జ్ఞాపకాలు – వ్యాపకాలు – 23

0
8

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

కంచి పరమాచార్య పాదస్పర్శ:

[dropcap]1[/dropcap]983 సెప్టెంబరు 12. నా జీవితంలో మధుర పవిత్ర స్మృతి నిలిపిన రోజు. నేను హైదరాబాదు ఆకాశవాణిలో అసిస్టెంట్ డైరక్టరుగా పని చేస్తున్నాను. ఢిల్లీ నుండి మాకు కొత్త డైరక్టరు కేశవ్ పాండే వచ్చి ఆగస్టులో చేరారు. అదే సమయంలో కర్నూలు తుంగభద్రా తీరంలో కంచి పీఠ పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి తమ పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి, ఉత్తరాధికారిగా అప్పుడే నియుక్తులైన ప్రస్తుత పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి – ముగ్గురూ చాతుర్మాస్య వ్రతారంభం చేశారు. కేశవ్ పాండే, నేను బయలుదేరి కర్నూలు చేరుకొన్నాం. మూడు కుటీరాలలో ముగ్గురూ ప్రాతః వేళ భక్తులకు దర్శనాలిస్తున్నారు. నేను వ్రాసి అప్పుడే ప్రచురించిన ‘భక్తి సాహిత్యం’ పుస్తకాన్ని పరమాచార్య పాదాల ముందు వుంచాను. వారు వాత్సల్యంతో గ్రంథం చేతులలోకి తీసుకొని మధ్యలో తెరచి చూచారు. ‘ప్రహ్లాదుడు’ వ్యాసం వారి కంట పడింది.

‘నమో నారాయణ!’ అని నామస్మరణ చేస్తూ నా తల దగ్గరగా చేయి చాపి ఆశీర్వదించారు. అదొక గొప్ప మధురానుభూతి. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు స్వాముల ఆశీస్సులనందుకొన్నాను. 1995లో నేను విజయవాడ ఆకాశవాణి డైరక్టరుగా వున్నప్పుడు శ్రీ జయేంద్ర సరస్వతిని సూక్తి ముక్తావళి రికార్డింగ్‌కు ఆహ్వానించాను.

“మేము బయటకి రాము గదా!” అన్నారు.

“మీ పాదస్పర్శతో మా స్టూడియో పవిత్రమవుతుంది” అన్నాను సవినయంగా.

మర్నాడు వారు, విజయేంద్ర సరస్వతి స్టూడియోకి వచ్చి, చాలా సేపు గడిపి రికార్డింగ్ చేశారు. పక్కనే క్వార్టర్సు లోంచి అన్ని కుటుంబాల వారు స్టూడియోకి వచ్చి ఆశీస్సులందుకొన్నారు. 2008 దసరా ఉత్సవాలలో వారు కంచి పీఠ ఆస్థాన విద్వాంసునిగా నన్ను నియమిస్తూ పట్టా ప్రదానం చేశారు. 2018లో కంచికి వెళ్ళి శ్రీ విజయేంద్ర సరస్వతి పీఠారోహణం తర్వాత ఆశీస్సులందుకొన్నాను. 2009లో కంచి స్వాముల సమక్షంలో రెండు రోజులు తిరుపతిలో రామాయణ పాత్రల గురించి నేను ప్రసంగించే అవకాశం కలగడం అదృష్టం.

కంచి పీఠం, శృంగేరీ పీఠం భారతదేశంలో సుప్రసిద్ధాలు. 2004లో బెంగుళూరు డైరక్టరు ఆర్. వెంకటేశ్వర్లు సౌజన్యంతో మిత్రులు రామచంద్ర వెంటరాగా శృంగేరి పీఠాధీశ్వరులను దర్శించి ఆశీస్సులందుకొన్నాను. ఆ పర్యటనలో భాగంగా ఉడిపి పెజావర్ స్వామీజీని, ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే గారిని సందర్శించే అవకాశం లభించింది. పూర్వజన్మ సుకృత ఫలంగా ఎందరో సంతులు, స్వామీజీల పాదస్పర్శకి అవకాశం కలిగింది.

విజయవాడ స్టూడియోకి సాధుసంతులు:

1995-97 మధ్య కాలంలో నేను విజయవాడ ఆకాశవాణిలో  పని చేసిన కాలంలో పలువురు స్వామీజీలను వినయవిధేయతలతో ఆహ్వానించాను. అనంతపురంలో బాగా పరిచితులైన దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి శిష్య సమేతంగా విచ్చేశారు. వారికి బొమ్మేపర్తి (అనంతపురం జిల్లా)లో మాతృమందిరం వుంది. నన్ను వారు ప్రత్యేకంగా అక్కడికి ఆహ్వానించారు. ఇటీవల 2020 మే లో మైసూరు దత్త పీఠానికి వెళ్ళినప్పుడు వారు ఏకాంత దీక్షలో వున్నారని శిష్యులు దర్శనం నిరాకరించారు. అనుకోకుండా వారు చిలుకల వనంలో తిరుగుతున్నారు. నన్ను చూడగానే మేడ మీద నుండి దిగి వచ్చి నన్ను ఆప్యాయంగా పలకరించి అనంతపురం జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు. నేను ఢిల్లీలో వుండగా వారు లాయర్ శాంత ఇంట్లో విడిది చేశారు. మానస సరోవరం దర్శించి అక్కడి జలాలు తెచ్చి భక్తులకు ప్రోక్షిస్తున్నారు. నన్ను చూడగానే – ‘ఆకాశవాణి అనంతపద్మనాభరావు’ అని అందరికీ ఘనంగా పరిచయం చేశారు.

విజయవాడలో రికార్డు చేసిన ప్రముఖ స్వామీజీలలో శ్రీ చినజియ్యర్ స్వామీజీ ఒకరు. సీతానగరం ఆశ్రమానికి వెళ్ళి వారిని సూక్తి ముక్తావళికి ఆహ్వానించాను. 1995 నుంచి గత 25 సంవత్సరాలుగా వారి అభిమానానికి నోచుకున్నాను. 2007లో అన్నమయ్య 600 జయంతి ఉత్సవాలకు తాళ్ళపాకకు వారిని ఆహ్వానించే బాధ్యతను భూమన కరుణాకరరెడ్డి నాకు అప్పగించారు. అప్పట్లో దేవస్థానంపై చినజియ్యర్ స్వామి చిరుకోపంతో ఉన్నారు. మొత్తానికి అన్నమయ్య ఉత్సవాలకు వారు రావడం విశేషం.

గుంటూరుకు చెందిన విశ్వయోగి విశ్వంజీ, అక్కడి కృష్ణాతీరంలో ఆశ్రమం నిర్మించుకొన్న శ్రీ మాతా శివచైతన్య ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. చిలకలూరిపేట వెళ్ళే దారిలో విశ్వంజీ నిర్మించిన విశ్వభవన ప్రారంభోత్సవానికి ప్రత్యేకాహ్వానితుణ్ణి. మాతా శివచైతన్య ఆశ్రమ శంకుస్థాపనకు 1996లో గొప్ప సభ ఏర్పాటు చేశారు. ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, నేను సభలో అతిథులం.

గన్నవరంలో భువనేశ్వరీ పీఠాధిపతులు పూర్వాశ్రమంలో నరసరావుపేటలో సంస్కృతాధ్యాపకులు. వారి కుమార్తెను మా బంధువుల కుర్రాడి కిచ్చారు. ఆ విధంగా వారు సన్నిహితులయ్యారు. భువనేశ్వరీ మాత సమక్షంలో వారు నాకు మంత్రోపదేశం హస్త, మస్తక సంయోగంతో అందించారు. ఎక్కిరాల భరద్వాజ, వేదవ్యాస్ సోదరుల సాన్నిహిత్యం తర్వాత లభించింది.

వేలాదిమంది సభలో వేదికపై నేను:

1993 డిసెంబరు 25న శ్రీ సుందర చైతన్య స్వామి జన్మదినోత్సవం సందర్భంగా కడపలో గీతాయజ్ఞం సంకల్పించారు. అప్పుడు నేను ఆకాశవాణి డైరక్టర్‌ని. నన్ను వేలాదిమంది పాల్గొన్న సభలో అతిథిగా ఆహ్వానించారు. ఆశువుగా పద్యం చెప్పాను:

“స్వామి సుందర చైతన్య సభలలోన
ఇసుక వేసిన రాలదు ఎందువలన?
దేవతా సముదాయం దీవనలిడి
పుష్పవర్షంబు కురియగ మోదమంది.”

-సభలో హర్షధ్వానాలు.

ధవళేశ్వరంలో 1995లో సుందర చైతన్య రామాయణ గ్రంథావిష్కరణకు నేను మా తల్లిదండ్రులతో వారి ఆహ్వానమందుకొని వెళ్ళాము. రెండు రోజులు గడిపాము. వారి గ్రంథంపై నేను సుదీర్ఘ వ్యాసం వ్రాసి పంపితే, చాలా సంవత్సరాల తర్వాత మా డైరక్టరు జనరల్ రాపూరి వెంకటేశ్వర్లు వార్ని కలవడానికి వెళ్ళినప్పుడు నా వ్యాసం చూసారట! 1996 సెప్టెంబరు 5న రాధాకృష్ణ పండితుల జన్మదినోత్సవం సందర్భంగా సుందర చైతన్య విజయవాడ కేంద్రం నుండి ఆంగ్ల ప్రసంగం చేశారు. ఆ సందర్భంగా మా క్వార్టర్స్‌కు విచ్చేసి కుటుంబాన్ని ఆశీర్వదించారు.

భగవాన్ నుండి దక్కని ఉంగరం:

1993 నవంబరులో పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి బాబా జన్మదినోత్సవాలకు కడప నుండి రికార్డింగ్ బృందం వెళ్లాము. 1990-92 మధ్య మూడు సంవత్సరాలు వరుసగా అనంతపురం డైరక్టరుగా జన్మదినోత్సవాలకు వెళ్ళాను. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, ప్రధాని పి.వి. నరసింహారావు, శివరాజ్ పాటిల్ ప్రభృతులు వచ్చారు. మధ్యలో అంతర్జాతీయ వైద్య పరిశోధనా సదస్సు ఏర్పాటు చేశారు. ఆ వేదికపై ఒక డాక్టరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బాబా వేదిక దిగి వచ్చి ముందు వరుసలో నేను కూచొన్న కుర్చీ పక్క ఖాళీ వుంటే అందులో కూచొన్నారు. మహద్భాగ్యం.

ఆ సాయంకాలం సభావేదిక మీదకి నేను, నాతో వచ్చిన మా ఇంజనీర్ వెంకట్రామన్ వారి ఆశీస్సులకు వెళ్ళాము. నా ముందు వెంకట్రామన్ నడిచారు. నేను వెనుక ఉన్నాను. బాబా తన హస్తాల నుండి విభూతి మా యిద్దరి చేతులలో విదిలించారు. వేదిక దిగి రాగానే వెంకట్రామన్ చేతిని విప్పి చూశాడు. పచ్చరాతి ఉంగరం కనిపించింది. పొంగిపోయాడాయన. నాకు విభూతి మిగిలింది. ఎవరి ప్రాప్తం వారిది.

బాబా జ్యేష్ఠ సోదరులు జానకిరామయ్య ఆ మూడు సంవత్సరాలలో బాగా సన్నిహితులయ్యారు. ఆ ఊరి వ్యక్తికి ప్యూన్ ఉద్యోగం ఆయన సిఫార్సు చేశారు. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ద్వారా పేరు తెప్పించారు. అతను గత 30 ఏళ్ళుగా అక్కడ పని చేస్తున్నాడు.

మంత్రాలయ స్వామి దర్శనం:

1981లో నేను, గొల్లపూడి మారుతీరావు కడప నుండి ఆగస్టు నెలలో మంత్రాలయంలో జరిగిన ఆరాధనోత్సవాలకు వెళ్ళాము. జనసమ్మర్దంగా వున్నా అప్పటి స్వామీజీ మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి, అక్షతలు, శాలువా అందించి ఆశీర్వదించారు. మారుతీరావు తమ అత్మకథ ‘అమ్మ కడుపు చల్లగా’లో ఈ విషయం ప్రస్తావించారు.

విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి తిరుపతి సదస్సులలో పరిచయమయ్యారు. 2006లో సాధు సదస్సును తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల ఆస్థాన మండపంలో బృహత్కార్యంగా నిర్వహించింది. 60 మందికి పైగా స్వామీజీలు ఆసేతు శీతాచలం నుండి విచ్చేశారు. అందులో ఆరుగురి వసతి సౌకర్యాల భారం నాపై వుంచారు. కంచి పీఠం, దత్త పీఠం, శృంగేరీ పీఠం – ఇలా పీఠాధిపతులకు వసతి, ప్రత్యేక దర్శనాలు చూశాను. అప్పుడు వారు ప్రసన్నులయ్యారు. కాకినాడ శ్రీ పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద స్వామి పూర్వం మా నెల్లూరులో గడిపారు. గొలగమూడి వెంకయ్యను, వారి భక్తులు అల్లు భాస్కరరెడ్డిని గుర్తు చేసుకొంటున్నాను.

పుష్పగిరి పీఠాధిపతి:

1975-82 మధ్య కడపలో పని చేసినప్పుడు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ నృసింహభారతీ తీర్థస్వాములు ఆదరపూర్వకంగా మన్నించారు. విజయ్వాడ, హైదరాబాదు, ఢిల్లీలలో ప్రత్యేకించి వారి అన్ని ఉత్సవాలలో నేను పాల్గొన్నాను. మా కుమారులు ఇద్దరి వివాహాలకు – హైదరాబాదులో – విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. వారి చివరి రోజులలో వారి జీవితచరిత్ర రచన కుపక్రమించాను. ఐదారు సార్లు ఇంటర్వ్యూ చేశాను. అకస్మాత్తుగా పరమపదించారు. ఆ జీవనరేఖలను ‘దర్శనం’ పత్రికలో ధారావాహికంగా సంవత్సరం ప్రకటించాను.

కుర్తాళం జలపాత స్నానం:

నేను శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ విద్యార్థిని (1965-67). అప్పుడు పరిశోధక విద్యార్థి పి.వి. ప్రసాదరావు (ప్రసాదరాయ కులపతి). అప్పటి నుండి వారితో అనేక భువన విజయ సభలలో పాల్గొన్నాను. 1996లో ఇంద్ర సభలో ఇంద్రుని వేషధారి, గుంటూరు జిల్లా కలెక్టరు సి. ఉమామహేశ్వరరావు రాలేకపోవడంతో ఆపద్ధర్మంగా నాకు ఇంద్రపదవి దక్కింది. 2007లో అన్నమాచార్య పీఠం వారు కుర్తాళం మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సులో నేను పత్ర సమర్పణ చేశాను. అప్పుడు కుర్తాళం స్వామివారు మా దంపతులకు అమ్మవారి శేషవస్త్రం బహుకరించారు. జలపాత స్నానం గొప్ప విశేషం.

ఉత్తరదేశ స్వామీజీలు:

మేము ఋషీకేశ్ వెళ్ళినప్పుడు అక్కడ మేధానంద స్వామి ఆశ్రయం కల్పించి ఆశీర్వదించారు. అక్కడ ధ్యానం చేసిన ప్రజ్ఞారణ్యస్వామి మాకు కళాశాల అధ్యాపకులైన సి. పద్మనాభరావు. ద్వారకాధీశుని పార్లమెంటు సభ్యులతో దర్శించాను. అప్పుడు పూరీ, ద్వారకా శంకరాచార్యుల దర్శనం లభించింది. బొంబాయికి చెందిన భం భం బాబా, మౌంట్ ఆబూకు చెందిన మాతాజీలు, రామచంద్ర మిషన్ అధిపతి శ్రీ కమలేష్ పటేల్, శ్రీ శ్రీ రవిశంకర్‌ల ఆశీస్సులు అందుకొన్నాను.

వరల్డ్ టీచర్స్ ట్రస్టు అధిపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు, ప్రస్తుత అధిపతి కంభంపాటి పార్వతీ కుమార్ పరిచితులయ్యారు. శ్రీ శివానందముర్తి గారు తమ ట్రస్టు పక్షాన 25 వేల రూపాయలతో శ్రీరామ నవమి పురస్కారం నాకు అందించారు. వారికి నేను వ్రాసిన ‘దాంపత్య జీవన సౌరభం’ అంకితమిచ్చాను. వరంగల్‌లో జరిగిన వారి సన్మానానికి నేను ఢిల్లీ నుండి ప్రత్యేకంగా విచ్చేశాను.

శుక బ్రహ్మాశ్రమం:

శుక బ్రహ్మాశ్రమము, ఏర్పేడు వ్యాసాశ్రమము సన్నిహితము. 2009లో ఏర్పేడు స్వాముల వారిని కలిశాను. వయో వృద్ధులు – తర్వాత కొంతకాలానికి గతించారు. శ్రీ విద్యా ప్రకాశానంద గారి కడప రికార్డింగు, మా యింట ఆతిథ్యం పూర్వం మనవి చేశాను. ప్రస్తుత పీఠాధిపతి విద్యాస్వరూపానంద గిరి బాగా ఆప్యాయంగా పలకరిస్తారు. 2018లో వారి నేత్రాలయం సందర్శించి మా మాతృమూర్తి పేర 50 వేల విరాళం పంపగలిగాను.

ఈ విధంగా పలువురు సాధు సంతుల పాదస్పర్శ, పదస్పర్శ పురాకృత సుకృతం కాక మరేమి?

శుభం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here