జ్ఞాపకాలు – వ్యాపకాలు – 33

1
7

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

విషాదాన్ని మిగిల్చిన 2000 సంవత్సరం:

[dropcap]2[/dropcap]0వ శతాబ్దికి వీడ్కోలు పలికే 2000 సంవత్సరం నాకు మా తండ్రిగారి మరణంతో విషాదాన్ని మిగిల్చింది. మా నాన్న 83 ఏళ్ళ వయస్సులో ఆరోగ్యంగా ఆయన పనులు ఆయన చూసుకుంటూ సుఖ జీవనం గడిపారు. నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాళెం దగ్గరలోని చెన్నూరు గ్రామంలో పది ఎకరాల పొలం స్వయంగా జీతగాళ్ళతో 60 ఏళ్ళు వ్యవసాయం కొనసాగించారు. ఉద్యోగ రీత్యా నేను కందుకూరు, కడప, విజయవాడ, హైదరాబాదు, ఢిల్లీలలో 1967 నుండి బదిలీలపై వెళ్లాను. 1999 చివరి వరకూ మా అమ్మా నాన్న చుట్టపుచూపుగా మా దగ్గరకు వచ్చి రెండు నెలలు అతి కష్టం మీద వుండి వెళ్ళిపోయేవారు. చివరి రోజుల్లో ఏడెనిమిది సంవత్సరాలు ఓపిక లేక పొలాలు కొన్ని అమ్మి, మిగతా కౌలు కిచ్చారు. పట్టణాలలో వాతావరణం ఆయనకు గిట్టక, స్వగ్రామంలో పదిమందికి తలలో నాలుకలా జీవించారు. నేను ఒక్కగా నొక్క కొడుకుని. వృద్ధిలోకి వచ్చి ఢిల్లీ ఆకాశవాణికి రాజైనానని మురిసిపోయేవారు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు నాకు లేరు. తృప్తిగా, ఆనందంగా, పుస్తక పఠనం చేస్తూ కాలక్షేపం చేశారు. 2000 సంవత్సరంలో నేను జస్టిస్ పి. కోదండరామయ్య, హైకోర్టు న్యాయమూర్తి సలహా మేరకు వాల్మీకి రామాయణం ఏడు కాండలను పునర్వసు నాడు మొదలుపెట్టి మళ్ళీ నెల పునర్వసుకు పూర్తి చేశాను. శ్రీరామచంద్రుడికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నాన్నగారికి చూపించాను. భక్తితో కళ్ళ కద్దుకున్నారు. ఆ సాయంకాలం 4 గంటల ప్రాంతంలో సడన్‌గా అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. 2000 ఆగస్టు 2న ఢిల్లీలోని రామమనోహర్ లోహియా హాస్పిటల్‌లో చేర్పించాము. స్కానింగ్ చేశారు. మర్నాడు వెంటిలేటర్ పై పెట్టారు. ఆగస్టు 5 శనివారం 1 గంటకు తుది శ్వాస విడిచారు.

యమునా నదీ సంగమంలో దహనం:

పండోరా రోడ్ క్వార్టర్స్‌లో వుండేవాడిని. అక్కడ ఓ మలయాళీ స్నేహితుడు దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఫోనులో పురోహితుని సంప్రదించాము. వెంకట్రామన్ అనే పండితుడు ఆ సాయంకాలం 4 గంటలకు వచ్చారు. ఆయన కేంద్ర న్యాయశాఖలో ప్రైవేట్ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు. చక్కని మంత్రోచ్చారణ గలవారు. ఇందిరాగాంధీ దహన సంస్కారాలు జరిపిన పండితుడు. గంగాయమునలు కలిసే ఒక ప్రదేశంలో శవానికి స్నానం చేయించి సూర్యాస్తమయ సమయంలో నాన్నగారి అంత్యక్రియలు పూర్తి చేశాను. రెండో రోజు అస్థి సంచయనం. మూడో రోజు కార్లో హరిద్వార్ వెళ్ళి గంగానదిలో అస్థి నిమజ్జనం చేశాము. ఆ వారమే మా స్వగ్రామానికి వెళ్ళి 9వ రోజు నుండి 12వ రోజు వరకు కర్మ క్రతువులు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిపాము.

ఆకస్మికంగా బైపాస్ సర్జరీ – 2000 మార్చి:

2000 సంవత్సరం మరో విషమ పరీక్ష తెచ్చిపెట్టింది. మార్చి 6న నేను సాధారణ చెకప్ కోసం రామ్‍మనోహర్ లోహియా హాస్పిటల్‍ కెళ్ళాను. ఇ.సి.జి. తీసిన డాక్టర్ యాంజియోగ్రామ్ అవసరమన్నాడు. 13న యాంజియోగ్రామ్ చేసి నా గుండెలో మూడు బ్లాకులు ఉన్నాయని నిర్ధారించాడు. రామకృష్ణన్ అనే డాక్టర్ వెంటనే ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో హృద్రోగ చికిత్సా నిపుణులు డా. వృద్ధికి ఫోను చేసి, నా పేరు, వివరాలు చెప్పారు. వెంటనే బైపాస్ సర్జరీ నిర్ణయించారు. మా పెద్దబ్బాయి (రమేష్ చంద్ర) విదేశాలకు వెళ్ళడానికి బొంబాయి కెళ్ళాడు. వెంటనే ఢిల్లీ వచ్చాడు. చిన్నవాడు జనార్దన బెంగుళూరు నుండి హుటాహుటిన వచ్చాడు. మార్చి 18న డా. వృద్ధి బైపాస్ సర్జరీ చేశారు. అపోలో ప్రతాపరెడ్డి గారి పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఢిల్లీ ఆకాశవాణి డైరక్టర్‍గా పని చేస్తున్న నేను రెండు నెలలు సెలవు పెట్టి మే 10న తిరిగి విధులకు హాజరయ్యాను. 20 ఏళ్ళు గడిచినా ఎటువంటి సమస్య గుండెకు సంబంధించి కలగక పోవడం అదృష్టం.

నేషనల్ ఛానల్‍కు బదిలీ:

గుండె ఆపరేషన్ తర్వాత పన్ ఒత్తిడి తగ్గించాలని మా డిప్యూటీ డైరక్టర్ జనరల్ గైక్వాడ్ నన్ను పిలిచి సలహా ఇచ్చారు “ఢిల్లీ కేంద్రంలో 24 x 7 పని ఒత్తిడి. కొద్ది నెలలు నేషనల్ ఛానల్ డైరక్టర్‍గా పని చేయండి!” అన్నారు. 2000 జూన్ 1న నా బాధ్యతలు పి.పి.సేధియాకు అప్పగించి నేను జవహర్‍లాల్ నెహ్రూ స్టేడియంలోని ఆఫీసు నేషనల్ ఛానెల్‍లో చేరాను. రిటైరవడానికి ముందు కనీసం మూడు నెలలైనా ఢిల్లీ స్టేషన్ పగ్గాలను పట్టుకోవాలని ఆయన కోరిక. అది నెరవేర్చుకొన్నాడు.

ఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో

నేషనల్ ఛానల్‍లో పని చేయడం గొప్ప అనుభూతి. 30 ఏళ్ళ క్రితం నాగపూర్‍లో 1000 కిలోవాట్ల ట్రాన్స్‌మిటర్ ఏర్పాటు చేసి యావద్భారతదేశానికి ప్రసారాలు వినిపించేలా ఆ ఛానల్ కల్పన చేశారు. గురురాజ్ అనే దాక్షిణాత్యుడు తొలి డైరక్టర్. అన్ని ప్రాంతాల అభిరుచుల కనుగుణంగా కార్యక్రమ రూపకల్పన చేశారు. రోజులు 18 గంటల ప్రసారం. దేశంలోని అన్ని సంస్కృతులకు అది దర్పణం పడుతుంది. అన్ని సంప్రదాయాల సమాహారం అది. ఆకళింపు జేసుకొని కొత్త కార్యక్రమాలు రూపొందించాము. నాకు ముందు సుక్‍జిందర్ కౌర్ అనే వనిత డైరక్టర్. వందమంది దాక సిబ్బంది. స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్రం. సంగీతానికీ, వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యం. సుశిక్షుతులైన సిబ్బంది కావడం వల్ల మంచి ప్రోగ్రాములు చేయగలిగాం. ఇంతలో మా డైరక్టర్ జనరల్ నాకు కబురు పెట్టి డైరక్టరేట్‍లో ప్రధాన నాడి అయిన పాలసీ విభాగం డైరక్టర్‍గా రమ్మని కోరారు. ఆదేశించవచ్చు కానీ, నా అంగీకారం అడిగారు. ఆ పదవిలో పనిచేయడం ప్రతిష్ఠాత్మకం కాబట్టి సరేనన్నాను.

లోక్‌సభ స్పీకర్ శ్రీ జి.యం.సి.బాలయోగిచే సత్కారం

ఊహించని పదవీ బాధ్యత:

ఆకాశవాణి డైరక్టర్ జనరల్ కార్యాలయంలో ‘పాలసీ’ డైరక్టర్ వెన్నెముక లాంటివాడు. ఏ.ఆర్.కృష్ణమూర్తి, కేశవ్ పాండే వంటి సవ్యసాచులు గొప్పగా పేరు తెచ్చుకొన్న పదవి. దేశవ్యాప్తంగా వున్న అన్ని కేంద్రాల కార్యక్రమాల రిలే వ్యవహారాలకు సంబంధించి దైనందిన చర్యగా ఆదేశాలు జారీ చేయాలి. పార్లమెంటు కార్యకలాపాలు, ప్రముఖుల సందేశాలు, విపత్తు నివారణ సందేశాలు రోజూ శాటిలైట్ ద్వారా ఆదేశాలు పంపాలి. డైరక్టర్ జనరల్‍కు ఢిల్లీ స్టేషన్ డైరక్టర్ ఒక కన్ను, మరో కన్ను ఈ పాలసీ డైరక్టర్. ఏ మాత్రం పొరపాటు జరిగినా రైలు పట్టాలు తప్పుతుంది. పార్లమెంటులోనూ, పత్రికల్లోనూ విమర్శలకు కేంద్ర సమాచార మంత్రి సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తుంది. 2000 సెప్టెంబరులో నేను అందులో చేరాను. 1984 అక్టోబరు 31న మధ్యాహ్న వేళ అప్పటి ప్రధాని ఇందిరాగాంధి హత్యకు గురయ్యారు. అప్పట్లో పాలసీ డైరక్టరు  హుటాహుటీన ఆఫీసుకు వెళ్ళకుండా (సెలవు రోజు) ఇంటి నుంచి ఫోన్లో ఆదేశాలు జారీ చేశాడు. ఆగ్రహించిన డైరక్టర్ జనరల్ ఆయనను ఆ పదవి నుండి తక్షణమే తొలగించారు. అది చరిత్ర!

ఫలించిన జ్యోతిషం:

ఢిల్లీలోని భారతీయ విద్యాభవన్‍లో నేను జ్యోతిషరత్న క్లాసులు శని, ఆదివారాలు 2000 సంవత్సరంలో క్రమంగా హాజరయ్యాను. తెలుగువారైన కె.యన్.రావు తదితరులు జ్యోతిష విభాగానికి సలహాదారులు. నాకు మార్చిలో బైపాస్ సర్జరీ అయింది. మేలో పరీక్షలు. అయినా పరీక్షలు వ్రాసి ప్యాసయ్యాను. అలా జ్యోతిషరత్న అయ్యాను. నేను లోగడ ఒక ఉన్నతాధికారికి జాతకం చూసి నాలుగు పేజీల భవిష్యత్తు వ్రాసి ఇచ్చాను. రాష్ట్రపతి ముద్ర గల constitutional post త్వరలో వస్తుందని స్పష్టంగా వ్రాసాను. ఐదారు నెలల వ్యవధిలో ఆయన భారతదేశ ఎన్నికల సంఘం సభ్యులయ్యారు. ఆయనే తెలుగు వారైన జి.వి.జి. కృష్ణమూర్తి. ఆరేళ్ళ పాటు ఆయన ఆ పదవిలో వున్నారు. నేను జోస్యం చెప్పినప్పుడు ఆయన న్యాయశాఖ కార్యదర్శి. 1990లో ఎలక్షన్ కమీషనర్ అయ్యారు. ఇప్పటికీ నా జోస్యం గూర్చి నలుగురికీ చెబుతారు. దైవకృప.

డా. బెజవాడ గోపాలరెడ్డి గారిచే సన్మానం

పనిచేసే గాడిదకు బరువులు జాస్తి:

బాగా పని చేస్తాడని పేరు రావడం కష్టం. అది నిలుపుకోవడం మరింత కష్టం. వచ్చిన తర్వాత ఇంకా కష్టం. అలా అయింది నా పని. పాలసీ విభాగానికి తోడు అదనంగా నాటక విభాగం, రూపక విభాగం, పబ్లిక్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ బరువులు (ముగ్గురు డైరక్టర్ల బరువు) నా భుజాల మీదకి ఎత్తారు. మరో పిట్ట కథ. అప్పట్లో మా డైరక్టర్ జనరల్‍కు, రెండో స్థానంలో వున్న అదనపు డైరక్టర్ జనరల్‍కు ఉప్పు – నిప్పు వ్యవహారం. ఇద్దరికీ మధ్య నేను నలిగిపోయాను. ఈయన ఔనంటే, ఆయన కాదంటాడు. ఫైలు మీద యుద్ధాలు. ‘నొప్పించక, తానొవ్వక, తప్పించుకు తిరుగువాడు ధన్యుడ’నిన నానుడి ననుసరించి వొళ్ళు కాపాడుకొన్నాను.

హోం సెక్రటరీ శ్రీ. కె. పద్మనాభయ్య దీపప్రజ్వలనం

లోక్‌సభ స్పీకర్ ఆవిష్కరించిన నా గ్రంథం:

2000 సంవత్సరం నవంబరు నెలలో రాష్ట్రావతరణ ఉత్సవాలు జరిగాయి. 1950 నుండి 2000 వరకు దేశ రాజధానిలో వివిధ రంగాలలో పని చేసిన ప్రముఖుల జీవిత సంగ్రహాలతో 250 పుటల గ్రంథం ఒకటి నేను వ్రాశాను. తెలుగు విశ్వవిద్యాలయం లోని అంతర్జాతీయ భాషా కేంద్రం పక్షాన దానిని ప్రచురించారు. నవంబరు ఉత్సవాలలో లోక్‍సభ స్పీకరు జి.యం.సి.బాలయోగి గారు ‘ఢిల్లీ ఆంధ్రా ప్రముఖులు’ అనే ఆ గ్రంథాన్ని ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రపతులు, ప్రధాని, కేంద్రమంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖులు దాదాపు 300 మంది జీవనరేఖలు అందులో పొందుపరిచాను. ఇప్పటికీ అది పరిశోధకులకు కరదీపిక.

మంత్రి శ్రీ సి. ఇబ్రహీం గారిచే ఆకాశావాణి వార్షిక పురస్కారం స్వీకరణ

21వ శతాబ్దిలో కొసమెరుపు:

2000 సంవత్సరాంతంలో నా ప్రమోషన్ విషయంలో నేను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో కేసు వేసి గెలిచాను. నాతో బాటు 12మంది ఒకే రోజు డిప్యూటీ డైరక్టర్ జనరల్‍గా పదవీ బాధ్యతలు 2001 ఆగస్టు 23న చేపట్టాము. నన్ను ఒక్కడినే ఆకాశవాణి నుండి దూరదర్శన్ ప్రమోషన్‍పై పంపారు. నేను ససేమిరా వెళ్ళనని సీ.ఈ.వో. బైజాల్ గారికి లిఖిత పూర్వకంగా వ్రాసి ఇచ్చాను. ఆకాశవాణి శివాలయం. దూరదర్శన్ విష్ణాలయం. చక్కరపొంగలి ప్రసాదాలు దొరుకుతాయి. ఆ గొడవ వద్దని భావించాను. సమాచార శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా మాట్లాడి నన్ను అంగీకరింపజేశారు. నా నిజాయితీ పట్ల విశ్వాసంతో క్లిష్టమైన కాశ్మీర్ ఛానల్ బాధ్యతలు నాకు అప్పగించారు. ఎంతో సానుకూలంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎవరికీ తల వొంచనవసరం లేదని హామీ ఇచ్చారు.

‘కూర్చుండ మా యింట కుర్చీలు లేవు’:

దూరదర్శన్‍కు వెళ్ళడానికి సిద్ధపడి వెళితే గదులు ఖాళీ లేవు. ‘మరో నెలలో కొందరు బదిలీ మీద వెళ్తారు, అప్పటి వరకు ఆకాశవాణిలోనే వుండ’మని బైజల్ సలహా ఇచ్చారు. 2001 సెప్టెంబరు 21న నేను, నా సహచర మిత్రుడు మండ్లోయా – ఇద్దరం దూరదర్శన్‍లో డిప్యూటీ డైరక్టర్ జనరల్‍గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఒక వారం పాటు ఒకే గదిలో ఎదురెదురుగా కూర్చున్నాము. నెమ్మదిగా మా గదులు విశాలంగా కేటాయించారు. పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కాశ్మీర్ ఛానల్ శ్రీనగర్‍లో ప్రారంభించారు. సంవత్సర కాలంగా కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ప్రైవేటు ప్రొడ్యూసర్ల పంట పండింది. వివరాలు తరువాయి భాగంలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here