జ్ఞాపకాల పందిరి-55

64
7

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

బిరుదులూ – సత్కారాలు..!!

[dropcap]ఈ[/dropcap] మధ్య కాలంలో, బిరుదులూ – సత్కారాలూ అనే జంటపదాలు జనంలో తరచుగా వినబడుతున్నాయి. సహజంగా మనిషిని బట్టి, మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి, సేవానిరతిని బట్టి, కొందరిని సమాజమే ఎదురువచ్చి,సంతోషంగా సన్మానిస్తుంది, గౌరవిస్తుంది, పేరుపడ్డ పెద్దల పేరుతో సత్కరిస్తుంది. దీనికి భిన్నంగా కొంతమంది తమ పరపతితోనూ, ధనమదంతోనూ, వీటిని బజారు వస్తువులు మాదిరిగానే కొనుక్కొంటున్నారు. కొన్ని సంస్థలకు, మరికొందరు పెద్ద మనుష్యులకు ఇదొక వ్యాపారంగా, బంగారు బాతుగా మారింది. ఇలా కాకుండా ప్రభుత్వపరంగా కొన్ని శాశ్వత బిరుదులూ – సన్మానాలూ వున్నాయి. దేశానికి – సమాజానికీ,తమ విశిష్ట సేవలు అందించిన మహానుభావులను వీటితో సత్కరించడం ఆనవాయితీగా వస్తున్నది. వీటికోసం అన్ని రంగాలను పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతున్నది. వీటిల్లో కూడా నూటికి నూరు శాతం న్యాయం జరగక పోయినప్పటికీ, కొంతవరకూ మేలే అని చెప్పుకోవాలి. తమ సేవలద్వారా మరణించిన వారికి సైతం మరణానంతర అవార్డులు ఇచ్చి గౌరవిస్తున్నారు. అలాగే, విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ఇచ్చి సత్కరించడం కూడా జరుగుతున్నది. కొన్ని విశ్వవిద్యాలయాలు కేవలం ఈ డాక్టరేట్లు ఇవ్వడానికే వెలసినట్లుగా ఈ మధ్యకాలంలో వెలుగులోనికి వచ్చిన తాజా వార్త. అంటే, డబ్బులుంటే ఎలాంటి డిగ్రీనైనా, డాక్టరేట్ నైనా కొనుక్కోవచ్చునన్న మాట. ప్రభుత్వాలు, ఇలాంటి విశ్వవిద్యాలయాల పట్ల ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరమే!

ఈ మధ్యకాలంలో, సాహిత్యపరంగా, సాంస్కృతికపరంగా, సంగీతపరంగా అనేక గ్రూపులు (ఫేస్‌బుక్ & వాట్సాప్ వగైరా) ఏర్పడి, ఇష్టమైన రీతిలో బిరుదులు ఇవ్వడం, సన్మానాలు చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. పైగా ఆ బిరుదులు మరీ అతిశయోక్తులుగా మారి, నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సమాజంలో అదొక జాడ్యంగా రూపాంతరం చెందింది.

బిరుదులు ఇవ్వడం అనే దానిని నేను తప్పు పట్టడం లేదు, కానీ ఎలాంటి వ్యక్తికి బిరుదు ఇవ్వవచ్చు, ఆ బిరుదుకు ఆ వ్యక్తి ఎంతవరకూ అర్హుడు అన్నది తెలుసుకుని,ఈ బిరుదులు ప్రధానం చేసే సాహసం చేయాలి.. అయితే, అందరినీ ఇదే కేటగిరిలో చేర్చలేము. కొన్ని సంస్థలు, ఆరోగ్యకరమైన నిబంధనలకు కట్టుబడి, నిజంగా యోగ్యులైన వ్యక్తులను, బిరుదులకు, అవార్డులకు, సన్మానాలకూ గుర్తించడం జరుగుతున్నది. అయితే, వీటి శాతం చాలా తక్కువ. ఈ బిరుదులూ -సన్మానాలు గురించి నాకు ఎదురైన రెండు అనుభవాలు మీ ముందు వుంచుతాను. ఈ రెండూ ఒకదానికొకటి భిన్నమైనవి.

నేను వృత్తిపరంగా దంతవైద్యుడినని, అంతో ఇంతో సాహిత్యాభిరుచి వున్న వాడినని బాగా తెలిసిన వ్యక్తి నుండి ఒకానొక రోజు ఫోన్ కాల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే ఒక ప్రాంతీయ విశ్వవిద్యాలయము, మరో సాహితీ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా అవార్డు ప్రధానం కూడా చేస్తున్నారనీ, దాని కోసం వెంటనే నన్ను బయోడేటా పంపమని. నిజానికి నాకు ఈ అవార్డులూ – సన్మానాలూ ఇష్టం ఉండదు. నన్ను దగ్గరగా ఎరిగిన వారికి ఈ విషయం తెలుసు. కానీ,ఈ ఫోన్ చేసిన వ్యక్తికి తెలియక పోవచ్చు, అది అతని తప్పుకాదు! అందుచేత, అతనిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక, నా సేవాకార్యక్రమాలతో కూడిన చిన్న బయోడేటా, అతను చెప్పిన చిరునామాకు పంపించాను. ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోయాను కూడా! ఒక పదిహేను రోజుల తర్వాత అదే వ్యక్తి నుండి మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. రెండు కేటగిరీలలోనూ (వైద్యం,సాహిత్యం) నేను సెలెక్ట్ అయ్యాననీ, అయితే, వాళ్ళు నన్ను వైద్యం కేటగిరీలో ఉంచి ‘వైద్య రత్న’ బిరుదు ప్రధానం చేయడానికి నిర్ణయించారని, తక్షణమే మూడువేల రూపాయలు వారికి పంపి అవార్డు కన్ఫర్మ్ చేసుకొమ్మని అతని సలహా. ఆ విషయం విన్న నాకు నవ్వు ఆగింది కాదు! ఇదేమి వింత? నేను వాళ్ళను అడిగింది లేదు, నాకు అసలే అవసరంలేదు. సేవ చేసేవాడికి బిరుదులతో పని లేదు. ఆ సందర్భంగా సన్మానానికి, ఇతర సాంకేతిక అవసరాలకు కొంత డబ్బు అవసరం కావచ్చు, దీనిని ఎవరూ కాదన్నారు. కానీ,ఇలా ఎందుకు? అందుకే, నాకు ఆ బిరుదు అవసరం లేదని వాళ్లకు సమాచారం అందించమని చెప్పాను. ఆ తర్వాత, అప్పటినుండి ఇప్పటివరకూ మా మధ్య ఎలాంటి సంభాషణలూ చోటు చేసుకోలేదు. సరే,ఆ విషయం అక్కడితో ముగిసింది.

డా. ఓ.నాగేశ్వరరావు, డాక్టర్ రావూస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ అధినేత-హైదరాబాద్

తర్వాత కొద్దిరోజులకే అంటే 2019లో అనుకుంటాను. సోదర మిత్రుడు, నాకు జూనియర్, హైద్రాబాద్‌లో, వృత్తిపరంగానూ, ప్రవృత్తిపరంగాను అనేక ఘన విజయాలు సాధించిన గొప్ప సాహసికుడు డా. ఓగూరి నాగేశ్వర రావు ఫోన్ చేసాడు. ఇద్దరం అప్పుడప్పుడు పరస్పరం ఇలా ఫోన్ చేసుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటాం. తరచుగా కలుసుకొనక పోయినా, ఇలా ఫోన్ కాల్స్‌తో సేదతీరుతుంటాం. నిజానికి సోదరుడు నాగేశ్వరరావు ఎప్పుడూ బిజీగా వుండే మనిషి. వృత్తికి సంబందించిన పనులతో పాటు అనేక సేవా కార్యక్రమాలకు తన విలువైన సమయాన్ని ఖర్చు చేసి తృప్తిపడి వ్యక్తిత్వం అతనిది. వీటికి తోడు సభలు సమావేశాలు, శుభకార్యాలలో పాల్గొని అందరినీ సంతృప్తిపరిచే సహృదయుడతడు. అంతమాత్రమే కాదు, అందరితోపాటు, తన సామాజిక వర్గ ప్రజలకు, ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా, టక్కున వాలి, సమస్య పరిష్కారం అయ్యేవరకూ వదిలిపెట్టని మంచి మనసు అతనిది. ఈ కోనసీమ కుర్రోడు హైదరాబాద్‌లో దంతవైద్య విద్యార్థిగా, దంతవైద్యుడిగా, ఆరంగేట్రం చేసి కొత్త ఒరవడులు సృష్టించిన ఘనుడు. డా. నాగేశ్వర రావు బహుముఖ ప్రజ్ఞాశాలి. దంతవైద్యుడిగా, సామాజిక సేవకుడిగా, నటుడిగా, రచయితగా, రేడియో/టి. వి బ్రాడ్‌కాస్టర్‌గా, మంచి స్నేహితునిగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, సోదరుడు ఓ.ఎన్.ఆర్. అలాంటి వ్యక్తి ఫోన్ చేసి “నీకు ‘వైద్య రత్న’ బిరుదు ఇచ్చి, రవీంద్ర భారతిలో సన్మానం చేస్తాం, ఒప్పుకోవాలి” అన్నాడు, గుండెల మీద కత్తి పెట్టి చెబుతున్నట్టుగా. నేను క్షణం మౌనంగా వుండి “నాకెందుకు బ్రదర్ – ఇవన్నీ?” అన్నాను. “లేదు, నువ్వు దానికి నూటికి నూరు శాతం అర్హుడవు, ఇప్పుడు నాకు చాన్సు వచ్చింది, తర్వాత నేను ఈ పని చేయలేను, మరి మాట్లాడకు” అన్నాడు. నిజానికి ఈ తమ్ముడు ‘డా. రావ్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించి అప్పటికే అనేక దంతవైద్య పరమైన సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు. అలా మంచి పేరు తెచ్చుకున్నాడు. నిజానికి నా వంటి అనేక మంది వైద్య మిత్రులకు ఇలా సన్మానాలు చేయడం వల్ల, ఖర్చు తప్ప అతనికి వచ్చే లాభం ఏమీ లేదు. దానికి తోడు వెలకట్ట లేని శ్రమ కూడా!

అంతే కాకుండా, ఇతర వైద్యులతో పాటు, నాకు కూడా సన్మానం చేయాలని నిర్ణయించుకోవడం వెనుక చరిత్ర కూడా వుంది. సామాన్య ప్రజానీకంలో, దంతవైద్య విజ్ఞానంలో అవగాహన తీసుకురావడానికి, అనేక మార్గాల ద్వారా నేను చేస్తున్న కృషి అతనికి తెలుసు, పాఠశాల పిల్లల దంత సంరక్షణ విషయంలో, తరచుగా పాఠశాలల్లో నేను ఏర్పాటు చేస్తున్న దంత వైద్య శిబిరాల గురించి డా. రావ్‍కు అవగాహన వుంది. రేడియో/దూరదర్శన్‌ల ద్వారా, దంతవైద్య విజ్ఞానాన్ని నేను తరచుగా అందిస్తున్న విషయం, తమ్ముడు నాగేశ్వర రావుకి బాగా తెలుసును. వీటికి తోడు నేను, కవిగా, కథా రచయితగా, వ్యాసకర్తగా ఇతనికి పరిచయమే!

వీటినన్నింటినీ ప్రత్యక్షంగా తెలిసినవాడిగా, నన్ను కూడా సన్మాన గ్రహీతల జాబితాలో చేర్చే నిర్ణయం తీసుకున్నాడని గ్రహించాను. అందుకే అప్పటికి ‘సరే!’ అన్నాను.

మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ గారి చేతులమీదుగా సన్మానం

కార్యక్రమం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి. ముఖ్య అతిథి తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ గారు. డా. రావూస్ ఓరల్ ఫౌండేషన్ & ఆదర్శ ఫౌండేషన్ సంస్థలు కలిసి, సన్మానాలూ సంగీతంతో కూడిన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. మంచి వర్షంలో కూడా జనం బాగానే వచ్చారు. ప్రత్యేకంగా నాకోసం మిత్రులు – రచయితా శ్రీ సాంబశివరావు గారు, సాగర్ మిత్రులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ సుబ్బారావు గారు, మిత్రమణి – రచయిత్రి శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు రావడం ఎంతో ఆనందం అనిపించింది. హన్మకొండ నుండి సన్మానం స్వీకరించడానికి, నా సీనియర్ డా. వేణుగోపాల నాయుడు గారు కూడా రావడం సంతోష మనిపించింది. ఆ సభలో, తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక వ్యవహారాల సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు కూడా ఉన్నట్టు గుర్తు. అతిథుల ఉపన్యాసాలు పూర్తి అయినాక, మంత్రివర్యులచే,  ‘వైద్య రత్న’ బిరుదు ప్రదానం, తర్వాత సన్మానం ఘనంగా జరిగాయి.

‘వైద్య రత్న’ పురస్కారం
సమావేశానికి హాజరైన సాగర్ మిత్రులు శ్రీ రాజేంద్ర ప్రసాద్, శ్రీ సుబ్బారావు, శ్రీమతి లక్ష్మి పద్మజ దుగ్గరాజు
నేను, డా. ఓ.నాగేశ్వరరావు

నా స్పందనలో డా. నాగేశ్వర రావుకి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశాను. నా కార్యక్రమం పూర్తి అయ్యేవరకూ ఎంతో ఓపిగ్గా కూర్చుని నాకు శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రమణి శ్రీమతి లక్ష్మీ పద్మజను, నాకోసం ప్రత్యేకంగా వచ్చి(మొదటిసారి కలుసుకోవడం) నాకు పుష్పగుచ్ఛం అందించిన మిత్రులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ (బి. ఎస్. ఎన్. ఎల్) గారినీ ,ఎప్పటికీ మరచిపోలేను. సోదర మిత్రుడు రవీంద్ర భారతిలో నాకు చేసిన సన్మానం నా జీవితంలో ఒక మైలురాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. (మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here