జ్ఞాపకాలు – వ్యాపకాలు – 27

2
9

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

R.T.P. ఎవరన్న స్టేషన్ డైరక్టరు:

[dropcap]వి[/dropcap]జయవాడ ఆకాశవాణి కేంద్రంలో 1978-80 మధ్య రెండేళ్ళు బదిలీ మీద వెళ్ళి పని చేశాను. పున్నమ్మ తోటలో పాత స్టూడియోలు, పక్కనే పాత ఆఫీసు భవనం వుండేవి. ఒక పెద్ద మర్రి చెట్టు స్టూడియో పక్కన వూడలు దిగి వుంటే, చుట్టూ సిమెంట్ అరుగు నెర్రులు పోసి వుండేది. దాని మీద కూచొని డ్రామా ఆర్టిస్టులు గంటల తరబడి రిహార్సల్సు చేసేవారు. డి. రామమోహనరావు, నండూరి సుబ్బారావు వారి చేత కొత్త నాటకాలు రూపొందించేవారు.

ఆఫీసులో నా పక్కనే ప్రముఖ సంగీత విద్వాంసులు వోలేటి వెంకటేశ్వర్లు సీటు. ఆయన రోజూ 11 గంటల ప్రాంతంలో రిక్షా ఎక్కి ఆఫీసుకు వచ్చేవారు. నాకంటే వయస్సులో 20 ఏళ్ళు పెద్ద. అప్పుడు నా వయస్సు 31. వారికి 60 ఏళ్ళూ. ఎంతో ఆదరంగా నాతో ముచ్చటించేవారు. ఒక రోజు సరదగా ఒక విషయం ప్రస్తావించారు.

ఆకాశవాణిలో కర్నాటక సంగీతంలో ‘రాగం తానం పల్లవి’ అనే కార్యక్రమం ప్రసారమవుతోంది. దానిని రికార్డులలో R.T.P. అని వ్రాస్తారు. అది స్టేషన్ డైరక్టర్‌ ఆమోదానికి పంపుతారు. అది నెలకొకసారి ప్రసారం. అప్పటి ఔత్తరాహుడైన డైరక్టర్ ఆమోదానికి పంపారు. మూడు నెలలకు లోపు ఏ ఆర్టిస్టును మళ్ళీ పిలవకూడదని నియమం. ఈ R.T.P. ఒక వ్యక్తి అని భావించిన డైరక్టర్ రెడ్ ఇంక్‌తో, “Close Booking. Please Substitute” అని వ్రాసి పంపారట! ఎంతగానో నవ్వుకొన్నాం.

అప్పట్లో విజయవాడ ఆకాశవాణి నిలయ విద్వాంసులు దిగ్దంతులుండేవారు. వారి సరసన నేనూ పని చేశాను. నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, జగన్నాథాచార్యులు, అన్నవరపు రామస్వామి, దండమూడి రామ్‌మోహనరావు, సుందరపల్లి సూర్యనారాయణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం, సంధ్యావందనం శ్రీనివాసరావు, ప్రపంచం సీతారాం, మల్లిక్, మల్లాది సూరిబాబు, బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి, ఎల్లా వెంకటేశ్వరరావు, వింజమూరి లక్ష్మి ప్రభృతులుండేవారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1965 ప్రాంతంలో రెండేళ్ళు ప్రొడ్యూసర్‍గా వ్యవహరించారు.

ఆ తరువాత తరంలో విజయవాడ కేంద్రానికి కొత్త రక్తం వచ్చింది. మృదంగం లక్ష్మీనారాయణ రాజు, భవాని, మోదుమూడి సుధాకర్, సద్గురు చరణ్, డి.మోహనకృష్ణ, ప్రియంవద ప్రభృతులు సంగీతఝరికి ప్రాణం పోశారు. అందులో మల్లాది సోదరులులో ఒకరిని నేను ఎంపిక చేశాను (1996). కడపలో వుండగా 1994లో  మ్యూజిక్ కంపోజర్‌గా మోదుమూడి సుధాకర్‌ను సెలెక్ట్ చేశాను. తర్వాత అతడు బదిలీపై విజయవాడ చేరాడు. కడపలో మృదంగ విద్వాంసుడు జయభాస్కర్‍ను ఎంపిక చేశాను.

స్టేషన్ డైరక్టర్లంటే నాకు భయమన్న బాలమురళి:

1996 డిసెంబరు 1న ఆకాశవాణి విజయవాడ కేంద్రం 48వ వార్షికోత్సవం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆహుతుల సమక్షంలో ఏర్పాటు చేశాం. ఏవో అభిప్రాయ భేదాల వల్ల బాలమురళి “ఆంధ్రదేశంలో నేను కచేరీలు చేయను” అని శపథం చేశారు. అప్పటికి ఐదారు సంవత్సారాలైంది. నేనంటే గౌరవం. వార్షికోత్సవానికి కచేరీకి ఆహ్వానించాను ఫోన్లో. రెండు మూడు సార్లు ఫోన్ చేయగా, చివరకు సమ్మతించారు. “మృదంగ సహకారం ‘ఎల్లా’ను వుంచమంటారా?” అన్నాను. “ఎప్పుడూ అతనే అంటే ‘ఎల్లా’?” అని చమత్కరించి లక్ష్మీనారాయణరాజు (స్టాఫ్‌)ని కోరారు.

తుమ్మలపల్లి కళాక్షేత్రం బాలమురళి కచేరి ఆస్వాదించడానికి నిండిపోయి నడవలలోను, స్టేజి మీద జనం కూర్చోవలసి వచ్చింది. సభ ప్రారంభంలో నా స్వాగత వచనాలు కాగానే  బాలమురళి కచేరీ. చివరగా ఆయన స్పందిస్తూ “నేను విజయవాడ ఆకాశవాణిలో పని చేశాను. అప్పటికీ, ఇప్పటికీ స్టేషన్ డైరక్టరు అంటే భయం. అందుకే పద్మనాభరావు కోరగానే కచేరీకి అంగీకరించాను” అని చమత్కరించారు.

ప్రముఖ సంగీత కళాకారులు:

నేను ఆంధ్రదేశంలో కడప, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో పని చేసిన సందర్భాలలో పలువురు గాయకులతో సన్నిహిత పరిచయాలు కలిగాయి. కడప కేంద్రానికి తిరుపతి సంగీత కళాశాల ఆచార్యులంతా రికార్డింగుకి విచ్చేశారు. నూకల చిన్నసత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, డి. పశుపతి, పుదుక్కోటై సోదరులు, వి.యల్. జానకిరాం, యం.యల్. వసంతకుమారి, ద్వారం లక్ష్మి ప్రభృతులు ప్రముఖులు. కర్నూలు నుండి వయోవృద్ధులు సంగీతమూర్తి డా. శ్రీపాద పినాకపాణి, వారి సతీమణి బాలాంబ కడపకు వచ్చిన రోజు పండుగ.

హైదరాబాదు సంగీత ప్రపంచం:

నేను 1982-87 మధ్య హైదరాబాదులో స్టూడియోకి విచ్చేసిన పలువురు సంగీత విద్వాంసుల పరిచయాలు పెంచుకొన్నాను. పూర్వకాలంలో ఆకాశవాణిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‍గా వింజమూరి వరదరాజయ్యంగార్ పనిచేశారు. వారి కుమారులు వి. గోవింద రాజన్ సింగరేణి కాలరీస్ యం.డి.గా వుండగా నేను కొత్తగూడెం డైరక్టరు. హైదరాబాదులో మంచాళ జగన్నాథరావు, పాలగుమ్మి విశ్వనాధం, వింజమూరి సీతాదేవి, యన్. యన్. శ్రీనివాసన్ ఆ తరం ప్రముఖులు. శ్రీనివాసన్ హాస్య చతురులు. ఆకాశవాణి వార్షిక పోటీలకు సంగీత ప్రధాన రూపకాలు తయారు చేశారు.

స్టేషన్ డైరక్టర్‌గా పని చేసిన యస్. రాజారాం ప్రముఖ సంగీత కుటుంబం నుంచి – మైసూర్ వాసుదేవాచార్ – వచ్చారు. వారి వద్ద నేను పని చేశాను. రిటైరైన తర్వాత మదరాసులోని కళాక్షేత్ర డైరక్టర్‍గా ఆమరణాంతరం వ్యవహరించారు.

“ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ వస్తే కాదనవద్దు”:

రాజారాం గారికి నేనంటే బాగా అభిమానం. ఆయన ఇలా సలహా ఇచ్చారు “పద్మనాభరావు గారూ! మీకు ఇంకా 20 ఏళ్ళకి పైగా సర్వీసు వుంది. ఉజ్జ్వల భవిష్యత్తు వుంది. చాలామంది ఆంధ్ర లోనే వుండి రిటైర్ కావాలని భావిస్తారు. కాని ఢిల్లీ ఆకాశవాణి డైరక్టరేట్‍లో పని చేసే అవకాశం వస్తే కాదనవద్దు” అని సలహా ఇచ్చారు. 1987 జనవరిలో నాకు ఢిల్లీ ట్రాన్స్‌ఫర్ వచ్చింది. వారి మాటలు గుర్తుకు వచ్చాయి. అంగీకరించి వెళ్ళాను. నా భవిష్యత్ ప్రయాణానికది దోహదం చేసింది.

సంగీత కళాకారుల కచేరీలు:

రాజశ్రయంతో పూర్వకాలంలో సంగీత విద్వాంసులు పోషణ లభించి కళను వృద్ధి చేశారు. ఆ తర్వాత ఆకాశవాణి ఆ భారాన్ని భుజస్కంధాలపైన వేసుకొంది. ‘రేడియో ఆర్టిస్ట్’ – అని వారు విజిటింగ్ కార్డులు, లెటర్ హెడ్‌లు వేసుకొంటారు. టాప్ గ్రేడ్ రావడం గజారోహణంతో సమానంగా భావిస్తారు. పలువురు విద్వాంసులకు టాప్ గ్రేడ్ రావడానికి నా దోహదము వుందని వినయంగా చెబుతున్నాను. ఆహుతుల సమక్షంలో కచేరీల సందర్భంగా పలువురితో మైత్రి లభించింది. అయ్యగారి శ్యామసుందర్ దంపతులు, బాంబే సిస్టర్స్, హైదరాబాద్ సిస్టర్స్, హైదరాబాద్ బ్రదర్స్, నాదస్వర విద్వాంసులు ఖాశిం సోదరులు, షేక్ చినమౌలానా ప్రభృతులు ప్రముఖులు.

అర్ధరాత్రి అవసరం కలిగిన మృదంగం:

2000 జనవరి 26న దేశ రిపబ్లిక్ దినోత్సవ స్వర్ణోత్సవాల సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలలో రాష్ట్రపతి ప్రసంగం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేశారు. 25 రాత్రి 11 గంటల సమయంలో సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఆర్. వి. వైద్యనాథయ్యర్ ఫోన్ చేశారు. తెల్లవారితో సభలో యస్.పి.బాలసుబ్రమణ్యం ‘వందేమాతరం’ ఆలపించాలి. ఆయన రాలేకపోయారు. సుధా రఘునాథనన్ రాత్రికి రాత్రి ఢిల్లీ పిలిపించారు. ఆమెకు సహకార వాద్యం మృదంగం కావాలి. ఉదయం 7 గంటలకు మృదంగ విద్వాంసుడు పార్లమెంటులో వుండాలి. ‘సహకరించండి!’ అని ఫోను.

నేను అప్పుడు ఢిల్లీ స్టేషన్ డైరక్టర్. అర్ధరాత్రి వేళ మా స్టాఫ్‌లో వున్న పి.జయభాస్కర్‌కు ఫోన్ చేశాను.

“సార్! నాకు రెండు రోజులుగా 102 డిగ్రీల జ్వరం. మన్నించండి” అన్నాడు భాస్కర్.

“భాస్కర్! ఎలానో గండం గట్టెక్కించాలి” అన్నాను.

తెల్లవారేసరైకి మరో మృదంగ కళాకారుడు పార్లమెంట్ హాల్‌లో ప్రత్యక్షమయ్యాడు.

ఢిల్లీ ఆకాశవాణి డైరక్టరేట్‌లో ఈమని శంకరశాస్త్రి ఒక వెలుగు వెలిగారు.  ఆకాశవాణి నిలయ విద్వాంసులుగా పండిట్ రవిశంకర్ కొద్ది కాలం పనిచేశారు. లోఢీ రోడ్ లో వారి ఇంటివద్ద కలిసినప్పుడు ఆయన తన సతీమణిని పరిచయం చేసి “She is from your Andhra” అని చమత్కరించారు.

సంతకించనివారు:

ఢిల్లీ ఆకాశవాణిలో హిందూస్థానీ, కర్నాటక సంగీత విభాగాలలో నలభై మంది ఉన్నారు. ‘పని చేస్తున్నార’ని ఉద్దేశపూర్వకంగానే వ్రాయలేదు. ఆఫీసుకు వారానికి ఒకసారి వచ్చి ఐదు రోజుల సంతకాలు చేసేసి వెళ్ళిపోతారు. బయట గిరాకీలు జాస్తి. ఆఫీసులో వారి గదికి నేనూ రోజూ వెళ్ళి “తప్పనిసరిగా ఆఫీసుకు రోజూ రావాలి” అని కట్టడి చేశాను. ‘ఘరానా’ పెద్దలకు ఉక్రోషం వచ్చింది. అదేదో అవమానంగా భావించారు. నెల రోజులలో సద్దు మణిగింది. ఎందరో మహనీయులు పని చేసిన ఆకాశవాణి అది. కటక్‌లో హరిప్రసాద్ చౌరాసియా, ఢిల్లీలో భజన్ సపూరి, హెచ్.సి. వర్మ, సుహాసినీ కొరాట్కర్, ఇందిరా జగదాచారి, పండిట్ శివకుమార్ శర్మ, శుభా ముద్గల్, సుమతీ మటాడ్కర్, దేలూ చౌధురి (ఢిల్లీలో ప్రముఖ హిందూస్థానీ విద్వాంసులు) ప్రభృతులు ఖ్యాతి తెచ్చారు. సంగీత సాహిత్యమయ ప్రపంచం ఆకాశవాణి. అందులో వారితో కలిసి పనిచేయడం పురాకృత సుకృతం.

గంగానదిని అమెరికా తెప్పించగలరా?

ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో షెహనాయ్ మాంత్రికుడు బిస్మిల్లా ఖాన్‌ను ఇంటర్వ్యూ చేశాము. కాశీలో వుంటారాయన. గంగాతీరాన ప్రతి రోజూ షెహనాయ్ వాయించడం ఆయనకలవాటు. ఒక అమెరికన్ విశ్వవిద్యాలయం వారు ఆయనకు ఆ దేశంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా నియామకం ఉత్తర్వులు పంపారు. “గంగానదిని అమెరికా తీసుకురాగలరా?” అని వినయంగా ప్రశ్నించి ఆ పదవిని త్యజించారు.

ఢిల్లీ స్టూడియోకి ఎందరో సంగీత ప్రముఖులు వచ్చారు. ఆశా భోస్లే, అనూప్ జలోటా, అనూరాధా పౌడ్వాల్, అంజద్ అలీఖాన్, పండిట్ జస్‌రాజ్, హరిప్రసాద్ చౌరాసినా, సుమిత్రా గుహ, అదొక సంగీత తిరునాళ్ళ. ప్రముఖులు వచ్చినప్పుడు నేను డైరక్టరుగా స్టూడియోకి వెళ్ళి వారిని సాదరంగా పలకరించేవాడిని.

నృత్య కళాకారిణులు:

సంగీత నృత్య ప్రధానంగా దూరదర్శన్ ప్రసారాలు చేస్తుంది. 2001-05 మధ్య దూరదర్శన్‍లో వుండగా పలువురి నృత్య ప్రదర్శనలు ఏర్పరచాం. ఆంధ్రుల కీర్తి కిరీటాలు యామినీ కృష్ణమూర్తి, రాజారెడ్డి రాధారెడ్డి దంపతులు, స్వప్న సుందరి, శోవనా నారయణ్ కథక్ డాన్సర్లు, పద్మా సుబ్రమణ్యం ప్రముఖులు.

హైదరాబాదులో నటరాజ రామకృష్ణ, కళాకృష్ణ, ఆలేఖ్య, ఉమారామారావు, మద్దాళి ఉషా గాయత్రి, నృత్యంలో ప్రముఖులు.

వినమ్రంగా నమస్కరించిన యం.యస్. సుబ్బలక్ష్మి:

1992 నవంబరులో పుట్టపర్తిలో సత్యసాయిబాబా జన్మదినోత్సవాలకు మదరాసు తెలుగు అకాడమీ యూనిట్ కాన్సర్టులకు యం.యస్. సుబ్బలక్ష్మి విచ్చేశారు. వారిని విడిది గదిలో కలిసి ‘ఆకాశవాణి’ నుండి అనగానే ఆమె కుర్చీలోంచి లేచి వినమ్రంగా శిరసు వంచి నాకు నమస్కరించారు. అది ఆకాశవాణి కళామతల్లికి చేసిన నమస్కారంగా భావిస్తాను.

అలా ఎందరో సంగీత విద్వన్మణుల పరిచయ సుగంధ పరిమళాలు నాకు లభించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here