జ్ఞాపకాల పందిరి-88

22
10

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

ఆపద్భాందవుడు.. శ్రీ సూర్యా రావు గారు!!

జీవితంలో కొన్ని పరిచయాలు, స్నేహాలు వెతుక్కోవాలి. మంచి పరిచయాలు స్నేహాలూ అయితే అవి కలకాలం నిలిచిపోతాయి. అభిరుచులు అలవాట్లూ కలిస్తే అవి బంధుత్వాలుగా కూడా మారిపోతాయి. ఆ అనుబంధం ఆత్మీయతతో కూడి అనురాగం పండించుకునే స్థాయికి ఎదిగిపోతాయి. ఇరుపక్షాలలోనూ కలిసిపోయే గుణం ఉండడమే దీనికి ప్రధాన కారణం కావచ్చు, ఒకే రకపు ఆలోచనా విధానం దీనికి అదనపు ఆకర్షణే అవుతుంది!

స్వర్గీయ ఉప్పే సూర్యారావు గారు (నాగార్జున సాగర్.. దక్షిణ విజయపురి)

కొన్ని పరిచయాలూ, స్నేహాలూ మనం ఎదురుచూడకుండానే, ఊహించని రీతిలో మనకే ఎదురు వస్తాయి. ఇలాంటివి సహజమైన పరిచయాలూ, స్నేహాలలోనూ. అలా మనతో పరిచయం పెంచుకోవాలనుకునేవారు, లేదా స్నేహం చేయాలనుకునేవారు, మన గురించి తెలుసుకోవడం, మన జీవన విధానం గురించి అప్పటికే అవగాహన వున్నవారు మనకు దగ్గర కావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇంకొకరి విషయంలో మనమూ అలానే చేయవచ్చు. వీటికి తోడు, వృత్తి, ప్రవృత్తి, కులం, మతం, ప్రాంతం, బంధుత్వ లింకులు మొదలైనవి మరింత సన్నిహితం చేసే అంశాలుగా మారతాయి. ఇలాంటి పరిచయాలు కూడా కలకాలం నిలిచిపోయేవిగా ఉంటాయి. ఇతరులు వీళ్ళను చూసి, బంధువులేమోనని భ్రమపడే అవకాశం కూడా లేకపోలేదు.

శ్రీమతి & శ్రీ వి.సూర్యారావు గారు

చదువు కోసం ఉన్న వూరు విడిచి తెలియని దూరప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఉద్యోగ రీత్యా కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, పర్యాటక ప్రదేశాలు దర్శించినప్పుడు, ప్రయాణాలప్పుడు, ఇలా అనేక సందర్భాలలో మనకు కొన్ని పరిచయాలు లేదా స్నేహాలు ఎదురొస్తాయి. అలా అని అందరూ కులం కోసం మతం కోసం, ప్రాంతం కోసం, సామాజిక వర్గం కోసం ప్రాకులాడి పరిచయాలు చేసుకుంటారని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎక్కువమంది మనిషి మంచితనానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు! అయితే ఈ మధ్య కాలంలో పరిచయాలు, స్నేహాలూ, రాజకీయాలూ, పూర్తిగా కులం ప్రాతిపదికగా నడవడం అత్యంత బాధాకరం. శాసనాలు చేసేవారు, మేధావులుగా కొనియాడబడేవారు కూడా దీనికి బానిసలు కావడం మరింత దురదృష్టకరం. మళ్ళీ ఇవ్వన్నీ పోవాలంటే మనలో ఒక అంబేడ్కర్, ఒక వివేకానందుడు, ఒక గాంధీ, ఒక ఏసుక్రీస్తు పుట్టాలేమో అనిపిస్తుంది. లేకుంటే స్వాతంత్ర్య పూర్వపు రోజులు మళ్ళీ దాపురిస్తాయని చెప్పడానికి ఏ మాత్రం సందేహించ నక్కరలేదు.

పెద్ద కుమారుడు రామ్ గోపాల్. ఉప్పే (హైదరాబాద్)

మా పెద్ద అక్క స్వర్గీయ కుమారి కానేటి మహానీయమ్మ, 1965 ప్రాంతంలో నాగార్జున సాగర్ (దక్షిణ విజయపురి)లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సందర్భంలో అప్పుడప్పుడు సాగర్ వెళ్ళుతుండేవాళ్ళం. తర్వాత ఊహించని రీతిలో నేను మా అక్క దగ్గర వుండి ఇంటర్మీడియెట్ (హిల్ కాలనీ, 1972-74) చదివే అవకాశం కలిగింది. అక్క దగ్గర ఉండడం వల్ల నా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడానికి, అక్క ప్రేమ, అదే స్థాయిలో క్రమశిక్షణ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయని గర్వంగా చెప్పగలను. ఈ నేపథ్యంలో మాకు ఒక కుటుంబం పరిచయం అయింది. అది క్రమంగా స్నేహంగా మారి, బంధువులుగా తుది రూపం దిద్దుకుంది. అది ఇప్పటికీ (అక్క మరణించిన తర్వాత కూడా) కొనసాగడం గొప్ప విషయం! అది ఆ కుటుంబం ప్రత్యేకత కూడా!

సూర్యారావు గారి పిల్లలు-మనుమలు

ఆ కుటుంబమే, ఉప్పే సూర్యారావు గారి కుటుంబం. ఆయన సహృదయత, సేవ/సహాయ గుణం, అక్షరాల్లో చెప్పలేనంత గొప్పది. మా కుటుంబంతో అంత దగ్గరగా ఉండడానికీ, నాటి అభిమానాలూ ఆత్మీయతలు ఇప్పటికీ నిలిచి ఉండడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో ముఖ్యమైనవి – ఒకే ప్రాంతం కావచ్చు, ఒకే సామాజిక వర్గం కావచ్చు, మా అక్క ఉపాధ్యాయిని అయినందున కావచ్చు, ఏది ఏమైనా ఆ కుటుంబం మాతో చాలా చక్కగా కలిసి పోయింది. అదే విధంగా మేము కూడా ఆ కుటుంబంతో ఆత్మీయ మిత్రులుగా కలిసిపోయాము. అక్కను చాలా మర్యాదగా, గౌరవంగా, ఆత్మీయంగా చూసేవారు. ఆయనకు అయిదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలూను. ఇంచుమించు అందరూ అక్క దగ్గరకు చదువుకోవడానికి వచ్చేవారు. చిన్న ఉద్యోగంలో వుండి అంత పెద్ద కుటుంబాన్ని పెంచిపోషించడంలో సూర్యారావు గారి శ్రీమతి వీరమ్మగారు ఆయనకు గొప్ప సహకారిగా ఉండడం నేను ప్రత్యక్షంగా చూసాను. పిల్లలతో పాటు సూర్యారావు గారి బావమరిది, మరదలు కూడా చదువు నిమిత్తం వీరితోనే ఉండేవారు. నిత్యం నవ్వుముఖంతో వుండే సూర్యారావు గారి పిల్లలు ఇంచుమించు అందరూ ప్రయోజకులు కావడానికి ప్రధాన కారణం ఆయన సేవాగుణం, సహృదయత, ఆపదలో ఆదుకోవడం వంటి లక్షణాలు వుండడమేనని నేను భావిస్తాను.

సూర్యారావు గారి పుత్ర రత్నాలు

మా అక్క పూర్తిగా శాఖాహారి, మేమంతా మాంసాహారులం. ప్రతి సంక్రాంతికి మేము అక్కదగ్గరికి నాగార్జున సాగర్‌కు వెళ్ళేవాళ్ళం. అలాంటి సమయాల్లో సూర్యారావు గారు ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి అక్క పర్మిషన్ తీసుకుని మమ్ములను భోజనానికి తీసుకు వెళ్ళేవాళ్ళు. నాగార్జున సాగర్ డామ్ చూడాలన్నా, డామ్ లోపలి గ్యాలరీ చూడాలన్నా, ఆయన శ్రమ అనుకోకుండా మాకోసం పాస్‌లు తెచ్చేవారు. నాగార్జున కొండకు వెళ్లాలన్నా ప్రత్యేక ఏర్పాటు చేసేవారు. ఆయన ఆత్మీయ అభిమానానికి, మాకు ఆనందమే కాదు ఆశ్చర్యం కూడా వేసేది. మేము బాగా చదువుకుంటున్నామని మేమంటే చాలా ఇష్టపడేవారు. కలిసినప్పుడల్లా ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారు. పెద్ద చదువులు చదువుకుని, పెద్ద ఉద్యోగాలలో స్థిరపడాలని హిత బోధ చేసేవారు. అందుకే ఆయన అంటే మరింత గౌరవం ఏర్పడేది.

రెండో కొడుకు నారాయణ రావు (బాబ్జి) కోడలు…హైమవతితో సూర్యారావు గారు

మా అక్క వంటరిగా అక్కడ ఉండడం వల్ల, ఆ కుటుంబం అంతా అక్కను కంటికి రెప్పలా కాపాడేవారు, ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అది మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది.

సూర్యారావు, సూరమ్మగార్ల పిల్లలు కూడా మాతో చాలా బాగా కలిసిపోయేవారు. ఎంతో ఆత్మీయంగా, మర్యాదగా ఉండేవారు. అది ఇప్పటికీ అటూ ఇటూ కొనసాగుతూనే వుంది. సూర్యారావు దంపతుల పెద్దకుమారుడు రాంగోపాల్ విద్యుత్ శాఖలో (నెల్లూరు) పనిచేసి పదవీవిరమణ చేసిన తర్వాత హైదరాబాద్‌లో నివాసం వుంటున్నారు. ఇద్దరం తరచుగా పలకరించుకుంటాము.

ఐదవ కుమారుడు ఉమామహేశ్వర రావు(విజయవాడ)

తర్వాత రాధాబాయి గృహిణిగానే హైదరాబాద్‌లో స్థిరపడిపోయింది. బాబ్జీగా పిలవబడే నారాయణరావుకు నేనంటే మహా ఇష్టం. ఇతను గొప్ప సాహసి. ఆ సాహసం తోనే సాగర్లోనే ఒక బ్రాహ్మణ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోగలిగారు. ఉద్యోగస్థుడుగా ఉండగానే హృద్రోగంతో మరణించడం ఆ ఇంట్లో పెద్ద విషాదం. తర్వాత భార్యకు ఉద్యోగం వచ్చి లెక్చరర్‌గా పదవీ విరమణ చేయడం, వాళ్ళ పిల్లలు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడడం ఆనందించదగ్గ విషయం. నేను ఎప్పుడు సాగర్ వెళ్లినా ఎక్కువ సమయం నాతోనే గడిపేవాడు. అతను లేకపోవడం ఈవాళ ఆ కుటుంబానికే కాదు నాకు కూడా తీరని లోటు. ఇంకా ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయీ ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. ఆఖరి అబ్బాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో (విజయవాడ) నీటి పారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఇతను కూడా నన్ను ఇష్టపడతాడు, విజయవాడ వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కలుస్తుంటాం.

మూడవ కుమారుడు కృష్ణార్జునరావు (హైదరాబాద్) కుటుంబం

జీవితం అంతా కుటుంబం కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, శ్రేయోభిలాషుల కోసం శ్రమించిన సూర్యారావు గారు పిల్లల అభివృద్ధిని పెద్దగా చూడకుండానే/అనుభవించకుండానే, పదవీ విరమణ చేసిన కొద్దికాలానికే స్వర్గస్థులైనారు. అలా తండ్రిని కోల్పోయిన పిల్లలకు, తల్లి ఇంకా ఆరోగ్యంగా జీవించి వుండడం వాళ్ళ అదృష్టంగా భావించాలి.

కృష్ణార్జునరావుతో రచయిత.

నా జీవితంలో నేను మరచిపోలేని మంచి వ్యక్తులలో శ్రీ సూర్యారావు గారు ముఖ్యులుగా నేను భావిస్తాను. వారి ప్రేమ, ప్రోత్సాహం నా ఎదుగుదలకు తప్పక కొంతవరకూ ఉపయోగపడిందని నేను భావిస్తాను.

6-12-1999 న శ్రీ సూర్యారావు గారు రచయితకు రాసిన లేఖ.

ఉపకారం చేయడమే ధ్యేయంగా బ్రతికిన, ఉన్నతమైన వ్యక్తిత్వం గల మంచి మనిషి శ్రీ సూర్యారావు గారు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here