జ్ఞాపకాల పందిరి-86

25
9

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

మేమిద్దరం..! మాకిద్దరు..!!

ప్రజలే ప్రభుత్వం అన్నది చాలామంది ప్రజలకు తెలియదు. ప్రజలు వేరు ప్రభుత్వం వేరు అన్న పద్ధతిలో ప్రవరిస్తుంటారు. ప్రజలు లేకుండా ప్రభుత్వాల మనుగడ ఉండదని, ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వాలు ప్రజలను పరిపాలించలేవన్న సంగతి చాలామంది విస్మరించి ప్రవర్తించడం చాలా విడ్డూరంగా ఉంటుంది. ఇలాంటి విషయాలకు సంబందించిన ఆలోచనల్లో ఒక్కోసారి అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు పెద్దగా తేడా వుండదు. ప్రభుత్వం అంటే అదొక ప్రజావ్యతిరేక సంస్థగా భావిస్తారు మరికొందరు.

అదే విధంగా పవర్ పాలిటిక్స్ కోసం ప్రజాధనమే ‘ఉచితాలు’ పేరుతో వృథా చేసి పేద ప్రజలను మభ్యపెట్టి పథకాలు అమలుచేసే ప్రభుత్వాలు, తమ నెత్తిన కుచ్చు టోపీ పెట్టి, వేలకోట్లలో అప్పులు చేసి, ఆ అప్పు మన మీదే రుద్దుతున్నారన్న విషయం కూడా చాలా మంది ప్రజలకు తెలియదు. వాళ్ళు తాత్కాలిక ఉచితాలకే ప్రాధాన్యం ఇస్తారు తప్ప, దేశ భవిష్యత్ ప్రయోజనాల గురించి అసలు ఆలోచించరు. ప్రజాధనం ధనం వెచ్చించి పార్టీ పేరు మీదనే ముఖ్యమంత్రి పేరు మీదనే ఉచితాలు ప్రకటించడం ఎంతవరకూ సబబు. ఇది కూడా ప్రజలు ఆలోచించడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అంతమాత్రమే కాదు, ప్రజల సంక్షేమం కోసం ప్రయోజనకరమైన పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలు సహకరించనప్పుడు ఆ సంక్షేమ పథకం ప్రజల వద్దకు చేరదు.

ముఖ్యంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ సంక్షేమం (జనాభా నియంత్రణ), క్షయ నిర్మూలన, ఎయిడ్స్ నిర్మూలన, మలేరియా నిర్మూలన, కుష్ఠు నిర్మూలన, ప్రస్తుతం కరోనా నిర్మూలన వంటి కార్యక్రమాలు అనేకం ప్రజలు తమవంతు బాధ్యతగా సహాకరిస్తే తప్ప ఆశించిన ఫలితాలు అందుకోలేము, తత్ఫలితంగా నష్టపోయేది ప్రజలే! అందుచేత ప్రజలలో చైతన్యం, ఎన్నికలలో ఓటు వేసే విధానం నుండి ప్రారంభం కావలి. దేశ భవిష్యత్తు, అభివృద్ధి, మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధుల మీదే ఆధారాపడి ఉంటుందని మరచిపోకూడదు. దేశం నాకేమి ఇచ్చింది? అన్న భావన కాకుండా, దేశానికి నేనేమి చేసానన్న విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఉదాహరణకు ప్రభుత్వ ఆసుపత్రులు తీసుకుందాం. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు దిగువ మధ్యతరగతి, అంతకంటే దిగువ తరగతి వాళ్ళు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు అందుకుంటారు, మరో మార్గం వారికి ఉండదు. ఆ పై వర్గం వారు ఎప్పుడూ ప్రభుత్వ ఆసుపత్రి ముఖం చూడరు. కానీ మేడికోలీగల్ కేసులు, పోస్ట్‌మార్టంలు తప్పని సరిగా ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలి కాబట్టి, పెద్దలతో అలాంటప్పుడు సమస్యలు వస్తాయి (ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు) వారికి అవసరం వచ్చినప్పుడు వారిస్థాయిలో వైద్య సేవలు ఆశిస్తారు. అప్పుడు ఆసుపత్రి అధికారిని ప్రశ్నిస్తారు. అదెందుకు లేదు, ఇదెందుకు లేదు అని గొడవ చేస్తారు. అంతేగాని, మామూలు సమయంలో ఆసుపత్రికి వచ్చి,ఆసుపత్రి అవసరాలేమిటో అసలు పట్టించుకోరు. ఇలాంటి విషయాలలోనే ప్రజా చైతన్యం అవసరం. ప్రభుత్వానికి ఇలాంటి విషయాలలో సహకరిస్తే, దేశాభివృద్దికోసం, దేశ సౌభాగ్యం కోసం మన పక్షాన ఎంతో కొంత చేసామన్న తృప్తి మిగులుతుంది!

ఎంతటి సున్నితమైన విషయాలలో సైతం, మన చైతన్యం, స్పందన ఎలావుండాలో నా అనుభవం ఒకటి మీ ముందు ఉంచుతాను. నేను మహబూబాబాద్ ఆసుపత్రిలో పని చేస్తున్నప్పుడే (1982-1994) నాకు పెళ్ళి కావడం, ఒకరి తర్వాత మరొకరుగా ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది. మా బాబు (రాహుల్) మొదటి సంతానం. పాప (నిహార) రెండవ సంతానం. పాప పుట్టిన వెంటనే మా పెద్దన్నయ్య (స్వర్గీయ కె.కె. మీనన్) నుండి ఒక ఉత్తరం (కార్డు) వచ్చింది.

వేసెక్టమీ గురించి హెచ్చరిక చేసిన పెద్దన్నయ్య, స్వర్గీయ కె.కె.మీనన్ (కథ/నవల,రచయిత)

అది ఒక ముఖ్యమైన వార్త మోసుకు వచ్చింది. అప్పట్లో ఇంకా మొబైల్స్ రంగంలోనికి దిగలేదు. ల్యాండ్‌లైన్ ఫోన్ కూడా అప్పటికి నేను స్వంతం చేసుకోలేదు. అందువల్ల అన్నయ్య ఉత్తరం రాసాడు. దాని సారాంశం ఏమిటంటే నాకు కూతురు పుట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘నీ పిల్లల్ని పెంచుకోగల స్తొమత నీకు వుండొచ్చుగానీ, గంపెడు పిల్లల్ని కంటే, భరించే శక్తి ప్రభుత్వానికి లేదు. అందుచేత తక్షణమే ‘వేసెక్టమీ’ ఆపరేషన్ చేయించుకో’మన్నది ఆయన సూచన. ఆ ఉత్తరం ముందుపెట్టుకుని పదే పదే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసాను. అప్పుడు ఆసుపత్రి హెడ్‌గా (డిప్యూటీ సివిల్ సర్జన్) డా. ఎస్. వెంకటేశం గారు ఉండేవారు. ఆపరేషన్ థియేటర్ ఇన్‌ఛార్జ్‌గా నర్స్ కుసుమ కుమారి ఉండేవారు. విషయం డా. వెంకటేశం గారికి వివరించాను.

ఆపరేషన్ చేసిన స్వర్గీయ డా.ఎస్. వెంకటేశం గారు (హైదరాబాద్)
ఆపరేషన్ థియేటర్ ఇన్‌చార్జ్ నర్స్ కుమారి.కుసుమ కుమారి (రిటైర్డ్ హెడ్ నర్స్, ఒంగోలు)

ఒక శుభోదయాన డాక్టర్ గారు నాకు ‘వేసెక్టమీ’ ఆపరేషన్ చేసేసారు. వారం రోజుల వరకూ నా శ్రీమతికి గానీ, ఇతర బంధువులు/స్నేహితులకు గానీ ఈ విషయం చెప్పలేదు. ఆపరేషన్ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించినా, నేను సెలవు తీసుకోకుండా ఆసుపత్రి డ్యూటీకి వెళ్ళిపోయాను. అందుచేత ఎవరికీ తెలిసే అవకాశం లేదు.

శ్రీమతి, శ్రీ డా. కె.ఎల్.వి. ప్రసాద్

వారం రోజుల తర్వాత కూల్‌గా నా శ్రీమతికి వివరించి ఒప్పించగలిగాను. అయితే మా అత్తగారు (అక్క) పెద్ద గొడవ చేసింది, చెప్పకుండా ఆ పని చేసినందుకు. ఇంకొక సంతానం కోసం చూడవలసింది అంది.

రచయిత ఇద్దరు పిల్లలు రాహుల్ (అమెరికా), నిహార (హన్మకొండ)

నేను అప్పుడు ఒకటే మాట చెప్పాను “పిల్లల్ని పెంచవలసింది నేను. ఉన్న ఇద్దరినీ ప్రయోజకులిని చేయగలిగితే చాలు” అని. తర్వాత ఆ గొడవ క్రమంగా చల్లారి పోయింది. ఇక్కడ నేనేదో గొప్ప పని చేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు. నా శ్రమను తగ్గించుకోవడమే గాక, ప్రభుత్వానికి నావల్ల అదనపు భారం లేకుండా చేశానన్న తృప్తి నాకు మిగిలింది. అంత మాత్రమే కాదు నేను ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినంత కాలం, వేసెక్టమీ చేయించుకున్నందుకు గాను ప్రత్యేక ఇంక్రిమెంట్ అనుభవించాను. ఈ సదుపాయం నిరుద్యోగులకు లేకపోవడం బాధాకరం. ఇది ప్రభుత్వం ఆలోచించదగ్గ విషయం!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here