జ్ఞాపకాల పందిరి-97

49
5

[box type=’note’ fontsize=’16’]”కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

సంతోషానికి స్పీడ్ బ్రేకర్..!!

[dropcap]జీ[/dropcap]వితం ఒక తిరుగుతున్న చక్రం లాంటిది. చక్రం తిరుగుతున్నంత సేపు జీవితం ఒకేలా ఉండదు. ఆటుపోట్లను కలబోసుకుంటూ జీవిత చక్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ గమనంలో సంతోషం, విషాదం, వ్యథలూ, బాధలూ అన్నింటినీ పలకరించుకుంటూ పోతుంది. అందుచేత జీవితంలో ఎప్పుడు ఏమి ఎదురువస్తుందో చెప్పలేము. మంచి జరిగినా, చెడు జరిగినా, సమానంగా ఎదుర్కోవాలని, అనుభవజ్ఞులైన పెద్దలు చెబుతూ వుంటారు. చెప్పడానికీ, వినడానికి ఇది సులభమే! కానీ సుఖాన్నీ, దుఃఖాన్ని సమానంగా స్వీకరించగల సామర్థ్యం ఎంతమందిలో ఉంటుంది? సుఖాన్ని సంతోషాన్ని ఆనందంగా ఆస్వాదించగల వ్యక్తి, దుఃఖాన్నీ, బాధలను వ్యథలను సమానంగా ఎలా స్వీకరించగలడు? అతికొద్ది మందికి మాత్రమే ఇది సాధ్యం. ఇలాంటి వ్యక్తుల జీవితాలు సాఫీగా సాగిపోతాయి. అయితే సమాజంలో, మంచి జరిగితే ఆనందంగా ఎగిరి గంతులు వేసేవాళ్ళు, చెడు జరిగితే, తట్టుకోలేక సాగిలపడి దుఃఖ సముద్రంలో మునికి పోయేవాళ్లే ఎక్కువగా వుంటారు. సమస్య అంతా వీళ్లతోనే. ఇలాంటి వారు ఎక్కువగా సున్నిత మనస్కులై, దేనికీ తట్టుకోలేని మనస్తత్వం కలిగి వుంటారు.

జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటారు. ఆవేదనలో కొట్టుమిట్టాడుతుంటారు. భవిష్యత్తును అయోమయంలోకి నెట్టి వేస్తారు. అయితే ఇటువంటి వారు కావాలని మారం ఆ పని చేయరు. వారి మానసిక పరిస్థితి అలా ఉంటుంది. వారు సమస్యను ఎదుర్కోలేని పరిస్థితిలో వుంటారు. ఇలాంటి వారికి మానసికంగా సమస్యను ఎదుర్కొనే శక్తి ఉండదు. అందుచేత త్వరగా నీరసించిపోవడమో, బెంగపెట్టుకోవడమో, నిరాశా నిస్పృహలకు లోనుకావడం వంటి సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉంటాయి. తోబుట్టువులు, బంధువులు స్నేహితులు, శ్రేయోభిలాషులు ధైర్యంగా వుండాలని, సమస్యను ఎదుర్కోవడానికి అలవాటు పడాలని బుజ్జగింపు మాటలు చెబుతారు. అలా ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ బాధ ఎలాంటిదో, అది ఏమిటో అనుభవించేవాళ్లకే తెలుస్తుంది.

కాలం తెచ్చే మార్పుల్లో అది కరిగిపోవాలి తప్ప ఒక పట్టాన సమస్యను మానసిక ఆలోచనల నుండి తప్పించలేము. ఇలాంటి సమస్యను ప్రతి ఒక్కరు, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో అనుభవంచక తప్పదు.

సున్నిత మనస్కుడనైన నాకు జీవితంలో నాకూ ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే వున్నాయి. అందులో ఒకటి ఈ మధ్య నేను ఎదుర్కొన్న/ఎదుర్కొంటున్న సమస్య ఇక్కడ వివరించడం సమంజసంగా ఉంటుందనుకుంటాను.

మా అమ్మాయికి పెళ్లి అయిన తర్వాత అత్తారింటికి సికింద్రాబాద్ (సఫిల్‌గూడ) వెళ్ళిపోయింది. ఆమెను సాగనంపేటప్పుడు నా పరిస్థితి వర్ణనాతీతం. అదుపు చేసుకోలేనంత దుఃఖం. తట్టుకోలేని పరిస్థితి. ఇక మన అమ్మాయి కాదు అన్న భావన. ఆ బాధను అసలు తట్టుకోలేకపోయాను. తాను బాధపడుతూనే నన్ను ఎంతగానో ఓదార్చి మా అమ్మాయి అత్తారింటికి వెళ్లిపోవడం, ఆ తర్వాత నేను క్రమంగా ఆ పరిస్థితి నుండి కోలుకోవడం జరిగింది. అలా మేము హన్మకొండ, అమ్మాయి సికింద్రాబాద్. ఈలోగా అమ్మాయి ప్రసారభారతిలో ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్ పోస్ట్‌కు అప్లై చేయడమూ, పరీక్ష పాస్ కావడము, ఇంటర్వ్యూ కోసం నేను అమ్మాయిని చెన్నై తీసుకువెళ్ళడమూ, అమ్మాయి సెలెక్ట్ కావడమూ జరిగాయి. పోస్టింగ్ మాత్రం ఆలస్యంగా వచ్చింది, అది కూడా నిజామాబాద్ ఎఫ్.ఎం. స్టేషన్‌కు వచ్చింది. అయితే అక్కడి వాతావరణం ఆమెకు సరిపడలేదు. అతి కష్టం మీద సంవత్సరం నిజామాబాద్‌లో పని చేసింది.

రచయిత అమ్మాయికి ఉద్యోగ రీత్యా మార్గదర్శనం చేసిన నాటి ప్రసారభారతి డైరెక్టర్ జనరల్, రచయిత మిత్రులు, శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు (మధ్య)గారితో, రచయిత, శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ బాబు (కుడి)

అప్పటికి ప్రసారభారతిలో (ఢిల్లీ) డైరెక్టర్ జనరల్‌గా మొదటి తెలుగు అధికారి నాకు పరిచయం వున్న వ్యక్తి ఉండడం మా అదృష్టమని చెప్పాలి. ఆయన సహకారంతో, మా అమ్మాయికి, అనుకోని రీతిలో వరంగల్ పోస్టింగ్ రావడం జరిగింది. ఇది నేను ఊహించని పరిణామం. నా కూతురు ఇంత త్వరగా మాతో కలిసి వుండే పరిస్థితి ఏర్పడుతుందని అనుకోలేదు. అలా ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో మా అమ్మాయి అడుగుపెట్టింది. ఒకానొకప్పుడు నా చేయి పట్టుకుని వరంగల్ కేంద్రం చూడడానికి వచ్చిన చిన్నమ్మాయి అదే రేడియో కేంద్రంలో ఆఫీసర్‌గా అడుగు పెట్టడం నాకు ఆనందాన్ని కలిగించింది. మా జీవితంలో ఇదొక అద్భుతం, దేవుడు ఆర్.వి.ఆర్. గారి రూపంలో మాకు అందించిన గొప్ప వరం!

తర్వాత మా అమ్మాయి మనవరాలు ‘ఆన్షి‘కి జన్మనిచ్చిన తర్వాత మనవరాలి పెంపకంలో నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆమె ఉనికి నాకు గొప్ప చైతన్యం అందించింది. తాతతో ఆన్షికి కూడా అలంటి అనుబంధమే ఏర్పడింది.

రచయిత మనవరాలు ఆన్షి. నల్లి (సికింద్రాబాద్)

ఆమె నాకు కవితా వస్తువు అయింది. మనవరాలిని దృష్టిలో పెట్టుకుని మొదటి పుట్టిన రోజుకి ఒక పుస్తకం ప్రచురించాను. దానిపేరు ‘పనస తొనలు’. అందమైన ముఖ చిత్రం వేసి ఇచ్చారు ప్రియ మిత్రులు ప్రముఖ కార్టూనిస్ట్/కథా రచయిత/చిత్రకారులు శ్రీ సరసి గారు. అనుకోని రీతిలో మనవరాలి మరో పుట్టిన రోజుకి, ‘చిలక పలుకులు’ అనే పుస్తకం చిన్న పిల్లలిని దృష్టిలో ఉంచుకుని రాసాను. నా అదృష్టం కొద్దీ ఈ పుస్తకానికి కూడా మిత్రులు సరసి గారు చక్కని ముఖ చిత్రం వేసి ఇచ్చారు. ముచ్చటగా మూడవ పుస్తకం మొన్న మనవరాలు ఆన్షి ఐదవ జన్మ దినోత్సవం నాడు (24, జనవరి 2022) ఆవిష్కరించడం జరిగింది. దీని పేరు ‘ఆటవిడుపు’ మనవరాలి ఫోటోలకు తగ్గట్టు చిన్న చిన్న కవితలు పూర్తిగా కలర్ లో తీసుకు వచ్చాను. మనవరాలి కోసం ఇలా తెలుగులో మూడు పుస్తకాలు ఆమె బాల్యం లోనే వ్రాయడం అరుదు.. అని నన్నెరిగిన సాహితీ మిత్రులు చెబుతుంటారు.

మనవరాలు కోసం రచయిత రాసిన పుస్తకాలు

అలా మానవరాలితో, ఆమె ఆటలతో, అల్లరితో, ఆనందంతో మమేకమైపోవడం విడదీయరాని బంధంగా మారిపోయింది. అలిగినా, ఎవరిమీదైనా కోపం వచ్చినా, “తాతా” అంటు వచ్చి వళ్ళో వాలిపోయే ఆన్షి, వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చినా, నా దగ్గరికి వచ్చి”తాతా.. అమ్మను తిట్టు” అని గారాలు పోయే నా మనవరాలు, ఇప్పుడు నాకు దూరంగా హైదరాబాద్‌కు (వాళ్ళమ్మకు హైదరాబాద్ బదిలీ కావడం వల్ల) వెళ్ళిపోయిన తర్వాత ఈ బలహీనమైన తాత మనసు ఎంత తల్లడిల్లిపోయిందో, మానసికంగా ఎంత కృంగిపోయిందో, ఎంత ఒంటరితనం అనుభవిస్తుందో చెప్పడానికి ఇక్కడ అక్షరాలూ సరిపోవు.

తాత-మనవరాలు
సికింద్రాబాద్ లో తల్లిదండ్రులతో బేబి ఆన్షి.

కూతురు, కుటుంబంతో సహా ఎప్పుడూ నాతోనే వుండాలని కోరుకోవడం కూడా సబబు కాదు. వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడం నా స్వార్థమే అవుతుంది. కానీ పెనవేసుకుపోయిన రక్తసంబంధాలు, ప్రేమలు, బంధాలూ -అనుబంధాల వలయంలోనుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. నా జీవన శైలిలో పెద్ద మార్పు చోటు చేసుకుంది. ఇది కొందరికి హాస్యాస్పదం అనిపించవచ్చుగానీ సున్నిత మనస్కులకు ఇదొక పెద్ద సమస్య. ప్రస్తుతం ఇది నా సమస్య. “హైదరాబాదే కదా! అనుకున్నప్పుడు వెళ్లి రావచ్చుకదా!” అని ఓదార్చే శ్రేయోభిలాషులూ వుంటారు. కానీ సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే కొంతకాలం వరకూ నాకు (మాకు) ఇది జీర్ణించుకోలేని అంశం. ఐదు సంవత్సరాలు నా దగ్గరే పెరిగిన నా మనవరాలిని రోజూ చూడకుండా ఉండడం అంత సులభం కాదు. అలవాటు పడడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ ఇప్పటికీ గెలుపు మానవరాలిదే!

తాత-అమ్మమ్మలతో బేబి ఆన్షి.

నేను ఓడిపోతున్నాను. ఏది ఏమైనా నా మనవరాలు కూడా నాకు దూరంగా ఉండడానికి అలవాటు పడాలి/పడుతున్నది. తల్లిదండ్రులు కదా ఆమెకు ప్రథమ స్ధానం. ఏది ఏమైనా నా మనవరాలు హైదరాబాద్ వాతావరణానికి అలవాటు పడాలి, అక్కడి స్కూల్‌కి అలవాటు పడాలి, చదువులో చురుగ్గా ఉండాలి, ఆమె సుఖము/సంతోషము, ఆరోగ్యము/ఆనందమే నేను కోరుకుంటాను. ఒంటరి జీవితానికి అలవాటు పడడం ప్రస్తుతం నా ప్రధాన కర్తవ్యం. ఈ సమాజంలో, ఈ యాంత్రిక జీవితంలో నాలాంటివారు ఇంకెందరో!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here