జ్ఞాపకాల పందిరి-68

60
6

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

సీనియర్ మిత్రులు..!!

[dropcap]చ[/dropcap]దువుకున్న రోజులు చాలా గొప్పవి. తిరిగి రమ్మంటే రానివి. తలుచుకుని ఆనందించాలి తప్ప మరో మార్గం లేదు. చాలామంది ఎప్పటి స్నేహితులను అప్పుడే మరచిపోతుంటారు. మరిచిపోక పోయినా అలాంటి వాటికి పెద్దగా ప్రాధాన్యత నియ్యరు. గతం గతః అన్నట్టు ఉంటుంది వాళ్ళ ధోరణి. అలాంటి వారి ఆలోచనలు, ప్రాధాన్యతలు వేరుగా వుంటాయి. వాళ్ళు ప్రస్తుతానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు అందరివీ ఒకేలా ఊహించుకోవడం కూడా పొరపాటేనేమో! ఎక్కడో కొందరిలో అవి కలవవచ్చునేమోగానీ ఎక్కువశాతం భిన్న వ్యక్తిత్వాలు మాత్రమే కనిపిస్తుంటాయి. దానిని తప్పుగా మనం భావించలేము. జిహ్వకో రుచి అన్నట్టుగా సమాజంలో భిన్న మనస్తత్వాల గలవాళ్ళు వ్యక్తిత్వాలు గలవాళ్ళు మాత్రమే మనకు కనిపిస్తుంటారు. అలా అని వాళ్ళను తప్పు పట్టలేము, ఎవరి జీవితాలు వాళ్ళవి. అభిరుచులను బట్టి అవసరాలను బట్టి, తమ చుట్టూవున్న పరిస్థితులను బట్టి, ఇంటి వాతావారణాన్ని బట్టి వారి.. వారి జీవనశైలిని ఏర్పరచుకోవడం మానవ సహాజం. అందరికీ ఒకే రకమైన జీవనశైలిని ఊహించలేము, అది సాధ్యం కాని పని.

ఇక రెండవ రకం వ్యక్తులు అతి తక్కువ శాతం మంది వుండేవాళ్ళు, సున్నిత హృదయులు. ప్రతి సంఘటన వారికి అవసరమైనదీ, ముఖ్యమైనదీనూ. గతాన్ని ఎప్పటికప్పుడు, లేదా సందర్భం వచ్చినప్పుడు తప్పక జరిగిన విషయాలను ఒకమారు నెమరు వేసుకుంటారు. ఇది వీరిలోని ప్రత్యేకత, ప్రత్యేక వ్యక్తిత్వమూనూ. వీళ్ళు ఒకసారి పరిచయం అయినవాళ్ళని అసలు మరచిపోరు. జరిగిన సంఘటనలు, ఎదురైన సమస్యలు వీరి మస్తిష్కం నుండి ఎటూ జారిపోవు. అవి తలచుకుని మానసికానందం పొందడం వీరికి అలవాటు. కొన్ని బాధపడే విషయాలు కూడా ఉంటాయి అది వేరే విషయం!

నా మటుకు నేను నాకు వూహ తెలిసినప్పటినుంచీ ఒకసారి పరిచయం అయితే మరిచిపోవడం అనేది జరగదు. మొబైల్స్ యుగం ప్రారంభం అయినప్పటినుంచీ ఫోటోలు తీసుకుని వాటిని భద్రపరుచుకోవడం కూడా మొదలు అయింది. చూసేవాళ్ళకి ఇది వింత అనిపించవచ్చు. చాటు మాటుగా ‘పిచ్చి’ అనుకున్నా ఆశ్చర్య పోనక్కరలేదు. కొందరికి జన్మతః ఈ అభిరుచి ఉండవచ్చు. కొందరు ఇతరులను స్నేహితులను చూసి నేర్చుకొనవచ్చును. నా దృష్టిలో ఇది ఒక మంచి అలవాటు. స్నేహితులను, బంధువులను, శ్రేయోభిలాషులను ఏదో ఒక రూపంలో గుర్తు చేసుకోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. చదువుకునే రోజుల్లో అనేకమంది స్నేహితులవుతారు. చివరికి మిగిలేది మాత్రం బహుకొద్దిమంది మాత్రమే! ఇక్కడ నా సహాధ్యాయులైన స్నేహితుల గురించి కాదు, నాకు సీనియర్లు అయి వుండి నన్ను స్నేహితుడిగా అక్కున చేర్చుకున్న వారి గురించి వివరిస్తాను.

సీనియర్లు అంటే జూనియర్లను ఏడిపిస్తారనీ, ఆటపట్టిస్తారని, ముప్పు తిప్పలు పెడుతుంటారని, ‘రేగింగ్’ పేరుతో భయం సృష్టిస్తుంటారని తరచుగా వింటుంటాము. అంతెందుకు మా సమీప బంధువు స్వర్గీయ వర్ధనపు బ్రహ్మానందరావు గారు, రేగింగ్ కారణం వల్ల అప్పట్లో మెడిసిన్‌లో సీటు వదులుకొని వచ్చేసిన ఉదంతం పెద్దవాళ్ళు చెప్పగా నాకు ఇప్పటికీ గుర్తు వుంది. అయితే ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే నా సీనియర్లు నన్ను అమితంగా ప్రేమించారు, సోదరుడిలా చూసారు. నాకు మంచి స్నేహితులుగా శ్రేయోభిలాషులుగా మారారు. అందుకే వారిని మరచిపోవడం అన్నది జరిగే పనికాదు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మా విద్యార్థీ విద్యార్థినులలో, కులం మతం ప్రాంతం, హోదా ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. ఈ జాడ్యం మాకు చదువు చెప్పిన పెద్దలలో ఉండేదేమో నాకు తెలియదు. వున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. మేము మాత్రం ఎప్పుడూ వాటి జోలికి పోలేదు, ఆ అవసరం రాలేదు కూడా!

నాకు నా సీనియర్ స్నేహితుల్లో అప్పటినుండి ఇప్పటివరకూ మిత్రత్వానికి విలువనిచ్చి మంచి స్నేహితుడుగా కొనసాగుతున్న పెద్దలు డా. మదన్ మోహన్ గారు. ప్రేమగా అందరూ ఆయన్ని ‘మదన్’ అని పిలుస్తారు. నన్ను ఆయన ఎందుకో గాని ‘బావగారూ!’ అని సంబోధిస్తారు. ఆ పిలుపు నాకు ఆనందం కలిగించడమే కాదు, ఒళ్ళంతా గిలిగింతలు పెడుతుంది కూడా. అనంతపురంకు చెందిన డా. మదన్ మోహన్ గారు ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ లోనే ఉండేవారు.

డా.వి.మదన్ మోహన్ (బెంగుళూరు)తో రచయిత

నాకంటే ఈ డాక్టర్ గారు రెండేళ్లు సీనియర్. సీనియర్ అన్న అహంభావం ఏమాత్రం ఆయనలో కనిపించేది కాదు. మంచి తెలివైనవాడు, అద్భుతమైన మెరిక లాంటి దంత వైద్యుడు కూడా. ఈ నాటికి ప్రతిరోజూ వాట్స్‌ఆప్ మాధ్యమం ద్వారా శుభోదయం చెప్పుకోవడం మాకు అలవాటు. ప్రస్తుతం ఆయన బెంగుళూరులో నివశిస్తున్నారు. మేము తరచుగా కలుసుకోకపోయినా వాట్సాప్ ద్వారా ప్రతిరోజూ పలకరించుకునే సదుపాయం కలిసి వచ్చింది. ప్రతిభావంతుడైన డాక్టర్ మదన్ మోహన్ నాకు ఇష్టమైన వ్యక్తులలో ముఖ్యుడు. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం కూడా! పోస్టు గ్రాడ్యుయేషన్ చేయకుండానే, చికిత్సావిధానాలాలో వారిని మించిన మేధావి డా. మదన్ మోహన్.

డా.రఘనాధ రెడ్డి కుటుంబం, అమెరికా

నా సీనియర్లలో మరో విశిష్టమైన వ్యక్తి, అమెరికాలో స్థిరపడిన దంతవైద్యులు, సహృదయులు డా. రఘునాథ రెడ్డి. మిత్రలోకంలో ‘రఘు’గా, ‘రఘు రెడ్డి’గా ప్రసిద్ధులు. వీరు దంతవైద్యంలో నాకు జూనియర్ అయిన రాధారెడ్డిని వివాహమాడారు. ఇద్దరు అమెరికాలో స్థిరపడి అక్కడే దంత వైద్యశాలను ప్రారంభించి, వారితో పాటు మరికొంతమంది దంత వైద్యులకు, దంతవైద్య సేవలు అందించే అవకాశాలు కల్పిస్తున్నారు. సీనియర్ అన్న అహంభావం ఏమాత్రం లేని డా. రెడ్డి గారు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుండేవారు. నేను వరంగల్ వచ్చిన తరువాత పదమూడు సంవత్సరాలు వరుసగా అధ్యక్షడిగా కొనసాగుతున్న సందర్భంలో, ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు జరిగే నాటకోత్సవాలకు వారి పేరుమీద రెండు సార్లు పదివేలు చొప్పున ప్రాయోజకులుగా సొమ్ము అందించిన సహృదయులు వారు. నాకు చెక్కు పంపిస్తూ రెడ్డిగారు రాసిన మాటలు నాకు ఇంకా గుర్తుకు వున్నాయి. “ఇక్కడ వుండి నేను ఎలాగూ ఏమీ చేయలేకపోతున్నాను. నువ్వు అక్కడ చేస్తున్న మంచి పనికి ఈ సొమ్ము ఉపయోగించు” అని రాశారు. నాకు ఆ మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. సాహిత్య సాంస్కృతిక రంగాలలో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఉత్ప్రేరకాలుగా పనిచేసాయి. ఇదిఎప్పటికీ మరచిపోలేని విషయం. తరచుగా మాట్లాడుకోపోయినా ఫేస్‌బుక్‌లో నేను రాసే అంశాలకు అప్పుడప్పుడూ స్పందిస్తూ కామెంట్లు పెడుతుంటారు. ఆ విధంగా స్నేహం ఇంకా హాయిగా కొనసాగుతున్నది.

డాక్టర్ కృపాకర్, రఘునాథ రెడ్డి, మదన్ మోహన్ గార్లు ముగ్గురూ సహాధ్యాయులే. కృపాకర్ గారు కూడా అమెరికా దేశం లో స్థిరపడి ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు. అప్పుడప్పుడూ ఫోన్ చేయడం, వాట్స్‌అప్‌లో చాట్ చేస్తుంటారు. ఈ డాక్టర్ గారిలో మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే,వీరు మాకు దంత వైద్య శాస్త్రంలో పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ సి. డి. రెడ్డి గారికి అల్లుడు. మా ప్రొఫెసర్ గారి అమ్మాయి (డా. కృపాకర్ గారి భార్య) పెళ్లి కాక ముందు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నాట్యప్రదర్శన ఆరేంగేట్రం చేసినప్పుడు, నటరాజ రామకృష్ణ, సినారే ప్రభృతుల సమక్షంలో మాట్లాడే అవకాశం నాకు లభించింది. మొట్టమొదటిసారి రవీంద్ర భారతిలో మాట్లాడే అవకాశం అందివచ్చిన శుభ సందర్భం అది నాకు.

ఈ జాబితా లోని వారే డా. కృష్ణ ప్రసాద్ గారు. చదువుకునేటప్పుడు వీరు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండేవారు. అప్పుడప్పుడు ఫేస్‌బుక్‌లో దర్శనం ఇస్తుంటారు. వీరు ప్రస్తుతం ఎక్కడ వుంటున్నారన్నది ఇదమిద్దంగా తెలియదు. కానీ వారి సహృదయత, స్నేహశీలత బహు గొప్పవి. నేను నిత్యం తలుచుకునే నా సీనియర్లలో వీరు కూడా ముఖ్యులే. మా కుటుంబ స్నేహితురాలు శ్రీమతి ప్రభావతి గారికి డా. కృష్ణ ప్రసాద్ అతి దగ్గరి బంధువులు కావడం విశేషం!

డాక్టర్ జి.నాగేశ్వరరావు, సీనియర్ డెంటల్ సర్జన్, హైదరాబాద్

నాకంటే ఒక సంవత్సరం సీనియర్ దంత వైద్య విద్యార్థులతో నాకు చనువు ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పటివరకు స్నేహం కొనసాగిస్తున్నవారు బహుకొద్ది మంది మాత్రమే! అందులో అతి ఎక్కువ చనువు స్నేహం, ఆత్మీయతతో సహృదయతను మూటగట్టుకొని స్నేహాన్ని అందిస్తున్న ప్రియమిత్రుడు డా. జి. నాగేశ్వర రావు. చదువుకునే సమయం కంటే ఆ తర్వాతి కాలంలో అతి సన్నిహితుడైన మిత్రులలో ఈయన ఒకడు. కొద్ది రోజులు మాత్రమే ప్రభుత్వ రంగంలో పనిచేసి ఆ తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించి (హైదరాబాద్ విద్యానగర్ లోని శంకర్‌మఠ్ పైన) అందులో సఫలీకృతుడై ఇప్పటికీ చక్కని దంత వైద్య సేవలు అందిస్తున్న మంచి దంత వైద్యుడు డా. నాగేశ్వరరావు. నన్ను ఎంతో ఆప్యాయంగా ‘కెఎల్వీ’ అనే డా. రావుని, ప్రేమగా నేను ‘కామ్రేడ్’ అంటాను. అలా పిలవడానికి మరో ముఖ్య కారణం వారి కుటుంబం అంతా వామపక్ష భావజాలం గలవారై ఉండడమే. నేను తరచుగా కలుసుకునే మిత్రులలో ఈయన ఒకడు. ఆధునిక దంత వైద్యాన్ని ఆకళింపు జేసుకుని, నూతన పోకడలను అధ్యయనం చేసి మంచి వైద్యం అందించే ఈ దంత వైద్యుడు ‘డా. జి. ఎన్. రావు’ గా ప్రసిద్ధుడు. పేదగా పుట్టినా, పేదవాడిగా మరణించకూడదన్నది పెద్దల సూక్తి. దానికి శ్రేష్ఠమైన ఉదాహరణ డా. జి. ఎన్. రావు అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఆయన కష్టపడి పేదరికాన్ని జయించి ఎవరూ ఊహించని స్థాయికి చేరుకోవడం నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. దీని వెనుక ఆయన శ్రమ ఏమాత్రం వెల కట్టలేనిది. ఎప్పుడయినా ఫోన్‌లో మాట్లాడుకున్నప్పుడు సరదాగా ఒకరినొకరు ఏడిపించుకోవడం, తిట్టుకోవడం మా ఇద్దరి ప్రేమకు పరాకాష్ట!

డా.ముక్కామల పార్థసారథి, ఏలూరు

నా మరో మంచి మిత్రుడు, (డా. జి. ఎన్. రావుకి సహాధ్యాయి) డా. ముక్కామల పార్థసారథి. ఈయన ప్రైవేట్ ప్రాక్టీషనర్‌గా,పశ్చిమ గోదావరి జిల్లాలో స్థిరపడి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అప్పట్లో ఏలూరులో అత్యాధునిక దంత వైద్యసేవలు అందించిన దంత వైద్యులు వీరే! డా. పార్ధసారధి ప్రముఖ సినిమా పెద్దలు రామినీడు గారి అల్లుడు. ఈయన పెళ్లి ఏలూరులో జరిగింది. ఆ సందర్భంగా పెళ్ళిలో సినిమా సీనియర్ నటుడు అల్లు రామలింగయ్యగారిని, సినీ హీరో శ్రీ మురళీ మోహన్ గారినీ అతి దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ఇది మరచిపోలేని మధుర ఘట్టం.

చదువుకునే రోజుల్లో డా. కిషోర్,డా. రామచంద్రారెడ్డి (ఇప్పుడు లేరు) డా. పార్థసారథి, డా. చాంగ్ ప్రభుతులు ఒక బృందంగా ఇతరులతో కలసి మంచి బృందంగా ఉండేవారు. వీళ్ళందరూ నన్ను అధికంగా ప్రేమించేవారు. పార్థసారథిని ఏదో నిక్ నేమ్ పెట్టి ఏడిపిస్తుండేవారు. నేను ఒప్పుకునేవాడిని కాదు. ఈ బృందం కాన్ఫరెన్సులకి వెళ్లినా, విహార యాత్రలకు వెళ్లినా నన్ను తప్పక తీసుకువెళ్ళేవారు. అలాంటప్పుడు డా. పార్థసారథి నన్ను ఎంతో ప్రేమతో అభిమానంతో చూసేవాడు. వీరందరితో అమృత్‍సర్, సిమ్లా కాన్ఫరెన్స్‌కు వెళ్లి, ఇతర ప్రాంతాలను కూడా దర్శించే అవకాశం నాకు కలిగింది. డా. పార్థసారథి కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా ‘బావగారూ’ అని పిలిచేవాడు. హాయిగా ఏలూరులో స్థిరపడ్డ డా. పార్థసారథి నేనూ క్రమం తప్పకుండా వాట్స్‌అప్‌లో ఇప్పటికీ శుభోదయంతో పలకరించుకోవడం ఎంతో ఆనందం అనిపిస్తుంది. అప్పుడప్పుడూ మేము కాన్ఫరెన్సుల్లో కలుసుకునేవాళ్ళం. ఇప్పుడు వయసు దృష్ట్యాను, ఇతర కారణాల వల్లనూ అవి తగ్గిపోయాయి, అదే విధంగా మా కలయికా తగ్గిపోయింది. డా. పార్థసారథి ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ మంచి స్నేహితుడు అనడంలో ఎలాంటి సందేహము లేదు.

డాక్టర్ కె.వి.బి.ఆనంద్, విశాఖపట్నం

నాకు స్నేహితుడైన మరో మంచి వ్యక్తి, విశాఖపట్టణం వాసి, నాకు సీనియర్ డా. కె. వి. బి. ఆనంద్. నాతో పాటు ప్రభుత్వ సర్వీసులో దంతవైద్యుడిగా పని చేసి పదవీ విరమణ చేసినాడు. ఎక్కువ కాలం అనకాపల్లి లోనే పని చేసి, ఆ ఊరిమీద వున్నఅభిమానం కొద్దీ ప్రమోషన్ సైతం వదులుకుని అనకాపల్లిలోనే రిటైర్ అయినాడు. అప్పట్లో ఆనంద్ ఆంధ్రభూమి వారపత్రిక తప్పక కొని చదివేవాడు. కవిత్వం కూడా రాసేవాడు. కవితా సంపుటి కూడా వేసినట్టు గుర్తు. మేం ఇద్దరం అంత సన్నిహితం కావడానికి ప్రధాన కారణం నేను ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్‌లో వుండక ముందు ఇద్దరం గౌలిగూడాలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ పరిచయమే మా ఇద్దరినీ బాగా దగ్గర చేసింది. అది ఇప్పటికీ కొనసాగడం చాలా సంతోషం అనిపిస్తుంది. మూడు సంవత్సరాల క్రితం విశాఖపట్నం వెళ్ళినప్పుడు,వాళ్ళింట్లో ఇద్దరం కలిసిన తీపి గుర్తులు ఇంకా పచ్చి గానే ఉన్నాయి.

స్వర్గీయ డా.పి.రామచంద్రారెడ్డి, కడప

ఇప్పటికీ నన్ను బాధపెట్టే విషయం నా సీనియర్ రామచంద్రారెడ్డి మరణం. గోవాలో హౌస్ సర్జెన్సీ చేస్తూ పి.జీ. సంపాదించే నేపథ్యంలో, ఒక ప్రమాదంలో మరణించడం అప్పట్లో జీర్ణించుకోలేని అంశం అయింది. నన్ను బాగా ఇష్టపడ్డ సీనియర్ మిత్రులలో ఆయన ఒకరు. నన్ను ఎంతో ఆత్మీయంగా ‘మామగారూ’ అని పిలిచేవాడు. ఎప్పుడో అతని పుట్టిన రోజు సందర్భంగా నేను రాసి ఇచ్చిన కవిత, రెడ్డి ఫేంట్ జేబులో దొరికిందట వాళ్ళ అమ్మగారికి. అది చదివి ఆవిడ భోరున ఏడ్చారన్న విషయం తెలిసి నా మనసు మూగగా రోదించిన సన్నివేశం అసలు మరచిపోలేను. స్వచ్ఛమైన మనస్సుగల స్నేహితుడు దూరం కావడం నన్ను ఇప్పటికీ బాధ పెడుతూనే ఉంటుంది. అలా ఒక సహృదయుడైన మంచి స్నేహితుడిని నేను కోల్పోయాను.

వీరు కాక, డా. వాసిరెడ్డి కిశోర్ కుమార్ (అమెరికా), డా. చాంగ్ (విజయవాడ), డా. హరిప్రసాద రావు (హైదరాబాద్), డా. షేక్ దస్తగిరి (తాడేపల్లి గూడెం)వంటి వారు నాకు మంచి స్నేహితులుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం పెద్దగా వారితో సంబంధాలు లేవనే చెప్పాలి. కాలేజీ జీవితం చాలా గొప్పది. ముఖ్యంగా మా హైదరాబాద్ ప్రభుత్వ దంత వైద్య కళాశాల జీవితం సీనియర్ -జూనియర్ అన్న వివక్షత లేకుండా, కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా ఆనందంగా గడిపేవాళ్ళం. అవన్నీ చాలా మంచిరోజులు. చీకూ – చింతకు దూరంగా వున్నరోజులు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here