జ్ఞాపకాల పందిరి-69

8
7

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అప్పగింతలు..!!

[dropcap]ప[/dropcap]రిస్థితులు అనుకూలించకుంటే, కాలం కలిసి రాకుంటే ఒక్కోసారి ఎంతటివారికైనా స్థాయితో సంబంధం లేకుండా బిక్షగాడి కంటే దీనస్థితికి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మన హోదా గానీ, డబ్బు గానీ, ఆస్తులు గానీ – అంతస్తులు గానీ ఎందుకూ పనికి రాకుండా పోతాయి. నేను గొప్పవాడిని కాబట్టి నేను ఒకరిని అర్థించలేను లేదా సహాయం చేయ్యమని అడగలేను అనుకుంటే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. అందుచేత మన పరిస్థితి ఎటూ కాని పద్ధతికి దిగజారి పోయినప్పుడు, మనం ఒకటి కాదు ఎన్నైనా మెట్లు దిగి కిందికి రావలసిందే లేకుంటే నష్టపోయేది మనమే. కావాలని చూస్తూ.. చూస్తూ తమ జీవితానికి చివరి క్షణాలు ఎందుకు కల్పించుకుంటారు?

ఒకోసారి కొందరు పెద్దలు తమ హోదాను, ఆర్థిక స్థాయిని అడ్డం పెట్టుకుని చాలా మూర్ఖంగా ప్రవరిస్తుంటారు. జీవితాన్ని ఏమాత్రం సరిగా అర్థం చేసుకోరు, తమ తమ భేషజాలతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. అయినా ఇలాంటి వారి ప్రాధాన్యతలు తమ గొప్పలు ప్రదర్శించుకోవడానికే వినియోగిస్తారు. పరిస్థితులను బట్టి స్థాయిని హోదాలనూ పక్కకు పెట్టి అవసరాలకు ప్రాధాన్యత నివ్వడం తెలివైనవారు చేసే పని. నాలుగు విలాసవంతమైన కార్లు వున్న వ్యక్తి, ఒక్కోసారి తప్పని పరిస్థితిలో కాలినడకన పోవాల్సిన దుస్థితి ఏర్పడవచ్చు! అయిదు నక్షత్రాల హోటల్‌లో మాత్రమే కాఫీ తాగే వ్యక్తి ఆకలి తీర్చుకోవడానికి పేదవాడి గుడిసెలో ఆతిథ్యం పొందవలసిన అవసరం రావచ్చు. ఇక్కడ స్థాయి చూసుకుని బెట్టు చేస్తే నష్టం ఎవరికి?

ఇటువంటి సంఘటనలు ఎన్నో రూపాల్లో అందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురుకాక తప్పదు. ముఖ్యంగా విలాసవంతమైన జీవితం గడిపేవారిలో ఇటువంటి జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండి పోతాయి. ఈ నేపథ్యంతో ఒక వింత అనుభవాన్ని మీ ముందు ఉంచడానికి ఆశపడుతున్నాను. నా జీవితంలో ఇటువంటి అనుభవాలు కోకొల్లలు. కానీ.. అన్నీ అందరికీ ఉపయోగపడేవి కావు. నేను ఎదుర్కొన్న అనుభవాలు నలుగురికీ ఉపయోగపడేవి మాత్రమే చెప్పడం నా ఈ ‘జ్ఞాపకాల పందిరి’ ముఖ్య ఉద్దేశం.

నా జీవితంలో నేను మహాహబూబాద్‌లో పనిచేసిన పన్నెండు సంవత్సరాలూ చాలా ముఖ్యమైనవి. అనేక అనుభావాలను అనుకోని రీతిలో మూటగట్టుకొని కొన్నింటితో ఆనందమూ, మరికొన్నింటితో వ్యథలు ఒళ్లంతా అల్లుకున్న రోజులవి. అయినా ఎప్పటికీ మరచిపోలేని మరుపురాని వూరు అది. అప్పట్లో మహబూబాబాద్ ఒక పెద్ద తాలూకా కేంద్రం. వ్యాపార కేంద్రాలైన వరంగల్ – ఖమ్మం లకు మధ్యన రైల్వే మార్గంలో ఉన్న రెవిన్యూ డివిజన్. ప్రస్తుతం ఇది జిల్లా కేంద్రం అయింది. అవసరాలను బట్టి తోటి వైద్యులను, ఊరి పెద్దలను, వివిధ వ్యాపారస్థులను పరిచయం చేసుకోక తప్పదు. ఉద్యోగంలో చేరిన తొలి రోజులవి. నా కోసం నేను కొందరిని పరిచయం చేసుకుంటే, నా వైద్యం కోసం, వైద్య సలహాల కోసం నన్ను పరిచయం చేసుకున్నవాళ్ళు కొందరు. ఇందులో సింహభాగం అక్కడి బాంక్ ఉద్యోగులదీ, తర్వాత రైల్వే ఉద్యోగులదీను. సాయంత్రం కాసేపు తప్పక రైల్వే స్టేషన్లో కూర్చొని వచ్చేవాడిని. ఇరుపక్షాల అవసరరాలను బట్టి వ్యాపార రంగంలో ముందుకు దూసుకుపోతున్న ఒక ప్రముఖ వ్యక్తి నాకు పరిచయం అయ్యారు. ఒకచిన్న మొక్క లాంటి సాధారణ వ్యక్తి, ఆర్థికంగా ఒక మహా వృక్షంలా ఎలా ఎదగవచ్చో, ఆయన జీవితాన్ని తాపీగా విశ్లేషిస్తే తెలుస్తుంది.

ఒక షాపులో సాధారణ సహాయకుడిగా చేరి, గురువుకే వ్యాపార మెళుకువలు నేర్పించి, ఆ వ్యాపారాన్ని ఎన్నో రెట్లు పెంచి గురువు ప్రశంశలు పొంది, ఆయన ఆశీస్సులతో, తానూ వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి తాను ఏమిటో స్వయంగా నిరూపించిన వ్యకి. ఆయనను మొదట నాకు పరిచయం చేసిన ఆత్మీయ మిత్రులు స్వర్గీయ డా. వై. ఆర్. అప్పారావు గారు. ఆ పరిచయం కాబడ్డ వ్యక్తి ‘నాగేంద్ర బుక్స్ &జనరల్ స్టోర్స్’ అధినేత శ్రీ ఎం. నాగేశ్వర రావు గారు. అందరికీ ‘నాగేంద్ర’గా ప్రసిద్ధులు. నా మహబూబాద్ జీవిత కాలంలో నాకూ నాగేశ్వర రావు గారికి అనేక అనుభవాలు. వ్యాపారాన్ని గురించి తప్ప మిగతా అన్ని విషయాలలో నా మాటకు విలువ ఇచ్చేవాడు ఆయన. ఒక రెండు ఉదాహరణలు చెప్పి అసలు విషయానికి వస్తాను.

ప్రముఖ వ్యాపారస్థులు, మంచి మిత్రులు శ్రీ నాగేశ్వరరావు, మహబూబాబాద్.

ఒక రోజు ఉదయం మా ఇంటికి వచ్చారు నాగేశ్వర రావు. దంత సమస్య ఏమైనా ఉందేమోనని, “ఏమిటీ విషయం ఇంత ప్రొద్దున్న?” అన్నాను. “ఒక ముఖ్య విషయం మీతో మాట్లాడాలని వచ్చాను” అన్నారు.

“చెప్పండి” అన్నాను.

“అమ్మాయి పెద్దది అయింది. పెళ్లి చేసేస్తాను సార్” అన్నారు.

“ఇంత చిన్న పిల్లకి పెళ్లి చేస్తారా?” అన్నాను.

“మాలో అలాగే ఉంటుంది సార్. లేకపోతే లేనిపోని నిందలు మోపుతారు” అన్నారు.

అది సరయిన పద్ధతి కాదనీ, కాస్త వయస్సు వచ్చేవరకూ పెళ్లి చేయడం సబబు కాదని, నచ్చచెప్పగలిగాను. నా సలహాకు విలువ ఇచ్చి మూడు సంవత్సరాలు ఆగి అప్పుడు కూతురుకి పెళ్ళి చేసాడు.

మరో సంఘటన – తల్లి వృద్ధురాలు. నడుం వంగిపోయింది. ఎక్కడికి వెళ్లాలన్నా చేతుల ఆధారంగా దేకుతూ వెళ్ళాలి. నాగేశ్వరరావు, ఆయన శ్రీమతీ వ్యాపార పరంగా బిజీగా ఉండేవారు. ఆ పెద్దావిడ అలా అనాథలా రోడ్డు దాటడం చూసిన నేను, నాగేశ్వరరావు వంటరిగా వున్నప్పుడు తల్లి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరణాత్మకంగా చెప్పాను.

నాగేశ్వరరావు దంపతులు, మహబూబాబాద్

ఆ రోజునుంచి తల్లి చనిపోయేవరకూ ఆవిడకు ఎంతో సేవ చేసాడు. ఈ రెండు సంఘటనలు ఆయనపట్ల గౌరవం మరింత పెరిగేటట్లు చేశాయి. నాకు కూడా ఎంతో సహాయకారిగా ఉండేవారు. ఇక అసలు విషయానికి వస్తే…..

ఒక రోజు అర్ధరాత్రి నా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. తర్వాత తలుపు మీద డబ.. డబ.. చప్పుడు అయింది. నాకు ఎమర్జెన్సీ కేసుల బెడద ఉండదు. చుట్టాలు గానీ, మిత్రులుగా నీ ఆ సమయంలో నా ఇంటికి వచ్చే అవకాశమే లేదు! నక్సలైట్ల దాడులు అధికంగా వున్న రోజులవి. అందుచేత భయం.. భయంగానే తలుపు తీసాను. అప్పుడు మేము ఆంధ్రాబ్యాంక్ మిత్రుడు శ్రీ తిరుమలరావు గారి ఇంట్లో ఉంటున్నాము.

కొడుకులతో నాగేశ్వరరావు దంపతులు, మహబూబాబాద్

తలుపు తీయగానే ఎదురుగా నాగేశ్వర రావు నేలమీద కూర్చుని కడుపునొప్పితో విపరీతంగా బాధ పడుతున్నాడు. ఆయన పక్కన రిక్షా అబ్బాయి నిలబడి వున్నాడు. ఇద్దరి ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే —

నాగేంద్రకు, మూడు గంటలుగా కడుపు నొప్పి వస్తున్నది. క్రమంగా అది పెరుగుతున్నది. రకరకాల గృహవైద్యం చేసినా కడుపునొప్పి తగ్గలేదు. ఆలస్యంగా క్లినిక్కులకు, ఆసుపత్రులకూ వెళ్లారు. ఎవరూ తలుపు తీయడం లేదు, స్పందించడం లేదు. ఆఖరి ప్రయత్నంగా నా దగ్గరికి వచ్చారు. బ్రతుకుతాడన్న నమ్మకం అతనికి పోయింది. నొప్పి విషయం పక్కన పెట్టి తన ఇంటి అప్పగింతలు చెప్పడం మొదలు పెట్టాడు. కంగారు పడవద్దని వారించాను.

లోపల నా క్లినిక్ రూంలో బల్లమీద పదుకోమన్నాను. ఏమి చేయాలో నాకు తోచడం లేదు. అప్పట్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ మందుల శాంపిల్స్ బాగా ఇచ్చేవారు. అలా నా దగ్గర ‘బరాల్గన్’ టాబ్లెట్స్ వున్నాయి. అది గుర్తుకు వచ్చి వెంటనే ఒక టాబ్లెట్ ఆయన చేత మింగించి గ్లాసుడు నీళ్లు తాగించాను.

నాగేశ్వరరావు కుటుంబం, మహబూబాబాద్

వెంటనే మా ఇంటికి దగ్గర్లో వున్ననర్సింగ్ హోమ్‌కు ఫోన్ చేసాను. వాళ్ళు తక్షణమే స్పందించి నాగేశ్వర రావును పంపించామన్నారు. త్వరగా తీసుకు వెళ్ళమని రిక్షా అతన్ని తొందర చేసాను.

ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే,రిక్షా నర్సింగ్ హోమ్‌కు చేరుకునేసరికి నాగేశ్వర రావు కడుపు నొప్పి కాస్తా తగ్గిపోయింది. అక్కడ అరగంట కూర్చోబెట్టి మళ్ళీ కడుపు నొప్పి వస్తే ఏమి చేయాలో చెప్పి ఇంటికి పంపించేశారు. ఇంటికి వెళ్లి నాగేశ్వరరావు ఆనందంగా ఫోన్ చేయడం ఇప్పటికీ, ఎప్పటికీ మరచి పోలేని విషయం. నేను ఇప్పుడు హన్మకొండలో ఉంటున్నా మా ఇద్దరి మధ్యా సత్సంబంధాలు హాయిగా కొనసాగుతూనే వున్నాయి. మా ఇద్దరి పిల్లల పెళ్ళిళ్ళకీ హాజరై ఆశీర్వదించడం నాగేశ్వర రావు గారి అభిమానానికి స్నేహానికి నిజమైన సాక్ష్యం.

పెద్ద కొడుకు సైదయ్య కుటుంబంతో నాగేశ్వరరావు దంపతులు

ఆయన కష్టం వూరికే పోలేదు, పిల్లలందరూ ప్రయోజకులైనారు, వారి వారి వ్యాపారాలు చేసుకుంటూ ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతూ దానధర్మాలు చేస్తూ తృప్తిగా బ్రతుకుతున్న మంచి మనిషి శ్రీ నాగేశ్వర రావు. ఆయన జీవితం ధన్యమైనది. నా మహబూబాబాద్ జీవితంలో నేను గుర్తుంచుకోదగ్గ మంచి వ్యక్తులలో ఆయన ఒకరు. గుర్తుంచుకోదగ్గ వ్యక్తి శ్రీ నాగేంద్ర!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here