జ్ఞాపకాల పందిరి-93

34
9

[box type=’note’ fontsize=’16’]”కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

రాజకీయ రంగం-సాహిత్య రంగంగా రూపాంతరం చెందింది..!!

[dropcap]కొ[/dropcap]న్ని కుటుంబాలలో కొన్ని వృత్తులు, లేదా ప్రవృత్తులు వంశ పారంపర్యంగా, తరతరాలుగా, ఒక తరం నుండి మరో తరానికి అంది పుచ్చుకుని అలా కొనసాగుతూ ఉంటాయి. ఇప్పటికీ కొన్ని కంపెనీలు, కొన్ని కుటుంబాలను ఈ రూపంలో మనం చూడవచ్చు. టాటా – బిర్లాలు, హిందూ వంటి వార్తాపత్రికలు ఈ కోవకు చెందినవి, రెండు ఉదాహరణలు మాత్రమే. ఎవరో పూర్వీకులు చిన్న స్థాయిలో ఏదైనా సంస్థను స్థాపిస్తే, దానిని అందిపుచ్చుకుని తర్వాతి తరంవారు కాలానికి అనుగుణంగా అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ, కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంటారు. అది అలా కుటుంబాలతో కొనసాగుతూ ఉంటుంది. కుటుంబాలు పెరిగినప్పుడు, అన్నదమ్ములు గానీ, మరోరకంగా భాగస్వాములు గానీ విడిపోయి పేరు మార్చుకుని అదే వ్యాపారం చేయడం మనం చూస్తూనే వున్నాం. అలా మనుష్యులు మారినా ఆయా వృత్తి, వ్యాపారాలు, వంశ పారంపర్యంగా ఏదో రూపంలో అలా కొనసాగుతూనే ఉంటాయి.

రాజకీయ రంగం దీనికి ఏ మాత్రం అతీతం కాదు. ఒక్క మనదేశ రాజకీయ కుటుంబాలను గురించి విశ్లేషిస్తే చాలు, అది బాగా అవగాహనకు వస్తుంది. దీనికి ముఖ్య ఉదాహరణలుగా, నెహ్రు – గాంధీ కుటుంబాలు ప్రముఖంగా చెబుతారు. అలా కాకుండా ప్రాంతీయంగా అనేక రాష్ట్రాలలో కూడా ఈ రాజకీయ వ్యవస్థ వంశ పారంపర్యంగా వస్తూనే వుంది. గతాన్ని పోల్చి చూస్తే ఇప్పుడు అది మరింతగా విస్తరించిందని చెప్పాలి. కరెక్ట్‌గా చెప్పాలంటే క్రమంగా అవి కుటుంబ పాలనగా రూపు దిద్దుకుంటున్నాయి.

భవిష్యత్తుకు ఇవి తప్పుడు సంకేతాలు చూపిస్తున్నాయేమో అన్న అనుమానం కూడా కాస్త ఆలోచించేవారికి రాక మానదు. ప్రజలు రాష్ట్ర/దేశ ప్రయోజనాలు పక్కన పెట్టి వ్యక్తి (గత) పూజలకు దాసులు కావడం బాధాకరం.

ఇక సాహిత్యపరంగా ఆలోచించిస్తే కొన్ని పండిత కుటుంబాలు వంశ పారంపర్యంగా ఎందరో ఉద్దండ పండితులను సమాజానికి అందించడం మనం చూస్తూనే వున్నాం. ఇది మంచి పరిణామమే! అయితే ‘పండిత పుత్రః…’ అన్న సామెతకు సరిపడా ఎక్కువ కుటుంబాలు ఎక్కువ శాతం సాహిత్యానికి దూరంగా ఉండిపోతున్నాయి. అయితే ఒకప్పుడు కొన్నివర్గాలు ప్రజలకు మాత్రమే సాహిత్యం లేదా పాండిత్యం దగ్గరయింది.

ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. అన్ని వర్గాల ప్రజలు సాహిత్యం చదువు కుంటున్నారు, మేలిమి సాహిత్యాన్ని పండిస్తున్నారు కూడా. సాహిత్యపరంగా ఇది ఆహ్వానించదగ్గ విషయమే! రాజకీయానికి అంటిన చీడ దీనికి అంట లేదనే చెప్పాలి. ఎందుచేతనంటే ఇది డబ్బుకు, ఉచితాలకు లొంగనిది కాబట్టి! ఈ నేపథ్యంలో మా కుటుంబ అనుభవాలు ఇక్కడ ఉదాహరించక తప్పదు.

స్వాతంత్య్రం రాక మునుపు, ఆ తర్వాత కూడా కోస్తాప్రాంతం అంతా కుల వివక్షత విషయంలోనూ, పేదరికం విషయంలోనూ ఆయా ప్రజలు గొప్ప ఉద్యమాలు చేశారు. వారి వెనుక కమ్యూనిస్టు పార్టీ అండగా నిలిచింది. అప్పటికి కమ్యూనిస్టు పార్టీ ముక్కలు చెక్కలు కాలేదు. సామాన్యుడి దృష్టిలో అప్పటికి అది పేదవాళ్ల పార్టీ. ఈ నేపథ్యంలో మా నాయన స్వర్గీయ కానేటి తాతయ్య గారు, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ గ్రామ రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆయన షెడ్యూల్డ్ కులాల సహకార సేవాసంస్థకు అధ్యక్షులుగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అనేకమంది ఇతర గ్రామపెద్దలతో కలసి ఆయన పేదప్రజలకు ఇళ్ల పట్టాలు సాధించేందుకు అనేక ఉద్యమాలలో పాల్గొని సాధించగలిగారు. దీనికోసం అప్పటి ఉమ్మడి రాష్ట్ర రాజధాని అయిన మద్రాసుకు కూడా పోయి ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన విషయాలు కూడా రికార్డులు తెలియజేస్తున్నాయి.

(రచయిత నాయన కానేటి తాతయ్య)

గ్రామంలో గ్రామపెద్దగా మాకు వూహ తెలిసేంతవరకూ ఆయన మాటకూ, తీర్పుకు తిరుగులేదు. అప్పట్లో ఎలాంటి నేరాలు గ్రామంలో జరిగినా పోలీసు కేసు పెట్టడానికి వీలులేదు. గ్రామపెద్దల పరిష్కారమే (తీర్పు) శిరోధార్యం అయ్యేది. మాకు తెలిసిన తర్వాత కూడా ఆయన ఎందరో కుటుంబ సమస్యలకు పరిష్కార మార్గం చూపించారు. ఆయన మాట అంటే ‘తాతాచారి ముద్ర’గా భావించేవారు గ్రామప్రజలు. పక్క గ్రామాలకు కూడా ఆయన పెద్దరికం విస్తరించి ఉండేది. ఇటువంటి కుటుంబ నేపథ్యంలో, ఆయన పిల్లలకి ఎవరికీ రాజకీయ రంగం అంతగా రుచించక పోవడం కొందరికి వింతగానే అనిపిస్తుంది. మాకు అభిరుచి లేనందువల్ల మా నాయన గారు మమ్ములను రాజకీయం వైపు మళ్లించలేదని లేదా ప్రోత్సహించలేదని అనిపిస్తుంటుంది. మా నాయన గానీ మా అమ్మ గానీ, మమ్ములను చదువుకొమ్మనే ప్రోత్సహించారు.

(రచయిత తల్లిదండ్రులు)

ముఖ్యంగా మా అమ్మ పూర్తి నిరక్షరాస్యులైనప్పటికీ, మా చదువులు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. అమ్మ ఆశలు కొంతవరకూ మేము నెరవేర్చగలిగినా, మా ఎదుగుదల దానికి సంబందించిన ఫలాలు అనుభవించకుండానే మా అమ్మ సుదూర తీరాలకు కనిపించకుండా వెళ్లిపోవడం విషాదకరం, మా దురదృష్టమూనూ.

ఇకపోతే మా కుటుంబ నేపథ్యానికి భిన్నంగా, మాకు మా కుటుంబంలో లేని రచనా వ్యాసంగం వంటపట్టిందని చెప్పాలి. ఇది అందరూ ఆశ్చర్యపోయే విషయమే! సాహిత్యకారుడిగా, మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లలో జ్యేష్ఠుడైన మా పెద్దన్నయ్య సాహిత్య రంగంలో హైస్కూల్ స్థాయిలోనే ఆరంగేట్రం చేసాడు. నాకు తెలిసి మా కుటుంబంలో అప్పటికి సాహిత్యకారులు ఎవరూ లేరు. మా పెదనాయన శ్రీ కానేటి సత్తెయ్య గారు మాత్రం తెలుగు భాష పట్ల కొంత అభిరుచివున్నట్లు అనిపించేది. తెలుగు నీతి పద్యాలు అలవోకగా పాడి అర్థం చెప్పేవారు మా చిన్నప్పుడు.

(రచయిత పెదనాయన కానేటి సత్తయ్య గారు)

పెద్దన్నయ్య కె.కె. మీనన్‌కి మాత్రం హైస్కూల్ స్థాయిలో అలవాటైన రచనా వ్యాసంగం, ఆయన చివరి రోజులవరకూ కొనసాగింది. నవలా రచనలోనూ, కథా రచనలోనూ, ఆయన కలం కదను తొక్కింది. అనువాద ప్రక్రియలోనూ ఆయన కొన్ని కథలను తెలుగు భాషలోకి అనువదించి తన సత్తా నిరూపించుకోగలిగినాడు. ‘ఈనాడు గ్రూప్’ ఈ విషయంలో ఆయనకు ఎంతగానో తోడ్పడిందని చెప్పక తప్పదు. మీనన్ గారి రచనా వ్యాసంగం మరింత పదునుదేలడానికి ముఖ్య కారణం ‘ఏజీ ఆఫిసు’ లోని ‘రంజని’ సంస్థ, తద్వారా ఆయనకు పరిచయమైన మంచి మంచి రచయితలూ, సాహిత్య కారులూనూ.

(రచయిత కుటుంబంలో మొదటి రచయిత కె.కె.మీనన్)

సందర్భం వచ్చినప్పుడల్లా మీనన్ గారు, శ్రీ ఇసుకపల్లి దక్షిణామూర్తి, గరిమెళ్ళ రామమూర్తి వంటి పెద్దల గురించి, వారి ప్రోత్సాహం గురించి ఎక్కువగా చెబుతుండేవారు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైన మిత్రుడు, శ్రీ శీలా వీర్రాజు గారని చెబుతుండేవారు. అలా మీనన్ గారు, మా కుటుంబంలో, ఒక రచయితగా, సాహిత్యకారునిగా పునాది రాయి వేశారు. ఆయనలో రాజకీయ లక్షణాలు ఉన్నప్పటికీ, వాటిని బహిర్గతము చేసుకుని దుర్వినియోగము చేసుకోలేదు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని అప్పటి డబ్ల్యు.జి.బి. కాలేజీ (వెస్ట్ గోదావరి – భీమవరం కాలేజీ)లో చదువుకుంటున్నప్పుడు, ప్రాణాలకు సైతం లెక్క చేయక విద్యార్థి ఎన్నికలలో నిలబడి విజయం సాధించడమే దీనికి గొప్ప ఉదాహరణ.

మా పెద్దక్కయ్య ఉపాధ్యాయినిగా నాగార్జునసాగర్‌లో స్థిరపడినారు. ఆవిడ సాహిత్యం అంటే ఇష్టపడేవారు. కథలు, నవలలు బాగా చదివేవారు. అయితే రచయిత్రిగా నేను అక్క మహనీయమ్మను ఎప్పుడూ చూడలేదు. అయితే మా రచనలను బాగా ప్రోత్సహించేవారు.

(రచయిత పెద్దక్క మహానీయమ్మ కానేటి)

చిన్నన్నయ్య డా. మధుసూదన్ కానేటి, ఆకాశవాణిలో అనౌన్సర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి విశాఖపట్నంలో స్థిరపడినవారు. నా చిన్నతనం నుండి ఆయన కవిత్వం రాయడం నాకు గుర్తు వుంది. ఆయనను సాహిత్య పిపాసిగా నేను ఎరుగుదును. అప్పట్లో యువభారతి కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనడం నాకు తెలుసును. కవిత్వంతో పాటు కథలు (తక్కువ) కూడా రాసారు. వేలసంఖ్యలో ఆయన కవితలు రాసినప్పటికీ వాటిని పుస్తక రూపంలో చూడలేకపోవడం తెలుగు పాఠకుల దురదృష్టంగా నేను భావిస్తాను. ఆయన ఖాతాలో కవిత్వం పుస్తక రూపం చూడక పోవడం బాధాకరం. దీనికి సరైన కారణాలు నా స్థాయివాడికి తెలియక పోవచ్చు.

(రచయిత చిన్నన్నయ్య  డాక్టర్ కె.మధుసూదన్)

ఆకాశవాణిలో అన్నయ్య మధు ఉద్యోగం ‘అనౌన్సర్’ అయినప్పటికీ, సాహిత్య విభాగం చూసేవాడాయన. దానివల్ల ఎందరో సాహిత్యకారులు, వారి రచనలు ఆయనకు పరిచయం అయ్యాయి. ఎందరో సుప్రసిద్ధ కవులను రచయితలను రేడియోకి పరిచయం చేసిన అనుభవం ఆయనది. కాళోజి, కాళీపట్నం రామారావు (మాస్టారు), మొదటి సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి మొదటి ఎం.పి.గా ఎన్నికైన కానేటి మోహనరావు వంటి వారు దీనికి చిన్న ఉదాహరణ మాత్రమే! ఒక పాఠకుడిగా సమీక్షకుడిగా, విమర్శకుడిగా, ఎందరో సాహిత్యకారులను తయారు చేసిన మార్గదర్శిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు.

తర్వాత మా చిన్నక్క భారతీదేవి, మంచి చదువరి మాత్రమే! స్వంతంగా రచనలు చేసే సాహసం ఎప్పుడూ చేయలేదు. అలాంటి అవకాశాలు కూడా ఆమెకు లభించలేదు. అన్నయ్య రచనలకు మాతో పాటే ఆమె కూడా గర్వపడేది.

(రచయిత చిన్నక్క భారతీదేవి)

సమస్యల సుడిగుండంలోనుంచి బయటపడి చిన్న సాహిత్యకారుడిగా ఎదిగిన ఘనత నాదేనని చెప్పాలి. నా చిన్నప్పటి నుంచి నన్ను ఎరిగినవారు నేను రచయితగా మారడం చూసి ఆశ్చర్య పోతుంటారు.

(రచయిత కుటుంబంలో, రచయిత తరంలో చివరి రచయిత)

ఈ విధంగా మా నాయనను బట్టి, మాలో కొందరికైనా రాజకీయం అంది రాలేదు (అంతయూ మన మేలుకొరకే కదా!) సరికదా సాహిత్యరంగం మమ్ములను వరించిందని చెప్పాలి. ఇది సంతోషించదగ్గ విషయమే! ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే మా కుటుంబంలో పిల్లలు ఎవరికీ సాహిత్యం పట్ల పెద్దగా అభిరుచి లేకపోవడం! నాకెందుకో గట్టి నమ్మకం మా మూడో తరం మీద వుంది. నేను బ్రతికుండగా అలాంటి అద్భుతం ఏదో జరుగుతుందని ఎదురుచూస్తుంటాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here