జ్ఞాపకాలు – వ్యాపకాలు – 17

0
5

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

వరుస పర్యటనలు (1987-90):

[dropcap]ఢి[/dropcap]ల్లీ ఆకాశవాణి శిక్షణా కళాశాలలో మూడేళ్ళు పని చేశాను. అది జాతీయ స్థాయి సంస్థ కావడం వల్ల దేశం నలుమూలలా కార్యక్రమ సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేసేవాళ్ళం. అలా పలు ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకొనే అవకాశం, అక్కడి సిబ్బందితోనూ, ప్రసార ప్రముఖులతోను పరిచయం భాగ్యం లభించింది. మా డైరక్టర్లు నన్ను అభిమానించేవారు కావడం వల్ల ఆయా నగరాలకు నన్ను పురమాయించేవారు.

సిమ్లా పర్యటన:

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వారి HIPA – Himachal Pradesh Institute of Public Administration వారి సిమ్లా ప్రాంగణంలో 1989 జూన్‌లో రెండు వారాల పాటు సైన్స్ వర్క్‌షాపు నిర్వహించారు. ఆకాశవాణిలో 1983లో ఒక డజను మంది సైన్స్ ఆఫీసర్లను స్థానికంగా నియమించారు. వారందరూ డాక్టరేట్లు పొందినవారు. సైన్సు కార్యక్రమాల రూపకల్పనలో కొత్త బాణీలు కట్టారు. అందరూ తర్వాతి కాలంలో డైరక్టర్లు అయ్యారు. జి. జయలాల్ (త్రివేండ్రం) 2014 ప్రాంతంలో డైరక్టరు జనరల్ (ఆకాశవాణి) కూడా అయ్యాడు. ఈ 12 మందిని సిమ్లాకి పిలిచి ఒక వర్క్‌షాప్ ఏర్పరచాం. జూన్ నెల వాతావరణం సిమ్లాలో అనుకూలంగా వుంటుంది గాబట్టి అందరం హాయిగా గడిపాం. 1989 జనవరిలో భోపాల్ ఆకాశవాణిలో ఉత్తర ప్రాంత అకౌంటెంట్లకు ట్రెయినింగ్ ఇచ్చాం. అప్పుడు అక్కడ డైరక్టర్‍గా జి.టి. అయ్యంగార్ ఉన్నారు. ఆయనా, నేనూ లోగడ కడపలో పనిచేశాం.

ఇస్రో ఆతిథ్యం:

ఇస్రో వారి విద్యావిజ్ఞాన సంస్థ DECU పేర అహమ్మదాబాద్‌లో వుంది. వారి సహకారంతో ఆకాశవాణి శిక్షణా సంస్థ సంయుక్తంగా 1989 ఆగస్టులో లోకల్ రేడియో కేంద్రాల డైరక్టర్లకు రెండు వారాల శిక్షణ ఇచ్చాం. రాకెట్ లాంచింగ్ సెంటర్ విక్రమ్ సారాభాయ్ పేర అత్యున్నత ప్రమాణాలతో పని చేస్తోంది. అహమ్మదాబాద్ లోని ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో మహావీర్ సింగ్ పని చేస్తున్నారు. ఆయన చొరవతో శిక్షణ విజయవంతంగా పూర్తి చేశాం. కిరణ్ కార్నిక్ అప్పుడు ఆ సంస్థ అధిపతి. నూతన విధానంలో కార్యక్రమ రూపకల్పన గూర్చి చర్చలు జరిపాము.

బొంబాయిలో వాణిజ్య ప్రసారాలు:

వివిధ భారతి పేర అకాశవాణిలో విజ్ఞాన వినోదాలు కలిగించే సంస్థ ఒకటి బొంబాయిలో వుంది. ఆకాశవాణి వాణిజ్య ప్రకటనల ప్రధాన కార్యాలయం Central Sales Unit పేర వుంది. దేశవ్యాప్తంగా వున్న 16 మంది డైరక్టర్లను అక్కడికి పిలిపించి రెండు వారాల శిక్షణ ఇచ్చాం. అక్కడ తెలుగు వారైన యస్. వేణుగోపాల రెడ్డి ఆకాశవాణి డైరక్టరుగా వుండి సహకరించారు.

సైన్స్ ప్రసారాలు:

విజ్ఞాన ప్రసారాలు ప్రాముఖ్యం సంతరించుకుంటున్న రోజులలో మెరికల్లాంటి యువతీయువకులు 1983-85 మధ్య ఆకాశవాణిలో చేరారు. వారిలో డా. కె.బి.గోపాలం (హైదరాబాద్), డా. ఆర్. శ్రీధర్ (మదరాసు), హెచ్.ఆర్. కృష్ణమూర్తి (బెంగుళూరు), జి. జయలాల్ (త్రివేండ్రం) దక్షిణాదికి చెందినవారు. గ్రోవర్ (లక్నో), అపర్ణా వైష్ (జైపూర్), దీపాచంద్ర (భోపాల్) తదితరులు కొత్తతరంగా పేర్కొనవచ్చు. సంప్రదాయ ధోరణిలో సాగుతున్న ప్రసారాలకు కొత్త దృష్టి కల్పించగలిగారు.

కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖలో సైన్స్ కమ్యూనికేషన్ డైరక్టరుగా నాయర్ వుండేవారు. ఆయనతో సత్సంబంధాలు ఏర్పర్చుకొని ఆకాశవాణి జాతీయ స్థాయిలో హిందీలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో ఈ సైన్స్ ఆఫీసర్లు చురుకుగా పాల్గొన్నారు.

వారిని సుశిక్షితులను చేయడానికి పలురకాల శిక్షణలు ఏర్పాటు చేశాం. 1989 సెప్టెంబరులో మదరాసులో రెండు వారాలు వర్క్‌షాప్ పెట్టాం. అలానే 1990 ఫిబ్రవరిలో నాగపూరులో మరో శిబిరం నిర్వహించాం. అక్కడ డైరక్టరుగా ఉన్న తమిళ వ్యక్తి బి.ఆర్. కుమార్ బాగా సహకరించారు. నాగపూరులో నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం వుంది. అందులో డైరక్టరుగా తెలుగువారు టి.యస్.మూర్తి వున్నారు. ఇన్‍కమ్ టాక్స్ కమీషనర్‌గా ఏ.వి.రావు వున్నారు. వీరందరిని కలిశాను. సివిల్ సర్వీసులలో ఐ.ఆర్.ఎస్.కు సెలెక్టయిన వారికి సంవత్సర కాలం నాగపూరులో శిక్షణ ఇస్తారు. దాని పనితీరును వెళ్ళి గమనించి వచ్చాను.

విద్యా ప్రసారాలు:

ఆకాశవాణి చిరకాలంగా విద్యా ప్రసారాలకు ప్రాముఖ్యం ఇచ్చింది. ప్రతి కేంద్రంలోనూ విద్యా విభాగ ప్రసారాధికారి వుంటారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ, SCERT సౌజన్యంతో చాలా కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఇటీవలి కాలంలో అవి మూతబడ్డాయి. విద్యా ప్రసారాధికారులకు 1990 ఏప్రిల్‌లో హైదరాబాదులో ఒక జాతీయ స్థాయి శిక్షణ నిర్వహించాం. విద్యా శాఖాధికారుల సౌజన్యం లభించింది.

కన్యాకుమారి వద్ద శిక్షణ:

తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో 1984 అక్టోబరులో స్థానిక రేడియో ప్రారంభించారు. అదిలాబాదు, కేంజర్, కోటలలో ఇటువంటి కేంద్రాలు వెలిశాయి. ప్రతి జిల్లాలో ఒక రేడియో కేంద్రం 1990 – 1995 మధ్య ప్రారంభించారు. ఈ కేంద్రాధిపతులకు 1990 జూలైలో రెండు వారాలు శిక్షణ ఇచ్చాము.

సమీపంలోని కన్యాకుమారి తదితర పర్యాటక కేంద్రాలు దర్శించాం. త్రివేండ్రం దగ్గరలోనే వుంది. కాని, అది కేరళ. నాగర్‌కోయిల్ తమిళనాడు. జయలాల్ ఇక్కడ డైరక్టరు. బాగా చొరవ చూపి కార్యక్రమాలు చేశాడు. అక్కడి నుండి తిరునల్వేలిలో డైరక్టర్‌గా పని చేస్తున్న ఆర్. వెంకటేశ్వర్లు (2014లో డైరక్టర్ జనరల్ అయ్యాడు) సౌజన్యంతో కుర్తాళం పీఠాన్ని, జలపాతాన్ని సందర్శించాను.

స్టేషన్ డైరక్టరుగా ఎంపిక:

నేను 1975లో ఆకాశవాణిలో ప్రొడ్యూసర్‌గా చేరాను. అది ఎదుగుబొదుగు లేని ఉద్యోగం. అదే హోదాలో చాలా మంది రిటైరయ్యారు. అయితే లబ్ధప్రతిష్ఠులు అలా పని చేశారు. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, జి.వి. కృష్ణారావు, దాశరథి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, పోలేటి వెంకటేశ్వర్లు, మంచాళ జగన్నాథరావు వంటివారు పాత తరానికి చెందినవారు. ఉషశ్రీ, రావూరి భరద్వాజ, నేను, విజయభూషణశర్మ 1975లో ప్రొడ్యూసర్లుగా చేరాం.

నేను 1982లో యు.పి.యస్.సి. ద్వారా అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా ఎంపికయ్యాను. నాతో పని చేసే దాదాపు 150 మంది కంటే డైరక్ట్ రిక్రూట్‍మెంట్ వల్ల సీనియారిటీ లభించింది. 1988లో మళ్ళీ యు.పి.యస్.సి. ద్వారా స్టేషన్ డైరక్టర్‌గా ఎంపికయ్యాను. అప్పుడు కూడా నా హోదాలో పనిచేసే వందమందికి పైన సీనియారిటీ వచ్చింది. 2001లో క్లాస్ వన్ అధికారిగా 18 ఏళ్ళు పూర్తయ్యాయి. ఏతా వాతా డిప్యూటీ డైరక్టర్ జనరల్‌గా పదోన్నతి లభించింది. ప్రస్తుతం దాని హోదా అడిషనల్ డైరక్టర్ జనరల్‌గా పిలుస్తున్నారు. సారాంశంగా చెప్పదలచుకొన్నది – ప్రొడ్యూసర్‌గా 60వ ఏట రిటైర్ కావాల్సిన నేను అత్యున్నత పదవీ యోగం జాతకంలో వుండి పొందగలిగాను. ఉద్యోగ ప్రారంభదశను తలచుకొంటే 1967 డిసెంబరులో ప్రభుత్వ కళాశాలలో తెలుగు ట్యూటర్‍గా చేరిన నేను శాఖా చంక్రమణం చేసి చిటారు కొమ్మకు చేరుకొని క్రిందపడకుండా నిలదొక్కుకున్నాను.

డైరక్టర్‍గా పదవీ బాధ్యతలు:

1988 జూలైలో మా బ్యాచ్‍లో సెలెక్ట్ అయిన 15 మందిమి డైరక్టర్లుగా చేరాము. లక్నోలో పనిచేసే శ్రీవాత్సవను కడప, ఢిల్లీలో పనిచేసే నోరిన్ నక్వీని విశాఖపట్నం – ఇలా ఇండియా పటం పైన రకరకాల గీతలు గీచి ట్రాన్స్‌ఫర్లు చేశారు. నేను 1987 జూన్‌లో చేరాను. సంవత్సరం కూడా పూర్తి కాలేదు. నన్ను ఢిల్లీలోనే వుంది డైరక్టరేట్‌లో స్పోకెన్ వర్డ్ డైరక్టరుగా నియమించారు. ట్రెయినింగ్ సెంటర్ పనులు కూడా చూడమని డైరక్టర్ జనరల్ ఆదేశించారు. రాజీవ్ గాంధీ పుణ్యమా అని శని, ఆదివారాలు సెలవులు.

ట్రెయినింగ్ సెంటర్లో మూడు రోజులు సోమ, బుధ, శుక్రవారాలు – మంగళ, గురువారాలు డైరక్టరేట్‌లోను పని చేసేలా ఏర్పాటు చేసుకొన్నాను. దానికొక కారణం – ప్రతి గురువారం డైరక్టరేట్‌లో ప్రోగ్రాం సమీక్షా సమావేశం జరుగుతుంది.  డైరక్టర్ జనరల్ అధ్యక్షత వహిస్తారు. దాదాపు 20మంది డైరక్టర్లు (డైరక్టరేట్‌లో పని చేసేవారు), ఢిల్లీ స్టేషన్ డైరక్టరు, చీఫ్ ఇంజనీరు, వార్తా విభాగాధికారులు పాల్గొంటారు. గత వారంలో జరిగిన జాతీయ కార్యక్రమాల సమీక్ష, వచ్చేవారం కార్యక్రమాల వివరాలు చర్చిస్తారు. వాడిగా, వేడిగా చర్చలు జరుగుతాయి. ఢిల్లీ స్టేషన్ డైరక్టర్ సమాధానాలు చెప్పుకోవాలి. సంగీత విభాగ డైరక్టరు ఆ వారంలో ప్రసారమైన హిందుస్థానీ, కర్నాటక సంగీత స్థాయిని వివరిస్తారు.

జాతీయ కార్యక్రమాల సమీక్ష:

ఆ వారంలో జరిగిన జాతీయ ప్రసంగం – ఇంగ్లీషు, హిందీల గూర్చి చర్చిస్తారు. అలానే జాతీయ నాటకస్థాయిని, జాతీయ రూపక వివరాలను ఘాటుగా విమర్శిస్తారు. ఒక్కొక్కసారి తీవ్రస్థాయిలో చర్చలు వ్యక్తిగత గొడవల ఆధారంగా జరుగుతాయి. ఏది ఏమైనా జాతీయ కార్యక్రమాల పట్ల పత్రికల విమర్శలు, శ్రోతల స్పందనను దృష్టిలో పెట్టుకొంటారు.

ఆర్టిస్టుల ఫీజు పెంపుదల:

గత పది సంవత్సరాలుగా ప్రసంగకర్తలకు, నాటక రచయితలకు, నాటకంలో పాల్గొనేవారికి, సంగీత కళాకారులకు చెల్లించే ఫీజుల రివిజన్ జరగలేదు. అప్పటి డైరక్టర్ జనరల్ అమృతరావు షిండే వాటిని పెంచడానికి సుముఖంగా వున్నారు. ఆ పెంపకం పని చేయవల్సిన బాధ్యత స్పోకెన్ వర్డ్ డైరక్టర్‍గా నాపై బడింది. చాలా జాగ్రత్తగా ఒక నెల పాటు కుస్తీ పట్లు పట్టి దాదాపు రెండున్నర వంతుల ఫీజు పెంచాము. డైరక్టర్ జనరల్‍తో చర్చించి, ఆమోదం పొంది ఫీజు పెంపుదల ఆర్డర్ నా సంతకంతో 1990లో విడుదల చేశాము. అదొక మధురానుభూతి.

వారంలో రెండు రోజులు:

నిరంకారీ కాలనీ నుండి పార్లమెంటు స్ట్రీట్‌కు రావడానికి ఒక గంట పైన పడుతుంది. ఎనిమిది గంటలకే బయలుదేరి 9.30 గంటలకు డైరక్టరేట్ చేరుకొనేవాడిని. పదిగంటలకి పైన ప్యూను కూడా రాడు. అది ఉత్తరదేశ సంస్కృతి. నా సెక్షన్‌లో ఫైళ్ళు పేరుకొనిపోయి వుండేవి. అప్పట్లో వందకు పైగా ఆకాశవాణి కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాలు పంపే త్రైమాసిక ప్రసంగాల షెడ్యూళ్ళను పరిశీలించి ఆమోదించాలి. శ్రద్ధగా పరిశీలించి పునశ్చరణ లేకుండా చూడాలి. వారం పని రెండు రోజుల్లో పూర్తి చేయాలి. మధ్యలో మంత్రిత్వ శాఖలో మీటింగులకు హాజరు కావాలి.

స్మారకోపన్యాసాలు:

నా ఆధ్వర్యంలో ఏటా ఆకాశవణి రెండు స్మారకోపన్యాసాలు ఏర్పాటు చేస్తుంది. 1988 డిసెంబరులో రాజేంద్రప్ర్రసాద్ స్మారకోపన్యాసం శ్రీమతి కపిలా వాత్సాయన్ చేత జరిపించాను. ఆమె ప్రముఖ సాహితీవేత్త. ముందుగా వారిని కలిసి ప్రసంగ విషయం చర్చించి, నేషనల్ మ్యూజియం హాలులో సభ జరిపాము. అదే విధంగా ఆంగ్ల ప్రసంగాన్ని సర్దార్ పటేల్ స్మారకోపన్యాసాన్ని మాజీ కేంద్రమంత్రి కరణ్‌సింగ్ చేత జరిపించాము. కాశ్మీరు ప్రభువైన ఆయనను కలిసి చర్చించడం గొప్ప అనుభూతి. ఎంతో గౌరవాదరాలతో మాట్లాడారు.

నా డ్యూటీలో మరో బాధ్యత ఏటా జరిగే జాతీయ కవి సమ్మేళనానికి 18 భాషలలో కవులను, వాటికి హిందీ అనువాదకులను ఎంపిక చేయడం. ఆ ప్రక్రియ దాదాపు మూడు నెలలు కొనసాగుతుంది. ఆ కవి సమ్మేళనాన్ని ఏదో ఒక నగరంలో ఏర్పాటు చేస్తాము. ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ వుంది. వీటికిగా ఒక్కొక్క భాషకు ఒక్కొక్క సెలక్షన్ కమిటీ వుంటుంది. ఆ కమిటీకి నేను కార్యదర్శిని. ఢిల్లీ కేంద్రంలో ఈ మీటింగులు జరుగుతాయి. అదొక బృహత్ ప్రణాళిక. ఆ విధంగా 1988-1990ల మధ్య పనుల హడావిడితో కుస్తీ పట్లు పట్టవలసి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here