జ్ఞాపకాల పందిరి-72

47
6

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

మిత్రలాభం..!!

[dropcap]స్వ[/dropcap]చ్ఛమైన స్నేహానికి కులం తోనూ, మతంతోనూ, ప్రాంతం తోనూ, భాషతోనూ స్టేటస్ తోనూ సంబంధం ఉండదని నేను అనుకుంటాను. అది నిజమేనని నా అనుభవాలు ఎన్నో నిరూపించాయి కూడా! నిజమైన స్నేహాన్ని కాంక్షించేవారు ఇతర విషయాలు అసలు పట్టించుకోరు. వారి దృష్టి ఎప్పుడూ మానసిక వికాసం, మానసిక ఉల్లాసం, మానసిక చైతన్యం మీదనే ఆధార పడివుంటుంది. వారి జీవనశైలి, తల్లిదండ్రుల పెంపకమూ బంధువుల -పరిసరాల ప్రభావం తోనే మలచబడుతుంది. వారి చర్చల్లో కులం, మతం అన్నవి ప్రస్తావనకు రావు. వచ్చినా దానికి చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉండదు. ‘మనమంతా ఒక్కటే.. మన ధ్యేయం ఒక్కటే..’ అన్న మూలసూత్రం మీద వారి ప్రవర్తన ఆధారపడి వుంటుంది. వీటికి భిన్నంగా ప్రవర్తించిన నాడు స్నేహానికి అసలు అర్ధమే ఉండదు.

కొంతమంది మనతో స్నేహంతో వున్నట్టే నటిస్తారు కానీ లోలోపల ఉండవలసిన అవలక్షణాలన్నీ ఉంటాయి, అవి సందర్భాన్ని బట్టి ఎప్పుడో బయట పడతాయి. మరి కొంతమందైతే, వారి అవసరాలు తీర్చుకునేవరకూ మనతో స్నేహం చేస్తారు తర్వాత ఏదో ఒక పేచీ సృష్టించి శత్రువుగా మారతారు. సాధారణంగా ఇలాంటివి పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, వివిధ కార్యాలయాల్లో ఎదురవుతుంటాయి. జీవితంలో ఎంతోమంది రకరకాలైన మనస్తత్వం కలిగిన స్నేహితులు లాంటి వ్యక్తులు తారసపడుతుంటారు. కానీ చివరికి ఏ కొద్దిమందో లేదా ఒకరిద్దరో అసలైన స్నేహితులుగా మిగులుతారు. ఇంచుమించు చాలామందికి ఈ అనుభవాలు సర్వసాధారణమే!

నేను నా జీవితంలో ఇప్పటి వరకూ స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చాను. అదొక వర్ణించలేని అనుబంధం. ఒకసారి పరిచయం అయితే నేను మరచిపోవడం అనేది ఇంచుమించు ఉండదు. మనస్తత్వాలు కలిస్తే ఆ స్నేహబంధం మరింత బలంగా చుట్టుకుంటుంది. నా హైస్కూల్ మిత్రులనుండీ ఇప్పటి మిత్రులవరకూ మా మధ్య పెనవేసుకున్న బంధం ఇలాంటిదే! నా పిల్లల పెళ్ళిళ్ళకి నా హైస్కూల్ మిత్రులూ వచ్చారు, నాకు బి.డి.ఎస్.లో బోధించిన ప్రొఫెసర్లూ వచ్చారు. అలాంటి నా స్నేహితుల్లో ముందువరుసలో నిలబెట్టదగ్గ మిత్రుడు, బి.డి.ఎస్.లో నా సహాధ్యాయి కెప్టెన్ డా. హనుమాన్ ప్రసాద్ సింగ్. స్నేహితుల మధ్య ‘హనుమాన్’గా ప్రసిద్ధుడు. మేమిద్దరం బిడిఎస్ -1975 బ్యాచ్‌కు సంబంధించిన వాళ్ళం. ఇంటర్‌మీడియేట్ వరకూ తెలుగు మీడియంలో చదివిన నాకు ఆంగ్లం అంతంత మాత్రంగానే వచ్చేది. ఆంగ్లంలో మాట్లాడాలంటే చెమటలు పట్టేవి. దీనికి తోడు మాకు బి.డి.ఎస్.లో ఇతర రాష్ట్రాల/దేశాల విద్యార్థులకు ప్రత్యేక కోటా ఉండడం వల్ల వివిధ భాషలవాళ్ళు వుండేవాళ్ళు. వాళ్ళు అందరితో స్నేహంగా ఉండాలని వున్నా భాష పెద్ద అవరోధంగా ఉండేది. ఆంగ్లం, హిందీ, తెలుగు ప్రధానంగా మాట్లాడుకోవడం అమలులో ఉండేది. హైదరాబాద్‌లో ఉండడం వల్ల హిందీ (కూరగాయల మార్కెట్ భాష) కొద్దిగా అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి వీలుగా ఉండేది.

కెప్టెన్ హనుమాన్ ప్రసాద్ సింగ్, ఢిల్లీ.

అందుచేత ఉత్తర భారతదేశం నుండి వచ్చిన హిందీ మాతృభాష గల సహాధ్యాయులతో మాటలు కలిపే ప్రయత్నం చేసేవాడిని. అలా బాగా దగ్గర మిత్రుడైనవాడు డా. హనుమాన్ ప్రసాద్ సింగ్. ఇతను రాజపుట్ వంశానికి చెందినవాడు. అలా అని కులాన్ని అడ్డుపెట్టుకుని ఆతను ఎన్నడూ ఎబ్బెట్టుగా ప్రవర్తించలేదు. హనుమాన్ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉండేవాడు. నేను మరికొంతమంది మిత్రులతో గౌలిగూడాలో అద్దె ఇంట్లో ఉండేవాడిని. ఆతను అప్పుడప్పుడు తీరిక సమయాల్లో మా రూమ్‌కి వచ్చేవాడు. నేను అతని రూమ్‌కి వెళ్ళేవాడిని. అలా ఒక ఆదివారం హనుమాన్ మా రూమ్‌కి వచ్చాడు.

1975.బి.డిఎస్. బ్యాచ్, ప్రభుత్వ దంత వైద్య కళాశాల, హైదరాబాద్. ఎడమవైపు నిలుచున్నవారిలో చివరి వ్యక్తి డా. హనుమాన్ సింగ్

అప్పటికి మా రూమ్ దగ్గర పెద్ద గొడవ జరుగుతున్నది. ఈ గొడవకు నేపథ్యం కొంత ఇక్కడ వివరించాలి. మేము అద్దెకుంటున్న ఇంటికి పక్కన వేరేవాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటిముందు కొంచెం ఖాళీస్థలం, సాయంత్రం కాసేపు సరదాగా బయట కూర్చోవడానికి అనుకూలంగా ఉండేది. మేము మిద్దె మీదకు వెళితే వాళ్ళందరూ కనిపిస్తారు. ఆ యింట్లో వాళ్లకి ముగ్గురమ్మాయిలు వుండేవాళ్ళు. పెద్దమ్మాయి పదవతరగతి గాని డిగ్రీ చదువుతున్న అమ్మాయిలా ఉండేది. చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేది. మిగతా ఇద్దరూ ఆమెకంటే చిన్న. మేము బయట బట్టలు ఉతుకుతుంటే వేరే ఇంటి మిద్దె మీది నుండి కాగితం ఉండలు చుట్టి విసురుతుండేవారు. మేము చూసేసరికి పక్కకు తప్పుకునేవారు. వీళ్ళను చూడ్డానికి నా రూమ్‌మేట్స్ సాయంత్రాలు పైకి మిద్దె మీదకు వెళ్లేవారు. అప్పుడప్పుడూ నేనూ వెళ్ళేవాడిని. ఒక రోజు ఇలాంటి సమయంలో ఆ ఆడపిల్లల తండ్రి మమ్మల్ని ఉద్దేశించి ఏమి మాట్లాడాలో తెలియక “మీరంతా ఇలా ఎందుకు చూస్తున్నారు?” అన్నాడు.

వెంటనే నేను అందుకుని, “మీరెందుకు చూస్తున్నారు మావంక?” అన్నాను. “ఆ.. అదేంటి?” అన్నాడు ఆ పెద్దమనిషి. “అవునండీ.. మీరు మా వంక చూస్తేనే కదా, మేము మీకు కనిపించేది!” అన్నాను. “లాజిక్కు మాట్లాడుతున్నావా?” అన్నాడు. “మీరు ఏదైనా అనుకోండి, మా ఇంటి మిద్దె మీద మేము వున్నాము. ఎటువైపు అయినా చూసే హక్కు మాకు వుంది. కావాలంటే కనపడకుండా తెరలు కట్టుకోండి, మీ అమ్మాయిలకు బురఖాలు వేయండి” అన్నాను. అతను మా అందరివంకా సీరియస్‌గా చూసాడు. దాని ప్రభావం వారం రోజుల తర్వాత మాకు తెలిసింది. పక్కింటి పెద్దమనిషి మా ఇంటి యజమాని తాగుబోతు కొడుక్కి ఏమి చెప్పాడో ఏమో.. ఒక ఆదివారం మేము హాస్టల్ లంచ్ ముగించుకుని వచ్చిన కాసేపటికి మా ఇంటి యజమాని కొడుకు పీకలదాకా తాగి ప్రముఖంగా నన్ను అటాక్ చేయబోయాడు. అదుగో.. అదే సమయంలో నా మిత్రుడు హనుమాన్ ప్రసాద్ సింగ్ వచ్చాడు. పరిస్థితి గమనించాడు. ఇక వివరాలలోనికి పోకుండానే, మా ఇంటి యజమాని కొడుకు మీద పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అది తట్టుకోలేక అతగాడు తిట్టుకుంటూ వాళ్ళ ఇంట్లోకి పారిపోయాడు.

మిత్రుడు హనుమాన్ వెంటనే నన్ను అక్కడినుండి ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్‌కి తీసుకుని వెళ్ళాడు,అతని రూంలో నన్ను గెస్టుగా పెట్టుకున్నాడు. నా డిగ్రీ కోర్సు పూర్తి అయ్యేవరకూ అక్కడే కొనసాగాను. అప్పుడు హనుమాన్ రూమ్‌మేట్ ఇప్పుడు, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్, ప్రొఫెసర్ మనోహర్ గారు. ఆయన కూడా తమ్ముడిని గెస్ట్‌గా వుంచుకుని ఉండడం వల్ల, హనుమాన్‌ని ప్రశ్నించలేదు. అంతమాత్రమే కాదు డా. మనోహర్ నాకు మంచి మిత్రులు అయ్యారు కూడా. హన్మకొండకు వచ్చిన మొదటి రోజుల్లో ఆయనే మాకు ఫిజీషియన్. కాకతీయ మెడికల్ కళాశాలకు అనుబంధంగా వున్న మహాత్మగాంధీ మెమోరియల్ (ఎం.జి.ఎం)ఆసుపత్రికి సూపరింటెండెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత ‘నిమ్స్ – డైరెక్టర్’ అయ్యారు. ఈ వ్యాసం రాసే సమయానికి ఆయన ఇంకా పదవిలో రెండవసారి కొనసాగుతూనే వున్నారు.

హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ లో, సహాధ్యాయులతో కెప్టెన్ హనుమాన్ ప్రసాద్ సింగ్

నా మిత్రుడు డా. హనుమాన్ ప్రసాద్ సింగ్ రాష్ట్రేతరుడు. మేము చదువుకునేటప్పుడు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రభుత్వ దంతవైద్య కళాశాల (డెంటల్ వింగ్) ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండేది. అప్పటికి ఇంకా ప్రత్యేక దంతవైద్య కళాశాలగా ఏర్పడలేదు. ప్రైవేట్ దంతవైద్య కళాశాలలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికి లేవు. అలా మొత్తం నలభై సీట్లు ఉండేవి. అందులో కొంతశాతం కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యార్థులు వుండేవారు. వీరిని ‘సెంట్రల్ నామినీస్’ అనేవారు. అలా మా క్లాసులో ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, అండమాన్, మలేషియా, మణిపూర్ వంటి ప్రదేశాలనుండి నాకు సహాధ్యాయులు ఉండేవారు. అటువంటి వారిలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెంది అండమాన్ నుండి నామినేట్ చేయబద్ద విద్యార్థి డా. హనుమాన్ ప్రసాద్ సింగ్. తండ్రి గారు శ్రీ రామ్ దూలార్ సింగ్ అసిస్టెంట్ కమీషనర్‌గా అండమాన్‌లో పనిచేస్తుండడం మూలాన హనుమాన్ అక్కడినుండి నామినేట్ చేయబడ్డాడు. మంచి స్నేహశీలుడైన డా. హనుమాన్, స్నేహితుడిగా మాత్రమే గాక, ఒక శ్రేయోభిలాషిగా, స్వంత సోదరుడికి మించి ప్రేమించేవాడు. అలాంటి మా మైత్రి హనుమాన్ కొద్దిగా తెలుగు నేర్చుకునే అవకాశాన్ని కలిగించింది. కొన్ని తెలుగు లలిత గీతాలు నేర్చుకున్నా డు. సందర్భం వచ్చినప్పుడు తనకు తాను స్వేచ్ఛగా ఆలపిస్తూ ఉండేవాడు. ఇప్పటికీ అతనికి ఈ పాటలు గుర్తుండడం విశేషం!

పెద్దక్క ఉపాధ్యాయురాలిగా నాగార్జున సాగర్‌లో (దక్షిణ విజయపురి) పని చేస్తుండడం మూలాన, మిత్రుడు హనుమాన్‌ని ఒకసారి అక్కడకు తీసుకు వెళ్లాను. అక్కను ‘అక్కా..’ అని ఆప్యాయంగా పిలిస్తే అక్క మురిసిపోయేది. స్వంత కుటుంబం లోని వ్యక్తిగా స్వేచ్ఛగా ఉండేవాడు. అలా అక్క ప్రేమకు,ఆత్మీయతాను రాగాలకు పాత్రుడయ్యాడు. అంతమాత్రమే కాదు ఒకసారి మా అత్తగారి ఇంటికి (విజయవాడ) తీసుకు వెళ్లాను. అప్పటికి నేను ఆ ఇంటి అల్లుడినవుతానని నాకే తెలీదు. అలా జరిగినట్టు హనుమాన్‌కి ఇప్పటికీ తెలియదు. వాళ్ళు నా బంధువులు అని మాత్రమే తెలుసు. అయితే నా పెళ్ళికి అతను, అతని పెళ్ళికి నేను వెళ్లే అనుకూలతలు అప్పుడు ఏర్పడలేదు. 1975లో బి.డి.ఎస్.లో చేరిన మేము 1980లో పూర్తి చేసుకుని ఎవరి మార్గం వాళ్ళం ఎంచుకున్నాం. నేను ఆరు నెలల పాటు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి (సింగరేణి కాలరీస్) లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేసి, ఆ తర్వాత అప్పటి ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమీషన్ ద్వారా డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా మహబూబాబాద్ (అప్పుడు తాలూకా, ఇప్పుడు జిల్లా) ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాను. తర్వాత జనగాం, కరీంనగర్ జిల్లా ఆసుపత్రులలో, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్‌గా పనిచేసి 2011లో పదవీ విరమణ చేసాను.

కెప్టెన్ హనుమాన్ ప్రసాద్ సింగ్

నా మిత్రుడు దంతవైద్యుడిగా ఆర్మీకి (ఇక్కడ సెలెక్ట్ కావడం చాలా కష్టం) సెలెక్ట్ అయ్యాడు. హనుమాన్ ఆర్మీలో పదవీ విరమణ చేసే సమయానికి కెప్టెన్ ర్యాంకులో వున్నాడు. తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా 1996లో ఢిల్లీ లోని డా. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో దంతవైద్యుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి అక్కడి దంతవైద్య విభాగానికి అధిపతి అయినాడు. ఈ సంవత్సరం 30-సెప్టెంబరు నాడు పదవీ విరమణ చేయనున్నాడు.

మూడు సంవత్సరాల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో హైదరాబాద్‌లో కలుసుకునే అవకాశం కలిగింది. ఎంతగానో ఆనందించాము, గతాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుని మురిసిపోయాము. కెప్టెన్ (డా). హనుమాన్ ప్రసాద్ సింగ్ లాంటి స్నేహితులు బహు అరుదు. ఈ రోజుల్లో మరీ అరుదు!

పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం. కూర్చున్న వారిలో కుడి నుండి రెండవ వ్యక్తి డాక్టర్ హనుమాన్

బ్రతికినంత కాలం మా స్నేహం ఇలానే కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహములేదు. అయితే అతను ఢిల్లీ -నేను హన్మకొండ, అంతే తేడా…!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here