జ్ఞాపకాలు – వ్యాపకాలు – 35

0
6

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

కంగారుగా ఆంధ్రాబ్యాంకు మేనేజర్ ఫోను:

[dropcap]2[/dropcap]005 ఫిబ్రవరి 28న 58 ఏళ్ళు నిండి నేను ఢిల్లీ దూరదర్శన్ డైరక్టరేట్ నుండి రిటైరవుతున్న రోజు. సాయంకాలం 4 గంటలకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. మీటింగ్‌కి బయలుదేరుతుండగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ ఆంధ్రాబ్యాంకు మేనేజరు కంగారుగా ఫోను చేశారు “సార్! మీ అకౌంట్‌లో ఎక్కడివో 8½ లక్షలు wrong credit  అయ్యాయి” అన్నారు. ఒక్క క్షణం ఆలోచించాను. “మేనేజర్ గారూ! అది నా ప్రావిడెంట్ ఫండ్ మొత్తం. పొరపాటున గాదు. సరిగానే రిటైరన రోజు చెల్లించారు” అన్నాను. “సారీ సర్!” అని ఆయన ఫోన్ పెట్టేశారు.

వీడ్కోలు సభకు దూరదర్శన్ డైరక్టర్ జనరల్ నవీన్ కుమార్ వచ్చి నాలుగు ప్రశంసా వాక్యాలు పలికారు. “నాలుగేళ్ళ పాటు కాశ్మీర్ ఛానల్ వ్యవహారాలు పారదర్శకంగా R.A.P. Rao నిర్వహించారు. క్లిష్ట సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని సంస్థకు మేలు చేశారు” అని శాలువాతో సన్మానించారు. 1997లో నేను ఢిల్లీ వెళ్ళినప్పటి నుండీ నా పేరు R.A.P. Rao గా అందరూ పిలవసాగారు.

నేను సంతకం కూడా సంక్షిప్తంగా చేయసాగాను. రోజుకు కనీస పక్షం వంద సంతకాలు చేయాలి. సంక్షిప్త శబ్ద చిత్రంలాగా సంతకం పొట్టిదిగా అలవాటైంది. వీడ్కోలు సభలో మిత్రులు, అడిషనల్ డైరక్టర్ జనరల్ ఆర్.వెంకటేశ్వర్లు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. “పబ్లిక్ రిలేషన్స్‌లో ఆయన అందెవేసిన చేయి. బెంగుళూరు వెళ్ళినా, హైదరాబాదు వచ్చినా రాజ్‌భవన్‌లకు నేరుగా వెళ్ళగలిగిన సమర్థులు. మాకు మార్గదర్శకులు. ఇప్పుడు పని చేస్తున్న ఎందరో డైరక్టర్లకు 20 ఏళ్ళ క్రితం రావు గారు ట్రయినింగ్ కళాశాలలో శిక్షణ ఇచ్చారు” అని అభినందించారు.

మాజీ గవర్నర్ శ్రీ సుశీల్‍కుమార్ షిండే చేతుల మీదుగా సత్కారం

జాతీయ కవి:

దూరదర్శన్ నుండి వెంకటేశ్వర్లు 2013లో ఆకాశవాణి డైరక్టర్ జనరల్‍గా పదోన్నతి పొంది ఉత్తమ అధికారిగా పేరు తెచ్చుకొన్నారు. ఆయన హయాంలో 2014 జనవరిలో హైదరాబాదులో ప్రేక్షక సమక్షంలో ఆర్.టి.సి. ఆడిటోరియంలో జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో తెలుగు కవిగా నాకు అవకాశం కల్పించారు. 14 భాషలకు సంబంధించిన కవులు యావద్భారతదేశం నుండి వచ్చి తమ తమ భాషలలో కవితలు వినిపిస్తారు. వాటి హిందీ అనువాదం మరో కవి చేస్తారు. నా తెలుగు కవితకు హిందీ అనువాదాన్ని డా. చిల్లర భవాని సమర్థవంతంగా చేశారు. సభకు ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు శ్రీ ఈ.యస్.యల్. నరసింహన్ వచ్చారు.

రేడియో కొనాలంటే దొరుకుతోందా అన్న గవర్నరు:

ఆ సభలో స్టేషన్ డైరక్టర్, ఆత్మీయ మిత్రులు మంగళగిరి ఆదిత్యప్రసాద్ ముఖ్య అతిథిగా వచ్చిన గవర్నరుకు జ్ఞాపికగా ఫిలిప్స్ రేడియో బహుకరించారు. ఆయన సంతోషంగా స్వీకరించి వేదిక నుండి దిగి నాలుగు మెట్లు నడిచారు. మళ్ళీ వేదిక మీదకి వచ్చి మైక్ అడిగి తీసుకుని ఇలా అన్నారు:

“డైరక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. మూడు నెలలుగా రాజ్‌భవన్ సిబ్బందికి ఒక రేడియో కొని పట్టుకురండని చెబుతున్నాను. హైదరబాద్ నగరంలో ఎక్కడా దొరకలేదని చెప్పారు. నేను పొద్దుటే భక్తిరంజని వింటాను. రేడియో సెట్ కానుకగా ఇచ్చినందుకు థాంక్స్” అన్నారు.

పదవీ విరమణానంతరం ఎలా గడపాలి?

2005 మార్చి 1 నాడు నేను సర్వతంత్ర స్వతంత్రుడిని. హుందాగా పదవీ విరమణ చేశాను. నా పెన్షన్ పేపర్లు శాంక్షన్ అయ్యాయి. గ్రాట్యూటీ తదితర మొత్తాలు ఇచ్చివేశారు. దూరదర్శన్‌లో పని చేసిన కొందరు అధికారులకు పెన్షన్ రావడం అనేది అనేక కారణాల వల్ల సంవత్సరాల పాటు నిలిచిపోవడం నాకు బాగా గుర్తు. రిటైరయిన తర్వాత 6 నెలల పాటు క్వార్టర్స్‌లో వుండవచ్చు. దానికి అద్దె వసూలు చేస్తారు. 1997 నవంబరులో తాత్కాలికంగా ప్రగతి విహార్ హాస్టల్‌లో వసతి ఇచ్చారు. పేరుకు అది హాస్టల్. ఫర్నిచర్ వుంటుంది. సింగిల్ బెడ్ రూం.

మాజీ కేంద్ర మంత్రి శ్రీ అరుణ్ జైట్లీతో

1999 జనవరిలో పండారా రోడ్డు క్వార్టర్స్‌లో A 223 క్వార్టర్స్ విశాలమైనది – నాకు కేటాయించారు. అంతకు ముందు ఆ ఇంట్లో పార్లమెంటు సభ్యురాలు, గాంధేయవాది అయిన శ్రీమతి నిర్మలా దేశ్‍పాండే ఆరేళ్ళు నివసించారు. మాకు పక్కనే షాజహాన్ రోడ్డులో కేంద్రమంత్రులు సి.హెచ్. విద్యాసాగార రావు, కృష్ణంరాజు ప్రభృతులు, ఇటువైపు పండారా పార్క్‌లో కేంద్రమంత్రి ఎల్.కె. అద్వానీ తదితర పార్లమెంటు సభ్యులు ఉండేవారు. చాలామంది సీనియర్ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లు మార్నింగ్ వాక్‍లో కలిసేవారు. విజిలెన్స్ కమీషనర్ హెచ్.జె.దొరకు అద్వానీగారు హోం మంత్రిగా వెళుతూ మారిన క్వార్టర్స్ కేటాయించారు. బాడీగార్డులతో ఆయన వాకింగ్‌కి వచ్చేవారు. అప్పుడప్పుడు పి.యల్. సంజీవరెడ్డి వాహ్యాళిలో కలిసేవారు.

ఢిల్లీలో పని చేసే ఆఫీసర్లకు వసతిగా వుండే క్వార్టర్సు, ఆఫీసు కారు లభిస్తే అంతకుమించిన అదృష్టం లేదు. రిటైరైన తర్వాత నా సహచరులలో కొందరిని కన్సల్టెంట్లుగా నియమించారు. ఢిల్లీ నుండి ఎప్పుడెప్పుడు బయటపడదామా? అని నా ఆలోచన. 16 రోజులలో ఇల్లు ఖాళీ చేసి మార్చి 17న ఢిల్లీ విమానాశ్రయం చేరుకొన్నాను.

విమానాశ్రయంలో దైవిక సంఘటన:

మార్చి 17 ఉదయం 9 గంటలకు ఇందిరాగాంధీ విమానాశ్రయానికి నేను, నా సతీమణి శోభ చేరుకొన్నాము. హైదరాబాదు వెళ్ళాలి. లౌంజ్‍‌లో కూచొన్నాము. ఇంతలో ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ శ్రీ ఏ.పి.వి. నారాయణ శర్మ అక్కడికొచ్చారు. 2005 ఫిబ్రవరిలో కేంద్ర బొగ్గు శాఖలో జాయింట్ సెక్రటరీగా వున్న శర్మగారిని తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వేశారు. అంతకు ముందు వారిని, రెండు, మూడు సార్లు మాత్రమే కలిశాను. సన్నిహిత పరిచయం చాలా తక్కువ. నమస్కరించి వారిని కలిశాను. వారి పక్కనే కూచొన్నాను.

మాజీ కేంద్ర మంత్రి శ్రీ ఎస్. జైపాల్‍రెడ్డితో

“హైదరాబాద్ టూర్ వెళ్తున్నారా?” అన్నారాయన.

“లేదు సార్! ఫిబ్రవరి ఆఖరున రిటైరయ్యాను” అన్నాను.

“అవునా!” అన్నారు.

అప్రయత్నంగా, దైవికంగా నా నోటి వెంట ఈ క్రింది మాటలు వచ్చాయి:

“మీరు తిరుపతిలో వున్నారు సార్. భగవంతుడు అనుగ్రహిస్తే దేవస్థానంలో నాకూ పని చేయాలని వుంది. ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి పదవి ఖాళీగా వుంది గదా!” అన్నాను.

“మొన్ననే పి. చెంచుసుబ్బయ్యను నియమిస్తూ బోర్డు నిర్ణయించింది” అన్నారు శర్మగారు. ఇంతలో వారు మదరాసు వెళ్ళే విమానం ఎనౌన్స్ చేశారు.

వారి వద్ద సెలవు తీసుకొన్నాను. మరో అరగంటలో బయలుదేరి హైదరాబాద్ చేరుకొన్నాము.

మహోన్నతమూర్తి ఆదరణ:

హైదరాబాదు వెళ్ళిన వారం తర్వాత తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పేర రెండు దరఖాస్తులు పంపాను. ఒకటి దేవస్థాన ప్రచురణల విభాగం ఎడిటర్ పదవికి, మరొకటి దేవస్థానంలో ఏదైనా ఖాళీకి. నా అప్లికేషన్ మీద ఏ.పి.వి. యన్. శర్మ గారు సానుకూలంగా స్పందిమ్చారు. ఏప్రిల్ నెలలో జరిగిన బోర్డు మీటింగులో నన్ను Coordinator, Software Projects గా నియమిస్తూ జీతము, క్వార్టర్స్, కారు యిచ్చేలా సంవత్సర కాల పరిమితికి బోర్డు ఆమోదించింది. మే నెల 13న నేను శ్రీ వేంకటేశ్వర దృశ్యశ్రవణ ప్రాజెక్టు కోఆర్డినేటర్‍గా బాధ్యతలు చేపట్టాను. ఆరోజు అక్షయ తదియ. సంవత్సరం నిండగానే మరో సంవత్సరం పొడిగించారు. తొలుత టి. సుబ్బరామిరెడ్డి చైర్మన్. మరుసటి సంవత్సరం భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షులు. మూడో సంవత్సరం పొడిగింపుకు బోర్డు ప్రతిపాదన మీటింగులో సమీక్షించారు. భగవంతుని డబ్బు తీసుకొని పని చేయడమెందుకని జీతం లేకుండా పని చేస్తానని వ్రాసి ఇచ్చాను.

మాజీ గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషీతో

బోర్డులో మోకాలొడ్డిన సభ్యుడు:

2007 మే నెలలో నాకు మూడో సంవత్సరం పొడిగింపు విషయం చర్చకు వచ్చింది. ఆయనను పొడిగించవద్దని ఒక సభ్యుడు అడ్డుపడ్డారు. అంశం వాయిదా పడింది. 2007 జూన్‌లో మళ్ళీ బోర్డులో చర్చకు వచ్చింది. అప్పటికి కె.వి.రమణాచారిగారు కార్యనిర్వహణాధికారిగా వచ్చి చేరారు. వారికి అది తొలి బోర్డు మీటింగు. నా అంశం ప్రస్తావనకి రాగానే మరో సభ్యుడు అడ్డుపడ్డారు. రమణాచారి గారు జోక్యం చేసుకుని “నేను చేరి కొద్ది రోజులే అయింది. పద్మనాభరావు సేవలు మన కవసరం. జీతం కూడా వద్దంటున్నారు. మళ్ళీ సమావేశంలో నిర్ణయిద్దాం” అని సభ్యులను కోరారు. అప్పుడు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షులు. మళ్ళీ నెల సమావేశంలో నా పదవిని మరో ఏడాది పొడిగిస్తూ ఆమోద ముద్ర వేశారు.

శల్య సారథ్యం:

2005 మే లో నేను చేరిన నాటిన నుండి కొందరు అనుకూల శత్రువులు ఈర్ష్యాసూయలు పెంచుకొన్నారు. బయటి నుండి వచ్చిన వ్యక్తి ఇలా స్థిరపడడం వారికిష్టం లేదు. శర్మగారి ఉద్దేశం వివిధ రకాల ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతను నాకప్పగించడం. దానికి కొందరు అభ్యంతరం చెప్పారు. శ్వేతభవనం లోపల దృశ్యశ్రవణ ప్రాజెక్టు పని చేస్తోంది. కామిశెట్టి శ్రీనివాసులు దానికి డైరక్టరుగా పని చేసి రిటైరయ్యారు. శ్వేత డైరక్టర్‍గా భూమన్ పనిచేస్తున్నారు.

మా ప్రాజెక్టులో ఒక అకౌంటెంటు, సీనియర్ అసిస్టెంట్‌గా విభీషణ శర్మ, మరికొందరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అన్నమాచార్య కీర్తనల రికార్డింగు మా పని. దాదాపు 200 కీర్తనలు రెండేళ్ళ కాలంలో రికార్డు చేశాము. వేదాలు రికార్డు చేశాము.

దాయభాగ పరిష్కారం:

2008 జూన్‍లో నన్ను మరో సంవత్సరం పొడించారు. కామిశెట్టి శ్రీనివాసుల్ని నియమించారు. ఆయనకు నా వద్ద వున్న రికార్డింగు ప్రాజెక్టు అప్పగించారు. నేను దృశ్య శ్రవణ ప్రాజెక్టు పర్యవేక్షించాను. అప్పుడప్పుడే భక్తి ఛానెల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఛైర్మన్ కరుణాకరరెడ్డి, ఈవోగా వున్న రమణాచారి సంకల్పించారు. హనుమంతుడికి సీతాన్వేషణ భారం అప్పగించినట్లుగా దానికి లైసెన్సు సంపాదించి తెచ్చే బాధ్యతను నా మీద పెట్టారు. ఒక పూట శ్వేత భవనంలోనూ, మరోపూట అప్పుడే అలిపిరి గెస్ట్ హౌస్‌లో పెట్టిన భక్తి ఛానెల్ ఆఫీసులోనూ పనిచేసే ఆదేశాలు జారీ అయ్యాయి. అనేక మార్లు ఢిల్లీ వెళ్ళి 2008 జూన్ నెలలో భక్తి ఛానెల్ లైసెన్సు సంపాదించుకొచ్చాను. జూలైలో తిరుమలలో మహాద్వారం ముందు రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ప్రారంభించారు. 2009 మే లో యస్.వి.బి.సి.లో కోఆర్డినేటర్‌గా నాకు అప్పటి సి.ఈ.వో. కె.యస్.శర్మ ఆర్డరిచ్చారు. 2010 మే లో దాన్ని పొడిగించారు. అప్పటి ఈవో ఐ.వై.ఆర్. కృష్ణారావు కోర్టు ఆదేశాల మేరకు రిటైరైన వారిని ఇంటికి పంపించే ప్రణాళికలో నేను పదవీ బాధ్యతల నుండి తప్పుకొన్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here