జ్ఞాపకాలు – వ్యాపకాలు – 31

1
9

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/boxa]

ఢిల్లీ గద్దెపై మూడేళ్ళు (1997-2000):

[dropcap]ఊ[/dropcap]హించని రీతిలో జానపద కథలలో పూలమాలను ఏనుగు ఒక అదృష్టవంతుడి మెడలో వేసినట్టు 1997 అక్టోబరులో దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మక ఆకాశవాణి గద్దెపై కూచొనే అవకాశం వెతుక్కొంటూ వచ్చింది. హైదరాబాద్ కావాలని నేనడిగితే డైరక్టర్ జనరల్ కెజ్రివాల్ ఢిల్లీ రమ్మని స్వయంగా ఆహ్వానించారు. దేశంలోని వందకు పైగా వున్న ఆకాశవాణి కేంద్రాలు ఢిల్లీ ప్రసారాలు రిలే చేస్తాయి. ప్రధాని, రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధిపతులు ప్రసంగాలు రికార్డు చేస్తారు. ఒక్క రాష్ట్రపతి, ప్రధాని తప్ప, మిగిలిన వారు అందరూ పార్లమెంటు స్ట్రీట్ లోని బ్రాడ్‌కాస్టింగ్ హౌస్ స్టూడియోలకే వస్తారు. నేను పని చేసిన మూడేళ్ళ కాలంలో రెండుసార్లు సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల ప్రసారాలను వివిధ పార్టీ నాయకులు మా స్టూడియోకి వచ్చి రికార్డు చేశారు.

కేంద్రమంత్రులు, పుర్వప్రధానులు ఆ విధంగా రావడం, వారికి స్వాగతం పలకడం నా డ్యూటీ. అలా వచ్చిన ప్రముఖులలో ఐ.కె.గుజ్రాల్, దేవేగౌడ, యల్.కె.అద్వాని, ఉమాభారతి, సత్యనారాయణ జెటియా, ఉమాభారతి, షీలా దీక్షిత్, సాహెబ్ సింగ్ వర్మ, నితీష్ కుమార్, సుష్మాస్వరాజ్, ప్రమోద్ మహాజన్, రవి శంకర్ ప్రసాద్, అరుణ్ జైట్లీ, జార్జి పెర్నాండెజ్, కుమారమంగళం, మణి శంకరఅయ్యర్ వంటి  హేమాహేమీలున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో తేనీటి విందు:

రాష్ట్రపతి ప్రతి ఏటా ఆగస్టు 15, జనవరి 26న ‘ఎట్ హోం’ పేర వివిధ ప్రముఖులతో తేనేటి విందు కార్యక్రమంలో విశాలమైన మొఘల్ గార్డెన్స్ ప్రాంగణంలో పాల్గొంటారు. దాదాపు 200 మంది సతీ సమేతంగా హాజరవుతారు. ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం డైరక్టర్ హోదాలో నాకా అవకాశం నాలుగేళ్లు లభించింది. ఉపరాష్ట్రపతి, ప్రధాని, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, కేంద్రమంత్రులు, త్రివిధ దళాధిపతులు, అధికారులు పాల్గొనే ఆ తేనీటి విందులో అందరినీ ముఖాముఖీ కలిసే అవకాశం కలిగింది. ఒకసారి రష్యా ప్రధానికిచ్చిన విందులో రాష్ట్రపతి భవనంలో నేనూ ప్రత్యేకాహ్వానితుణ్ణి. నేను కె.ఆర్.నారాయణన్ గారిని మూడు దఫాలు రికార్డు చేశాను. ఆయన చాలా మర్యాదగా పలికేవారు. ఒకసారి 1998 ఆగస్టు 5న నారాయణన్ ఇంటర్వూ హిందూ సంపాదకులు యన్.రాం చేత రికార్డు చేయించాను. రాష్ట్రపతి కార్యదర్శి రాజ్ మోహన్ గాంధీ ఎంతో ఆదరంగా సూచనలు, సలహాలందించేవారు. రాష్ట్రపతి సంతకంతో నాకొక ప్రశంసా లేఖ కూడా పంపారు.

చెత్తకుండీలు తెచ్చి నా గది ముందు కుమ్మరించడం:

1998 జూన్‌లో పార్లమెంటులో ప్రసార భారతి బిల్లు ప్రవేశ పెట్టినపుడు అధికార హోదాలో నేను గ్యాలరీలో కూచొన్నాను. అదే నెలలో ఆకాశవాణికి సంబంధించిన అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు రెండు వారాలు సుదీర్ఘ సమ్మె చేశారు.  కేవలం సీనియర్ అధికారులం ప్రసారాలకు అంతరాయం కాకుండా చూశాము. ఒక రోజు నేను ఆఫీసు గదికి మెట్లు ఎక్కుతుండగా మెట్ల ముందు నాలుగైదు చెత్త కుండీల చెత్త కుప్పగా దొర్లిపోస్తూ, ప్యూన్లు, సఫాయి కర్మచారులతో సహ సమ్మె చేశారు. నిరసనగా ఆ పని చేపట్టారు.

ఒక రోజు రాత్రి ఇంజనీర్లు డ్యూటీ అయి వెళ్లిపోతూ రికార్డింగ్ కన్సోల్ పని చేయకుండా చేసి వెళ్లిపోయారు. పొద్దుటే ప్రసార ప్రారంభానికి వచ్చిన క్యాజువల్ అనౌన్సర్లు బిత్తరపోయి నాకు ఫోను చేశారు. 10 రోజులకు పైగా ప్రసారాలకు అంతరాయం కలగకుండా చూడటం ఉద్యోగులకు చిర్రెత్తించింది. హుటాహుటిన డైరక్టర్ జనరల్ సూర్యోదయానికి ముందే వచ్చారు. నన్ను పక్కకు పిలిచి- “మీరు కూడా ఈ సమ్మెను ప్రోత్సహిస్తున్నారా? నన్ను ట్రాన్సఫర్ చేయించండి” అన్నారు కోపంగా. ఆయనకు, అడిషనల్ డైరక్టర్ జనరల్‌కు పడేది కాదు. నేను ఆయన పక్షాన వత్తాసు పలుకుతున్నానని డి.జి. అనుమానం! ప్రసారాలు ఎట్టకేలకు అరగంట లోపలే ఆరంభమయ్యాయి.

వివిధ రాష్ట్రాలకు పర్యటన:

1997 డిసెంబరులో ఉత్తరాది రాష్ట్రాల డైరక్టర్ల కోఆర్డినేషన్ మీటింగు జైపూరులో నా అధ్యక్షతన జరిగింది. Group 16 సమవేశంగా దానిని పిలుస్తారు. 16 మంది డైరక్టర్ల సమావేశం. ఢిల్లీ నుండి డైరక్టర్ జనరల్, ఇంజనీర్-ఇన్-చీఫ్ తదితర ఉన్నతాధికారులు వచ్చారు. 1998 జనవరిలో నా సూచన మేరకు హైదరాబాదులో రిపబ్లిక్ దినోత్సవ సర్వభాషా కవి సమ్మేళనం హైదరాబాదు రవీంద్రభారతిలో ప్రేక్షక సమక్షంలో ఘనంగా నిర్వహించాము. ఢిల్లీలోని సమాచార శాఖవారి ఇంటర్‌మీడియా కోఆర్డినేషన్ సంఘానికి నేను అధ్యక్షుడిని. ఆ హోదాలో మీడియా అధికారులందరి సమావేశానికి నేను అగ్రాసనాధిపత్యం వహించి మూడేళ్లలో ముప్పయి దాకా సమావేశాలు జరిపాం. 1998 నవబరులో ఆకాశవాణి విజయవాడ కేంద్ర స్వర్ణోత్సవాలలో ప్రసార ప్రముఖుల గూర్చి ప్రసంగించి సన్మానం అందుకొన్నాను. మదరాసు తెలుగు అకాడమీ గౌరవ ఉపాధ్యక్షుని హోదాలో మదరాసులో జరిగిన ఉగాది ఉత్సవాలకు అక్కినేని నాగేశ్వరరావుతో బాటు నేనూ పాల్గొనడం విశేషం. రెండు దఫాలు తిరుమల బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యానానికి తిరుమల వెళ్లాను. దేవస్థానం వారు ప్రచురించిన ఆంధ్రమహాభారత విరాటపర్వ వ్యాఖ్యాన పరిష్కరణ సమావేశానికి తిరుపతి వెళ్లాను. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1999 ఫిబ్రవరిలో దామోదరం సంజీవయ్య స్మారకోపన్యాసం చేశాను. ఖజురహోలో ఉత్సవాలకు వెళ్లాను.

ముగ్గురు కేంద్ర మంత్రులు:

1997-2005 మధ్యకాలంలో ఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసారశాఖల మంత్రులు ఐదారుగురు మారారు. 1997 అక్టోబరులో యస్. జైపాల్ రెడ్డి వున్నారు. ఆ తరువాతి సంవత్సరాలలో సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ,  ప్రమోద్ మహాజన్, రవి శంకర్ ప్రసాద్‌లు మంత్రులుగా వ్యవహరించారు. అందరితో నాకు అధికార హోదాలో పరిచయం కలిగింది. జైపాల్ రెడ్డి 1997 నవంబరులో ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన గాంధీ రాక్ స్వర్ణోత్సవ సభకు విచ్చేశారు. ఉద్యోగులకు సన్మాన కార్యక్రమానికి ప్రమోద్ మహాజన్‌ను స్వాగతించి లిఫ్ట్‌లో వెళుతుండగా నేను తెలుగులో మాట్లాడితే ఆయన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడారు. తొలిరోజులలో ఆయన మాహబుబ్‌నగర్ వాసి.

మొరాయించిన నేను:

ఆరుణ్ జైట్లీ 2000 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవాలలో నేను వ్రాసిన ‘Indian Classics’  గ్రంథం ఆవిష్కరించారు. ఆకాశవాణి నుండి 2001 సెప్టెంబరులో ప్రమోషన్ మీద డిప్యూటీ డైరక్టర్ జనరల్‌గా నన్ను దూరదర్శన్ వేశారు. నేను వెళ్లనని కాగితం మీద వ్రాసి ఇచ్చాను. అప్పుడు మంత్రిగా వున్న సుష్మాస్వరాజ్ నన్ను తన ఆఫీసుకు ఆమె కార్యదర్శి అంశుమాన్ ద్వారా పిలిపించారు. నేను వెళ్లగానే ఆమె స్వాగతించి కూచోమన్నారు.

“I have tension Madam. Now I am worried about my pension madam” అన్నాను. ఆమె పగలబడి నవ్వారు. దూరదర్శన్‌లో నా ముందున్న అధికారులకు కొందరికి అవినీతి నెపంతో పెన్షన్ చాలా కాలానికి గాని రాలేదు.

“మీ కేవిధమైన భయం అక్కర్లేదు. మీరు ముక్కుకు సూటిగా వెళ్లే అధికారి అని కాశ్మీర్ ఛానల్ అధిపతిగా వేశాం. నిర్భయంగా పని చేయండి” అని తమ మద్దతు తెలిపారు. దూరదర్శన్‌లో అవినీతి నిర్మూలనకు ఉన్నతాధికారులకు సూచనలు రహస్యంగా ఇవ్వమని మంత్రి రవి శంకర్ ప్రసాద్ కోరారు. నేను మూడు, నాలుగు పాయింట్లు వ్రాసి యిచ్చాను. ఆ కాగితాలు వెలుతురు చూడలేదు.

బర్మింగ్ హ్యంలో రామనవమి వ్యాఖ్యనం:

బర్మింగ్ హ్యాం (యు.కె) లో శ్రీరామనవమికి ఏటా డా. జె. హారగోపాల్ ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆంధ్ర పండితులను ఆహ్వానిస్తారు. భద్రాచల రామనవమి కల్యాణాలకు నేను చేసిన వ్యాఖానాలు విన్న హరగోపాల్ 1999 ఏప్రిల్‌లో నన్ను బర్మింగ్ హ్యం ఆహ్వనించారు. మాంచెస్టర్‌లో 300 మంది తెలుగు కుటుంబాల వారు ఘనంగా రామ నవమి వేడుకలు జరిపారు. అందులో నేను శ్రీరామనవమి ప్రాశస్త్యం వ్యాఖ్యాన ప్రాయంగా చెప్పాను. లండన్ వెళ్లి బి.బి.సి కార్యాలయం చూడటం అదృష్టం. షేక్స్‌పియర్ జన్మించిన Stratford-on-Avon సందర్శించాను. రెండు వారాలు యు.కె.లో పర్యటించే అవకాశం అలా కలిగింది. హరగోపాల్ దంపతులు అతిథి సేవలో అగ్రగణ్యులు. 2000 సంవత్సరంలో బారతీయ విద్యాభవన్‌లో చదివి జ్యోతిషరత్న పరీక్షలు వ్రాసి డిప్లొమా పొందాను.

సభలు-సన్మానాలు:

ఢిల్లీలో రెండు దఫాలుగా పదేళ్లు పని చేశాను. అక్కడ మూడు, నాలుగు తెలుగు సంఘాలు ప్రముఖం. ఆంధ్రా అసోసియేషన్ డా.వి.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నడిచేది. ఆయన నన్ను బాగా అభిమానించేవారు. వివిధ సభలకు నేను అధ్యక్షత, లేదా ముఖ్య అతిధిగా వ్యవహరించాను. అలాగే ఇతర సంస్థల సభలకు నేను ప్రముఖుణ్ణి. గరికపాటి నరసింహరావు అవధాన సభ, సాయి కృష్ణయాచేంద్ర గేయ ధార, త్యాగరాజోత్సవాలు, వివిధ గ్రంథావిష్కరణలు, రాళ్లబండి కవితా ప్రసాద్ అవధానం, అన్నమాచార్య జయంతులు, శీలావీర్రాజు, బలివాడ కాంతారావుల సన్మానాలు, శంకరనారాయణ హాస్యావధానం, ప్రజ్ఞావధానం; పద్మనాభయ్యగారి ఇంట్లో శ్రీరామనవమి ప్రసంగాలు ప్రముఖాలు. 1999 ఆగస్టులో యన్.వి.యల్.నాగరాజు తమ ఢిల్లీ తెలుగు అకాడమీ పక్షాన నాకు సత్కారం చేశారు. అధికారికంగా సర్దార్ పటేల్ స్మారకోపన్యాసం చేసిన ఏ.పి.జె. అబ్దుల్ కలాం సరసన వేదిక పై నేను మాట్లాడాను. కరణ్ సింగ్ చేత రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ ఉపన్యాసం, జస్టిస్ జె.యస్.వర్మ చే ఉపన్యాసం ప్రధానాలు. వరంగల్‌లో కాళోజీ చేత ఆకాశవాణి డైరక్టరు ఆదిత్య ప్రసాద్ సన్మానం చేయించారు.

ప్రపంచ తెలుగు సమాఖ్యా గోష్ఠి సమన్వయకర్త:

1998 డిసెంబరులో ఢిల్లీలో మదరాసులోని ప్రపంచ తెలుగు సమాఖ్య వారు  ఐదు రోజుల సాహిత, సాంస్కృతిక గోష్ఠులు నిర్వహించారు. సాహిత్య సభలకు వక్తల ఎంపిక, సమావేశ గోష్ఠి విషయ నిర్ణయ బాధ్యతను ప్రముఖ సినీ నిర్మాత యు.విశ్వేశ్వరరావు నాపై పెట్టారు. యావద్భారతదేశం నుండి ప్రముఖ సాహితీవేత్తలను ఆహ్వనించి దిగ్విజయంగా సభలు నిర్వహించగలిగాను. ఆ గౌరవంతో 2004 డిసెంబరులో వారు బెంగుళూరులో నిర్వహించిన ప్రపంచ తెలుగు సమాఖ్య సభలలో నాకు అవార్డు నిచ్చి సత్కరించారు. ఈ కాలంలోనే నేషనల్ బుక్ ట్రస్ట్ వారి తెలుగు భాషా సలహా సంఘ సభ్యుడిగా మూడేళ్ల కాలవ్యవధికి నియమించారు. తొలి సమావేశం హైదరాబాదులో నిర్వహించారు. నెల్లూరులో టౌన్ హాల్‌లో అభినందన సభను సారస్వత సంఘాలు ఏర్పాటు చేశాయి. వివిధ రాయబార కార్యాలయాలు ఏటేటా జరిపే విందు కార్యక్రమాలకు నేను ప్రత్యేక ఆహ్వానితుణ్ణి. శోవనా నారాయణ్ భర్త ఆస్ట్రియన్ రాయబారి. మూడేళ్ళు, వారి రాయబార కార్యాలయానికి అతిథిగా వెళ్లాను. అలానే  ఫ్రెంచి, ఫోలెండ్, బల్లెరియా, వియత్నాం, బ్రెజిల్, పనామా దేశ కార్యాలయాలకు అతిథిని. ఆయా దేశాల స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆయా రాయబారులు ఆకాశవాణికి వచ్చి సందేశాలు రికార్డు చేస్తారు. అదొక సంప్రదాయం.

గ్రంథ రచన:

అధికార హోదాలో వ్యవహారాలు సభలు సమావేశాల మధ్య పరుగులిడుతూ విరామ సమయంలో గ్రంథరచనలు చేశాను. సాహిత్య అకాడమీకి ‘వాల్మీకి’ గ్రంథానువాదం, పబ్లికేషన్స్ డివిజన్ కోసం ‘Indian Classics’, నేషనల్ బుక్ ట్రస్ట్ వారికి ‘హీబ్రూ కథలు’, తెలుగు విశ్వవిద్యాలయం వారికి ‘ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు’ తదితరరాలు వ్రాశాను. యోజన ఆంగ్ల పత్రిక సంపాదకురాలు డా.జె.భాగ్యలక్ష్మి నా చేత నాలుగు ఆంగ్ల వ్యాసాలు వ్రాయించారు. అలా మూడేళ్ల పరిపాలనా కాలం ఉరుకులు పరుగులతో ముందుకు సాగింది. 2000 మార్చిలో బైపాస్ సర్జరీ ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేయించుకోవడం పర్యవసానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here