జ్ఞాపకాల పందిరి-81

28
6

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

జుడా (JUDA)లో బాబాయ్..!!

[dropcap]జీ[/dropcap]వితంలో ఉద్యోగపర్వం కూడా ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. బాల్యం, యవ్వనం, విద్యాపర్వం ఎన్నో ప్రత్యేకతలను కలిగివుండి లెక్కలేనన్ని అనుభవాలను మూటగట్టుకొంటుంది. ఎందరో స్నేహితులను దరి చేర్చుకుంటుంది, ఎన్నెన్నో సాహసాలకు స్వప్నాలకు వేదిక అయిపోతుంది. అదొక ప్రత్యేకమైన కాలం. కులం మతం ప్రాంతాలకు అతీతంగా కలిసి ఆనందంగా గడిపిన రోజులు. చదువు సంధ్యలు, క్రీడలు, స్నేహాలూ, విహారయాత్రలు, ప్రేమలూ, విరహగీతాలు, విజయాలూ, వైఫల్యాలూ, ఇలా ఎంతో వింతగా గమ్మత్తుగా, ఆనందంగా, ఆహ్లాదంగా గడిచిపోతుంది విద్యాపర్వం. ఐతే ఈ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారా? అంటే అది వేరే విషయం!

ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించేసరికి ఒక రకమైన బాధ్యత మెడకు చుట్టుకున్నట్టు అవుతుంది. సమయపాలన, సమయం విలువ తెలిసివస్తుంది. జీవన శైలిలో పెనుమార్పులు మనకు తెలియకుందాని జీవితంలోకి చొచ్చుకుని వచ్చేస్తాయి. ఉద్యోగంలో స్థిరపడితే తల్లిదండ్రుల ఆలోచనలు పిల్లల పెళ్ళి వైపు, వాళ్ళ సంసారిక జీవిత నిర్మాణం వైపు సాగిపోతాయి. సమయం వృత్తికి ప్రవృత్తికి సమాన నిష్పత్తిలో వినియోగించవలసిన అవసరం ఏర్పడుతుంది. దీనితో సరదాలకూ, సాహిత్య, సాంస్కృతిక వినోదాలకూ సమయం కేటాయించ లేని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు సరదాలూ వినోదాలూ, వీలైన సమయాలలోనే వినియోగించుకోవాలి.

ఉద్యోగ పర్వంలో స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు ప్రయాణ సమయం ఎంతో విలువైనది. ఆ సమయంలోనే ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతూ శ్రమను అలసటనూ మరిచిపోయే అవకాశం వుంది. అది కూడా నలుగురితో కలిసి ప్రయాణించినప్పుడే సాధ్యం అవుతుంది. అది కూడా బస్సు ప్రయాణాలలోకాక రైలు ప్రయాణంలోనే ఇది బాగా సాధ్యం అవుతుంది. అయితే రైలు ప్రయాణం చేసేవాళ్ళు పైగా ఉద్యోగులు అందరూ ప్రయాణాన్ని ఏదో రకంగా సద్వినియోగం చేసుకుంటారు. కొందరు హాయిగా నిద్రపోతే, కొందరు పుస్తక పఠనంలో మునిగిపోతారు. కొందరు పేకాటలో పడితే, మరికొందరు సరదాగా జోకులు కబుర్లు చెప్పుకుంటూ ఆ కొద్దికాలన్నీ హాయిగా గడిపేస్తారు. దీనివల్ల అసలు ప్రయాణ బడలిక ఉండదు. రైలు దిగి ఎవరి ఆఫీసులకు వెళ్లి వాళ్ళ పనులు హాయిగా చేసేసుకుంటారు. గతంలో ఉద్యోగులు రవాణా సౌకర్యాలు అంతగా లేకపోవడం మూలాన ఎక్కువ శాతం స్థానికంగానే కాపురం ఉండేవారు. ఇప్పుడు రవాణా సౌకర్యాలు అధికంగా ఉండడం వల్ల, కుటుంబపరమైన అనేక సాంకేతిక కారణాల వల్ల చాలామంది ఈరోజుల్లో ఉద్యోగ నిమిత్తం నివాస ప్రదేశం నుండి ఉద్యోగ స్థలానికి ప్రయాణం (అప్ అండ్ డౌన్) చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ముంబై, చెన్నై, కలకత్తా వంటి మహానగరాలలో ఈ పరిస్థితి ఎప్పటినుండో వుంది.

నా ఉద్యోగ పర్వానికి సంబంధించి సగం కంటే ఎక్కువ కాలం అప్ అండ్ డౌన్ లతోనే గడిచిపోయింది. పన్నెండు సంవత్సరాలు స్థానికంగా (మహబూబాబాద్) ఉంటే, పది సంవత్సరాలు రైలు ప్రయాణం (కాజీపేట – జనగాం), ఏడు సంవత్సరాలు బస్సు ప్రయాణం (హన్మకొండ – కరీంనగర్) చేయవలసి వచ్చింది. ఈ ప్రయాణాలలో నేను మిత్రులతో కలిసి ఆనందంగా గడిపింది రైలు ప్రయాణాలలోనే.

ఉదయం ఏడున్నరకు కాజీపేటలో సిరిపూర్ కాగజ్ నగర్ నుండి సికింద్రాబాద్‌కు వెళ్ళే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉండేది. ఇంచుమించు అన్ని శాఖలకు సంబందించిన సిబ్బంది జనగాం వెళ్ళడానికి కాజీపేట స్టేషన్‌కు వచ్చేవాళ్ళు. బండి ఎక్కువ శాతం రెండో నంబరు ఫ్లాట్‌ఫార్మ్‌కు వచ్చేది. బండి రాగానే కొందరు పరుగుప రుగున బండి ఎక్కడం, కొందరు బయటినుంచే కర్చీఫ్ విసిరి సీటు రిజర్వ్ చేసుకోవడంతో మా ప్రయాణం ప్రారంభం అయ్యేది. ఇంచుమించు వైద్య సిబ్బంది అంతా ఒకేచోట కూర్చునేవారు నాతో పాటు డా. తుకారాం బాబాయ్, డా. రాజ్ కుమార్, డా. రాజేశ్వరరావు, డా. సుబ్బులక్ష్మి, డా. భోజ, డా. సారంగం, డా. ఎల్. సత్యనారాయణ, డా. గిరిధర్, డా. రవీందర్ (హోమియో), డా. శ్యామ్ సుందర్ (ఆయుర్వేద), సాంబయ్య (రేడియోగ్రాఫర్), రవీందర్ రెడ్డి (ఆప్తాల్మిక్ అసిస్టెంట్), డా. రాజు వంటివారు ఉండేవారు. అందరిలోనూ డా. తుకారాం బాబాయ్ పెద్దవాడు, ఆయనకు జీతం ఎక్కువ ఉండేది. నేత్రవైద్యంలో సివిల్ సర్జన్ ఆయన. మా అందరికీ ఆయన ప్రధాన ఆకర్షణ. ఆయనతో అందరం చాలా సరదాగా గడిపేవారం. ఎవరు ఎన్ని జోకులు వేసినా హాయిగా నవ్వేవాడు తప్ప నొచ్చుకునేవాడు కాదు. ముఖ్యంగా నేనంటే చాలా ఇష్టపడేవాడు. బాబాయ్‌తో మేము గడిపిన ఆనంద క్షణాలు వివరించే ముందు, మీకు ‘జుడా’ అంటే ఏమిటో చెప్పాలి కదా! అదే, ‘జనగాం అప్ అండ్ డౌన్ అసోసియేషన్’ అన్న మాట!

జుడా…సభ్యులు

మేమందరం ఇందులో సభ్యులం. డా. తుకారాం బాబాయ్ చాలా సాధారణ దుస్తులు ధరించేవాడు. అప్పుడప్పుడూ అప్పట్లో ఒక వెలుగు వెలిగిన సఫారీ దుస్తులు ధరించేవాడు. ఇన్‌షర్ట్ చేసేవాడు కాదు. ఈ విషయంలో బాబాయ్‌ను ఆట పట్టించాలనుకున్నాం. సరదాగా నేనే ఒక రోజు “బాబాయ్ రేపటినుంచి ఇన్‌షర్ట్ చేయాలి, లేకుంటే మిమ్ములను రైలు ఎక్కనివ్వం” అన్నాను. దానికి ఆయన హాయిగా నవ్వేసి “ఈ వయసులో నేను ఇన్‌షర్ట్ చేస్తే అందరూ నవ్వుతారేమో!” అన్నారు. “లేదు బాబాయ్, దానికి వయసుతో పనిలేదు” అన్నాను. దానికి ఆయన పొడిగా నవ్వేసి ఊరుకున్నాడు. అది సీరియస్‌గా తీసుకుని చెప్పిన మాట కాదు. సరదాగా అలా ఆయనను ఆట పట్టించాం అంతే! ఆ సంగతి మరచిపోయాం. అయితే ఒక సోమవారం రోజున మా అందరినీ ఆశ్చర్యపరుస్తూ బాబాయ్ ఇన్‌షర్ట్‌తో దర్శనం ఇచ్చారు. మేము ఆ రోజు ఆయనతో తెగ ఎంజాయ్ చేశాము. అయితే ఆయనలోని ఈ మార్పుకి బాబాయ్ శ్రీమతి గారు ఆశ్చర్యపోయి, ఈ విషయం అప్పటికే విదేశాల్లో వున్నకొడుకు, కూతురికి సందేశం పంపిస్తే పిల్లలు కూడా ఆశ్చర్యపోయి సంబరపడిపోయారట. ఈ వేషధారణ ఆయన ఇంచుమించు పదవీ విరమణ చేసినంతవరకూ కొనసాగించారు.

డా.తుకారం బాబాయ్, రిటైర్డ్ సివిల్ సర్జన్, హైదరాబాద్

మరో సందర్భంలో బాబాయ్‌కి మరో పరీక్ష పెట్టాం. అదేమిటంటే ఆయన బూట్లు వేసుకున్నా వాటిని వెనుకభాగం నొక్కిపట్టి చెప్పులు మాదిరిగా వాడేవారు. అది చూడ్డానికి అసలు బాగుండేది కాదు. ఒకరోజు మళ్ళీ నేనే “బాబాయ్, రేపటినుంచి కొత్త బూట్లు వేసుకురావాలి. లేకుంటే ఇప్పుడు వాడుతున్న బూట్లు లాగి పారేసి ‘స్టేషన్ ఘనాపూర్’ రైల్వే స్టేషన్‌లో బయటికి పారేస్తాం” అన్నాను. ఆయన వెంటనే “అయ్యో కొంచెం టైం ఇవ్వండి” అన్నారు నవ్వుతూ. “కుదరదు అలా” అన్నాను నేను. మళ్ళీ మా అందరినీ ఆశ్చర్య పరుస్తూ మరునాడు ఆయన కొత్త బాటా షూ ధరించి ప్రత్యక్షమయ్యారు. అంతమాత్రమే కాదు ఆ రోజు రైల్లో మా అందరికీ సమోసాలు కొనిపెట్టాడు.

జండా వందనం…. కుడినుండి రెండవవారు డాక్టర్ బాబాయ్

జనగాంలో రైలు దిగి పట్టాలు దాటి కొంచెం దూరం నడిస్తే రోడ్డుకి ఎడమవైపు పోస్టాఫీసుకు ఎదురుగా ‘షబ్బీర్ హోటల్’ ఉండేది. అక్కడ కాసేపు కూర్చొని టీ తాగేవాళ్ళం. ఒక్కోసారి ముందు చెప్పకుండానే, టీ తాగేసిన తర్వాత “ఈవాళ బాబాయ్ స్పాన్సర్ చేస్తారు” అనేవాళ్ళం. అంతే, మరోమాట లేకుండా బాబాయ్ బిల్లు కట్టేసేవారు.

డాక్టర్ గిరిధర్ రెడ్డి, రచయిత

బాబాయ్ సహృదయత గొప్పది. చిన్నవాళ్ళం అయినా, మేము ఎంత ఆటపట్టించినా, మాతో కలసి ఆనందించేవారు, మాతో ఎప్పుడూ కలిసి వుండాలని కోరుకునేవారు. ఎవరిపైనా కోపం పెట్టుకునేవారు కాదు. నేను ఆయనను సరదాగా ‘బాబూభాయ్ పటేల్’ అని పిలిచేవాడిని. పదవీ విరమణ చేసిన తర్వాత ఒక సందర్భంలో బాబాయ్ మళ్ళీ కలిశారు. మళ్ళీ పూర్వపు వస్త్రధారణతో చాలా డల్‌గా కనిపించారు బాబాయ్.

డాక్టర్ మదన్ మోహన్, రచయిత

“బాబాయ్ ఏంటి మళ్ళీ ఈ అవతారం?” అంటే, ‘’ ఇప్పుడు మీరు, మీ స్నేహం నాకు లేవుగా!” అన్నారు. అది చాలా కాలం బాధపెట్టింది. తప్పదు కాలమూ పరిస్థితులను బట్టి మనమూ బ్రతకవలసిందే.

జనగామ ఆసుపత్రి

బాబాయ్ ఆరోగ్యంగా అప్పుడప్పుడూ పిల్లలదగ్గరకి విదేశాలకు వెళ్ళివస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. నా జీవన యాత్రలో బాబాయ్ పాత్ర ఎప్పటికీ సజీవం!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here