చనిపోవడానికి కారణం ఏమిటో ఎవరికీ తెలీడం లేదు. కాసేపటికి బయట రకరకాల వదంతులు పుట్టాయి. ఎవరూ దగ్గరకు రావడం లేదు. బయట ఏవేవో వదంతులు ప్రచారం అవుతున్నాయి. డాక్టరు గారిది నెల్లూరు. బాడీ నెల్లూరు తీసుకు వెళ్ళాలి. కానీ.. బాడీ కూడా వెళ్ళడానికి సాహసించడం లేదు. నేను వెళదామంటే, నన్ను వెనక్కి లాగుతున్నారు, నా మిత్రులు శ్రేయోభిలాషులూనూ. బయట ఆయనది సాధారణ చావు కాదని రకరకాల కథనాలు ఊపు అందుకున్నాయి. చివరికి నేను ఇంకొక హోమియో వైద్య మిత్రుడు డా. ఎం. వి. రామారావు శవం కూడా నెల్లూరుకు బయలు దేరి వెళ్ళాము. బాడీని డాక్టర్ గారి కుటుంభానికి అప్పజెప్పి మేమిద్దరమూ వెనక్కి బయలుదేరాము. దారిలో డాక్టర్ మిత్రుడు వాళ్ళిద్దరి సంసారిక జీవితం గురించి రకరకాల కథలు వినిపించాడు. అప్పారావు గారు చనిపోయేవరకు అవి నా దృష్టికి రాలేదు. అవి నమ్మబుద్ధికాలేదు నాకు. కానీ.. మహబూబాదుకు రాగానే పుకార్లు మరీ ఎక్కువగా వినిపించాయి. ఈ విషయాలు తెలియాలని మాధవికి ఒక రిజిస్టర్డ్ ఉత్తరం నెల్లూరుకు రాసి పిచ్చి పని చేసాను. ఇది ఆ అమ్మాయికి కాకుండా వేరే కుటుంబ సభ్యుల చేతిలో పడింది. అది అనుమానాలకు దారితీసింది. పైగా అది ఎవరిమీదో కాదు.. నాపైననే. అది ఎలా తెలిసిందంటే, ఒకరోజు నెల్లూరు నుంచి, అప్పారావు గారి కుటుంబ సభ్యుడొకాయన మహబూబాబాద్ పనిమీద వచ్చి విషయం చెప్పాడు నా మీద కేసు పెడుతున్నారని.

నాటి మా డిప్యూటీ సివిల్ సర్జన్ డా. జె. సురేందర్ రెడ్డి

ఆ మాట విని నా గుండె ఝల్లుమంది. విపరీతమైన భయం పట్టుకుంది. సహాయం చేసినందుకు,వ్యవ-హారం ఇలా ఎదురు తిరిగినందుకు చాలా బాధ కలిగింది. వెంటనే ఆసుపత్రికి దగ్గరలో వున్న గురుతుల్యులు, సహృదయులు, లీడింగ్ లాయర్ గోపాల రావు గారి దగ్గరకు వెళ్లి జరిగినదంతా పూస గుచ్చినట్లుగా చెప్పను. ఆయన అంతా శ్రద్దగా విని ఒక పొడి నవ్వు నవ్వి “ఏమీ కాదు.. డాక్టరు గారు.. నోటీసు రానివ్వండి.. నేను చూసుకుంటాను” అని ఎంతో దైర్యం చెప్పి పంపారు. అయినా ప్రతి రోజూ పోస్ట్‌మాన్‌ను చూస్తే భయం పుట్టేది. అదృష్టవశాత్తు తర్వాత అలాంటి కేసు ఏదీ నా దృష్టికి రాలేదు. మాధవికి కాంపెన్సేటరీ గ్రౌండ్స్ క్రింద జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. చాలా కాలం వరంగల్లులో ఆమె పని చేసినట్టు నాకు తెలుసు కానీ,తర్వాత ఆమె ఏమైందో తెలియదు.

అయితే డా. వై. ఆర్. అప్పారావు గారు ఎన్నటికీ మరచిపోలేని మంచి మనసు గల మహోన్నత వ్యక్తి. మంచి వైద్యుడు. అంతకు మించి ప్రజా వైద్యుడు. ఆయన స్నేహం నా ఉద్యోగ జీవితంలో గొప్ప అనుభవం. అయితే.. ఆయన చనిపోయిన కారణం ఏమిటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరమే..!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here