జ్ఞాపకాల పందిరి-60

18
7

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నా.. దంత సంరక్షకులు..!!

[dropcap]నా[/dropcap] జీవితం మలుపు తిరిగింది నా అనారోగ్యంతోనే. వూహించని విధంగా నేను దంత వైద్యుడిని కావడమే ఆ మలుపు. నాకు హై స్కూల్ స్థాయిలో అనారోగ్యం కలిగి ఉండకపోతే, నా భవిష్యత్తు మరో రూపంలో ఎదురు వచ్చి ఉండేది. వైద్యుడిని కావడం మూలానే, నా ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా, మంచి వైద్య సహాయం పొందే అవకాశం కలిగింది. ఇవి జరిగాక ‘అంతయూ మన మేలుకొరకే’ అన్నసూక్తిని నమ్మక తప్పడం లేదు. ఒక డాక్టరు, మరో డాక్టర్‌కు వైద్యం చేయవలసినప్పుడు, ఆర్థికపరంగా కొంత వెసులుబాటు కలగడమే గాక, ప్రత్యేక శ్రద్ధ తప్పక ఉంటుండన్నది జగమెరిగిన సత్యమే! ఇలాంటి సదుపాయాలన్నీ నాకు కలిసొచ్చిన అదృష్టమే.

ఈరోజుల్లో, నిజాయితీగల ఒక వైద్యుడు దొరకడం అదృష్టమే. వైద్యపరంగా, ఆర్థికపరంగా, నిజాయితీని శంకించే పరిస్థితులు దాపురించాయి ఇప్పుడు. అందుకే తెలిసినవారి ద్వారానే ఇలాంటి పనులు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు చాలామంది. వైద్యరంగం వ్యాపారరంగం అయిపొయింది అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అక్కరలేదనుకుంటాను. వైద్యరంగంలో ఉండడం వల్ల, నాకే కాదు నా బంధు మిత్రులకు సైతం మంచి వైద్యం అందడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇది వాస్తవం, నా అనుభవం, అంత మాత్రమే కాక నాకు ఒకసారి పరిచయం అయితే మరచిపోవడం అంటూ ఉండదు.

దంత వైద్య విద్యార్థిగా రచయిత

ఆ స్నేహాన్ని అలా కొనసాగిస్తూనే వుంటాను, అవసరం వచ్చినప్పుడే కాదు, అవసరం లేనప్పుడు కూడా పలకరిసుంటాను. ఈ మనస్తత్వం, అలవాటు నాకు ఎంతగానో మేలుచేసింది, చేస్తున్నది కూడా! అయితే, దీనికి అభిరుచి, అభిరుచికి ఓర్పు జత ఉండాలి. ఇవి రెండూ లేనివారికి, ఇది ఎంతమాత్రమూ సాధ్యం కాదు. ఇది నేను తెచ్చిపెట్టుకున్న అలవాటు కాదు. అంతర్గతంగా నా నరనరానా జీర్ణించుకుని వున్న లక్షణం.

నేను బి.డి.ఎస్.లో చేరేవరకూ దంతసంరక్షణకు సంబందించిన అంశాలలో అంతగా అవగాహన ఉండేది కాదు. నేను రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు దంత-సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడడం జరిగింది. ఒక దంతానికి పిప్పి వచ్చినట్టుగా సీనియర్లు తేల్చారు. అప్పుడు ఓ.డి.ఎస్ (ఆపరేటివ్ డెంటల్-సర్జరీ) విభాగంలో డా.యాదగిరి అనే డాక్టరుగారు హౌస్ సర్జన్‌గా చేస్తుండేవారు. డిపార్ట్మెంట్ హెడ్‌గా ప్రొ.సి.ఎస్.మూర్తి గారు ఉండేవారు. ఈ విభాగంలో పిప్పి పన్నుకు, సిమెంట్ ఫిల్లింగ్ చేయడం, మూలచికిత్స (రూట్ కెనాల్ ట్రీట్మెంట్), పంటి తొడుగులు ( కేప్స్ లేదా క్రౌన్‌లు) చేయడం వంటి చికిత్సా విధానాలు ఇక్కడ జరుగుతాయి.

ఒక రోజు డా.యాదగిరి గారు నా పిప్పి పన్నుకు తాత్కాలిక ఫిల్లింగ్ చేశారు. అయినా అది చాలా సంవత్సరాల వరకూ చెక్కు చెదరలేదు. ఆ రకంగా ఆయన గుర్తుండిపోయారు. తరువాత, క్రింది దవడ లోని ఒక జ్ఞాన దంతం తీసివేయాల్సి వచ్చింది. నిజానికి పన్ను పరిస్థితిని బట్టి దానిని తీయడానికి, రెండు చికిత్సా విభాగాలు ఉంటాయి. కేవలం పళ్ళు తీయడానికి (extraction) ఒక విభాగం ఉంటుంది. దీనిని శాస్త్రీయ పరిభాషలో ‘Department of Exodontia’ అంటారు. ఇక్కడ ఏ ఇతర చికిత్సలు చేయరు. మరొకటి ‘Department of oral surgery’ అనబడే చికిత్సా విభాగము. కష్టమైన పళ్ళను శాస్త్ర చికిత్స ద్వారా తీయడం, దవడలకు – చికిత్సలు, వగైరా చికిత్సలు ఇక్కడ చేస్తారు. అప్పుడు ఈ విభాగానికి అధిపతిగా డా.తజమ్మల్ హుస్సేన్ ఉండేవారు. జాతీయ స్థాయిలో ఆయనకు చాలా గొప్ప పేరు ఉండేది.

రచయిత మొదట పన్ను తీయించుకున్న ఓరల్ సర్జరీ విభాగం హెడ్ ప్రొఫెసర్ తజమ్మల్ హుస్సేన్ గారు.

ఆయనకు ఇద్దరు సహాయకులు ఉండేవారు. ఒకరు డా. రాములు గారు, రెండవవారు, డా. హరనాథ్ గారు. ఓరల్ సర్జరీ డిపార్ట్మెంట్‌లో డా. హరనాథ్ గారు నాకు పన్ను తీశారు. ఇదొక గొప్ప అనుభవం. ఇప్పుడు ఈ విభాగాన్ని, ‘Department of maxillofacial surgery’ అంటున్నారు.

మొదట రచయిత పన్ను తీసిన ఓరల్ సర్జన్ శ్రీ. సి.హరినాథ్ గారు

ఆధునిక దంత చికిత్సా విధానాల్లో దీని ప్రాముఖ్యత గొప్పది. తరువాత, కొంతకాలానికి, పన్ను అరిగి జివ్వున గుంజడం మొదలైంది. అప్పుడు మా ప్రొఫెసర్ బి. శ్రీరామమూర్తి గారిని కలవడం జరిగింది. ఆయన ఆ పంటికి ఒక తొడుగు (క్రౌన్) వేయాలన్నారు. ఆ సదుపాయం హాస్పిటల్‌లో లేనందున చికిత్స నిమిత్తం డా. శ్రీరామమూర్తి గారి క్లినిక్‌కు వెళ్లాను. ఆయన క్లినిక్ అబిడ్స్ తాజ్ హోటల్‌కు దగ్గరలో ఉండేది. అక్కడ, ప్రొఫెసర్ గారి చేత క్రోన్ వేయించుకున్నాను. ప్రొఫెసర్ శ్రీరామమూర్తి గారు, ‘Department of Prosthodontics’కు హెడ్‌గా ఉండేవారు. ఆయనకు సాహిత్య సాంస్కృతిక అంశాల పట్ల మంచి అభిరుచి ఉండేది. ఈ రంగాలలో, విద్యార్థులను ఆయన బాగా ప్రోత్సహించేవారు.

ప్రొఫెసర్ బి.శ్రీ రామమూర్తి గారు

తర్వాత చాలా కాలం వరకూ ఎలాంటి దంత సమస్య నాకు రాలేదు. దంత సంరక్షణ పట్ల కొంత అవగాహన వుండడడం అది సాధ్యమై ఉండవచ్చు. తర్వాత హన్మకొండకు వచ్చేవరకూ, ఎలాంటి దంతసమస్యనూ ఎదుర్కొనలేదు. ఇతరులకు దంతచికిత్సలు చేయడంలో నిమగ్నమైన నాకు, నా దంతసమస్యలు నన్ను పలకరించలేదు. కానీ 2013 తర్వాత, మళ్ళీ సమస్య మొదలయింది. చల్లటి పానీయాలు తాగినా, చల్లని పదార్థాలు తిన్నా పళ్ళు ‘జివ్వు’మని గుంజడం మొదలుపెట్టాయి. వాటిని భరిస్తూ చాలాకాలం నిర్లక్ష్యం చేస్తూ గడిపేశాను. ఒకసారి, మా అమ్మాయిని చూడడానికి హైదరాబాద్ (సఫిల్ గూడ) వెళ్ళినప్పుడు మొత్తం పళ్ళన్నీ జివ్వుమని గుంజడం, నొప్పిపెట్టడం మొదలై, ఆ తర్వాత ఉధృతమై భరించరాని పరిస్థితి ఏర్పడింది. మందులకు తాత్కాలిక ఉపశమనము తప్ప పరిస్థితి తీవ్రతలో మార్పులు రాలేదు. ఇక డాక్టరుకు చూపించుకోవాలనే నిర్ణయానికి వచ్చాను.

హన్మకొండలో, నాకు తెలిసిన, నమ్మకమైన, పనిమంతుడైన దంతవైద్యుడు నాకు మిత్రుడు. దంతవైద్య కళాశాలలో నాకు జూనియర్. నన్ను గౌరవించి, మర్యాదగా వుండే దంతవైద్యుడు, డా. వై. మల్లేశ్వర్‌కు చూపించాను. అప్పుడు ఆయన ఎం.జి.ఎం ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ప్రైవేట్ ప్రాక్టీస్, హన్మకొండ చౌరస్తాలో ఉండేది (ప్రస్తుతం కాళోజి హెల్త్ యూనివర్సిటీలో,  పరీక్షల నియంత్రణాధికారి, తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాల చరిత్రలో ఆ స్థాయికి ఎదిగిన మొదటి దంత వైద్యుడు ఈయనే!). నా దంతాలన్నీ అరిగిపోవడం వల్లనే సమస్య వచ్చింది కనుక అన్నింటికీ, పంటి తొడుగులు (crowns) వేయాలన్నారు. సుమారు పదిహేను రోజులపాటు ఈ చికిత్సా కార్యక్రమం జరిగింది.

ప్రొఫెసర్. వై.మల్లేశ్వర్, Controller of examinations, Kaloji health university, Warangal.

తర్వాత సమస్యలు రాలేదు. తృప్తిగా భోజనం నమిలి తినేవాడిని. గట్టి పదార్థాలు కూడా సులభంగా నమిలేవాడిని. ఆ తర్వాత వాటిని గురించి అసలు ఆలోచించలేదు. తర్వాత 2020 మధ్య కాలంనుండి, కుడివైపు పైన క్రింద, దంతాలు జివ్వుమని గుంజడం మొదలు పెట్టాయి. తాత్కాలిక మందుల ఉపశమనంతో మళ్ళీ నా దంతాలు నిర్లక్ష్యానికి గురిఅయినాయి. అలా 2021 వరకూ గడిపేశాను. కరోనా కాస్త తగ్గు ముఖం పడుతున్న రోజులు. మళ్ళీ భరించలేని పంటినొప్పి మొదలయింది. నా శిష్యురాలు అనదగ్గ, సహృదయిని, డా. కవితా రెడ్డికి ఫోన్ చేసి నా సమస్య వివరించాను. ఆ అమ్మాయి (నాకంటే చాలా చిన్నది) వెంటనే క్లినిక్‌కు రమ్మన్నది.

రచయిత కుటుంబ దంతవైద్యురాలు డా.కె.కవితారెడ్డి, ప్రోస్థోడాన్టిస్ట్.

డా. కవితారెడ్డి నాకు పెద్దకూతురు లాంటిది. నాకు అమితమైన గౌరవం ఇస్తుంది. ప్రస్తుతం వరంగల్‌లో నైపుణ్యం గల దంతవైద్యుల్లో ముందువరుసలో, మొదటి స్థానంలో వుంది ఆమె. నేను డెంటల్ ప్రాక్టీసుకు దూరంగా ఉండడంతో, నాకు తెలిసిన వారందరికీ, డా. కవితారెడ్డి కుటుంబ దంతవైద్యురాలైంది. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో చక్కని దంత వైద్య సేవలు అందిస్తున్నది. నా సమస్యకు అతి తక్కువ సమయంలో పరిష్కారమార్గం చూపించింది. ఇప్పుడు నాకు ఎలాంటి దంత సమస్యలూ లేవు. భవిష్యత్తు సంగతి చెప్పలేను.

నిన్నమొన్నటి వరకూ నేను అనేకమందికి దంత వైద్య సేవలు అందించాను. అవసరమైన ముందస్తు సూచనలు చేసాను. పాఠశాలలు, కళాశాలలు, దర్శించి దంత వైద్య అవగాహన కార్యక్రమాలు, దంతవైద్య శిబిరాలు నిర్వహించాను. నన్ను ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారో నాకు తెలీదు కానీ, నా దంతసంరక్షకులను మాత్రం నేనెన్నడూ మరచిపోలేను. వారి సేవలను నిత్యం గుర్తుంచుకుంటాను. ఈ అవకాశం అందించిన ‘సంచిక’ పత్రికకు ఎల్లప్పుడూ ఋణపడి వుంటాను.

‘ఆరోగ్యమైన దంతాలు – ఆనందానికి సంకేతాలు’.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here