జ్ఞాపకాలు – వ్యాపకాలు – 30

1
5

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

హడావిడి జీవితం:

[dropcap]1[/dropcap]995 మార్చి 9 న కడప నుండి బదిలీ మీద విజయవాడలో చేరాను. 1978 నవంబరు నుండి 1980 జూన్ వరకు అక్కడ ప్రొడ్యూసర్‌గా పని చేసి ఉన్నాను. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ ఆకాశవాణి కేంద్ర నిర్దేశకత్వ బాధ్యతలు స్వీకరించాను. రజని వంటి దిగ్దంతులు పని చేసి మార్గనిర్దేశం చేసిన సాంస్కృతిక కేంద్రమది. ఆంధ్రుల సాహిత్య రాజధానియైన విజయవాడలో ప్రసారమాధ్యమాలు విరివిగా వున్న సమయంలో నేనక్కడ ప్రవేశించాను. నా సహచర బృందం కష్టింఛి ఇష్టపడి పని చేసేవారు. టీమ్ వర్క్‌గా పనిచేశాము. ప్రయాగ వేదవతి, దంటు పద్మావతి, మంజులూరి కృష్ణకుమారి, మంత్రవాది మహేశ్వర్ దంపతులు, వై. హనుమంతరావు తదితర బృందం నా ప్రణాళికలకు అండదండలుగా నిలిచారు. 1997 అక్టోబరు 9 న ఢిల్లీకి బదిలీ మీద వెళ్ళేంతవరకు రెండేళ్ళకు పైగా నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఆకాశవాణి శోభిల్లింది. 30 ఏళ్ళ ఆకాశవాణి జీవితంలో ఆ రెండేళ్ళు హడావిడిగా పరుగులు తీశాయి.

“రైల్వే రిటైరింగ్ రూంలో సంచి పెట్టండి”:

రెండ్రోజులకొక ప్రయాణం వుండేది. రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి మర్నాడు సాయంకాలం ఆఫీసు కాగానే మరో వూరి సభకు వెళ్ళేవాడిని. ఒకరోజు చమత్కారంగా మా ఆవిడ అంది – “రైల్వే క్లోక్ రూంలో సంచి పెట్టి మర్నాడు మరో ఊరికి వెళ్ళే ఏర్పాటు చేసుకొంటే హాయిగా వుంటుంది కదండీ!” అని. నిజమే. అనేకానేక నగరాలకు వెళ్ళవలసి వచ్చింది. అరకు, అన్నవరం, ధవళేశ్వరం, వేదాద్రి, పుష్పగిరి, తిరుమల, అంతర్వేది, పాలకొల్లు, గుడివాడ, సింహాచలం, కూచిపూడి, మచిలీపట్టణం, బాపట్ల, గుంటూరు, తణుకు, ఏలూరు, హైదరబాదు, తాడేపల్లి గూడెం, భీమవరం, అవనిగడ్డ, ఖమ్మం, నందిగామ – ఇలా వివిధ సాంస్కృతిక, సాహిత్య సమావేశాలకు ముఖ్య అతిథిగా వెళ్ళి ప్రసంగించాను. సన్మానాలు, సత్కారాలు అందుకొన్నాను. కళాశాలల వార్షికోత్సవాల విషయానికి వస్తే – ఉదాహరణగా కొన్ని ప్రస్తావిస్తాను.

స్థానిక మేరీ స్టెల్లా కళాశాల, మాంటిసోరి కళాశాల, లయోలా కళాశాల, సిద్ధార్థ కళాశాల, సయ్యద్ అప్పలస్వామి కళాశాల, శాతవాహన కళాశాలలకు వెళ్ళాను. బయట ఊర్లలో నూజివీడు పి.జి. సెంటర్ (ఎం.ఆర్. అప్పారావు గారి ఆహ్వానం), గుంటూరు జె.కె.సి. కళాశాల, విజ్ఞాన్ విద్యా సంస్థలు, చిలుమూరు జాతీయ కళాశాల, ఖమ్మంలో భారతీయ విద్యాభవన్ జర్నలిజం క్లాసులు, భీమవరం పి.జి.సెంటరు ప్రముఖాలు.

కంకిపాడులో అవార్డు, అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారం విశేషం.

నిత్యోత్సవం – పక్షోత్సవం:

తిరుమల శ్రీనివాసునికి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆ రెండేళ్ళలో నేను విజయవాడ కేంద్రానికి చైతన్యస్ఫూర్తిని కలిగించాను. 1995 జూన్‍లో బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆకాశవాణి పాడిపంటలు కార్యక్రమాల 30వ వార్షికోత్సవం వైభవంగా జరిపాము. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కోటగిరి విద్యాధరరావు, స్థానిక పార్లమెంటు సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (మాజీ కేంద్రమంత్రి) సభలో మాట్లాడారు. సభానంతరం కొద్ది సేపటికి ప్రముఖ పార్లమెంటేరియన్ ఆచార్య ఎన్.జి.రంగా పరమపదించారని తెలిసింది. విజయవాడకు తిరిగి వెళుతూ ఆ మర్నాడు ఉదయం పొన్నూరులో వారి పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి ప్రముఖుల సంతాప సందేశాలను అక్కడే రికార్డు చేసి ఆ సాయంకాలం ప్రసారం చేశాము.

కంచు కంఠం జగ్గయ్య బాధపడ్డ క్షణం:

1995 డిసెంబరు 1న విజయవాడ కేంద్ర వార్షికోత్సవం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశాము. 1948 డిసెంబరు 1న విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. కొంగర జగ్గయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించాను. ఆయన 1947 ప్రాంతాలలో ఢిల్లీ వార్తలు చదివిన ప్రముఖులు. సభ దిగ్విజయంగా జరిగింది. వేదిక దిగి రాగానే ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బిరామిరెడ్డిని ఒంగోలులోని ఆయన స్వగృహంలో నక్సలైట్లు చంపివేశారనే వార్త తెలిసింది. కార్లో గెస్ట్ హౌస్‌కి వెళుతుండగా ఆ వార్త చెప్పాను. జగ్గయ్య నివ్వెరపోయారు. ‘ఒంగోలు పార్లమెంటుకు నేను ఒకప్పుడు ఎన్నికయ్యాను’ అంటూ సౌమ్యుడైన మాగుంట మరణం విచారకరమని బాధపడ్డారు.

మరో కీర్తన పాడండని కోరిన ప్రేక్షకులు:

డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ విజయవాడ ఆకాశవాణిలో పనిచేశారు. సంగీత నాటక అకాడమీని యన్.టి.ఆర్. రద్దు చేశారనే కోపంతో బాలమురళి ఆంధ్రదేశంలో కచేరీలు చేయబోనని శపథం చేశారు. 1997 మార్చిలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలమురళి సంగీత కచేరీ ఏర్పాటు చేశాం. నా అభ్యర్థనను మన్నించి తమ మాటను వెనక్కు తీసుకుని అంగీకరించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం కిటకిటలాడింది. నడవలలో జనం కింద కూచొన్నారు. మరో పది నిమిషాల్లో స్టేజి మీదకి సర్దుకుంటూ వచ్చి జనం కూచొన్నారు.

కచేరీ ఏర్పాట్లకు ముందు “‘మృదంగ సహకారానికి’ ఎల్లా వెంకటేశ్వరరావు గారిని పిలుద్దామా?” అన్నాను ఫోన్‌లో. “ఎప్పుడూ అతనే అంటే ఎల్లా?” అని చమత్కరించారు. మా మృదంగ నిలయ విద్వాంసుడు లక్ష్మీనారాయణ రాజును ఎంపిక చేసుకొన్నారు. వయొలిన్ పై అన్నవరపు రామస్వామి సహకరించారు. సరిగ్గా ఎనిమిదింటికి కచేరీ పూర్తి అయింది. ప్రేక్షకులు గుంపుగా లేచి “మరో కీర్తన పాడండి సార్!” అన్నారు. వారి తరఫున నేనూ అభ్యర్థించాను. వారు అన్నారు గదా! – “మరో కాంట్రాక్టు యిస్తే వచ్చే వారం వచ్చి పాడుతా”నని చమత్కరించారు సరదాగా.

ప్రముఖులతో సందడి:

విజయవాడ కేంద్రంలో కార్యక్రమ నిర్వహణాధికారిగా అప్పట్లో పనిచేసిన డా. దంటు పద్మావతి ఒకసారి ఒక సభలో ఇలా అన్నారు:

“పద్మనాభరావు సార్ తెల్లవారి మార్నింగ్ వాక్‌లో రహదారి బంగ్లాకు వెళ్ళి ఎవరో ఒక ప్రముఖుణ్ణి కలిసి 11 గంటల కల్లా స్టూడియోకు రప్పించేవారు. ఆ రికార్డింగు పూర్తి అయి బయటకు రాగానే వారి చెక్ సిద్ధంగా వుండేది. వారికి వీడ్కోలు చెప్పిన 10 నిముషాల్లో మరో రంగానికి చెందిన వ్యక్తికి స్వాగతం పలికేవాళ్ళం. ప్రసంగశాఖను చూసే నాకు ఎంతో సందడిగా ఉండేది. సినీరంగానికి చెందిన దాసరి నారాయణరావు, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, జగ్గయ్య, భానుమతి, జంధ్యాల, కోట శ్రీనివాసరావు సోదరులు, పి. సుశీల… ఇలా అదో సినీ జగత్. రాజకీయ ప్రముఖులలో కె. రోశయ్య, బోళ్ళ బుల్లిరామయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సముద్రాల వేణుగోపాలాచారి, గవర్నర్ వి.యస్.రమాదేవి ప్రభృతులతో పరిచయ కార్యక్రమాలు. నృత్య సంగీత కళాకారులు సరే సరి. అధికార ప్రముఖులలో జస్టిస్ యం. జగన్నాథరావు, డా. కె.వి.రమణాచారి తదితరులతో స్టూడియో కోలాహలంగా ఉండేది. మాకు చేతినిండా పని. స్వామీజీల పరంపర గుర్తుకువస్తే కుర్తాళం పీఠాధిపతి, శృంగేరి శంకరాచార్య, కంచి పీఠాధిపతి, గణపతి సచ్చిదానంద స్వామీజీ, సుందర చైతన్య, మాతా శివ చైతన్య, విశ్వయోగి విశ్వంజీ, చిదానంద భారతీ స్వామి, చినజీయర్ స్వామి ప్రముఖులు. సాహితీలోకమంతా వచ్చేది. ఉగాది కవి సమ్మేళనాలు హైలైట్” – ఇలా సాగింది ప్రసంగం.

శతాధిక సభలు:

రెండేళ్ళలో వందకుపైగా సభలలో మాట్లాడాను. సిటీ కేబుల్ ప్రతినిధి, నేను తరచూ సాయంకాలాలలో తారసపడేవాళ్ళం. విజయవాడ నగర మేయర్ టి. వెంకటేశ్వరరావు ఒక సభలో ఇలా ప్రశంసించారు: “డైరక్టర్ పద్మనాభరావుగారు మంచి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. అన్ని సభలలోనూ ఆయనే” అని. జయంతులు, వర్ధంతులు డైరీ తిరగవేస్తుంటే కనిపించాయి. మల్లిక్ సంస్మరణ సభ, అన్నమాచార్య జయంతి, పారుపల్లి రామకృష్ణయ్య వర్ధంతి, విశాలాంధ్ర 44వ వార్షికోత్సవం, వార్త దినపత్రిక వార్షికోత్సవం, లాయర్ పత్రిక వార్షికోత్సవం (నెల్లూరు), ఘంటసాల జయంతి, వర్ధంతి, రామనామక్షేత్రం (గుంటూరు) వార్షికోత్సవం, గంగప్ప షష్టిపూర్తి, పర్వతాచార్యుల షష్టిపూర్తి (మార్కాపురం), అఖిల భారత జ్యోతిష శాస్త్రవేత్తల సదస్సు (గుంటూరు), హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహా సభలు, హైదరాబాదులో మాడుగుల నాగఫణిశర్మ మహా సహస్రావధానం, ఒంగోలులో మేడసాని మోహన్ చతుర్గుణిత అష్టావధానం, విశ్వనాథ సాహితీ పీఠ వసంతోత్సవం, గుంటూరులో నాగార్జున సాంస్కృతిక కేంద్రం ప్రసాదరావు ఆధ్వర్యంలో కున్నక్కుడి వైద్యనాథన్ అయ్యర్ కనకాభిషేకం, శోభానాయుడు కనకాభిషేకం, కూచిపూదిలో సిద్ధేంద్ర యోగి జయంతి, ఎన్.సి.వి. జగన్నాధాచార్య వర్ధంతి, వివేకానంద జయంతి, ప్రసాదరాయ కులపతి షష్టిపూర్తి (గుంటూరు), త్యాగరాజారాధనోత్సవాలు, భువన విజయం, త్రిభువన విజయం, కొర్రపాటి వర్ధంతి, గిడుగు జయంతి, నెల్లూరులో వేమన జయంతి, గుంటూరులో పద్య కవితా సదస్సు, ఒంగోలులో కవిత్రయ జయంతులు – డైరీ నిండా ఇవే!

నా జీవితంలో మైలు రాళ్ళు:

1995-97 మధ్య కాలంలో చిరస్మరణీయంగా గుర్తు వుంచుకొనే సందర్భాలు పేర్కొంటాను. 1995లో శ్రీశైల శివరాత్రి కళ్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానం, తిరుమలలో బ్రహ్మోత్సవాలకు దూరదర్శన్‍లో ప్రత్యక్ష వ్యాఖ్యానాలు, నాగార్జున విశ్వవిద్యాలయంలో అంతర్ విశ్వవిద్యాలయ సాంస్కృతికోత్సవాల ప్రారంభం, విజయవాడ పుస్తక ప్రదర్శనకు వచ్చిన కుష్వంత్ సింగ్‌తో ఇంటర్వ్యూ, నాగార్జున విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. విద్యార్థులైన సుహాసినీ పాండే, అడుసుమిల్లి శ్రీనివాసరావులకు పరీక్షాధికారిగా viva voce నిర్వహించడం గణనీయం.

శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం దర్శించి రికార్డింగులు చేసి ఛైర్మన్ కస్తూరి రంగన్‌తో కలిసి పాత్రికేయులతో ముచ్చటించడం (1996 అక్టోబరు) విశేషం. నెల్లూరులో కొమ్మిన సుబ్రమణ్యం నిర్వహించే సర్వోదయ కాన్వెంట్‌లో 1996 సెప్టెంబరులో బెజవాడ గోపాలరెడ్డిచే సన్మానం మధురానుభూతి. 1996 ఆగస్టు నెలలో జర్మనీలో జరిగిన ప్రపంచ దేశాల రేడియో డైరక్టర్ల నెల రోజుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొన్నాను. నెల్లూరులో వేమన జయంతి సన్మానం అందుకొన్నాను.

నేను వ్రాసిన మూడు గ్రంథాలు ఈ కాలంలో ఆవిష్కరించబడ్డాయి. ఒక రోజు Y’s Men International వారి సభలో “పుస్తకాలు వ్రాయడం సులభం, ప్రచురించడం కష్టం” అన్నాను. వెంటనే వణుకూరుకు చెందిన శ్రీ దీవి కోదండ రామాచార్యులు – లేచి “నేను ప్రింట్ చేయిస్తాను” అన్నారు. ప్రసార ప్రముఖులు ప్రచురించి బాలాంత్రపు రజనీకాంతరావుచే ఆవిష్కరింపజేశాను. భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు హైదరాబాదులో ఆవిష్కరించబడింది. నేషనల్ బుక్ ట్రస్ట్ వారి చెట్లు ప్రచురితమైంది.

వ్యక్తిగత జీవితం:

కుటుంబపరంగా ఈ రెండేళ్ళలో నా కుమారులు రమేష్ చంద్ర, జనార్దనలు బి.టెక్. పూర్తి చేసి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా చేరారు. మా అమ్మాయి శైలజకు 1997 ఆగస్టులో సమరం గారి ఆసుపత్రిలో రెండో కొడుకు వసంత్ జన్మించాడు. పిల్లలు స్థిరపడ్డారు గాబట్టి ఢిల్లీ బదిలీ ఆర్డర్లు వచ్చిన వెంటనే వెళ్ళి చేరిపోయాను. 1997 నుండి 2005 ఫిబ్రవరిలో రిటైరయ్యేంత వరకు ఢిల్లీలో కొనసాగాను. ఉద్యోగరీత్యా 1996 నవంబరులో సెలక్షన్ గ్రేడ్ డైరక్టర్ ప్రమోషన్ లభించింది.

అఖండమైన వీడ్కోలు సభ:

1997 అక్టోబరులో నేను ఢిల్లీ బదిలీ మీద వెళ్తున్నప్పుడు శ్రీజ సాంస్కృతిక సంస్థ వారు మనోరమ హోటల్‍లో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమీషనర్ డా. డి. టి. నాయక్ ప్రసంగిస్తూ, ‘నగరంలో ఇంత సౌహార్ద్ర పూర్వక వీడ్కోలు సభ తాను మునుపెన్నడూ ఒక అధికారి విషయంలో చూడలేద’న్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు నండూరి రామమోహనరావు నా సాహితీ సంపదను, అధికార సమన్వయాన్ని ప్రస్తుతించారు. ఆ మధుర స్మృతులతో కనకదుర్గ కాలి అందెలు ఘల్లుమనగా దేశ రాజధానికి 1997 అక్టోబరు 11న బయలుదేరాను. శుభం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here