జ్ఞాపకాల పందిరి-75

39
9

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నా కళ్లజోడెక్కడ..!

[dropcap]వ[/dropcap]యసు చాలా విచిత్రమైనది. రకరకాల దశలలో రకరకాల మార్పులు మనిషిలో తీసుకు వస్తుంది. వయసును బట్టి ఆలోచనలు, ఆలోచనలను బట్టి పనులు, పనులను బట్టి సమస్యలు, సమస్యలనుబట్టి జీవన గమనం ఇలా ఒకదానితో మరొకటి ముడిపడి వుంటుంది.

శరీరంలోని అంగాలు, అంగవిభాగాలూ వయసును బట్టి వాటి శక్తి సామర్థ్యాలను కోల్పోయి జీవితంలో కొన్ని వింత సమస్యలు మొలకెత్తుతాయి. అవి సాధారణ జీవితానికే ఆటంకాన్ని కలిగించవచ్చు. ఈ పరిస్థితి తమను పెంచి పోషించే పిల్లల మీద ప్రభావం చూపించి, వారి ప్రేమాభిమానాలలో మార్పులు రావచ్చు. విషయం తెలియక పెద్దలమీద సదాభిప్రాయాన్ని కోల్పోయి, పెద్దలంటేనే ఏహ్య భావం కలిగే ప్రమాదం వుంది. సమస్యపై అవగాహన లేక ఓర్పు, సహనం నశించి ఇరుపక్షాలలోనూ ఘర్షణ తత్త్వం ఏర్పడవచ్చు. తద్వారా బంధుత్వాలకూ, రక్త సంబంధాలకూ గండి పడవచ్చు. అలా అని అందరినీ ఈ రూపంలో చూడలేము, అందరికీ వయసు ఇలాంటి సమస్యలు తెస్తుందనీ చెప్పలేము. అయితే ఎక్కువ మందిలో వయసు పెరిగేకొద్దీ రకరకాల మార్పులు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే సమస్యలు మాత్రం లేకపోలేదు.

సమస్యను త్వరగా పసిగట్టగలిగితే త్వరలో ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గాలు ఈ రోజున మనకు అందుబాటులో వున్నాయి. కానీ సమస్య తీవ్రతరం అయితే తప్ప ఇలాంటి విషయాలలో ఎక్కువమంది అప్రమత్తం కాక విషయాన్ని తీవ్రతరం చేసుకుంటారు. వృద్ధాప్యం వచ్చిన తరువాత, పిల్లల చేత బయటికి గెంటబడటాలు, వృద్ధాశ్రమాలకు నెట్టబడటాలు ఇలాంటి సమస్యల వల్లనే అని చాలామందికి తెలియదు.

వృద్ధాప్యంలో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో అతి ముఖ్యమైంది జ్ఞాపకశక్తికి సంబందించిన అంశం. ఇవి వారికే కాకుండా వారిని సంరక్షించేవారికి కూడా సమస్యలు సృష్టిస్తాయి. తద్వారా లెక్కలేనన్ని అపోహలకు దారితీస్తాయి. జ్ఞాపక శక్తిని కోల్పోడానికి కారణాలు అనేకం. కారణం ఏదైనా జ్ఞాపకశక్తిని కోల్పోవడం వ్యాధి లక్షణమే గాని వ్యాధి మాత్రం కాదు. వ్యాధిని నిర్ధారించగలిగితే వ్యాధికి చికిత్స చేయగలిగితే, వ్యాధి లక్షణం దానంతట అదే సమసిపోతుంది. జ్ఞాపకశక్తిని కోల్పోవడం లేదా మరుపు లేదా మరచిపోవడం అనేది వినడానికి మామూలు మాట అనిపించినా, నానా అపార్థాలకు, కోపతాపాలకు కారణభూతమయ్యే అంశం ఇది.

అన్నం తిన్నా తినలేదు అని చెప్పడం, పాలు తాగినా, తాగలేదని చెప్పడం, స్నానం చేయించినా లేదని చెప్పడం, మందులు ఇచ్చినా, ఇవ్వలేదని చెప్పడం ఇటువంటివన్నీ కావాలని చెప్పే మాటలుకాదు. వయసు పెరిగేకొద్దీ నాడీ వ్యవస్థలో వచ్చే మార్పులే ఇలాంటి సమస్యలకు కారణం. అందుచేత అది అర్థం చేసుకోకుండా ముసలివారిని కసురుకోవడం విసుక్కోవడం వంటివి చేయకూడదు. ఇక్కడ ఎవరికైనా ఓపిక అవసరం.

ఇంతటి తీవ్రమైన సమస్యకాకున్నా నాకెదురైన ఒక సమస్యను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. 2015లో అనుకుంటాను మొదటిసారి అమెరికా ప్రయాణం అయ్యాము, నేను నా శ్రీమతీను. ఎక్కడా సమస్య రాకుండా మా అబ్బాయి రాహుల్ అన్ని ఏర్పాట్లూ చేసాడు. అంతర్జాతీయ విమానంలో ప్రయాణం చేయడం నాకు మొదటిసారి. అయినా ఏదో ఆందోళన, అవసరంలేని టెన్షన్, కలగలిపి అంతులేని భయం. నా సంగతి తెలిసే మా అబ్బాయి అన్ని ఏర్పాట్లూ చేసాడు. మా ఇద్దరి సీట్లు చూసుకుని, కూర్చున్నతరువాత, ఎయిర్ హోస్టెస్ చెప్పిన జాగ్రత్తలు విన్నాక సీటు బెల్టు పెట్టుకుని కూర్చున్నాం. కొద్దీ నిముషాల్లోనే విమానం పైకెగిరి,ఆ తర్వాత ఒకే స్థాయి ఎత్తులో వేగంలో ముందుకు సాగుతోంది. ఎప్పుడో ఒకప్పుడు తప్ప, మామూలుగా రైల్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తున్న అనుభూతిలో ప్రయాణాన్ని ఆనందిస్తున్నాం. అప్పటికి కాస్త దైర్యం వచ్చేసింది. టి.వి. చూస్తూ మధ్యమధ్యలో వాళ్ళు అందిస్తున్న ఆహార పదార్ధాలు తింటూ, శీతల పానీయాలు ఆస్వాదిస్తూ ఇంట్లోనే ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నాం. ఈలోపులో లఘుశంక గంట మ్రోగించింది. వాష్ రూమ్‌కి వెళ్ళాలి. అది ఎలావుంటుందో తెలియదు. అడగడానికి మొహమాటం, అందుకే నా శ్రీమతికి సైతం చెప్పకుండా కాస్త ఇబ్బందిగా అటూ ఇటూ కదులుతున్నాను. చాలాసేపటివరకూ మా ఆవిడ నా సమస్యను గుర్తించలేదు. ఆవిడ గుర్తించిన తర్వాత, నా పరిస్థితి అర్థం చేసుకుని ఆవిడ ఒకసారి వాష్ రూమ్‌కి వెళ్లివచ్చి నాకు అన్నీ చెప్పింది. మొత్తం మీద డోర్ కాస్సేపు ఇబ్బంది పెట్టినా మొత్తం మీద కార్యక్రమం విజయవంతం చేసుకుని వచ్చి కూర్చున్నాను.

సాధారణంగా రచయిత కళ్లజోడు స్థానం

తర్వాత మాకు సరఫరా చేసిన అంశాల్లో ఒక పుస్తకం తీసుకుని చదువుదామనుకున్నాను. పుస్తకం తీసుకున్నానుగానీ, తర్వాత వళ్లు ఝల్లుమంది. అనుకోకుండా వళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి. కారణం కళ్ళజోడు కనిపించడం లేదు. అది లేకుంటే గుడ్డివాడితో సమానం! మా బాబు ముందే చెప్పాడు, ఒక అద్దాల సెట్ అదనంగా తెచ్చుకొమ్మని. అది పెద్ద లగేజ్‌లో ఉండిపోయింది.

పైగా అసలు అది పెట్టానో లేదోనని మళ్ళీ అనుమానం. ఇక మొత్తం వెతకసాగాను. సీట్ల మధ్య, సీట్లలో పిచ్చివాడిలా వెతికేస్తున్నాను. అదృష్టావశాత్తు ఎవరి ఎవరి గొడవలో వాళ్ళు వున్నారు, నన్నెవరూ పట్టించుకోవడం లేదు. నా శ్రీమతి సీట్లో కూర్చుని తన ప్రయత్నం తాను చేస్తున్నది. ప్రయోజనం ఏమీ కనిపించలేదు. అద్దాలు వాష్ రూమ్‌లో లోపల పడిపోయాయని నిర్ణయానికి వచ్చేసాను. అక్కడికి వెళ్ళాక బాబుని ఇబ్బంది పెట్టిన వాడిని అవుతానేమో నని ఒకటే ఆలోచన.

బావమరిది సూర్య శేఖర్ దొండపాటితో (య.ఎస్.ఎ)

కూర్చున్నానేగానీ మనసంతా, ఆలోచనంతా కళ్ళజోడు లేకుంటే ఎదురయ్యే పరిణామాల గురించే! మిగతా విషయాలు ఎట్లావున్నా, మొబైల్‌లో ఫేస్‌బుక్ వాట్సప్‌లు చూడకుండా ఎలా? మిత్రులకీ శ్రేయోభిలాషులకు ప్రతి రోజూ శుభోదయం చెప్పడం ఎలా? పుట్టిన రోజున విష్ చేయడం ఎలా? (ఇవన్నీ నాకున్న దుర్గుణాలనుకోండి) మిత్రులతో చాటింగ్ చేయకపోతే ఎలా? అన్నీ ఇలాంటి ప్రశ్నలే ఒకదాని తర్వాత మరోటి వేధించడం మొదలుపెట్టాయి. ఇవేమీ పట్టనట్టు మా ఆవిడ మంచి ఆసక్తిగా టి.వి. పెట్టుకుని ఏదో ప్రోగ్రాం చూస్తున్నది. అలా కాసేపు అయిన తరువాత మా వైపు జ్యూస్ ట్రాలీ (శీతల పానీయాలు అందించే బండి) వచ్చింది. నాకు కావలసింది అడిగి తీసుకున్నాను. అది తాగుతున్నప్పుడు కాస్త జ్యూస్ చుక్కలు చొక్కామీద పడ్డాయి. దానికి, గబుక్కున చేతితో జ్యూస్ చుక్కలు పడ్డచోటికి నా చేతి వేళ్ళు వెళ్లాయి. జ్యూస్ చుక్కల సంగతి దేవుడెరుగుగానీ, చేతి వేళ్ళకి కళ్లజోడు తగిలింది. ఆశ్చర్యం! స్వర్గం కళ్ళముందు మెదిలింది, కళ్ళజోడు దొరికింది. అది ఎక్కడా పోలేదు, నాకు కళ్ళజోడు బాక్స్‌లో పెట్టుకునే అలవాటు లేదు. చొక్కా మొదటి బటన్ దగ్గర తగిలించుకోవడం అలవాటు. అది మర్చిపోయాను. అన్నింటికంటే వింత ఏమంటే, నా శ్రీమతి చూస్తూనే వుంది, కళ్ళజోడు పోయిందన్న ధ్యాసే గాని ఆమె కళ్ళజోడు చొక్కాకు వేళ్ళాడుతున్న విషయం నాకు లానే ఆమె కూడా గుర్తించలేకపోయింది. ఈ సమస్యను ఏమంటారో గానీ అప్పటికి మా ఇద్దరి పరిస్థితి అది.

నల్ల కళ్ళజోడుతో రచయిత

అలా రాకపోకలు ఎమెరిటస్ ఎయిర్‌వేస్‌లో ఆనందంగా జరిగాయి. గుర్తుకు వస్తే నా కళ్ళజోడు ఉదంతం గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆ చిన్న టెన్షన్ తప్ప మా మొదటి అమెరికా యాత్ర ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరదాగా ముగిసింది.

సహధ్యాయులతో రచయిత

నా జ్ఞాపకాల పందిరిలో ఇది ఒక ముఖ్య అంశంగా మిగిలిపోయింది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here