జ్ఞాపకాల పందిరి-74

30
8

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

కలిసొచ్చిన అదృష్టం..!!

[dropcap]ఇం[/dropcap]ట్లో పనిచేయడానికి పనిమనుష్యులను నియమించుకునే రోజులు క్రమంగా సన్నగిల్లిపోతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ఈ పరిస్థితి కొనసాగుతున్నది. సాధ్యమైనంత వరకూ ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం తప్పనిసరి అయింది. చదువుకోవడం, కష్టపడి ఏదో ఉద్యోగం సంపాదించుకోవడం వంటి మార్పులు చోటు చేసుకోవడం వల్ల పనిమనుష్యుల సంఖ్య తగ్గిపోయింది. వున్న కొద్దిమంది అధిక సొమ్ము ఆశించడంతో, ఇంచు మించు ఎవరి ఇంటి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది. పనిమనుష్యులకు చెల్లించే వ్యయం అధికంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం కావచ్చు. తప్పని పరిస్థితులలో పని మనుష్యుల కోసం అధిక వ్యయం వెచ్చించి పని చేయించుకోక తప్పదు. అందుచేతనేనేమో, ప్రతి చిన్న పని చేయడానికి ప్రత్యేకమైన యంత్రసామాగ్రి వినియోగించుకుని పని వెళ్లదీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నవి.

ఇల్లు శుభ్రం చేసుకోవడం అయినా, అంట్లు తోముకోవడానికైనా. బూజులు దులుపుకోవాలన్నా, తోటపని చేయాలన్నా అన్నింటికీ యంత్రాలు సిద్ధంగా ఉంటున్నాయి. బట్టలు ఉతికే విషయం వేరే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది ఇంటిలోపలి అలంకరణ నుండి బయట రంగులు వేయడం వరకు ఇంటివారే చేసుకోవడం పాశ్చాత్య దేశాలకు వెళ్లి వచ్చిన వారికి తప్పక తెలుసు.

మన దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా పూర్తిగా ఈ పరిస్థితి దాపురించక పోయినా, క్రమ క్రమంగా పనిమనుష్యులు దొరకని సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి దీనికి పూర్తిగా పాలక పెద్దలు ప్రభుత్వాలు, అక్కరలేని తాయిలాలు రుచి చూపించి, అనవసరంగా ప్రజల శ్రమ శక్తిని నిర్వీర్యం చేసి ప్రజలను పెడదోవ పెట్టిస్తున్నాయి. కష్ట జీవులు కాస్తా బద్ధకిస్తుల జాబితాలో చేరిపోతున్నారు. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకోవడం రాజకీయ నాయకులకు ఈనాడు వెన్నతో పెట్టిన విద్య అయి కూర్చున్నది. ప్రజలు, సమాజాం క్రమంగా కోల్పోతున్నదేమిటో ఇంకా తెలుసుకోలేకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వ ఖజానాలు ఖాళీ కావడానికి గల కారణాలలో ఒక ముఖ్యమైన అంశంగా ఈ ఉచితాల సంతర్పణను కూడా చేర్చడడానికి ఎలాంటి సందేహమూ అవసరమూ లేదు. శక్తి ఓపిక ఉన్నంత వరకూ కష్టపడి, వచ్చిన ఆదాయంతో బ్రతకడంలో వున్న తృప్తి మరోరకంగా రాదు.

ఒకప్పుడు భర్త ఉద్యోగం చేస్తే, భార్య గృహిణిగా ఉండేది. దీనికి కారణాలు అనేకం. వాటిని ప్రస్తుతం ఇక్కడ వివరించదలచుకోలేదు. కానీ, ఈ రోజుల్లో భార్యాభర్తలు చాలామంది చదువుకున్న వారు కావడం వల్ల వారి వారి అభిరుచులను బట్టి ఇద్దరూ ఉద్యోగులుగా స్థిరపడే అవకాశాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, పిల్లలను పెంచడం, సంరక్షించడం అనేది క్లిష్టమైన సమస్యనే!

విదేశాలలో అయితే ‘క్రెచ్’ (శిశుపోషణశాలలు) ల సంస్కృతీ ఎప్పుడో మొదలైంది. అందుచేత తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా తమ ఉద్యోగాలకు హాజరయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. మన దేశంలో కూడా ఈ సంస్కృతీ ప్రారంభం అయినా పాశ్చాత్య దేశాలలో ఊపందుకున్నంతగా లేదనే చెప్పాలి. ఇంకా సహాయకుల సేవలు మన దేశంలో ఉండడం వల్ల తప్పని పరిస్థితిలో మాత్రమే ఈ ‘క్రెచ్’ లను ఆశ్రయించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇళ్ళల్లో పని మనుష్యులను (సహాయకులు) పెట్టుకోవడమో, ఖాళీగా వున్న పెద్దలను పురమాయించడమో, బంధువులలో పేదలైన వారిని సమకూర్చుకోవడమో చేస్తున్నారు.

మేము ఇద్దరి పిల్లల విషయంలోనూ, ఇంటి పెద్దల మీద, బంధువుల మీదా ఆధారపడలేదు, ఆ వెసులుబాటు కూడా సమకూరలేదు. పనిమనుష్యుల పాక్షిక సహకారంతో మేము మా పిల్లలను పెంచి పెద్ద చేసుకోగలిగాము. అది పెద్ద సమస్యగా కూడా మాకు అనిపించలేదు. పైగా నా డ్యూటీ సమయాలు నాకు బాగా సహకరించాయి, కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో తండ్రిగా నేనే పిల్లలతో ఎక్కువగా గడిపే అవకాశం నాకు కలిగింది. ఒక రకంగా ఇది అదృష్టమే! కానీ మా మనవరాలు (కూతురి కూతురు )విషయంలో ఇది కుదరలేదు.

మనవరాలు పుట్టే సమయానికి, నేను నా శ్రీమతి పదవీ విరమణ చేసి ఇంట్లోనే ఉంటున్నప్పటికీ మా మనవరాలి విషయంలో మాపై ఎక్కువ భారం పడకూడదన్న ఉద్దేశంతో అనుకుంటాను, ముందుచూపుతో మా అమ్మాయి ఒక సంరక్షకురాలి (కేర్‌టేకర్ గర్ల్) వేటలో సఫలీకృతురాలైంది. దినపత్రికలో ప్రకటన ఆధారంగా, ఒక మధ్యవర్తి (బ్రోకర్) ద్వారా ఇద్దరు వచ్చారు మా ఇంటికి. అందులో ఒకరు నడివయస్కురాలు, రెండవ అమ్మాయి 20-25 మధ్య వయస్కురాలు. మా వాళ్ళు పెద్దావిడను సెలెక్ట్ చేశారు. కానీ ఆవిడ పిల్లను సంరక్షించడం కాదుగానీ, ఆమెను మేము సంరక్షించ వలసిన పరిస్థితి ఏర్పడేటట్టు నాకు అనిపించింది. అందుకే ఆమెను నేను ఆమెను కాదని రెండో అమ్మాయిని ఖాయం చేసాను. అలా నా నిర్ణయం మంచి ఫలితాలనిచ్చింది. నిజంగా ఇది మాకు కలిసొచ్చిన అదృష్టమే!

కుమారి స్వప్న, కొండపర్తి.

ఆ అమ్మాయి పేరు స్వప్న. కాజీపేట దర్గాకు దగ్గరలోని కొండపర్తి అనే గ్రామం. మంచి చురుగ్గా, నిత్యం సంతోషంగా ఉంటుంది. చదువుకునే స్థాయిలో మంచి క్రీడాకారిణి అని తెలిసింది. రోజూ ఉదయం షేర్ ఆటోలో 8 గంటల సమయంలో వచ్చి సాయంత్రం 6.30కు బయలుదేరి ఇంటికి వెళ్ళేది. కొద్దీ రోజుల్లోనే ఆమె ఏమిటో, ఆమె పనితనం ఏమిటో తెలిసిపోయింది. ఏదైనా ఒకసారి చెబితే మళ్ళీ మనం చెప్పే పరిస్థితి ఉండదు. ఆమె పరిశుభ్రంగా ఉండడమే కాదు, పాప (మనవరాలు) ను శుభ్రంగా ఉంచుతుంది. స్వంతవారి కంటే కూడా చాలా బాగా తన పని తానూ చేసుకుపోతుంది. మనవరాలికి అన్నం తినిపించడంలో ఆమె సిద్ధహస్తురాలు. పాప ఎంత విసిగించినా, ఎంత మొండికేసినా, ఆమెను బుజ్జగించి ఓపికగా అన్నం పెడ్తుంది. స్వప్న మా అందరికీ తలలో నాలుక అయిపొయింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా మా ఇంట్లోనే. స్వంత బంధువులా మెలుగుతుంది. ఆమె స్వయంగా క్రీడాకారిణి కనుక, ఉదయం సాయంత్రం మనవరాలిని మిద్దెమీదికి తీసుకు వెళ్లి ఆటలు ఆడిస్తుంది, తనుకూడా చిన్న పిల్లగా మారిపోయి ఆన్షి (మనవరాలు) తో ఆడుతుంది. ఆ వయసులో అవసరమైన వ్యాయామం చేయిస్తుంది. ఇవి మేము చెప్పినవి కాదు, స్వయంగా ఆమెనే కలుగజేసుకుని ఇవన్నీ చేస్తుంది. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న అంశం.

ఆన్షిని ఆడిస్తున్న స్వప్న

ఇక ఆన్షికి ఇప్పుడు ఐదు సంవత్సరాల వయస్సు. అప్పర్ కె.జి.కి వచ్చింది. బడి లేనందున ఆన్‌లైన్ క్లాసులు. ఆన్షి తల్లితో పాటు, స్వప్న కూడా క్లాస్ పూర్తయ్యేవరకూ ఆన్షితో వుండి, అంతా గమనిస్తుంది. మా అమ్మాయి ఆఫీసుకు వెళ్ళగానే స్వప్న మానవరాలితో హోమ్ వర్క్ చేయిస్తుంది. అది పూర్తికాగానే లంచ్ సమయం వరకూ ఇద్దరూ ఆటల్లో మునిగి పోతారు. మనవరాలు ఎంత విసిగించినా, ఇబ్బంది పెట్టినా తాను మాత్రం ఎంతో సహనంతో ఆన్షిని చూసుకుంటుంది. చిత్రం ఏమిటంటే పాప, మాతో కంటే స్వప్న తోనే ఎక్కువ సమయం గడుపుతుంది.

మా ఇంట్లో పుట్టిన రోజు జరుపుకున్న స్వప్న

కరోనా మహమ్మారి విశ్వవ్యాప్తమై సాధారణ ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసి పారేసింది. యావత్ ప్రపంచాన్ని ఇంకా గడగడ లాడిస్తూనే వుంది. ఈ నేపథ్యంలో అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అందరం (మా అమ్మాయి తప్ప) ఇంటి నాలుగు గోడల మధ్యకే పరిమితం అయిపోయాం. అందులో మా మనవరాలి కేర్‌టేకర్ అమ్మాయి స్వప్న కూడా వుంది. ఆమె సమ్మతం మీదనే ఆమెకు మా ఇంట్లో వసతి ఏర్పాట చేసాం, మేము ఏమి తింటే ఆమెకు అది పెడుతున్నాం, ఆమె పడుకోవడానికి ఒక దివాన్ ఏర్పాటు చేసాం. మా ఇంట్లో మనిషిగా ఆమెను చూస్తున్నాం. అయినప్పటికీ ఆమె మేము చేస్తున్నదాని కంటే ఆమె అందిస్తున్న సేవలు ప్రశంశనీయమైనవి. ఉదయం ఐదున్నరకి ఆమె తప్పక మేల్కొని ఇంట్లో అందరికంటే ముందు తయారై ఉంటుంది. ఎవరూ చెప్పకుండానే చిన్న చిన్న పనులు చేసేస్తుంది. మనవరాలు ఎప్పుడు నిద్ర లేస్తుందా? అని ఎదురుచూస్తుంది.

స్వప్న పుట్టిన రోజు జరుపుకున్న ఆనందంలో

ఆమె తలుచుకుంటే, “పాప తినడం లేదు నేనేమి చేయాలి?” అనొచ్చు. “చెప్పిన మాట వినడం లేదు నేనేమి చేయాలి?” అనొచ్చు. “అస్తమానం ఏడుస్తుంది, నేనేమీ చేయాలి?” అనొచ్చు. “చదవడం లేదు/రాయడం లేదు నేనేమీ చేయాలి?” అని ఇలాంటి పనులన్నీ తప్పించుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి ఎప్పుడూ అలా చేసే ప్రయత్నం చేయలేదు, తప్పించుకునే వ్యూహం పన్నలేదు. డబ్బులు తీసుకుంటున్నందుకు ఒక బాధ్యత గల వ్యక్తిగా పనిచేస్తుంది, మనవరాలికి స్వంత మనిషిలా ప్రేమను పంచుతుంది, అనురాగంతో పెంచుతుంది. నెల మొదటి వారంలో జీతం తీసుకుని ఇంటికి వెళ్లి అక్కడ తల్లితో (ఈ మధ్యనే తండ్రి చనిపోయాడు) రెండు రోజులు గడుపుతుంది (శుక్రవారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకూ). నా దృష్టిలో, నాకు తెలిసినంత వరకూ ఇలాంటి సహాయకులు బహు అరుదు.

మా కుటుంబంతో స్వప్న

చాలామందికి మనసు జీతం మీద ఉంటుంది కానీ, పని మీద ఉండదు. ఇంట్లో వస్తువుల మీద మనం నమ్మకంగా బ్రతికే అవకాశం ఉండదు. చిన్నపిల్లలకు తిండి సజావుగా అందుతున్నది లేనిదీ నమ్మకం ఉండదు. కానీ కుమారి స్వప్న, ఆమె సేవలు మాకు కలిసొచ్చిన అదృష్టం. అలా నా మనవరాలు కూడా అదృష్టవంతురాలు అని చెప్పక తప్పదు. మా పిల్లలు చిన్నప్పుడు (మేము మహబూబాబాద్‌లో వున్నప్పుడు) కూడా ఇలాంటి పనిమనుష్యులే దొరకడం, దేవుడి సంకల్పమో, మా అదృష్టమో గానీ, పెద్దవాళ్ళ సహకారం లేకుండానే మా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళకి వాళ్ళ స్థాయిలో ప్రయోజకులు అయినారు.

రెండేళ్ల క్రితం ఆన్షి

నేను మనుష్యులను నమ్ముతాను, నేను నమ్మినవారు ఎవరూ, నా నమ్మకాలను వమ్ము చేయలేదు. నా జీవితంలో ఇది కూడా నాకు కలిసొచ్చిన అదృష్టమే! ఎందరో ఆత్మీయులు పెద్దలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందించిన అన్ని రకాల సహాయ సహకారాలతోనే ఈ రోజున నేను/మేము, ఆనందంగా ఇలా బ్రతకగలుగుతున్నాము. అలాంటి వారందరికీ వందనాలు, వారిని జ్ఞాపకం చేసుకోగలగడం, గతాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకోవడానికి అవకాశం కలగడం కూడా నా అదృష్టం గానే భావిస్తాను. జీవితం అన్నాక చిన్న చిన్న సమస్యలు ఎదురుకాక తప్పదు, వాటికి ప్రాధాన్యతలను బట్టి విలువ ఇవ్వాలి తప్ప ప్రతిదానిని సీరియస్‌గా తీసుకోకూడదన్నది నా జీవితానుభవమే మరి!

ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, స్వప్నను మాకు పరిచయం చేసిన వ్యకి మరొక కుటుంబం కోసం ఎక్కువ జీతం ఆశ చూపించినా ఆమె తిరస్కరించడం. అలా స్వప్న మాలో ఒకరిగా కలిసిపోయింది. ఆమెకు మంచి భవిష్యత్తు రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. సమాజంలో ఇంకా మంచివాళ్ళు, బాధ్యతగా పనిచేసే వాళ్ళు వున్నారని చెప్పడానికి మంచి ఉదాహరణ కుమారి స్వప్న. ఆమెకు అభినందనలు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here