జ్ఞాపకాలు – వ్యాపకాలు – 21

0
6

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

పోలీసు ఉన్నతాధికారులతో అనుబంధం:

[dropcap]నే[/dropcap]ను పని చేసినది ప్రజా సంబంధాలు గల ఆకాశవాణి కావడం వల్ల, వస్తుతః నేను చొరవ తీసుకునే వ్యక్తిని కావడం వల్ల పలువురు జిల్లా అధికారులతో వివిధ శాఖాధిపతులతో పరిచయాలు – రేడియో పరిచయాల వల్ల – ఏర్పడ్డాయి. ముందుగా జిల్లాలలో – ప్రత్యేకించి – రాయలసీమ ప్రాంత పోలీసు అధికారులను ప్రస్తావిస్తాను.

కడప గడపలో:

1975-78 మధ్య కడపలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా వున్న ఏ.పి.రాజన్ బాగా పరిచయమయ్యారు. అప్పుడు ఆకాశవాణికి స్వంత భవనాలు లేవు. కోపరేటివ్ కాలనీలో రెండు అద్దె భవనాలలో వున్నాం. మా కొత్త భవన నిర్మాణానికి స్థలం కేటాయించమని జిల్లా కలెక్టరు పి.యల్. సంజీవరెడ్డికి మహాజరు సమర్పించాము. కడప తాశిల్దారు సర్వే చేయించి యస్.పి.బంగళా లోని విశాల ప్రాంగణంలో ఒక ఎకరం ప్రభుత్వ రేట్ల ప్రకారం కేటాయించవచ్చునని సూచించారు. కలెక్టరు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం యస్.పి. బంగళా పక్కనే ఆకాశవాణి వెలయడానికి ఒక కథ వుంది. ఆకాశవాణి అధికారులకు స్థలాన్ని కేటాయించడానికి రెవెన్యూ ఇన్‌స్పెక్టరు, సర్వేయర్ గొలుసు, కాస్ట్రాపు తీసుకుని యస్.పి. బంగళాలోకి అనుమతి తీసుకొని వెళ్ళారు. రాజన్ గారి భార్య దృఢమైన శరీరం గల వ్యక్తి. వారిని చూడగానే ఆమె ఆగ్రహించి ‘మా బంగళాలో ఒక్క అంగుళం కూడా ఇవ్వబోమ’ని తుపాకీ చూపి బెదిరించింది. రెవెన్యూ అధికారులు ‘బ్రతుకు జీవుడా!’ అని బయటపడ్డారు. అది పోలీసు, రెవెన్యూ విభాగాల మధ్య మనస్పర్థ కలిగించింది.

రాష్ట్ర తాత్కాలిక గవర్నరుగా కడప జిల్లా వారైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యస్. ఓబుల్‌రెడ్డి 1976 రాష్ట్రావతరణ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా కడప విచ్చేశారు. అప్పుడు కలెక్టర్ సంజీవరెడ్డి గవర్నరు దృష్టికి ఆకాశవాణి స్థలం అవసరం ప్రస్తావించి, వారి ద్వారా యస్.పి.రాజన్‌కు నచ్చజెప్పించి స్థలం ఇప్పించారు. రాజన్ అడిషనల్ డి.జి.పి.గా రిటైరయ్యారు.

కడపకు యస్.పి.గా వచ్చిన మరో అధికారి ఆర్.పి.ఠాకూరు. ఆయన 1986 బ్యాచ్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ డి.జి.పి.గా వ్యవహరించారు. ఒకసారి నేను 1996లో ఆఫీసు కార్లో వస్తున్నాను. యస్.పి.ఆఫీస్ టర్నింగ్ వద్ద మా డ్రైవరు యస్.పి.కారు డోరుకు తగిలేలా నడిపాడు. ఠాకూరు లోపలి నుంచి కోపంగా చూశారు. పోలీసు డ్రైవరు మా డ్రైవర్ చొక్కా పట్టుకొన్నాడు. నేను కారులోంచి దిగాను. అది గమనించిన ఠాకూరు ప్రశాంతమై వాళ్ళ డ్రైవర్‌ని వెనక్కి పిలిపించారు. గత ముప్ఫయి సంవత్సరాలుగా అనేక సభలలో వి.ఐ.పి.లలో వారిని కలిశాను. రాయలసీమ ఐ.జి.గా ఆయన తిరుమల వచ్చేవారు బందోబస్తు పర్యవేక్షణకు.

డి.ఐ.జి. హోదా గలవారు:

కడప, విజయవాడ కేంద్రాలలో పనిచేసినప్పుడు పలువురు డి.ఐ.జిల పరిచయం ఏర్పడింది. కడప, కర్నూలు జోన్‌కు కర్నూలులో డి.ఐ.జి. వుంటారు. అలా బాలకొండయ్య పరిచయమయ్యారు. ఆయన నెల్లూరు వారు. ఒక దఫా నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల డి.ఐ.జి. అనంతపురంలో వుంటారు. నేను అనంతపురం డైరక్టరుగా 1990-93మధ్య వుండగా నెల్లూరు వారైన పి. వెంకయ్య (డి.ఐ.జి.) సన్నిహితమయ్యారు. 1991లో ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన వనమహోత్సవానికి వారిని ఆహ్వానించాను. 1991 మే లో నా కుమార్తె శైలజ వివాహానికి ఆయన హజరయ్యారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సర్వీస్ కమీషన్‌కు ఛైర్మన్‌గా కొంతకాలం వ్యవహరించారు. దర్పమెరుగని అధికారి.

ఏలూరు రేంజి:

ఏలూరు రేంజి డి.ఐ.జి.గా డి.వి.యల్.యన్. రామకృష్ణారావు 1978-80 మధ్య వున్నారు. వారిని విజయవాడ ఆకాశవాణికి పిలిపించాను. ఆయన రావటానికి ముందురోజే ఒక ఇన్‌స్పెక్టర్ వచ్చి స్టూడియో అంతా గాలించి పరిశీలించారు. రామకృష్ణారావు పొడగరి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ జనరల్‌గా ఢిల్లీలో చాలా కాలం పనిచేసి 2018లో హైదరాబాదులో గతించారు. వారిది ప్రకాశం జిల్లా. ఏలూరు డి.ఐ.జి.గా జి.ఆల్‌ఫ్రెడ్ కూడా పని చేశారు. వారొక రికార్డింగ్‌ కొచ్చారు.

గుంటూరు రేంజి:

గుంటూరు రేంజిలో యస్.పి.గా, డి.ఐ.జి.లుగా పనిచేసిన పలువురు సన్నిహితులయ్యారు. రాజీవ్ త్రివేది, కె. అరవిందరావు, యం. మాలకొండయ్య, పూర్ణచంద్రరావు, సి.యస్.గోపీనాథరెడ్డి ఆకాశవాణికి సన్నిహితులు. ఏ.కె.ఖాన్ డి.ఐ.జి.గా వుండగా నెల్లూరు టౌన్ హాల్‌లో ఒక కవి సమ్మేళనం ఏర్పాటు చేశాం. బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులు. యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథి. ఖాన్ సాంస్కృతిక విలువలు గల వ్యక్తి. వారు అనంతపురం రాజ్యసభ సభ్యులు షఫియుల్లా కుమార్తెను వివాహమాడారు.

అనంతపురం పోలీసు అధికారులు:

1978 వరకు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిగా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి మాత్రమే వుండేవారు. అనంతపురానికి చెందిన కె. రామచంద్రారెడ్డి 1978 అక్టోబరు వరకు ఆ పదవిలో వున్నారు. ఆ తరువాత యం.వి.నారాయణరావు హయాంలోనని గుర్తు, ఆ పదవిని డైరక్టర్ జనరల్ హోదాకు పెంచారు. వారు 1982 మార్చి వరకు పని చేశారు. 1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీ హత్యోదంతం గూర్చి హైదరాబాదు ఆకాశవాణి నుండి కొన్ని కార్యక్రమాలు చేశాము. ఇందిరాగాంధీ ఆంతరంగిక భద్రతాధికారిగా పని చేసిన ఆయన అనుభవాలను ఆసక్తిదాయకంగా వివరించారు. కిన్నెర సాంస్కృతిక సంస్థ అధ్యక్షులుగా రాజధాని నాగరంలో ఎన్నో కార్యక్రమాలు చేయటానికి మద్దాళి రఘురాం‍కు ఆయన పెద్దదిక్కుగా నిలిచారు.

అనంతపురం జిల్లా నుండి మరో డి.జి.పి. ఆర్. ప్రభాకారరావు వచ్చారు. ప్రముఖ నాటక కళాకారుడు, న్యాయవాది అయిన రొద్దం హనుమంతరావు కుమారుడాయన. వేదవతీ ప్రభాకరరావు లలిత సంగీతగాయనిగా ప్రసిద్ధురాలు. 80 ఏళ్ళ వయస్సులో ఉత్సాహంగా దంపతులిద్దరూ కిన్నెర అధ్యక్ష స్థానంలో నిరాడంబరంగా హాజరవుతున్నారు. ప్రభాకరరావు 1990 ఏప్రిల్ నుండి 1992 ఫిబ్రవరి వరకు ఆంధ్రప్రదేశ్ డి.జి.పి.

వారి తర్వాత 1992 మార్చి నుండి 1994 ఫ్రిబ్రవరి వరకు రెండేళ్ళు డి.జి.పి.గా వ్యవహరించిన సౌమ్యులు టి.యస్. రావు. గుజరాత్ రాష్ట్రంలో పని చేసి తర్వాత మన రాష్ట్రానికి వచ్చారు. ఆధ్యాత్మిక చింతన గల వీరు హైదరాబాద్ మోతీనగర్‌లోని శంకరమఠ ధర్మకర్తగా చక్కటి దైవకార్యక్రమాలు గత దశాబ్దిగా నిర్వహిస్తున్నారు.

అనంతపురం జిల్లా వారైన ఇసుమల పుల్లన్న – ఇస్మాయిల్ పుల్లన్నగా రాష్ట్ర అడిషనల్ డి.జి.పి.గా పని చేశారు. సరస సంభాషణా చతురులు. వారిని 1992 ఏప్రిల్ 3న అనంతపురం ఆకాశవాణికి ఆహ్వానించాను. అది ఆదివారం. మధ్యాహ్నం ఒంటిగంటలోపు రికార్డింగు జరుగుతోంది. అదే సమయంలో నా కుమార్తెకు ప్రసవ వేదన వచ్చింది. తొమ్మిది నెలలు నిండాయి. క్వార్టర్స్ పక్కనే వున్న ఆసుపత్రికి తీసుకెళ్ళాము. డాక్టరమ్మ వెంటనే ఎక్స్‌రే తీయించాలంది. కంగారు పడ్డాను. అది గమనిస్తున్న పుల్లన్న తమ ఆఫీసు కారులో అర్జంటుగా తీసుకెళ్ళమని సహృదయంతో సూచించారు. పుట్టడానికి 10 గంటల ముందు పోలీసు కారెక్కిన ఆ పొట్టలో బిడ్డ మహోన్నత ఇంజనీరై అమెరికాలో యం.యస్. చేరి వచ్చి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడిప్పుడు (జయంత్).

అనంతపురానికి చెందిన మరో డి.జి.పి. – కె. అరవిందరావు. 2010లో పది నెలల పాటు ఆంధ్రప్రదేశ్ డి.జి.పి.గా పనిచేశారు. సాధు స్వభావి. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటంలో దిట్ట. జె.వి.రాముడు అనంతపురం వారే.

విజయవాడ, అనంతపురం, కడపలలో ఎందరో పోలీసు అధికారుల సాన్నిహిత్యం లభించింది. కందుకూరులో నేను ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా 1967-75 మధ్య పని చేశాను. అప్పుడు మా సహచరుడు ఫిజికల్ డైరక్టర్ అయిన జి. పీటర్ పాల్ 1977లో డి.యస్.పి.గా సెలెక్ట్ అయి సీనియర్ యస్.పి.గా రిటైరయి 2018లో ఒంగోలులో పరమపదించారు. కడపలో అడిషనల్ యస్.పి. యం. సత్యనారాయణరావు తర్వాత విజయవాడ అదనపు కమీషనరుగా పనిచేశారు. కందుకూరులో మా స్టూడెంట్ పి. హరికుమార్ డి.యస్.పి.గా సెలెక్ట్ అయి 2020 ఏప్రిల్ ఆఖర్లో ఐ.జి.పోలీస్‌గా రిటైరయ్యారు. కడప ఆకాశవాణిలో నావద్ద డ్యూటీ ఆఫీసరుగా పని చేసిన పి. వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం కర్నూలు రేంజ్ డి.ఐ.జి. ప్రస్తుతం విజయవాడలో డి.ఐ.జి.గా పని చేస్తున్న పి.హెచ్.డి. రామకృష్ణ నిక్కచ్చిగల అధికారిగా పేరు తెచ్చుకొన్నారు.

విజయవాడలో పోలీస్ కమీషనరు యం.వి.రామచంద్రరావు, ఆ తర్వాత వచ్చిన డి.టి.నాయక్ ఆత్మీయులు. విజయవాడ నుంచి నేను ఢిల్లీ బదిలీపై వెళ్ళినప్పుడు 1997 అక్టోబరులో జరిగిన మమతా హోటల్ వీడ్కోలు సభలో నాయక్ నా గురించి నాలుగు మంచి మాటలు పలికారు. ఆయన రాజకీయాలలో ప్రవేశించారు. అలానే పేర్వారం రాములు కూడా రాజకీయ ప్రవేశం చేశారు.

రాజధాని నగరంలో (1982-87):

హైదరాబాద్ ఆకాశవాణిలో నేను పని చేసిన సమయంలో వృత్తిరీత్యా పలువురు పోలీసు ఉన్నతాధికారులు పరిచయమయ్యారు. 1982-83 మధ్య డి.జి.పి.గా చేసిన యస్. ఆనందారాం విశిష్ట వ్యక్తి. వీరి సతీమణి విమలా ఆనందరామ్ ఆకాశవాణిలో ఆంగ్ల కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె ప్రముఖ ఆంగ్ల కథా రచయిత ఆర్.కె. నారాయణ్ సోదరి. 1987-90ల మధ్య నేను ఢిల్లీలో వుండగా ఆనందారాం గారిని స్పెయిన్‌లో (?) రాయబారిగా 1990లో నియమించింది. లోడి రోడ్‌లోని వారి యింటికి వెళ్ళి అభినందించాను. అప్పుడు ఆయన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధిపతి. విదేశానికి వెళ్ళడానికి వారి వ్యక్తిగత వస్తువులు ఆ దేశం పంపించారు. రెండు రోజుల్లో వారి ప్రయాణం. ప్రభుత్వం మారింది. పదవి రద్దయింది. కోర్టులో కేసు వేసి గాబోలు సామాన్లు వెనక్కి తెప్పించమని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. 2017లో వారు గతించారు.

1983 ఎన్నికలకు ముందు అడిషనల్ డి.జి.పి. అయిన పి. వి. రంగయ్యనాయుడు ఆకాశవాణికి ఎన్నికల భద్రతా ఏర్పాట్ల గూర్చి చెప్పడానికి వచ్చారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి కేంద్రంలో సహాయమంత్రి అయ్యారు. ఆయన అల్లుళ్ళు ఇద్దరూ – కె.వి.రావు, కె.పి.భాను లు ఐఎఎస్ అధికారులు.

సౌమ్యుడైన డి.జి.పి.గా పేరుకెక్కిన హెచ్.జె. దొర 1996-2002 మధ్య పోలీసు శాఖను పటిష్టం చేశారు. పుట్టపర్తి సాయిబాబా భక్తుడాయన. హైదరాబాదులో సత్యసాయి నిగమాగమం ఆయన కృషి ఫలితమే. 2003లో ఆయన విజిలెన్స్ కమీషన్ సభ్యులుగా ఢిల్లీలో పని చేశారు. నేను కూడా వారు నివసించిన పండారా రోడ్ లోనే వుండేవాడిని. ఆయనకు పండారా పార్కులో 4, 5, నెంబరు క్వార్టర్స్ కేటాయించారు. అంతవరకు ఆ భవనాలలో యల్.కె. అద్వానీ నివసించారు. హోం మంత్రి కాగానే వేరే భవనాలకు మారారు. నేను మార్నింగ్ వాక్‌లో పలుమార్లు దొరగారితో ముచ్చటించాను.

1987-89 మధ్య డి.జి.పి.గా చేసిన పి.యస్.రామమోహనరావు తర్వాత తమిళనాడు గవర్నరు అయ్యారు. మా నాన్నగారి పేర ఏటా నిర్వహించే అవార్డు సభలో యస్.పి.బాలసుబ్రహ్మణ్యాన్ని సత్కరించడానికి 2004 మే లో వారిని నెల్లూరు ఆహ్వానించాను. వేసవి విడిదికి ఆ సమయంలో ఊటీలో వుంటామని సూచించారు.

ఢిల్లీ పోలీసు మిత్రులు:

ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన యు.యన్.బి. రావు మంచి కార్యదక్షులు. నెల్లూరు జిల్లాకు చెందిన యస్. వాసుదేవరవు యు.టి. క్యాడర్‌లో డి.జి.పి. హోదాలో రిటైరయ్యారు. పండారా రోడ్‌లో మా పక్కనే తమిళనాడు క్యాడర్ యం.కె.ఝా ఉన్నారు. ఆయనకు 2000 ఆగస్టు 15న (వారు ఎంచుకున్న రోజు) కూతురు పుట్టింది. ఆ పాప జాతకం నేను వేసి ఇచ్చాను. మొన్న ఆయన అది గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన క్యాబినెట్ సెక్రటేరియట్‌లో డి.జి.పి. స్థాయి అధికారి. ఢిల్లీలో పేరు తెచ్చుకొన్న పాతకాలపు అధికారి యస్. వేణుగోపాలరావు. ఆయన శతజయంతి 2018లో జరిపారు. వారిని నేను 1976లో పి. పార్థసారథి, ఎం.పి. ఇంట్లో కలిసే అవకాశం దొరికింది. కె. విజయరామారావు ఢిల్లీలో పని చేసి, తెలుగుదేశంలో చేరి రాష్ట్ర మంత్రి అయ్యారు.

ఇలా పోలీసు మిత్రుల వరుసలో ఆర్. సీతారామారావు మరో ముఖ్యులు. గవర్నరు సలహాదారు ఎ.కె. మొహంతి, నేను నారాయణ ఐఎఎస్ అకాడమీలో పనిచేశాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here