జ్ఞాపకాలు – వ్యాపకాలు – 32

0
5

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

రెండు చేతులకు రెండు స్వర్ణ కంకణాలు:

[dropcap]స[/dropcap]న్మానాలు, సత్కారాలు అదృష్టవశాత్తు అనుకోకుండా లభించాయి. 50 ఏళ్ళ సాహితీ స్వర్ణోత్సవాన్ని కిన్నెర రఘురామ్ రవీంద్రభారతి (హైదరాబాద్)లో డా. కె.వి. రమణాచారి, శ్రీ ఏ.పి.పి. నారాయణ శర్మల ఆధ్వర్యంలో 2018 జనవరిలో ఘనంగా జరిపారు. ఆ సందర్భంగా శర్మగారి పవిత్ర హస్తాలతో నాకు స్వర్ణ కంకణం అలంకరింపజేశారు. శర్మగారూ, రమణాచారి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారులుగా 2005 – 2009 మధ్య వ్యవహరించారు గాబట్టి అవి పవిత్ర హస్తాలే. 50 ఏళ్ళుగా నేను చేసిన సాహిత్య సేవకు తగిన గుర్తింపు.

2004లో నేను ఢిల్లీ దూరదర్శన్ అదనపు డైరక్టర్ జనరల్‌గా పని చేస్తున్న రోజుల్లో నెల్లూరు నుంచి బెజవాడ గోపాలరెడ్డి స్మారక అవార్డు కమిటీ కార్యదర్శి బి.వి.నరసింహం ఫోను చేశారు. ‘ఈ సంవత్సరం గోపాలరెడ్డి పేర ఏర్పాటు చేసిన అవార్డుకు మా కమిటీ ఏకగ్రీవంగా మిమ్ము ఎంపిక చేసింద’న్నారు. అది ప్రతిష్ఠాత్మకమైన అవార్డు. ఆనందం వేసింది. ఆ అవార్డు ప్రదానం సందర్భంగా నాకు స్వర్ణ కంకణం బహుకరించారు. సభలలో చాలామంది అవధానులు ఆ స్వర్ణ కంకణం కనిపించేలా చొక్కా చేతులు పైకి లాగుకొని కూచుంటారు.

రెండు స్వర్ణ పతకాలు:

సాహిత్య సేవకు రెండు స్వర్ణ కంకణాలు లభిస్తే, విద్యారంగ ప్రతిభకు మరో రెండు స్వర్ణ పతకాలు లభించాయి. 1967లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగులో సర్వ ప్రథముడిగా వచ్చి గోల్డ్ మెడల్‌తో పాటు ఎం. సుబ్బారావు అవార్డు గవర్నరు చేతుల మీదుగా అందుకున్నాను. 1986లో హైదరాబాదు భారతీయ విద్యాభవన్ సాయంకళాశాలలో డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ చేసి దేశవ్యాప్తంగా వున్న అన్ని భవన్స్ కేంద్రాలలో సర్వ ప్రథముడిగా నిలిచి స్వర్ణ, రజత పతకాలు అప్పటి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ. కె. భాస్కరన్ చేతుల మీదుగా అందుకొన్నాను.

శివానందమూర్తి అనుగ్రహం:

సద్గురు శివానందమూర్తి (భీమ్లీ) సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఏటా శ్రీరామనవమి సందర్భంగా కొందరు పండితులకు 25వేల రూపాయల నగదు పురస్కారం అందజేస్తారు. 2013లో ఈ పురస్కారం నాకు అందించారు. లోగడ నేను వ్రాసిన ‘దాంపత్య జీవన సౌరభం’ గ్రంథాన్ని నేను శివానందమూర్తి గారి కంకితం చేశాను. వారి పవిత్ర హస్తాలతో దానిని శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన జరిగిన సభలో – హైదరాబాదులో ఆవిష్కరించారు. అలానే కుర్తాళం పీఠాధిపతి పేర పురస్కారాన్ని గుంటూరులో 2019 ఫిబ్రవరిలో శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారి కరకమలాల మీదుగా అందుకొన్నాను.

సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం:

ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం నాకు 2000 సంవత్సరంలో లభించింది. సాహిత్య అకాడమీ వారి కోరిక మేరకు అమితావ్ ఘోష్ ఆంగ్ల రచన ‘Shadow Lines’ – ను నేను ‘ఛాయారేఖలు’ అనే పేర 1998లో అనువదించాను. అప్పటి తెలుగు విభాగం కన్వీనర్ ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ ఆ గ్రంథానికి పురస్కారం ప్రకటించింది. 2000 సంవత్సరంలో అకాడమీ అధ్యక్షులు డా. గోపీచంద్ నారంగ్ ఆ అవార్డును నాకు ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో అందించారు. ఆ విషయాన్ని అమితావ్ ఘోష్‍కు మెయిల్ ద్వారా తెలియజేశాను. వెంటనే ఆయన “Many thanks for your message. I am honoured to have such a distinguished translator” అని ప్రశంసావ్యాక్యాలు పలికారు. అవార్డును మించిన ఆనందం కలిగించింది.

పాచిమొహానికి అవార్డు:

1990లో నేను ఢిల్లీలో పని చేస్తున్నప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. ఇంద్రనాధ్ చౌధురి మా క్వార్టర్లకు సమీపంలో ఠాగూర్ పార్క్‌లో వుండేవారు. వారు నాకు ముల్క్‌రాజ్ ఆనంద్ ఆంగ్ల రచన ‘Morning Face’ అనువదించమని పురమాయించారు. ఆ శీర్షికకు సరియైన తెలుగు పదం ‘పాచిమొహం’. అలా చేస్తే ఎవ్వరూ దాని మొహం చూడరు. సంస్కృతంలోకి వెళ్ళి ‘ప్రభాత వదనం’ అని నామకరణం చేసి 500 పుటల నవలను అనువదించాను. తెలుగు విశ్వవిద్యాలయం వారు 1993లో ఆ గ్రంథానికి ఉత్తమ అనువాద పురస్కారం ఇచ్చారు. ఆచార్య పేర్వారం జగన్నాధం అప్పటి వైస్-ఛాన్స్‌లర్. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి ఆలపాటి ధర్మారావు అవార్డు ప్రదానం చేశారు.

ఉభయ అకాడమీల అవార్డులు:

దేశంలో ప్రసిద్ధి చెందిన రెండు సాంస్కృతిక సంస్థలు – ఢిల్లీ తెలుగు అకాడమీ, మదరాసు తెలుగు అకాడమీ నాకు అవార్డులు అందించాయి. యన్.వి.యల్ నాగరాజు ప్రధాన కార్యదర్శిగా గల ఢిల్లీ తెలుగు అకాడమీ 1999లో ఢిల్లీలో జరిగిన సభలో కేంద్రమంత్రి ద్వారా అవార్డు అందించింది. టి.వి.కె. శాస్త్రి ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతా ఉత్సవాలు నిర్వహించిన మదరాసు తెలుగు అకాడమీ 2000 సంవత్సరంలో మదరాసులో అవార్డుతో నన్ను సత్కరించింది. అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డు అందుకొన్నాను. 2002లో రాష్ట్రీయ ఏక్తా అవార్డును ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం హాలులో కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే చేతుల మీదుగా అందుకొన్నాను. ఆయన లోగడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా వ్యవహరించారు.

కంచి పరమాచార్య ఆస్థాన విద్వాంస పురస్కారం:

2009 దసరాలలో నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్.వి.భక్తి ఛానల్‌లో పని చేస్తుండగా కంచి పీఠం నుండి టి.వి. రాఘవాచారి నాకు ఫోన్ చేశారు. ఆ సంవత్సరం దసరా ఉత్సవాలలో శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీస్వామి ఆస్థాన విద్వాంసుడిగా నన్ను సన్మానిస్తారని చెప్పారు. మహదానందం కలిగింది. అంతటి విశేష గౌరవం లభించడం కంచి కామాక్షి అనుగ్రహంగా భావించాను. జయేంద్ర సరస్వతి వారి పవిత్ర హస్తాలతో పురస్కారం అందుకోవడం పురాకృత సుకృతం.

వివిధ కవుల పేరిట అవార్డుల పంట:

నా సాహితీ కృషికి గుర్తింపుగా భిన్న సందర్భాలలో పలు నగరాలలో పలు ప్రసిద్ధ సాహితీ సంస్థలు ఆయా కవుల పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాలు నా కందించాయి. ప్రథమంగా నెల్లూరులోని వర్ధమాన సమాజం వారు డా. బెజవాడ గోపాలరెడ్డిగారి అధ్యక్షతన కవిత్రయ అవార్డును 1991లో నాకందించారు. 43 ఏళ్ళ వయస్సులో అందుకొన్న చిన్నవాడిని నేనే. కవిత్రయ కవులపై ప్రసంగం ఒక గంట చేయాలి. నన్ను కందుకూరి రుద్రకవి మీద మాట్లాడమన్నారు.

నెల్లూరులో మోచర్ల రామకృష్ణయ్య స్మారకోపన్యాసంలో భాగంగా రామాయణంపై ప్రసంగించి 1994లో పురస్కారాన్ని దుగ్గిశెట్టి రమణయ్య ద్వారా స్వీకరించాను. 2018లో ఉడాలి సుబ్బరామశాస్త్రి శతజయంతి సందర్భంగా నెల్లూరులో వాల్మీకి జయంతి పురస్కారాన్ని ఉడాలి నరసింహశాస్త్రి నాకందించారు.

గుమ్మడి చేతుల మీదుగా అవార్డు:

2000 సంవత్సరం నాకు కలిసొచ్చిన సంవత్సరం. నాగభైరవ కళాపీఠం వారి అవార్డును హైదరాబాదులో త్యాగరాజ కళా మండపంలో సి. నారాయణ రెడ్డి అధ్యక్షతన నాగ భైరవ కోటేశ్వరరావు అవార్డు సభ నిర్వహించారు. ప్రముఖ సినీనటులు గుమ్మడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పురస్కారం లభించింది. ఆ సభలో మా నాన్నగారు, అమ్మ పాల్గొనడం దైవికం.

విజయవాడ కేంద్ర డైరక్టర్‌గా వున్న సందర్భంలో మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య పేరిట E.K. అవార్డును 1996లో ఉయ్యూరులోని E.K. ట్రస్టు వారు నాకు బహుకరించారు. కృష్ణమాచార్యుల వారు World Teachers Trust స్థాపకులు. వారు నిర్వహించిన హోమియో క్లాసులకు నేను 1980లో మూడు నెలల పాటు హాజరయ్యాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా వుంటూ ధార్మిక ప్రవచనాలు, గ్రంథాల ద్వారా వారు విశేష కృషి చేశారు. ఆయన ఋషితుల్యుడు.

అమెరికాలో విశిష్ట పురస్కారాలు:

2002, 2008 సంవత్సరాలలో చికాగోలోని అన్నమాచార్య ప్రాజెక్టు (SAPNA) నిర్వాహకురాలు డా. శారదాపూర్ణ శొంఠి అన్నమయ్య జయంతి సభలలో పురస్కృతులందించి నాచే ఉపన్యాసాలు చేయించారు. శ్రీరామ్ శొంఠి, శారదాపూర్ణ శొంఠి అన్నమయ్య కీర్తనా ప్రచారాలను ముప్ఫయి ఏళ్ళుగా నిర్వహిస్తూ, సంగీతజ్ఞులను, సాహితీవేత్తలను సత్కరిస్తున్నారు.

వంగూరి చిట్టెన్‌రాజు వంగూరి ఫౌండేషన్ ద్వారా 2002, 2008 లలో న్యూయార్క్ లోనూ, ఫ్రిమాంట్‌లోనూ సభలు నిర్వహించి నన్ను సత్కరించారు. నా ‘అవధాన పద్మసరోవర’ గ్రంథం ఫ్రిమాంట్‌లో 2008లో గొల్లపూడి మారుతీరావు ఆవిష్కరించారు.

కడప, అనంతరపురంలో సత్కారాలు:

నా సర్వీసులో రాయలసీమలో 10 ఏళ్ళు పని చేశాను. కడపలో దోమా వెంకటస్వామి గుప్తా ఫౌండేషన్ పక్షాన అవధానిగా నాకు 2005లో పురస్కారం పాలాది లక్ష్మీకాంతశెట్టి అందించారు. లక్ష్మీకాంతశెట్టి ఏటా ఇచ్చే అవార్డును నాకు 2009లో ముఖ్యమంత్రి కె. రోశయ్య చేతుల మీదుగా అందించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని కళాభారతి పక్షాన కార్యదర్శి హరనాధ్ ప్రసిద్ధ కవి సీరిపి ఆంజనేయులు అవార్డును బహుకరించారు. విజయవాడలోని జాషువా సాహితీ పీఠం వారు 1996లో జాషువా స్మారక అవార్డు అందించారు.

ఆదర్శ దంపతుల పురస్కారం:

వెదురుపాక గాడ్‌గా ప్రసిద్ధులైన విజయ దుర్గా పీఠాధిపతి 2018 జనవరిలో వారి జన్మదినోత్సవం సందర్భంగా మా దంపతులకు ఆదర్శ దంపతుల సన్మానం ఘనంగా నిర్వహించారు. ఆ సంవత్సరం పి.వి. మనోహరరావు దంపతులతో మేమూ ఆ గౌరవం పొందాము. పి.వి. నరసింహారావు అన్నగారాయన. అందుకే విశేషం.

ప్రపంచ తెలుగు మహాసభలలో అవధాన సత్కారం:

తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 25 మంది అవధానులను ఒకే వేదికపైకి చేర్చారు – అప్పటి సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. రాళ్ళబండి కవితాప్రసాద్. ఆ సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవధానిగా నేనూ సత్కృతి నందుకొన్నాను.

అవార్డులు అందుకోవడమే గాక 2001 నుంచి మా నాన్నగారి పేర అనంతలక్ష్మీకాంత సాహితీ పీఠం అధ్యక్షుడిగా నేను ఏటా కవి పండిత సత్కృతి చేస్తున్నాను. డా. రావూరి భరద్వాజ, డా. యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ధారా రామనాథ శాస్త్రి, పొన్నాల రామసుబ్బారెడ్డి, సి. ఆర్. విశ్వేశ్వరరావు, కె. శ్రీనివాస రావు ప్రభృతులు 20 మందికి నా చేతుల మీదుగా అవార్డులు అందించగలగడం అదృష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here