జ్ఞాపకాల పందిరి-77

46
8

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అల్లారు ముద్దుకదే….!!

[dropcap]చా[/dropcap]లా సందర్భాలలో సమయం చిక్కినప్పుడల్లా “మా పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం” అనే తల్లిదండ్రులు వున్నారు. అదే విధంగా ఒకరి పిల్లల విషయంలో సానుభూతిగా మాట్లాడవలసి వచ్చినప్పుడు “వాళ్ళు పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు” అన్న మాటలు కూడా వింటుంటాం. అంతమాత్రమే కాకుండా మరికొందరు “వాడికి గారాబం ఎక్కువ” అంటుంటారు. లేకుంటే “ఆ పిల్లలను బాగా గారాబం చేసి పాడు చేశారు” అన్న మాటలు కూడా వింటుంటాం. అలాగే “పిల్లల్ని వాళ్ళు ఎంతో గారాబంగా పెంచుకున్నారు” లాంటి మాటలు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో మనకు వినపడుతూనే ఉంటాయి.

అసలు అల్లారు ముద్దుగా పెంచుకోవడం ఏమిటీ? గారాబం ఏమిటి? వేటికివి సంకేతాలు? ప్రేమకా? పిల్లల్ని పాడుచేయడానికా? లేక ప్రేమ పేరుతో పిల్లల్ని మొండివాళ్ళుగా, అల్లరి పిల్లలుగా తయారు చేయడానికా? ఇవి ఆలోచించ వలసిన విషయాలు, తీవ్రంగా చర్చించవలసిన విషయాలు. కొందరు తల్లిదండ్రులు గానీ, సంరక్షకులు గానీ, గారాబం పేరుతో (అది స్పెషల్ గ్రేడ్ ప్రేమ అని వారి ఉద్దేశం) పిల్లలను పెంచుతూ పరోక్షంగా వారే పిల్లలని మొండివారిగా, చెప్పిన మాట వినకుండా వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవారిగా తయారు చేస్తారు. ఎంత అల్లరి చేస్తే అంత ముద్దు చేస్తారు.

పిల్లలు ఎలాంటి చేయకూడని పని చేసినా వారిని సున్నితంగా హెచ్చరించకపోగా ‘పిల్లాడు/పిల్ల కదా, వాళ్ళు అల్లరి చేయకపోతే ఇంకెవరు చేస్తారు?’ అంటూంటే, పిల్లలు తాము చేసే పనులన్నీ చేయదగ్గవే అన్న దృష్టితో, ఆ పనులు పదే పదే చేసే ప్రయత్నిస్తారు. దీనివల్ల ఏది మంచి? ఏది చెడ్డ? అన్న విషయం తెలియకుండా పోతుంది. పిల్లలను ప్రేమించడం/గారాబంగా చూడడం అంటే పిల్లలు చేయకూడని పనులు చేస్తున్నా చూస్తూ ఊరుకోవడం కాదు. ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, గారాబం చేసేటప్పుడు గారాబం చేయాలి, అవసరాన్ని అతిక్రమించినప్పుడు మందలించవలసిందే, తప్పును తప్పుగా అర్థం అయ్యేలా విశదీకరించి చెప్పవలసిందే!

కొందరు తల్లిదండ్రులు, తమ పిల్లలు వయసులో కాస్త ఎదిగాక, వాళ్లకు చిన్న చిన్న పనులు కూడా చేయడం నేర్పించరు. కాగితాలు చింపి నేల మీద ఎక్కడబడితే అక్కడ పారేసినా తీయమని చెప్పరు. రిఫ్రిజిరేటర్ పదే పదే తీస్తున్నా వద్దని చెప్పరు. ప్రస్తుత సమాజంలో, దరిద్రపు వాతావరణంలో చిన్న పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని, చిన్న చిన్న పనులకు కూడా బయటకు పంపే సాహసం చేసే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు. అది వేరే విషయం!

కానీ ఎదిగే పిల్లలకు చిన్న చిన్న పనులు చెబుతూ, వారి కనీస బాధ్యతలను సున్నితంగా చెప్పగలగాలి. ఈ రోజుల్లో ఎదిగిన పిల్లలు ఇంట్లో పెద్దలకు అసలు చిన్న చిన్న పని సహాయం కూడా చేసే పరిస్థితిలో లేరు. చదువు పేరుతో ఇంట్లో చేయదగ్గ పనులు కూడా చేయకపోతే, జీవితంలో స్థిరపడే సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అమ్మ నాన్నా అన్నీ చేసి పెడుతున్నారు కదా అని, తాము చేసుకోదగ్గ పనులు చేయకుండా వుండకూడదు. తల్లీ కూతురూ హాయిగా నిద్రపోతుంటే, ఉదయమే లేచి వంటపనులు చేసే తండ్రుల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అలా అని ఇక్కడ తండ్రి వంటగది పనులు చేయకూడదని చెప్పడం నా ఉద్దేశం కాదు. అందరూ కలసి పనులు పంచుకుంటే అది అన్ని రకాల ఆరోగ్యకరమైన జీవితం అవుతుంది. పరోక్షంగా అంటే తెలియకుండా మంచి వ్యాయామం జరుగుతుంది. పని జరుగుతుంది, సంతోషకరమైన వాతావరణం కుటుంబాల్లో కనపడుతుంది.

ఇప్పటి పిల్లల సంగతి చెప్పలేను కానీ, మా తరంలో పిల్లలం, మా వయసుకు తగ్గ పనులు చేసేవాళ్ళం. సంతోషంగా కాకపోయినా బలవంతంగా నైనా కొన్ని పనులు చేయవలసి వచ్చేది. చదువుతో పాటు మా జీవనశైలిలో ఇది కూడా ఒక ముఖ్యమైన భాగంగా ఉండేది. దీనికి ఉదాహరణగా మా బాల్యం లోని కొన్ని విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అందరి బాల్యం అలా వుండాలనీ, ఉంటుందనీ చెప్పడం నా ఉద్దేశం కాదు. సాధారణంగా దిగువ మధ్య తరగతి కుటుంబాలలోని పరిస్థితులు ఇలానే ఉంటాయి. అందుచేత మా బాల్యం భిన్నమైనది.

రచయిత నాయన కానేటి తాతయ్య గారు

మా చిన్నప్పుడు మాకు రెండు ఆవులు ఉండేవి. అవి మా నాయనకు బహుమతి ఇవ్వగా సంక్రమించినవి. మా ఇంటి పక్క షెడ్డు క్రిందనే ఆవులు ఉండేవి. ఉదయం లేవగానే ఆవులు వేసిన పేడ తీసి అక్కడ శుభ్రం చేయాలి. సాధారణంగా ఆ పని మా నాయన చేసేవారు. కానీ ఆయన లేనప్పుడు లేదా వేరే పనిలో వున్నప్పుడు నేను ఆ పని చేయాల్సి ఉండేది. అది నాకు బాధగా నరకం అనిపించేది. అయినా చేయక తప్పేది కాదు. కారణం ఏమిటంటే అప్పటికే పెద్దన్నయ్య మీనన్ (ఇప్పుడు లేరు) చదువు నిమిత్తం నాగపూర్ వెళ్లి పోవడం, పెద్దక్క మహానీయమ్మ (ఇప్పుడు లేదు) భీమవరంలో చదువు నిమిత్తం భీమవరంలో హాస్టల్‌లో ఉండడం, చిన్నన్నయ్య డా. మధుసూదన్ (ఆకాశవాణి – విశాఖపట్నం) చదువు నిమిత్తం మా తాలూకా రాజోలులో స్వర్గీయ గొల్ల చంద్రయ్య గారి హాస్టల్‌లో ఉండడం వల్ల, మా చిన్నక్క భారతీ దేవి (ఇప్పుడు లేదు) నేనూ మా వూరు దిండి (తూ.గో. జిల్లా)లో తల్లిదండ్రులతో ఉండేవాళ్ళం. అందుచేత ఇంట్లో పనులు కొన్ని మా మీద పడేవి. అంత మాత్రమే కాదు. ఆ పనులు చేయాలంటే బాధగా ఉండేది. చేయను అని చెప్పే అవకాశం లేదు. మా నాయన అంటే అంత భయంగా ఉండేది. ఆయన మాటకే అదిరి పోయేవాళ్ళం.

పెద్దక్క మహానీయమ్మ, రచయిత, చిన్నక్క భారతి

తర్వాత ఆవులను పచ్చిక బయళ్లలో మేపడం. మా ఇంటికి దగ్గరలోనే పెద్ద రైతుల భూములు ముఖ్యంగా కొబ్బరి తోటలు ఉండేవి. పచ్చగడ్డి విస్తారంగా పెరిగి ఉండేది. సాయంత్రం వరకూ వాటితో కాలక్షేపం చేయవలసి వచ్చేది.

సాయంత్రం అవుతుందంటే, హరికేన్ లాంతర్ రాత్రికి సిద్ధం చేయడం ముఖ్యమైన పని. అది చాలా సున్నితమైన పని. ముందు అందులో కిరోసిన్ ఉందో లేదో చూసి లేకుంటే నింపాలి. తర్వాత దానికోసం ప్రత్యేకంగా ఉంచిన మసిగుడ్డతో చిమ్నీ శుభ్రంగా తెల్లగా తుడవాలి. కొడిగట్టిన వత్తిని నలిపి బొగ్గు పదార్ధం రాలిపోయేట్టు నలపాలి. అలా రాత్రి వెలుగు కోసం లాంతరు సిద్ధం చేయాలి. ఈ పని ఎప్పుడూ సంతోషంగా చేసినట్టు నాకు గుర్తు లేదు.

రచయిత చిన్నక్క భారతీదేవి

వేసవి సెలవులు వస్తే అదో సమస్యగా తయారయ్యేది. పంట కాలువలు వేసవి కాలంలో రకరకాల మరమ్మత్తుల కోసం కట్టేసేవారు. అంటే నీరు రాకుండా చేసేవారు. కాలువ ఎప్పటికప్పుడు లోతు మట్టితో పూడిపోతుంది కనుక వేసవిలో కాలువ లోతు తవ్వేవారు, వెడల్పు చేసేవారు. దానివల్ల చాలా మట్టి వచ్చేది. అసలు విషయం ఏమిటంటే, మా ఇంటి పక్కనే ఎత్తైన గట్టు (ఏటి గట్టు) ఉండేది. గట్టుకు పల్లపు భాగంలో పంట కాలువ ప్రవహించేది. దానికి అనుకునే కంకర రోడ్డు ఉండేది. ఎవరి ఇంటి తిన్నగా వారు కాలువ తవ్వి వారి ఇంటిదగ్గర లేదా ఇంటి వెనుక కొబ్బరి తోటను ఈ మట్టితో మెరక చేసేవారు. ఇంట్లో పెద్దవాళ్ళు మట్టి తవ్వితే, మట్టి పల్లపు ప్రదేశం నుండి గట్టు మీదికి, అక్కడినుండి మళ్ళీ క్రిందికి దిగి తోటలోనికి మోసే పని నాకు మా చిన్నక్క భారతికి పడేది. ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటేనే చాలా బాధ అవుతుంది.

దీనికి తోడు మా నాయన పెద్ద రైతుల దగ్గర మెట్ట భూమి లీజుకు తీసుకుని వేసవికాలం అందులో బీరపాదులు పెట్టేవారు. వాటి మీద వచ్చే ఆదాయం చిన్న చిన్న ఇంట్లో ఖర్చులకు సరిపోయేవి. వాటికి నీళ్ళు పోసి పని కూడా నాకూ, మా చిన్నక్క భారతికి పడేది. పాదులు పెట్టిన పొలంకి నీళ్లు మోసుకొచ్చే కాలువకు దూరం ఉండేది. కుండలతో బిందెలతో నీళ్లు పోయడం అంటే అంతకు మించిన నరకం మరోటి కనిపించేది కాదు. ఏడ్చుకుంటూనే నీళ్లు మోసేవాళ్ళం. దీనితో ఒళ్ళు హూనం అయ్యేది.

రచయిత చిన్నన్నయ డాక్టర్ మధుసూదన్. కె

దీనికి తోడు, వేసవి సెలవుల సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా (నరసాపురం – సరిపల్లి గ్రామం) నుండి మా పిన్ని (అమ్మ చెల్లెలు) మా ఇంటికి మమ్ములను చూడడానికి వచ్చేది. అప్పట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మాకంటే చాలా మెరుగ్గా ఉండేది. కానీ మా పిన్ని వస్తే ఆవిడతో గడిపే సమయం మాకు దొరికేది కాదు. అప్పట్లో పగవాడికి కూడా ఈ బాధ వుండకూడదు అని మా పసి హృదయాలకు సైతం అనిపించేది. అయినా మూగ జీవుల్లా చెప్పిన పనులు చేసుకుంటూ పోయేవాళ్ళం.

ఎడమ.. చిన్నక్క భారతి, కుడి…. అమ్మ వెంకమ్మ కానేటి, మధ్య…రచయిత

ఇప్పుడు తీరిగ్గా ఆలోచిస్తే, అప్పుడు మా తల్లిదండ్రులు చేసిన పని చాలా కరెక్ట్ అనిపిస్తుంది. ఒకరి మీద ఆధారపడకుండా సాధారణ పనులు మనమే చేసుకునే అలవాటు వారు కల్పించినందునే ఈ రోజున కొన్ని ఇంట్లో పనులు విసుగు లేకుండా చేసుకునే అలవాటు వయసుతో పాటు మాతో కలిసి పయనించింది. శ్రమించడం ఎలాగో నేర్పించింది. ఇంతమాత్రమే కాదు మా అన్నలు, చదువుకుంటూ పొలం పనులు (నాగలి దున్నడం, తొరుములు వేయడం) చేయడం, మా పెద్దక్క పంట చేలల్లో ఊడ్పులు (వరినాట్లు)కు, కలుపు తీయడానికి వెళ్లడం నాకు తెలుసును. జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఎదుర్కోవదానికి, శ్రమించడం తెలుసుకోవడానికి, ఎదిగే వయసుకు అనుకూలంగా కొన్ని పనులు పిల్లల చేత తల్లిదండ్రులు చేయించవలసిన అవసరం ఇప్పుడు బాగా తెలుస్తున్నది. దీనివల్ల మన పనులు మనం కొన్ని చేసుకోగలిగామన్న తృప్తితో పాటు, సహజమైన వ్యాయామం జరిగి శరీరం ఎప్పుడూ మనిషికి ఉత్సాహాన్నీ, ఉల్లాసాన్నీ కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. పిల్లల మీద గారాబంతో అతి సుకుమారంగా పెంచడం పిల్లలకు అన్యాయం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇంట్లోని చిన్నచిన్న పనులు ఆటలు-పాటలు, కనీస వ్యాయామం పిల్లలకు పుష్టికరమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని అందరూ ఒప్పుకోక తప్పదు. ఇప్పటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వుంది మరి!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here