[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
అదిగదిగో.. త్రిపుర..!!
[dropcap]అ[/dropcap]నుకున్నవి కొన్నిసార్లు, అనుకున్నట్టు జరగవు. దీనికి సమయం కలిసి రావాలి. పరిస్థితులు అనుకూలించాలి. అన్నీ సమకూరినా, ఆఖరి క్షణంలో అనుకూలంగా లేక చేజారిపోయే విషయాలు ఎన్నెన్నో! చూద్దాం, చేద్దాం, అనుకునేవారి విషయంలో అసలు పనులు కావు. నాన్చుడు వ్యవహారాలూ, చివరికి పనులు కాకుండా పోతాయి.
ఇలాకాకుండా, కొన్ని పనులు, లేదా కార్యక్రమాలు, లేదా ప్రయాణాలు, ప్రయత్నాలు, అనుకోకుండానే, అప్పటికప్పుడు ఆలోచన, హైటెక్ స్పీడ్‌లో కార్యాచరణకు వస్తుంది. కొన్ని అంతే! అలా జరిగిపోతాయి. వాటి గురించి విశ్లేషించుకున్నప్పుడు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా అని ఏదైనా పనిచేయడానికి ముందే అనుకోకూడదని చెప్పడం నా ఉద్దేశం కాదు! పకడ్బందీగా ప్లాన్ చేసుకుని, పట్టుదలతో, పని సాధించుకునేవాళ్ళు ఎంతమంది లేరు? చెప్పొచ్చేదేమిటంటే, ఒకసారి యెంత ప్లానింగ్ వున్నా చివరిక్షణంలో ఏదో విస్మరించలేని అడ్డు వచ్చి పడుతుంది. దానిని ఎవరూ ముందుగా ఆలోచించలేరు. ఇక్కడ జ్యోతిష్కాలు కూడా పనిచేయలేకపోవచ్చు. కానీ,కొన్ని సందర్భాలలో అనుకున్న తక్షణం చక.. చక.. పనులు, పూర్తి అయిపోవచ్చు.
జీవితంలో అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటివి తారసపడక పోవు. అయితే కొందరు సంఘటనలు గుర్తుంచుకుంటారు, కొందరు మరచిపోతారు లేదా అసలు పట్టించుకోరు. నా జీవితంలోని ఒక మధుర సంఘటన ఇక్కడ ప్రస్తావిస్తాను. ఇది ఎప్పుడూ నెమరు వేసుకునేది,గుర్తు పెట్టుకునేదీనూ.
నేను బి.డి.ఎస్. చదివేనాటికి, కొంతమందిమి చాలా దగ్గర మిత్రులమైనాము. చదువు పూర్తి అయి తలో చోటా ఉద్యోగాల్లో చేరిపోయినా ఆ స్నేహం దూరం కాలేదు. మొబైల్ వాడుకలోకి వచ్చాక ఇది మరింత సులభం అయింది. దూర దేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోవున్న మిత్రులు కూడా, బాగా దగ్గరై ఎప్పటికప్పుడు విషయాలు గ్రూపుల్లో పాలుపంచుకోవడం ద్వారా తాజా విషయాలు కూడా ఎప్పటికప్పుడు మా చెంత చేరేవి.
అలా మేము ‘రీ-గ్రూప్-1975’ అనే వాట్స్‌ఆప్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. గ్రూప్ అడ్మిన్‌గా, హైదరాబాద్ (చందానగర్)కు చెందిన మిత్రుడు డా. బి.ఎం.ఎస్. శంకరలాల్, అందరి మొబైల్ నంబర్లు సేకరించి సమూహంలో సభ్యులుగా చేర్చినాడు. వీలైనప్పుడల్లా చాట్ చేసుకునే అవకాశము, ఫోన్ కాల్, వీడియో కాల్, చేసుకునే అవకాశం ఏర్పడింది. సభ్యులు (క్లాస్‌మేట్స్) ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు కూడా వున్నారు. అయితే ఉత్సాహంగా సమూహంలో పాల్గొనే వాళ్ళు కొద్దిమందే. అందరికి, మా క్లాస్‌మేట్ డా. జె. క్రాంతి అంటే మంచి గౌరవం, నమ్మకమును. ఎలాంటి కార్యక్రమం ఆమె రూపొందించినా, వీలును బట్టి అందరూ ఆమోదిస్తారు. అది ఆమె స్నేహతత్వం, గొప్పతనం. అంతమాత్రమే కాదు ఆమెకు కులం, మతం, ప్రాంతంతో పని లేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాస్తికవాది, స్వర్గీయ గోపరాజు రామచంద్ర రావు (గోరా) గారి మనవరాలు, డా. సమరం గారి మేనకోడలు, స్వర్గీయ జొన్నలగడ్డ మైత్రిగారి అమ్మాయి. అందరితో కలసి మెలసి స్నేహానికి విలువ ఇచ్చే గొప్ప మనస్తత్వం గల మహిళ.
2011లో అనుకుంటాను, నా రిటైర్మెంట్‌కు కొద్ది నెలలముందు అనుకుంటా, ఒకరోజు డా. క్రాంతి ఫోన్ చేసి, “మనం త్రిపుర వెళుతున్నాం. ఎయిర్ టికెట్స్ నేను బుక్ చేస్తున్నాను, రెడీగా వుండండి” అని చెప్పింది.
నా మనస్తత్వం ఆమెకు బాగా తెలుసు, తప్పక ఆమె ప్రతిపాదనను ఒప్పుకుంటానని, ఆమె నమ్మకం. నేనూ మరో ఆలోచనకు ఆస్కారం లేకుండా, ‘సరే’ అన్నాను. త్రిపురలో ఇద్దరు ముఖ్యమైన సహాధ్యాయులు వున్నారు. వారు డా.పార్ధరాయ్ చౌదరి, డా. మౌజం ఆలీ. మరో మిత్రుడు, డా. ప్రనోబ్ అమెరికాలో స్థిరపడిపోయినాడు. అందుచేత వారిద్దరి ఆహ్వానం మీద త్రిపుర వెళ్ళడానికి సిద్ధపడ్డాం. అప్పుడు వీలుపడినవారు, రావడానికి సంసిద్దమయ్యాము. డా. క్రాంతి వాళ్ళ అబ్బాయితో పాటు, డా. శంకరలాల్ వాళ్ళమ్మాయి డా. శృతి, డా. జయంతి, డా. ఝాన్సీ (గుంటూరు) మొదలైన వాళ్ళం త్రిపుర ప్రయాణానికి సిద్ధపడ్డాం. నా నిర్ణయం నిజంగా నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. కారణం నేను కుటుంబానికి అతీతంగా ఎప్పుడూ ప్రయాణించలేదు. పైగా ఇంట్లో ప్రోత్సాహం కూడా లభించింది.
ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ప్రయాణిస్తున్న మిత్రుల్లో, నాకొక్కడికే విమాన ప్రయాణం మొదటి అనుభవం. ఇంటర్ చదువుకునేటప్పుడు నాగార్జునసాగర్‌లో, ఆగి వున్న విమానం ఎక్కి చూసిన అనుభవం తప్ప ప్రయాణించిన అనుభవం లేదు. ఇలా నాచేత మొదట విమాన ప్రయాణం చేయించిన ఘనత మిత్రమణి, డా. క్రాంతికే దక్కుతుంది.
ప్రయాణం ముందురోజున, హన్మకొండ నుండి సఫీల్‌గూడ (సికింద్రాబాద్) వెళ్లి, మరునాడు చందానగర్‌లో ఉంటున్న డా. శంకర్ లాల్ దగ్గరకు వెళ్లాను. అప్పటికి డా. శంకర్ లాల్ శ్రీమతి డా. కుసుమ గారు బ్రతికే వున్నారు. ఆవిడ ఆత్మీయత -ఆతిధ్యం మరువరానివి.
అక్కడినుండి కారులో శంకర్ లాల్, శృతి, నేనూ బేగంపేట విమానాశ్రయానికి వెళ్లాం. అప్పటికే మిగతా మిత్రులు వచ్చివున్నారు.
నాకు ఒక పక్క విమానం భయం పొడుస్తూనే వుంది. అది బయటికి కనపడకుండా జాగ్రత్త పడ్డాను. ‘ఇండిగో జెట్’ విమానం మాకోసం రెడీగా వుంది. అక్కడికి వెళ్ళిన తరువాత, భయం పోయి సరదా అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి సీట్లలో వాళ్ళం కూర్చున్నాం.
డా. జయంతికి విండో పక్క సీట్ వచ్చింది. క్రాంతి అది చూసి “కె. ఎల్వీ. మొదటిసారి విమాన ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి – విండో పక్క సీటు కె. ఎల్వీ కి ఇవ్వాలి” అని జయంతికి చెబితే ఆవిడ నాకా ఆ సీటు ఆఫర్ చేశారు. నేను ధన్యవాదాలు చెప్పి,ఆ సీట్లో కూర్చుని కాసేపు బయటి అందాలు చూడడం, కాసేపు మిత్రులతో మాట్లాడడంతో అసలు సమయమే తెలిసింది కాదు, ప్రయాణం చేసినట్టే అనిపించలేదు, సుమారు రెండుగంటల్లో త్రిపుర చేరుకున్నాం. అనుకున్నట్టు గానే డా. పార్ధరాయ్ చౌదరి విమానాశ్రయానికి వచ్చాడు.
అతని సంతోషం వర్ణించలేనిది. వాళ్ళ జన్మభూమికి మేము అంత త్వరగా వస్తామని ఊహించలేదు, పైగా ఇంతమందిమి! మాకోసం బుక్ చేసిన హోటల్‌కి వెళ్ళాము. ఎవరి రూములో వాళ్ళు సెటిలయ్యి, చౌదరి ఇంటికి వెళ్ళాము. అక్కడ ఆత్మీయతతో కూడిన ఆతిథ్యం లభించింది.
అక్కడ ఆ ప్రాంతం ఎక్కువ వెదురుబద్దల నిర్మాణాలు కనిపించాయి. చాలా సాధారణ జీవితమూ,మామూలు ఇళ్ళు కనిపించాయి. పెద్దగా అభివృద్ధి చెందిన ప్రదేశంగా అనిపించలేదు. ఎక్కువ కమ్యూనిస్టుల పాలనలో వున్న ఆ రాష్ట్రం అలా ఎందుకు ఉందో తెలియలేదు. బహుశా మేము బస చేసిన ప్రాంతం మాత్రమే అలా వుందేమో తెలియదు. మొబైల్ ప్రాచుర్యంలోకి వచ్చిన మొదటిరోజులు, గొప్పగా బయటికి కనిపించే విధంగా జేబులో పెట్టుకు తిరిగిన రోజులు. కానీ,త్రిపురలో వున్న నాలుగు రోజులూ, ఇంటికి ఫోన్ చేసే అవకాశం అంతగా కుదరలేదు.
మరో రోజు మౌజం అలీ తన ఇంటికి తీసుకువెళ్లాడు. డా అలీ నాన్నగారి ఉద్యోగ రీత్యా అతనికి బంగ్లాదేశ్‌లో కూడా పౌరసత్వం వుంది. నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి అలీ అప్పుడప్పుడు అక్కడకు వెళ్తాడట! అక్కడ కొన్ని నిత్యావసర వస్తువులు చౌకగా లభించడమే దానికి కారణం అని చెప్పాడు. అక్కడ వున్న నాలుగు రోజులు చాలా ప్రదేశాలు చూపించారు. అందులో గుర్తుపెట్టుకోవలసింది, భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దు.
ఈ రెండు దేశాలకు మధ్య ఒక ముళ్లకంచె తప్ప అటూ ఇటూ అంతా మామూలుగానే వుంది. నా విద్యార్థి దశలో అమృతసర్ లోని భారత్ -పాకిస్తాను సరిహద్దు చూసాను. అక్కడ నేను ఎంతో ఉద్వేగానికి గురిఅయ్యాను. బంధువులను విడదీస్తున్న భావన కలిగింది నాకు అక్కడ. నిర్ణీత సమయంలో సరిహద్దు గేటు తెరవడం, అటు ఇటు, బంధువులు, టూరిస్టులూ, సరిహద్దుకు దగ్గరగా వచ్చి మాట్లాడుకోవడం, సమయం కాగానే సైరన్ మోగడం, ఎటువైపు వారు ఆవైపు కన్నీళ్లతో వెనక్కి వెళ్లిపోవడం, ఆ దృశ్యం ఎంతటి వారికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. కానీ, త్రిపురలో అధికారిక గేటు చూడలేదు కనుక ఆ భావన కలుగలేదు. ఊహించని రీతిలో చాలా ఆనందంగా ఆందరం అక్కడ గడిపాము.
అప్పటికి నాకు సివిల్ సర్జన్ ప్రమోషన్ రావడం వల్ల నన్ను పార్టీ ఇమ్మని శంకరలాల్, జయంతి అడిగారు. దగ్గరలో వున్న మామూలు హోటల్‌లో పార్టీ ఇచ్చాను. మిత్రులతో కలసి అలా ఆనందంగా గడిపే అవకాశం సాధారణంగా రాదు. కానీ మిత్రురాలు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం దానిని సుగమం చేసింది. ఆమెకు అందుకు ఎప్పుడూ అందరం కృతజ్ఞులం గానే వుంటాం. అలా కలసివచ్చే అదృష్టాలు ఎప్పుడోగానీ రావు. త్రిపుర పర్యటన ఎప్పటికీ మరువలేనిది.
తరువాత నా అమెరికా విమాన ప్రయాణానికి, త్రిపుర ప్రయాణం పునాది రాయిగా మిగిలింది. త్రిపుర ఆ రెండు కుటుంబ మిత్రుల ఆతిథ్యం ఎన్నటికీ మరువరానిది. ఈ విశేషాలు నెమరువేసుకుంటూ ఆనందంగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చాము. గుర్తు చేసుకుంటే భలే అనిపిస్తుంది ఈ మధురాతి మధురమైన జ్ఞాపకం.
(మళ్ళీ కలుద్దాం)