జ్ఞాపకాల పందిరి-82

27
8

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

గతం నుంచి వర్తమానం వరకూ..!!

[dropcap]వృ[/dropcap]త్తికి అంకితం అవ్వడం, వృత్తికి న్యాయం చెయ్యడం, వృత్తిని జీవితంలో ప్రధాన అంశంగా భావించి, అన్నిరకాలుగా పేరు తెచ్చుకోవడం, కేవలం వృత్తికే కాదు దేశ అభివృద్ధికి కూడా దోహద పడినట్టు అవుతుంది. అమూల్యమైన ఆ కొద్ది గంటలూ ప్రభుత్వం, లేదా యాజమాన్యం మన దగ్గర నుండి డబ్బు చెల్లించి కొనుక్కున్నట్లు భావించవలసి ఉంటుంది. అందుచేత పనివేళల్లో పని మాత్రమే చెయ్యడం, పని విషయంలో సమయపాలన పాటించడం, పనిలో ఉండగా, రాజకీయాలకు, సాహిత్య చర్చలకు, ఇతర పిచ్చాపాటి ముచ్చట్లకూ అక్కడ చోటు వుండకూడదు. అయితే అది ఎంతమంది ఎలా పాటిస్తున్నారో కొన్ని కార్యాలయాల పరిస్థితి చూస్తే తెలుస్తుంది. ప్రజాసమయం, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న జ్ఞానం లేని కొందరు, ప్రభుత్వ ఉద్యోగాలు అడ్డం పెట్టుకుని, పక్క వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, బినామీ వ్యక్తులతో తమ స్థానంలో పనిచేయిస్తూ, పూర్తి స్థాయిలో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఇలా వృత్తిపరంగా ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల సమయాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు మనకు కనిపించినా, మన అవసరాలను దృష్టిలో వుంచుకుని అలాంటి వారి గురించి ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడుతుంది. పైగా ఆయా ఉద్యోగులకు, స్థానిక పెద్దల లేదా రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడం మూలంగా, వారు ఆడింది ఆటగా పాడింది పాటగా నడుస్తూ ఉండడం మనం గమనిస్తూనే వున్నాం. ఇప్పటికీ చాలామందిలో ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఎలా నడిపించినా సరిపోతుందన్న భావనలో ఉండడం దురదృష్టకరం!

ప్రభుత్వ పరమైన కొన్ని విభాగాలలో లేదా కార్యాలయాలలో జంకు-గొంకు లేకుండా బాహాటంగా అవినీతికి/లంచాలకు అలవాటు పడడం సమాజానికి రాచపుండులా తయారయింది. బాధాకరమైన విషయం ఏమిటంటే సాహిత్యకారులైన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమైన స్థానాలలో వుండి లంచాలు తీసుకుంటూ, లంచాలకు వ్యతిరేకంగా కవిత్వం రాయడం, కథలు/నవలలు రాయడం మనం చూస్తూనే వున్నాం. అలా అని ప్రభుత్వ ఉద్యోగులంతా ఇలాంటి వారని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ బీదవాడిని ఆర్థికంగా హింసిస్తూ, బీదరికం గురించి కవిత్వం, కథలు రాస్తే ఎలా వుంటుంది? అందుకనే ప్రజాసేవ చేయగల సహృదయులు మాత్రమే, తాము తీసుకునే జీతభత్యాలకు న్యాయం చేకూర్చ గలవారే ప్రభుత్వ ఉద్యోగాలలో చేరాలి. ఇందులో వెలుగు చూస్తున్న లోపాల వల్లనే ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రజల దృష్టిలో వేళాకోళంగా మారాయి.

ఇలాంటి నేపథ్యంలో నేను పనివేళల్లో ఇతరులను ఎవరినీ రానిచ్చేవాడిని కాదు. నా మిత్రులను, శ్రేయోభిలాషులను కూడా పనివేళల తర్వాతనే కలవమనేవాడిని. చికిత్సాపరమైన, వైద్యపరమైన పనులకు తప్ప పని వేళల్లో నా దగ్గరికి ఎవరూ వచ్చే సాహసం చేసేవారు కాదు. పేషేంట్స్ ఒత్తిడి లేనప్పుడు చదువు కోవడమో, వ్యాసాలు రాసుకోవడమో (నిజానికి పని వేళల్లో ఈ పనులు కూడా చేయకూడదు) చేసేవాడిని. అలా, వృత్తి -ప్రవృత్తి, క్రమశిక్షణతో నడుస్తుండేవి. పత్రికలలో వ్యాసాలూ, కథలూ రావడం, పని చేసిన చోటల్లా ప్రజల్లో ‘మంచి డాక్టర్’ గా పేరు రావడం చాలా తృప్తి నిచ్చేది.

1994 లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా జనగాం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. మహబూబాబాద్‌లో పనిచేసినప్పుడు స్థానికంగా ఉండేవాడిని. నా శ్రీమతి ఉద్యోగిని కావడం, ఆమెకు హన్మకొండలో పోస్టింగ్ రావడం మూలాన, పిల్లలను కూడా హన్మకొండ పాఠశాలలో చేర్చి నివాసం హన్మకొండ ఫిక్స్ చేయడం మూలాన, నేను రోజూ కాజీపేట నుండి రైలులో జనగాం అప్ అండ్ డౌన్ చేసేవాడిని. తొమ్మిది గంటల కల్లా డ్యూటీలో సిద్ధంగా ఉండేవాడిని. స్థానికంగా ఉండడం లేదన్న అపవాదు తప్ప, పనివేళల్లో ఎంతో నిబద్దతతో పని చేసి స్థానిక ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నాను. అప్పుడు జనగామ ఆసుపత్రి తాలూకా ఆసుపత్రి స్థాయిలో ఉండేది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాడిన తర్వాత జనగామ జిల్లాగా మారడం వల్ల, అది జిల్లా ప్రధాన ఆసుపత్రిగా మారింది.

ఒకరోజు యధావిధిగా ఉదయం నా డెంటల్ ఓ.పి. (అవుట్ పేషేంట్ విభాగం) లో నా పని సీరియస్‌గా చేసుకుంటున్నాను. ఆ రోజు పేషేంట్స్ కూడా ఎక్కువ మంది లైన్‌లో నిలబడి ఒక్కొక్కరూ వచ్చి చూపించుకుంటున్నారు.

కొంచెం సమయం అయ్యాక ఒక వ్యక్తి లైన్‌లో కాకుండా పక్కనుండి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. గేటు దగ్గర వున్న అటెండర్ అతడిని లోనికి రానివ్వడం లేదు. అయినా అతను పదేపదే లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వీలు పడ్డం లేదు. అది గమనించిన నేను అతడి వంక చూసి ‘పంటి నొప్పా?’ అన్నట్టుగా మైమ్ కళను ప్రదర్శించాను. “కాదు”.. అన్నట్టు అతను సైగ చేసాడు. ‘మరి ఎందుకు?’ అన్నట్టు నేను సైగ చేసాను. ‘పేస్ రీడింగ్’ అన్నట్టు నుదురు చూపించాడు. అంటే జాతకం లాంటిదన్నమాట. అతను కోయదొరలా వున్నాడు. అసలే అలాంటివాళ్ల కబుర్లు, పైగా జాతకం వంటివి నాకు అసలు ఇష్టం ఉండదు. అందుకే ‘నాకు వద్దు’ అన్నట్టు సైగ చేసాను. అయినా అతను అక్కడినుండి కదలలేదు, అలాగే లోపలికి వచ్చే ప్రయత్నమూ మానలేదు. అలా.. ఆలా.. మధ్యాహ్నం పన్నెండు అయిపొయింది. పేషేంట్స్ అయిపోయారు. నేను లంచ్ చేసే సమయం కూడా అయింది. కానీ ఆ కోయదొర అక్కడే నిలబడి వున్నాడు. అతను అలా నిలబడి ఉండడం నాకూ జాలి బాధ కలిగాయి. అందుకే లోపలి రమ్మన్నట్టు సైగ చేసాను. అతను లోపలికి వస్తూనే నా గురించి కొన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. పేషేంట్ కూర్చునే స్టూల్ మీద కూర్చోమన్నాను. కూర్చొని నా ముఖం వంక చూసి చిన్నప్పటి నుండి నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఆ.. మాటల ప్రవాహం అసలు ఆగడం లేదు. నా ఆశ్చర్యానికి అంతులేదు. ఏ మాత్రం తేడా లేకుండా అన్నీ చెప్పేస్తున్నాడు. ఇంకా అతనిని అలా చెప్పనిస్తే ఇంకేమి చెబుతాడోనని ఇక ముగించే ప్రయత్నం చేసాను. కానీ అతను కదలడం లేదు. పైగా “నువ్వు కారు కొంటావు దొరా” అన్నాడు. “నాకు ఆ ఆశలు లేవు” అన్నాను (అప్పటికి నేను స్కూటర్ తోనే కాలక్షేపం చేస్తున్నాను). అప్పుడు అతను ఒక స్ప్రింగ్ లాంటి తీగను నా టేబుల్ పై పెట్టి “ఈ తీగ కదిలితే నువ్వు కారు కోనబోతున్నట్టు” అన్నాడు. దానివంక కాసేపు చూసాడు. అది కదలడం మొదలు పెట్టింది. అది నాకు మరింత ఆశ్చర్యాన్ని,ఆరాటాన్ని కలిగించింది.

(కోయదొర చెప్పిన కొద్ది నెలలలోనే నేను కారు కొనడం జరిగింది,ఇది యాదృచ్ఛికం కావచ్చు!). నా ఆనందానికి అంతులేకుండా పోయింది. పర్సులోనుంచి పాతిక రూపాయలు చేతిలో పెట్టాను. చాలా సంతోషించాడు.

ఒక పొడుగు పుస్తకం తీసి నా పేరు, చిరునామా రాసి సహకరించామన్నాడు. దానిని వేరేవాళ్లకు చూపించడం ద్వారా కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆతని కోరిక మేరకు నా పేరు చిరునామాతో పాటుగా నా కామెంట్ కూడా రాసాను. అతను అంతటితో తృప్తి పడలేదు. ఆ పుస్తకం లోనే నాకు బాగా తెలిసిన ఇద్దరి పేర్లు చిరునామా రాసి ఇచ్చాను. అందులో ఒకాయన అక్కడ లోకల్‌గా వుండే డాక్టరు. పైగా ఆయన ఇల్లు హాస్పిటల్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల మన కోయదొర ముందు ఆయన దగ్గరకే వెళ్ళాడు.

భోజనం చేసి శ్రీమతితో ఆయన మాట్లాడుతున్న సమయంలో కోయదొర అక్కడికి వెళ్ళాడు. జాతకాల మీద జ్యోతిష్యం మీద వాళ్లకు అపారమైన నమ్మకం ఉండడం మూలాన, అతనికి మర్యాద చేసి కూర్చోబెట్టారు. ముందు డాక్టర్ గారి శ్రీమతికి జరిగిన కొన్ని సంఘటనలు చెప్పడంతో అతనిమీద ఆవిడకు మంచి నమ్మకం ఏర్పడింది. తర్వాత డాక్టర్ గారి వంతు వచ్చింది.

ప్రారంభంలోనే డాక్టర్ గారిని ఇబ్బంది పెట్టే సమాచారం చెప్పాడు. దానితో ఆయన కొంచెం ఇబ్బందిలో పడ్డట్టు అయింది. అప్పటికే స్త్రీలోలుడుగా పేరు పడ్డ ఆయన వ్యవహారం కోయదొర వ్యాఖ్యానం రూడీ చేయడంతో, ఆయన ఇంకెన్ని వినాలోనన్న భయంతో అతని చేతిలో వంద రూపాయల కాగితం చేతిలో పెట్టి త్వరగా మరోమాటకు తావివ్వకుండా పంపించేశారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి “గురువా, నా కొంప ముంచావుకదా!” అన్నాడు. ఆయన చెప్పిన విషయాలు విని నేను కూడా ఖంగు తిన్నాను. అలా జరుగుతుందని నేనూ అనుకోలేదు. అతడిని వదిలించుకోవడానికి నేను చేసిన పని ఇలా బెడిసి కొడుతుందని ఊహించలేదు. వాళ్ళ సంసారంలో తెలియకుండానే చిచ్చు పెట్టినట్టైంది.

ఇక్కడ విషాదం ఏమంటే, ఇది జరిగిన కొద్ది నెలలకే ఆ మేడం ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నన్ను బాగా బాధపెట్టిన సంఘటనలో ఇదొకటి. గుర్తుకు వస్తే మనసు వికలం అవుతుంది.

ప్రస్తుతం ఆ డాక్టర్ గారు బ్రతికే వున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ మాత్రం మరణించింది. కొన్ని జీవితాలు అంతేనేమో!!

కోయదొర కనిపిస్తే ఇప్పటికీ భయపడుతుంటాను నేను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here