[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
పంచాగ్నిమధ్యంలో:
[dropcap]దూ[/dropcap]రదర్శన్‌లో ఐదేళ్ళపాటు చేతివేళ్ళు కాలకుండా జీవించడం అదృష్టమనే చెప్పాలి. 2001 సెప్టెంబరు 21న ఢిల్లీ దూరదర్శన్ డైరక్టర్ జనరల్ కార్యాలయంలో – మండీ హవుస్ భవనంలో – ఐదో అంతస్తులో డిప్యూటీ డైరక్టర్ జనరల్‍గా (ఇప్పుడీ పోస్టును అడిషనల్ డైరక్టర్ జనరల్ అంటున్నారు) సి.ఈ.ఓ. అనిల్ బైజల్‌కి రిపోర్టు చేశాను. 25 ఏళ్ళు ఆకాశవాణిలో పని చేశాను. దూరదర్శన్ పద్ధతులు నాకు కొత్త. బలవంతపు బ్రాహ్మణార్థంగా ఇది తగిలించారు. అందునా కాశ్మీర్ ఛానెల్ వ్యవహారాలు పర్యవేక్షించడం.
నా సెక్షన్‌లో ఒక డైరక్టరు, ఒక డిప్యూటీ డైరక్టరు, ఇద్దరు అసిస్టెంట్ డైరక్టర్లు, సెక్షనాఫీసరు, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. పాక్ రేడియో, దూరదర్శన్‍లు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించడానికి శ్రీనగర్ దూరదర్శన్ కేంద్రం నుండి నిరంతరం కార్యక్రమాలు తయారు చేయించడం మా విధ్యుక్త ధర్మం. దానికిగా కాశ్మీరీ ప్రొడ్యూసర్లకు ఐదు ఎపిసోడ్లు తయారు చేయడానికి 30లక్షల దాకా దూరదర్శన్ ఇస్తుంది. కోట్ల రూపాయలు అలా పంచే కార్యక్రమానికి నేను సారధిని. ప్రొడ్యూసర్లు, నా క్రింది సిబ్బంది హేమాహేమీలు.
సి.బి.ఐ. పట్టుకున్న డైరక్టరు:
నా సెక్షన్‌లో పని చేస్తున్న డైరక్టరు అశోకా హోటల్లో ఒక ప్రొడ్యూసర్ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. జేబులో నిరోధ్ కూడా దొరికింది. దాదాపు మూడేళ్ళు సస్పెన్షన్‌లో వుండి బయటపడ్డాడు. కార్యక్రమాలు తయారుచేసే ప్రొడక్షన్ కంపెనీలు ఎంపిక చేయడానికి నా అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటయింది. అందులో హోం శాఖ ప్రతినిధి, రక్షణ శాఖ ప్రతినిధి, ముగ్గురు ప్రసిద్ధ వ్యక్తులు వున్నారు. కమిటీ ముందు రెండు వందలకు పైగా ప్రొడ్యూసర్లు తమ ప్రపోజల్స్ సమర్పించారు. నెలల తరబడి కసరత్తు చేసి అప్లికేషను సరి చూసి ప్రొడ్యూసర్లను మౌఖికంగా ఇంటర్వ్యూకి రోజుకు పదిమంది చొప్పున పిలిచాము. దూరదర్శన్‍కు గాని, మరే ప్రైవేటు ప్రసిద్ధ ఛానెల్‍కు గాని కనీసం మూడు సంవత్సరాల కాలంలో కార్యక్రమాలు వారివి ప్రసారమై వుండాలనేది నియమం. కాశ్మీరీ సాహిత్యం, సంస్కృతులకు సంబంధించిన ఇతివృత్తాలు ఎంచుకుని స్క్రిప్టు జమ చేయాలి. ఒక ముసాయిదా ఎపిసోడ్ చూపించాలి. దానిని కమిటీ ఆమోదించి ఒక్కొక్క ఎపిసోడ్‌కు మూడు నుంచి ఆరు లక్షల వరకూ ధనం మంజూరు చేస్తుంది. మూడు నెలలలోపు వాళ్ళు 5 ఎపిసోడ్లు తయారు చేసి పట్టుకురావాలి. కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత వారికి ఇరవై నుండి 30 లక్షల మొత్తం ఇస్తాము. ఈ మధ్య కాలంలో ప్రొడ్యూసర్లు దూరదర్శన్ అధికారుల ఇళ్ళ చుట్టూ తిరుగుతారు. ‘మండీ’ అంటే సంత పెట్టుకునే ప్రదేశం. మండీ హవుస్ సార్థక నామధేయమైంది.
శంకరాభరణం శంకరశాస్త్రి ప్రత్యక్షం:
ప్రొడ్యూసర్ల ఎంపిక సమయంలో ఒక రోజు హైదరాబాదుకు చెందిన నాటక రచయిత సి.యస్.రావు కళాపూర్ణోదయం కావ్యం ఆధారంగా ఐదు ఎపిసోడ్లు తయారు చేస్తామని ఇంటర్వ్యూకి వచ్చారు. ఆ కమిటీ అధ్యక్షుడిని నేను. సి.యస్.రావుతో బాటు జె.వి.సోమయాజులు (శంకరశాస్త్రి) వచ్చారు. వారిని కమిటీ సభ్యులకు పరిచయం చేశాను. హిందీలో కూడా అది నిర్మించారు గాబట్టి సభ్యులు గుర్తుపట్టారు. సబ్జెక్టు పటిష్టమైనది గాబట్టి ఆమోదించాము. ఐదేళ్ళ కాలంలో నెలకు 20 రోజుల చొప్పున ఈ ఇంటర్వ్యూలు వుండేవి. బయటి ఒత్తిళ్ళకు తట్టుకుని పారదర్శకంగా ఎంపిక చేశాము.
కార్యదర్శికి ఆగ్రహం:
ఎంతో కష్టపడి 114మంది ప్రొడ్యూసర్ల ఎంపికను ఆరు నెలల కాలవ్యవధిలో పూర్తి చేశాము. లిస్టు డైరక్టర్ జనరల్ ఆమోదానికి పంపాను. గోప్యమైన ఆ లిస్టులో పేర్లు మా ప్రొడ్యూసర్లకు తెలిసిపోయాయి. చాలా అధికార బలగం గల ముగ్గురు ప్రొడ్యుసర్ల పేర్లు అందులో లేవు. కార్యదర్శి పరోక్షంగా సహకరించమని కోరారు. నేను అంగీకరించలేదు. ఫైలు తనకు పంపమన్నారు. నిశ్చింతగా పంపాను. మూడు నెలలు ఆ ఫైలు తన వద్ద వుంచుకొన్నారు. ఈలోగా సెలెక్టయిన ప్రొడ్యూసర్లు వెళ్ళి ఆలస్యమవుతోందని సమాచార ప్రసార శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. మంత్రిగారి సెక్రటరీ నన్ను సంజాయిషీ అడిగారు. మూడు నెలల క్రితమే కార్యదర్శి వద్ద ఫైలు వుందని చెప్పాను. ఆ సాయంకాలానికల్లా కార్యదర్శి ఆమోద ముద్ర వేసి ఫైలు తిప్పి పంపారు. ఆయన ఇష్టపడిన మూడు పేర్లు చేరలేదు.
ముగ్గురు డైరక్టర్ జనరళ్ళు:
2001-2005 మధ్య కాలంలో నేను ముగ్గురు డైరక్టరు జనరళ్ళ వద్ద పని చేసి మెప్పు పొందాను. చేరిన కొద్ది నెలలు సి.ఈ.ఓ.గా, డి.జి.గా అనిల్ బైజల్ వున్నారు. ఆ తరువాత ఆయన హోం సెక్రటరీగా రిటైరయ్యారు. ఆయనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుగా నియమితులయ్యారు. డైరక్టరేట్‍లో నలుగురు డి.డి.జి.లు వున్నారు. వారిలో మూడో వంతు పనిభారం నాకు మోపారు. ఒక మీటింగ్‍లో బైజల్ ప్రశంసాపూర్వకంగా మాట్లాడి మెచ్చుకొన్నారు. ఆ తర్వాత యస్.వై.ఖురేషీ డి.జి.గా వచ్చారు. ఆయనకూ, అప్పటి సి.ఈ.ఓ.కు మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఇద్దరి మధ్యా నేను మెళుకువగా పని చేయక తప్పలేదు. రెండేళ్ళ పాటు పని చేసిన ఖురేషీ ఆ తర్వాత ఎన్నికల సంఘం చీఫ్ కమీషనర్‌గా పనిచేశారు. నన్ను ఎంతో ఆదరంగా చూశారు. మూడో వ్యక్తి బీహార్ కేడర్ ఐఎఎస్ అధికారి నవీన్ కుమార్. ఎన్నో ఫైళ్ళ మీద ఆయన నన్ను అభినందిస్తూ వ్రాశారు. వారి హయాంలో నేను పార్లమెంటరీ వ్యవహారాల సెక్షన్ కూడా చూశాను. అది కత్తి మీద సామువంటిది. గంటల మీద విషయ సేకరణ యావద్భారతదేశం నుండి అన్ని కేంద్రాల సమాచారం తెప్పించి పార్లమెంటు ప్రశ్నలకు సమాధానం తయారు చేయాలి. సీ.ఈ.ఓ.గా కె.యస్. శర్మ నా కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఆదేశాలిచ్చారు.
ప్రకాశ్ ఝా సినిమా వివాదం:
2003లో కాంగ్రెసేతర ప్రభుత్వం జయప్రకాశ్ నారాయణ్ జీవితంపై ఒక సినిమా నిర్మించవలసిందిగా ప్రకాశ్ ఝా అనే డైరక్టరుకు సాంస్కృతిక శాఖ ద్వారా కోటి రూపాయలు మంజూరు చేసింది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి ఝా చిత్రనిర్మాణం పూర్తి చేశాడు. హజారీబాగ్‌లోని సెంట్రల్ జైలును ఝా సెట్టింగులతో పునర్నిర్మించి 1942 నవంబరు 9న బ్రిటీషు ప్రభుత్వ హయాంలో జయప్రకాశ్ జైలు నుండి తోటి మిత్రులతో పారిపోయిన సంఘటనను అద్భుతంగా చిత్రీకరించాడు. రెండు గంటల నిడివి గల ఆ చిత్రంలో జయప్రకాశ్ పాత్రను చేతన్ పండిట్ ధరించాడు. టాల్ ఆల్టర్ తదితరులు నటించారు. చిత్రం విడుదలకు సిద్ధమయింది. సినిమా విభాగ పర్యవేక్షణ నేను చేస్తున్న సమయంలో 2004 జూన్ నాటికి ఆ చిత్రాన్ని కమిటీ ద్వారా చూసి ఆమోదించే బాధ్యత నాపై పడింది. కమిటీ సమావేశాల నాటికి నూతన కాంగ్రెసు ప్రభుత్వం వచ్చింది. జైపాల్ రెడ్డి సమాచార ప్రసారశాఖల మంత్రి.
సినిమాలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ధోరణిలో కొన్ని సన్నివేశాలున్నాయి. వాటిని సరిచూడాలని కమిటీ అభిప్రాయపడి డైరక్టరు అయిన ఝాని పిలిపించాము. ఆయన వాస్తవాలే చిత్రీకరించానని మొండి పట్టు పట్టాడు. చివరకు పార్లమెంటులో Starred Question వచ్చింది. దానికి సమాధానం తయారు చేసి జైపాల్ రెడ్డి గారికి బ్రీఫింగ్ ఇచ్చాము. ఆయన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిలా వీర విజృంభన చేసి ప్రతిపక్షాలను మెప్పించేలా మాట్లాడారు. అందరికీ అంగీకార యోగ్యమైన రీతిలో పరిష్కారం కుదిరి ఆ సినిమా 2004 డిసెంబరు 6న విడుదల అయింది.
కలకత్తా కోర్టు గొడవలు:
కలకత్తా లోని ఒక అడ్వర్టయిజర్ దూరదర్శన్‍కు కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. కోర్టు కేసుల విభాగాన్ని కూడా చూసే నాపై ఆ భారం పడింది. సుప్రీం కోర్టు న్యాయవాది దూరదర్శన్ పక్షాన న్యాయ సలహాలు అందించారు. కలకత్తా హైకోర్టులో కేసు నడుస్తోంది. పది రోజుల కొకసారి నేను డైరక్టర్ జనరల్ పక్షాన కలకత్తాకు పరుగులు తీయవలసి వచ్చింది. సంవత్సరంన్నర పాటు కేసు వాదనలు వాయిదాలు పడి ఎట్టకేలకు దూరదర్శన్ గెలిచింది. డబ్బులు కట్టించగలిగాము. పార్లమెంటు ప్రశ్నలకు సమాధానాలు, కోర్టు కేసుల పరిష్కరాలు, కాశ్మీర్ ఛానెల్ ప్రొడ్యూసర్ల బుకాయింపులు, బెదిరింపులు చాలా కాలం వేధించాయి. ఒక లేడీ ప్రొడ్యూసర్ తనకు శాంక్షన్ కాలేదని, ఇండియా గేట్ వద్ద తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని బెదిరిస్తూ ఫోన్ చేసింది. నేను డి.జి. దృష్టికి తీసుకెళ్ళాను. ఆవిడ దూరదర్శన్ ప్రాంగణంలోకి మూడు నెలలు రాకుండా నిషేధించాము.
వాజ్‌పేయితో శ్రీనగర్:
2003 ఏప్రిల్ 18న శ్రీనగర్ సందర్శించారు. అక్కడి ఉద్రిక్త వాతావరణంలో ప్రధాని పర్యటన విరమించుకోవలసిందిగా రహస్య నివేదిక ఇచ్చారు. అయినా ఆయన శ్రీనగర్ బహిరంగ సభలో ధైర్యంగా మాట్లాడారు. ప్రధాని శ్రీనగర్ పర్యటనకు ముందు ఏప్రిల్ 17న రేస్ కోర్స్ రోడ్డులో ప్రధాని వాజ్‌పేయి నివాసంలో కాశ్మీర్ ఛానెల్ వ్యవహారాల గురించి గంటసేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. అయన సంతృప్తికరంగా భావించి నన్ను కూడా తన బృందంతో శ్రీనగర్ తీసుకెళ్ళారు. అక్కడ ప్రొడ్యూసర్లు తమకు న్యాయం చేయవలసిందిగా ప్రధానికి మహాజరు సమర్పించారు. కాశ్మీరీ పండిట్లకు ఎక్కువ ప్రోగ్రాంలు కేటాయించవలసిందిగా కోరారు.
పి.వి.గారితో తరచూ సమావేశాలు:
2003-2004 సంవత్సరాల మధ్య మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గారిని తరచూ కలిసే అవకాశాలు లభించాయి. ఒకసారి వారే స్వయంగా ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక రచయిత వస్తారనీ, ఏదైనా సాహిత్య సంస్థ పక్షాన ఇష్టాగోష్ఠి చేయగోరారు. మా నాన్నగారి పేర ఏర్పాటు చేసిన అవార్డును రావూరి భరద్వాజకు అందించినపుడు వారిని పి.వి. వద్దకు తీసుకెళ్ళాను. ఎంతో ఆదరంతో మాట్లాడేవారు పి.వి.
దక్షిణాది కేంద్రాల పర్యవేక్షణ:
ఒక్కొక్క డి.డి.జి. ఒక్కొక్క ప్రాంతం కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత చూసేవారు. నాకు దక్షిణాది కేంద్రాలతో బాటు కొంత కాలం తూర్పు కేంద్రాల పర్యవేక్షణ ఇచ్చారు. పాట్నా వెళ్ళవలసి వచ్చినపుడు గయకు వెళ్ళి పితృదేవతలకు పిండాలు పెట్టాను. ప్రొడ్యూసర్లకు కార్యక్రమాలు శాంక్షన్ చేయడంలో కేంద్రాలు అవకతవకలు చేయకుండా చూడమని మా డి.జి. నవీన్ కుమార్ సూచించారు. నేను బెంగుళూరు, త్రివేండ్రం, మదరాసు, హైదరాబాదు కేంద్రాలను దర్శించి అక్కడి ప్రొడ్యూసర్ల సూచనలు సేకరించి ఒక సమగ్ర నివేదిక సమర్పించాను. మిగతా డి.డి.జి.లు కూడా ఇదే కసరత్తు చేయాలని నవీన్ కుమార్ ఆర్డర్లు వేశారు. స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడిగా సోమనాథ్ చటర్జీ వుండేవారు. ఆయన విస్తృతంగా పర్యటించారు. వారి వెంట నేను కలకత్తా, భువనేశ్వర్, హైదరాబాదు, అహ్మదాబాద్ పర్యటించాను. సోమనాథ్, ద్వారక దర్శించాము. మరో కమిటీతో శ్రీనగర్, జమ్మూ, పోర్ట్‌బ్లెయిర్ పర్యటించాను. కమిటీ వేసే ప్రశ్నలకు సమాధానాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాలి. డైరక్టర్ జనరల్‌కు మాట రాకూడదు. మొత్తం మీద దూరదర్శన్‍లో ఐదేళ్ళ వ్యవధిలో యావద్భారత విమాన పర్యటనలు చేయక తప్పలేదు. బహుశా విధినిర్వహణలో క్లిష్ట సమయం, ఇష్ట సమయముగా చెప్పవచ్చు. 2005 ఫిబ్రవరి 28న క్షేమంగా పదవీ విరమణ చేయగలిగాను. శుభస్కరం.