జ్ఞాపకాలు – వ్యాపకాలు – 37

1
9

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

40 నిముషాల్లో దొరికిన కొత్త ఉద్యోగం:

[dropcap]అ[/dropcap]ది 2011 జూన్ నెల. నేను శంకరంబాడి సుందరాచారి జీవిత చరిత్రను సి.పి.బ్రౌన్ అకాడమీ, హైదరాబాదు వారి కోరిక మీదకు వ్రాస్తున్న రోజులవి. అందుకు ముందు వారు బెజవాడ గోపాలరెడ్డి జీవిత చరిత్రను నాచేత వ్రాయించి ముద్రించారు. యశస్వి గారి హఠాన్మరణంతో ఆ సంస్థ మూతబడింది. శంకరంబాడి గ్రంథాల సేకరణ చేస్తున్నాను. మధ్యలో ఢిల్లీ నుండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వారు IAS ఇనిస్టిట్యూట్‌లలో తెలుగు అభ్యర్ధులకు సహకరించే అనువాదకుడిగా రెండు రోజులు పిలిచారు. ఢిల్లీ నుండి రాగానే మర్నాడు హిమయాత్ నగర్, హైదరాబాదులోని తెలుగు అకాడమీ కార్యాలయానికెళ్లాను. అక్కడ డైరక్టరు యాదగిరిని కలిసి కుశల ప్రశ్నల తర్వాత వారి గ్రంథాలయంలో శంకరాచారి పుస్తకాల అన్వేషణకు అనుమతి తీసుకొన్నాను. యాదగిరి నా చేత మూడు పుస్తకాలు వ్రాయించారు. సివిల్ సర్వీసు అభ్యర్దుల కోసం ‘పోటీ పరీక్షలు – లక్ష్య సాధన’, మరో ఇంగ్లీషు పుస్తకం ‘Ethics-Integrity-Aptitude’, ప్రపంచ సభల కోసం ‘ప్రసార ప్రముఖులు’ వ్రాయించారు.

నేను 11 గంటల నుండి 1 గంట దాకా ఆ రోజు అకాడమీ లైబ్రరీ గాలించి ఒకటి, రెండు పుస్తకాలు శంకరాచారివి పట్టుకొన్నాను. ఇంతలో లైబ్రరియన్ లంచ్ బాక్స్ తెరిచి తినబోయింది. ‘అమ్మా నేను అలా బయటికెళ్లి వస్తాన’ని చెప్పి బయటి కొచ్చి బడ్డీ కొట్టులో ఏదో తిన్నాను. ఇంతలో గుర్తు వచ్చింది. కందుకూరులో నాతో కలిసి పని చేసిన జూవాలజీ లెక్చరర్ పక్క సందులో నారాయణ సంస్థలలో పని చేస్తున్నారని. వెళ్లి కలిశాను. ఆయనా లంచ్ చేస్తున్నారు. మాటల సందర్భంలో నిన్ననే ఢిల్లీకి UPSC  పని మీద వెళ్లి వచ్చానని చెప్పాను. ఆయన చేతులు కడుగుకొని నన్ను క్రింది ఫ్లోర్‌లో వాళ్ల మిత్రుడు డి.వి.రావును కలిపారు. నారాయణ IAS అకాడమీ ఆ వారమే వాళ్లు ప్రారంభిస్తున్నారు. చైతన్య IAS అకాడమీ ప్రారంభమై హోం సెక్రటరీ కె. పద్మనాభయ్య ఉన్నతాధికారిగా చేరారు. డి.వి.రావు నన్ను నారాయణ గారి రూంలోకి తీసుకెళ్లారు. 5 నిమిషాల్లో నన్ను వాళ్ల అకాడమీ ప్రిన్సిపాల్‌గా ప్రకటించారు.

ముదిమిలో దక్కిన ప్రిన్సిపాల్ పదవి:

2011 జూన్‌లో హైదరాబాదులో యల్.బి.నగర్ సమీపంలోని సాగర్ ఎన్‌క్లేవ్ లోని విశాలమైన 3 అంతస్తుల భవనంలో 350 మంది విద్యార్ధినీ విద్యార్ధులతో ఇంటర్, డిగ్రీ, పోస్ట్ డిగ్రీ విద్యార్ధులతో అకాడమీకి తొలి ప్రిన్సిపాల్‌గా నేను పని మొదలు పెట్టాను. 1967 డిసెంబరులో కందుకూరు కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరిన నేను ఉద్యోగ విరమణానంతరం మరో అకాడమీ స్థాపక ప్రిన్సిపాల్‌గా చేరడం భగవదానుగ్రహం. ఇంటర్మీడియెట్ నుంచి సివిల్స్ కోచింగ్ అనే ప్రతిపాదనతో ఆనాడు ప్రారంభించిన అకాడమీ గత దశాబ్దిలో వేల సంఖ్యలో విద్యార్ధుల నాకర్షించగలిగింది.

కళాశాల ప్రారంభానికి ముందు తల్లిదండ్రులు, విద్యార్ధుల సమావేశంలో మాట్లాడవలసిందిగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ను అహ్వానించాము. ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది సభ. మధ్యాహ్నాం 4 గంటల వరకు కొనసాగింది. మంచి స్పందన కలిగి విద్యార్ధుల సంఖ్య ఊహించిన దానికంటే బాగా వృద్ధి చెందింది. ఈ సమావేశానికి నేను సమన్వయకర్తను. వారం రోజుల్లో హాస్టల్ వసతులు స్త్రీ పురుషులకు వేర్వేరుగా ఏర్పరిచాం. పది రోజుల కొకసారి నారాయణగారు స్వయంగా వచ్చి పర్యవేక్షించి భోజన వసతి, అధ్యాపకుల పాఠ్య బోధనల గూర్చి అడిగి తెలుసుకొనేవారు.

డా. బెజవాడ గోపాలరెడ్డి గారిచే చిరు సత్కారం

ప్రముఖుల ప్రసంగాలు:

30 మంది దాకా అధ్యాపకులు, ఇతర ఆఫీసు సిబ్బంది చేరారు. కళాశాల ఆనుకొని ఒక ఇంట్లో చేరి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించాను. ఉదయం 8 గంటల నుండి యంత్రం 5 వరకు క్లాసులు. వారానికొక ప్రముఖ వ్యక్తి చేత ప్రోత్సాహక ప్రసంగం (motivation class) ఏర్పాటు చేశాను. అలా వచ్చిన వారిలో ప్రముఖ పాత్రికేయులు సాక్షి రామచంద్రమూర్తి. జి.చక్తధర్, నవ్య జగన్నాథ శర్మ, జర్నలిజం ప్రిన్సిపాల్ ఆర్ ఉమామహేశ్వరరావు. మానసిక నిపుణులు డా.బి.వి.పట్టాభిరామ్; అధికారులలో పి.వెంకయ్య, IPS (సర్వీస్ కమీషన్ తాత్కాలిక చైర్మన్), యం.యల్.సి నాగేశ్వర్ రెగ్యులర్‌గా పాఠాలు చెప్పారు.

రైల్వే సి.పి.ఓ. కె.శ్రీనివాసరావు, చీఫ్ కన్జర్వేటర్ రామప్రసాద్ తదితరులున్నారు. ఎక్కవ ప్రీమియం గల కరీం హిస్టరీ, గురజాల జాగ్రఫీ పాఠాలు చెప్పారు. రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించుకొన్నాం. అకడమిక్ పాఠాలతో బాటు సివిల్స్ సిలబస్ కూడా చెప్పించాను. నేను జనరల్ స్టడీస్ చెప్పాను. ఈ విధమైన కోర్సు తొలి ప్రయత్నం కావడం వల్ల నిరంతరం చైతన్య స్ఫూర్తితో నడిచింది. ఇంటర్, డిగ్రీ విద్యార్ధులచే రెగ్యులర్ పరీక్షలు వ్రాయించాం.

చిన్నజియ్యరు స్వామివారి పవిత్రహస్తాలతో సన్మానం

గోడ దూకి పారిపోయిన విద్యార్థి:

ఇంటర్మీడియెట్ ఫలితాలు వచ్చాయి. ఖమ్మం ప్రాంతానికి చెందిన ఒక కుర్రవాడు ఫెయిల్ అయ్యాడు. సెక్యూరిటీకి కనిపించకుండా రెండో అంతస్తు నుండి దూకి అతడు పారిపోయాడు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన సంఘటన అది. 1 గంటకల్లా తల్లిదండ్రులకు వర్తమానం అందింది. ప్రిన్సిపాల్‌గా మీదే బాధ్యత అంటూ తండ్రి ఫోన్‌లో గదమాయించాడు. పోలీస్ కంప్లయింట్ వద్దని మా అడ్మిన్ ప్రిన్సిపాల్ రమణారెడ్డి సూచించాడు. ఆయన నారాయణ సంస్థలలో చాలా కాలంగా పని చేసిన అనుభవజ్ఞుడు. ఆ కుర్రవాడు సెల్ ఫోన్ పారేశాడు. రమణారెడ్డి స్కూటర్ల మీద వేగులను పంపాడు. గాలించి ఆ కుర్రవాడిని సాయంత్రం 4 గంటల వేళకు సికింద్రాబాదు రైల్వేస్టేషన్లో పట్టుకొన్నారు. బొంబాయి వెళ్లే రైలులో పారిపోవాలని అతడి ఆలోచన. మొత్తానికి పట్టుకొని కాలేజీకి తెచ్చారు.

నారాయణగారి పర్యవేక్షణ:

ఆయన పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా వందల కొద్ది విద్యా సంస్థలున్నాయి. ఆయన ఆఫీసు గదిలో స్క్రీన్ మీద అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌ల బొమ్మలు కన్పిస్తాయి. వారానికొకసారి వారితో చర్చించి విద్యార్థుల మాసవారీ పరీక్షా ఫలితాలు సమీక్షిస్తారు. 15 రోజులకొక సారి జంటనగరాల ప్రిన్సిపాల్ సమావేశాంలో సుదీర్ఘంగా చర్చిస్తారు. ఉదాహరణకు జాగ్రఫీ పేపర్లో 6వ ప్రశ్నను ఆ సెంటర్లో అందరు విద్యార్థులు సరిగా వ్రాయలేదంటే దానికి బాధ్యుడు ఆ పాఠం చెప్పిన మేష్టారే నని నిర్ణయించేవారు. ఆ విధంగా ఆయన సూక్ష్మ పరిశీలన చేయగల సమర్థులు. అందుకే ఆ విద్యా సంస్థలు పేరు తెచ్చుకొన్నాయి.

మార్గదర్శి-మహర్షి:

నారాయణ సంస్థలలో చిరకాలం పని చేసిన డి.వి.రావు అనబడే దిట్టకవి వెంకటేశ్వరరావు మచిలీపట్నం హిందూ కళాశాలలో కెమిట్రీ లెక్చరర్‌గా మూడు దశాబ్దాలు పని చేసి మధ్యలో చైతన్యలో చేరారు. అక్కడ నుండి నారాయణ చేరదీశారు. మంచి లౌకికులు, మానవ వనరుల వినియోగము, పర్యవేక్షణలో, మాటనేర్పరితనంలో ఘనులు. ఆయన మీద నారాయణ గురుతర బాధ్యత పెట్టారు. దానిని సక్రమంగా నిర్వహించారు డి.వి.రావు. నేను కళాశాలలో ఒక్క సంవత్సరమే పని చేస్తానని ముందుగా వారిద్దరికీ చెప్పాను. ప్రైవేటు సంస్థలలో పని చేయడం అంతగా ఇష్టం లేదు. అయినా ఒక ఛాలెంజ్‌గా తీసుకొని పని చేసి 2011 జూన్ నుండి 2012 జూన్ వరకు తొలి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించాను. హయత్‌నగర్‍లో కొత్త క్యాంపస్‌కు పూజాదికాలు నేను, మా శ్రీమతి శోభాదేవి నిర్వహించి కళాశాల మిత్రుల వీడ్కోలు తీసుకొని వచ్చేశాను.

సుప్రసిద్ధ నటి షావుకారు జానకితో నేను, నా శ్రీమతి

జైపూర్, ఢిల్లీ, నాగపూర్‌లలో మాక్ ఇంటర్వ్యూలు:

2011 సంవత్సరం ఏప్రిల్, మే నెలలో ఆ సంవత్సరం IAS ఇంటర్వ్యూలకు సెలక్టు అయిన అభ్యర్ధులకు మాక్ ఇంటర్వ్యూలు దేశవ్యాప్తంగా జరపాలని చైతన్య, నారాయణ సంస్థలు పోటాపోటీగా నిర్ణయించాయి. నా పరివారంతో బయలుదేరి నేను ముందుగా ఢిల్లీ వెళ్లాను. కరోల్‌బాగ్ లోని నారాయణ సంస్థల కళాశాల ప్రాంగణంలో 10 రోజుల పాటు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించాం. ఉచితంగా నిర్వహిస్తున్నాం గాబట్టి మంచి స్పందన వచ్చింది. ఢిల్లీలో నారాయణ విద్యా సంస్థల నిర్వాహకుడిగా, సమన్వయకర్తగా డా.గోపాల్ ఆరితేరిన వ్యక్తి. నేను, ఆయన నడుం కట్టి నాకు తెలిసిన IAS, IPS అధికారులను ఇళ్ల వద్ద కలిసి ఇంటర్య్యూలు చేయడానికి అహ్వానించాము. రిటైరయిన పోలీసు అధికారులను యు.యన్.బి.రావు సంప్రదించారు. నామీది అభిమానంతో కేంద్ర సమాచార కమీషనర్‌గా రిటైరయిన ఏ.యన్.తివారి వచ్చారు. ఆయన లోగడ కడప కలెక్టరుగా నాకు పరిచితులు. ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ వద్ద కార్యదర్శిగా పని చేశారు. మాక్ ఇంటర్వ్యూలు జయప్రదమయ్యాయి.

నాగపూరు ‘యశ్డా’లో తిష్ఠ:

మహారాష్ట్ర ప్రభుత్వం యశ్వంత రావు చౌహాన్ పేర ఒక ఉద్యోగ శిక్షణా సంస్థను YASDA పేర మన MCHRD తరహాలో సువిశాల ప్రాంగణంలో నాగపూరులో నిర్వహిస్తోంది. వారి సహకారంతో వారం రోజుల పాటు దాదాపు 50 మందికి మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించాం. అక్కడి స్పందనను చూచి మరో వారం రాజస్థాన్, జైపూర్‌లో మూడు రోజులు నిర్వహించాం. మొత్తానికి ఆ విధంగా మాక్ ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడిగా వంద మందికి పైగా దోహదం చేయగలిగాను.

ఏతావాతా ప్రిన్సిపాల్‌గా గొప్ప అనుభవం సంపాదించాను. అధ్యాపకులలో సమన్వయం, విద్యార్ధులలో క్రమశిక్షణ, హాస్టల్‌లో భోజనాది వసతుల ఏర్పాటు, కొత్త పాఠ్య ప్రణాళిక రూపకల్పన, తల్లిదండ్రులకు భరోసా నా విధులలో భాగం. ‘మిమ్మల్ని చూసి మా వాడిని మీ కాలేజిలోనే చేర్చామ’ని తల్లిదండ్రులు చెప్పినప్పుడు నా కళ్లు చెమ్మగిల్లాయి. ఇంటర్‌లో చేరిన విద్యార్థి 6 సంవత్సరాల తర్వాత  IAS అవుతాడని నమ్మబలకడం కష్టసాధ్యం. అది ఇష్టం లేని పని. సంవత్సరం తిరగగానే గుడ్‌బై చెప్పి మర్యాదగా బయటికొచ్చాను. అదో అనుభవం జీవితగమనంలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here