జ్ఞాపకాల పందిరి-73

47
10

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

చెన్నై బాలాజీ…

[dropcap]మ[/dropcap]న మిత్రులు మనకు సహాయం చేయడంలో ప్రత్యేకత లేదనుకుంటాను. అది ఎలాగూ జరిగే పని కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి చెప్పవలసిన అవసరం ఉండదు. సహాయం చేయలేని వారి గురించి ఇక్కడ ప్రస్తావించడడం ప్రస్తుతం అప్రస్తుతం కావచ్చు. నిస్సహాయతను తప్పుపట్టలేము. సహాయం చేయాలని వున్నా చేయలేని పరిస్థితి అన్నమాట. అటువంటి మిత్రుల నుండి సహాయము ఆశించడం కూడా తప్పే. అది వారిని మానసికంగా హింసించడమే అవుతుంది. మనకు అత్యంత ప్రీతిపాత్రులైన స్నేహితులు అవసరమైన సహాయం చేయగల సమర్థులై వుండి,మన సమస్యను అవగాహన చేసుకుని మనం అడగక ముందే సహాయయం చేయడానికి ముందుకు వస్తే అంతటి గొప్ప విషయం థ్రిల్లింగ్ మరోటి ఉండదు. అవి అరుదుగా జరిగే సంఘటనలు. ఏదీ కూడ మనం సీరియస్‌గా తీసుకోవలసిన అంశం కాదు. కలిసి వస్తే అంతకు మించిన తృప్తి, సంతోషం మరోటి ఉండదు. స్నేహితుల ద్వారా అనేక సందర్భాలలో అనేక రూపాలలో సహాయం పొందిన జీవితం నాది. ఒకసారి స్నేహం ఏర్పడితే నా మనసులోనుంచి అది చెదిరిపోవడం బహు అరుదు. నాలానే ఎందరో ఇలాంటి స్నేహమయ జీవితంతో తృప్తిగా ఆనందంగా బ్రతక గలుగుతున్నారు. అలాగే సహాయం పొందడంలోనే కాక చాతనయినంత సహాయం చెయ్యడంలోనూ నేను ఏంతో మానసిక తృప్తితో బ్రతక గలుగుతున్నాను.

అయితే దీనికి భిన్నంగా మరో వ్యక్తి ద్వారా పరిచయమై, ఆ పరిచయం తర్వాత మంచి స్నేహంగా మారి పరిచయం చేసిన వారికి మించి స్నేహితులుగా మారడం, అవసరానికి వారు ఎంతగానో సహాయపడడం వంటి సన్నివేశాలు అరుదుగా కనిపించినా, అక్కడక్కడా ఇలాంటి వారు కూడా కనిపించక పోరు. ఆ స్నేహం, ఆ ఇద్దరి వ్యక్తుల మనస్తత్వం మీద, అభిరుచుల మీద తప్పక ఆధారపడి ఉంటుంది. ఇలాంటి స్నేహాలు కూడా స్థిరంగా నిలిచిపోతాయి. ఇలాంటి వారితో అప్పుడప్పుడు పలకరింపులు, గొప్ప మానసిక శక్తిని పుష్టిని అందిస్తాయి. ఇలాంటి స్నేహాలు అందులోని మజా అనుభవించిన వారికే అర్థం అవుతుంది.

శ్రీ బాలాజీ…. చెన్నై

నా జీవితంలో ఈ రెండో రకం స్నేహాలు కూడా పుష్కలంగా వున్నాయి. ఎవరితోనైనా స్నేహం స్నేహమే! నా పెద్ద బావమరిది రాజబాబు పాండ్రాక (ఏ.ఓ. – జీవిత భీమా సంస్థ, విజయవాడ) తన చిన్ననాటి మిత్రుడిని పరిచయం చేసాడు. వాళ్ళు 5-6 గురు మిత్రులు ప్రాథమిక విద్య నుండి డిగ్రీ వరకూ చదువుకున్నవాళ్ళు. పెళ్లిళ్లు అయి పిల్లలు పుట్టినా వాళ్ళ స్నేహం ఇప్పటికీ చెరిగి పోలేదు. వాళ్ళ ఇళ్ళలో/వాళ్ళ బంధువుల ఇళ్ళలో జరిగే మంచి – చెడు కార్యక్రమాలకు సైతం అందరూ కలిసి పాల్గోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందు చేతనంటే. కలిసి చదువుకున్నది విజయవాడ అయినా, పెళ్లిళ్లు అయిన తర్వాత ఉద్యోగ రీత్యా తలా ఒకచోట స్థిరపడినవారు. ఆ మిత్రబృందంలో శ్రీ బాలాజీ (చెన్నై) రాజబాబు (విజయవాడ), చంద్రశేఖర్ (విజయవాడ), వెంకట్ (విజయవాడ), రంగనాథ్ (విజయవాడ) సభ్యులు. ప్రస్తుతం ఒక్క బాలాజీ (ఏ. జి. ఆఫీసు, చెన్నై)మాత్రమే వేరే రాష్ట్రంలో వున్నాడు, మిగతా అందరూ విజయవాడ చేరుకున్నారు. వీళ్ళందరూ మా బావమరిది పిలిచినట్టే ‘బావగారూ’ అని పిలవడం ఆనందం గానూ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పబోతున్నది శ్రీ బాలాజీ గురించి.

మిత్ర బృందంలో బాలాజీ, రాజబాబు తదితరులు

బాలాజీ జన్మస్థలం చెన్నై. తండ్రి రైల్వేలో పనిచేయడం మూలాన ఆయన విద్యాభ్యాసం విజయవాడలో జరిగినట్టున్నది. అందుచేత బాలాజీ తమిళుడు. తెలుగు మాట్లాడగలడు (తమిళుడుగా గుర్తించ లేనంతగా) కానీ చదవడం, రాయడం తెలీదు. స్నేహశీలుడు, మంచి మనసు కలవాడు. అలాంటి మిత్రుడు శ్రీ బాలాజీ నాకు రెండు సందర్భాలలో ఎంతగానో సహాయం చేసాడు. ఆయన స్థానంలో నేను వుండి ఉంటే అంత సహాయం నేను చేయలేక పోయేవాడిని కాదేమో అని నాకే అనిపిస్తుంటుంది. ఆ రెండు సందర్భాలూ చెన్నైలోనే కావడం మూలాన బాలాజీ సహాయం కోరాను. ఆయనతో వున్న సాన్నిహిత్యం, చనువు, బాలాజీ సహకారం అర్థించడానికి ఉపయోగపడ్డాయని చెప్పక తప్పదు.

క్రికెట్ ఆటగాళ్లు శ్రీ బాలాజీ. శ్రీ రాజబాబు (బావమరిది..విజయవాడ)

అది 2006వ సంవత్సరం. నా సుపుత్రుడు రాహుల్ కానేటి చెన్నై వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. అమెరికాలో చదువుకోవడానికి వీసాకు దరఖాస్తు చేసుకుంటే రాహుల్‌కి ఇంటర్వ్యూ కి చెన్నైకి పిలుపు వచ్చింది. అమెరికన్ కాన్సులేట్ అప్పుడు హైదరాబాద్‌లో ఇంకా ఏర్పాటు కాలేదు. కాబట్టి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వీసా మంజూరు చేసే వెసులుబాటు చెన్నై లోనే ఉండేది. అబ్బాయిని ఒక్కడినే పంపడం నాకు అసలు ఇష్టం లేదు. అందుచేత నేను కూడా అబ్బాయితో కలసి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది.

ఇద్దరికీ చెన్నై తెలియదు. నేను ఒకసారి విద్యార్థి దశలో చెన్నై వెళ్లాను కానీ పెద్దగా ఆ ప్రాంతాలు గుర్తులేవు. కొత్త ప్రదేశం ఎలా? అని మాలోమేము తర్జనభర్జన పడుతున్న సమయంలో, మా పెద్ద బావమరిది పరిచయం చేసిన తన మిత్రుడు శ్రీ బాలాజీ గుర్తుకు వచ్చాడు. ఆయన అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ చెన్నైలో పనిచేస్తున్నాడు.

అప్పుడు ఆయనకే ఫోన్ చేసి విషయం వివరించాను. దానికి వెంటనే బాలాజీ స్పందించి, తప్పక సహాయం చేస్తానని, నిర్భయంగా చెన్నైకి రమ్మని ఆహ్వనించాడు. అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నాడు. రైల్వే స్టేషన్‌కు వచ్చి మమ్ములను రిసీవ్ చేసుకున్నాడు. ఇంటర్వ్యూ ప్రదేశానికి దగ్గరలో హోటల్ రూమ్ బుక్ చేసినందువల్ల అక్కడకు తీసుకు పోయాడు. తర్వాత వీసా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి తీసుకుపోయాడు. ఆ ప్రదేశం మెయిన్ రోడ్డులోనే ఉంది.

చెన్నై హొటల్ లో రచయితతో శ్రీ బాలాజీ.

కూర్చోవడానికి అక్కడ ఎలాంటి సదుపాయము లేదు కూడా వెళ్లిన వారికి. కూర్చోవడానికి ఫుట్‍పాత్ మాత్రమే దిక్కు. అక్కడ స్థలం దొరకడం కూడా చాలా కష్టం. ఒకసారి కూర్చొని లేస్తే మళ్ళీ అది కూడా దొరకదు. ఎండలో అలా నిలబడవలసిందే! రాహుల్ లోపలికి వెళ్లిన తర్వాత ఇదంతా బయట నేను అనుభవించాను. నాకు ఇబ్బంది కలగ కూడదని, ఆఫీసునుంచి మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్ళేవాడు బాలాజీ. వీసా వచ్చిందని తెలిసాక నాకంటే ఎక్కువ బాలాజీ సంతోషించాడు. రాహుల్‌కి అనేక విషయాలు బోధించాడు.

ఎలా వుండాలో, తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల ఎలా సత్సంబంధాలు కలిగి ఉండాలో, అమెరికాలో స్నేహితులతో ఎలా మెలగాలో, ఇలాంటి విషయాలెన్నో మా వాడికి హితబోధ చేసాడు. సాయంత్రం మమ్ములను తిరుగు ప్రయాణంలో రైలు ఎక్కించేవరకూ మాతోనే వున్నాడు. మా బావమరిదికి అతనికి మధ్య వున్న స్నేహం ఎలాంటిదో అప్పుడు కాని నాకు పూర్తిగా తెలిసి రాలేదు.

2013 తర్వాత సంవత్సరం అనుకుంటాను, మా అమ్మాయి ప్రసారభారతిలో ప్రోగ్రాం ఎగ్జిక్యుటివ్ పరీక్ష పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కోసం చెన్నైకి పిలిచారు. అప్పటికి మా అమ్మాయికి పెళ్లి అయింది. భర్తను తీసుకుని చెన్నైకి వెళుతుందని నేను భావించాను. ఇక్కడ మళ్ళీ సెంటిమెంటు అడ్డువచ్చి మా అమ్మాయి నన్నే రమ్మంది. నేను తిరిగి బాలాజీ సహాయం అర్థించక తప్పలేదు,ఆయన సంతోషంగా ఒప్పుకొనక తప్పలేదు. మళ్ళీ షరా మామూలే!

మాకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా అన్ని ఏర్పాట్లూ చేసాడు బాలాజీ. మా పిల్లలకి చిన్నప్పటినుంఛీ ఈ బృందం తెలుసు. వాళ్ళ మేనమామను పిలిచినట్టే, అతని మిత్ర బృందం సభ్యులందరినీ ‘మామా’ అని పిలుస్తారు ఇప్పటికీ అలా బాలాజీ సహాయం ఎన్నటికీ మరువరానిది. ఈ ట్రిప్పులోనే చెన్నై సాహితీ మిత్రులు శ్రీ బొందల నాగేశ్వరరావు, శ్రీ చెన్నయ్య గార్లను కలవడం; కొద్దీ గంటలు ముచ్చటించుకునే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తాను.

ఇంటర్వ్యూలో మా అమ్మాయి సెలెక్ట్ అయి సంవత్సరం తర్వాత నిజామాబాద్ ఎఫ్.ఎం రేడియో స్టేషన్‌లో జాయిన్ కావడం, తదుపరి సంవత్సరం వరంగల్ రేడియో స్టేషన్‌కు బదిలీ కావడం ఇదంతా ఐదు సంవత్సరాల క్రితం మాట! జీవితంలో కొన్ని సందర్భాలు ఎప్పుడూ మనల్ని వెన్నంటి ప్రయాణం చేస్తుంటాయి. నాకు ఈ సంఘటన అలాంటిదే మరి!

ఇప్పటికీ బాలాజీతో నాకు స్నేహసంబంధాలు, పలకరింపులూ వున్నాయి. మా ఇద్దరి పిల్లల పెళ్ళిళ్ళకీ, మా బావమరిదితో పాటు అతని మిత్రబృందం భార్యామణులతో హాజరుకావడం ఎంతో సంతోషం కలిగించే విషయం. ఇలాంటి స్నేహాలు బ్రతికినంత కాలం వుండాలని నేను కోరుకుంటాను. అందరిలో నాకు బాలాజీ ప్రత్యేకం, అతని హృదయం విశాలం!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here