జ్ఞాపకాలు – వ్యాపకాలు – 38

3
7

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అనుకోని మలుపులు తిరిగిన నా జీవితం:

[dropcap]ల[/dropcap]క్ష్మీకాంతరావు, శారదాంబలకు నేను ఏకైక పుత్రుడిని. గారాబం చేసి నా చదువు పాడుచేయకుండా నన్ను శారదాపుత్రుడిని చేశారు. పది ఎకరాల సుక్షేత్రమైన మాగాణి వ్యవసాయం చెన్నూరు గ్రామంలో స్వయంగా చేసేవారు మా నాన్న. పాలెగాళ్ళు, ఎద్దులబండి, ఆవులు, గేదెలు పల్లెటూరి వాతావరణం. హైస్కులు చదువులకు బుచ్చిరెడ్డిపాళెం పంపారు. ‘ఇక చాలులే! వ్యవసాయం చూసుకొందువు’ అనకుండా నెల్లూర్లో మాతామహుల ఇంట్లో పెట్టి డిగ్రీ చేయించారు.

గౌరవనీయులు మా తల్లిదండ్రులు

తిరుపతి చదువు:

1965లో డిగ్రీ పూర్తయ్యే నాటికి నాకు 18 ఏళ్ళు నిండాయి. బి.ఇడి. నెల్లూరులోనే చేసి జిల్లాలో ఏదో ఒక హైస్కూలులో టీచర్‍గా పని చేస్తూ తమకు దగ్గరగా వుంచుకోవాలని నాన్న ఆలోచన. తిరుపతిలో ఎం.ఎ. తెలుగు చేస్తానంటే కాదనలేదు. 1965-67 మధ్య ఎం.ఎ. తెలుగులో గోల్డ్‌మెడల్‌తో 1967 జూన్‍లో ప్యాసయ్యాను. మా ఎం.ఎల్.ఎ. బెజవాడ పాపిరెడ్డి సిఫారసు మేరకు నాయుడుపేట సమీపంలోని అరవపాళెం హైస్కూలులో జూలై 20న జూనియర్ తెలుగు పండిట్‍గా చేరాను. నెల జీతం 150 రూపాయలు. ఏ సౌకర్యం లేని ఆ వూళ్ళో పని చేయడం ఇష్టం లేక ఆ సాయంకాలమే తిరుగు రైలెక్కాను. ఆ ఒక్క రోజు జీతం 5 రూపాయలు నా జీవితంలో తొలి జీతంగా రెండు నెలల తర్వాత మనియార్డరు తీసుకొన్నాను. అక్టోబరు 23న సీనియర్ తెలుగు పండిట్‍గా నెల్లూరు జిల్లా మర్రిపాడులో చేరి డిసెంబరు 15 వరకు పని చేశాను.

డిగ్రీ విద్యార్థిగా, కుడి వైపు నుంచి రెండోస్థానంలో

కందుకూరు కళాశాలలో:

ఎన్నడో హైదరాబాదు డైరక్టర్ ఆఫీసు డబ్బాలో వేసిన అప్లికేషన్ ఫలితంగా ఎవరి సిఫారసు లేకుండా కందుకూరు ప్రభుత్వ కళాశాలలో తెలుగు ట్యూటర్‍గా రూ. 350 జీతంతో 1967 డిసెంబరు 16న చేరాను. అది టెంపరరీ 10 A పోస్టు. 1974లో ఇంటర్వ్వూ పెట్టి పర్మనెంట్ చేశారు. అసిస్టెంట్ లెక్చరర్‍గా 1975 మధ్య భాగంలో శ్రీకాకుళం వేసే సూచనలు అందాయి. చెప్పిన పాఠమే చెప్పే ఉద్యోగం నాకిష్టం లేదు బహుశా నా జాతకరీత్యా కూడా మార్పు వుందేమో!

ఆకాశవాణి కడప గడపలో:

1975 జూన్ 1న హైదరాబాద్ ఆకాశవాణి డైరక్టరు పి. బాలగురుమూర్తి ఆఫీసులో జరిగిన ఇంటర్వ్యూలో ఉషశ్రీని విజయవాడకు, విజయభూషణశర్మను విశాఖపట్టణానికి, నన్ను కడపకు ప్రసంగ శాఖ ప్రొడ్యూసర్‌గా ఎంపిక చేశారు. వారిద్దరూ అప్పటికే ఆయా కేంద్రాలలో దిగువ స్థాయిలో పని చేస్తున్నారు. నేనొక్కడినే బయటివాడిని. స్టేషన్ డైరక్టర్ నన్ను హెచ్చరించిన విషయాలివి. (1) ప్రస్తుతం మీరు తీసుకొంటున్న స్కేలు రూ.355/- ఈ ఉద్యోగం స్కేలు రూ.350/- (2) దీనిలో పెన్షన్ లేదు, (3) ప్రస్తుతం 3 సంవత్సరాల కాంట్రాక్టు మాత్రం ఇస్తారు, (4) మీ ఉద్యోగానికి రాజీనామా చేసి రావాలి. పెద్దమనిషిగా పెద్దమనసుతో చెప్పిన మాటలవి. నేను ‘చేరుతా’నని పట్టుబట్టాను. బాలాంత్రపు రజనీకాంతరావు, ఆచార్య బిరుదరాజు రామరాజు ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులు.

మూడు నెలల కాంట్రాక్టు:

1975 ఆగస్టు 14న కళాశాల పదవికి రాజీనామా చేసి 16న కడప ఆకాశవాణిలో చేరాను. పోలీసు వెరిఫికేషన్ కోసం మూడు నెలల వరకు కాంట్రాక్టు ఇచ్చారు. తర్వాత మూడు సంవత్సరాలు కాంట్రాక్టు 1978 ఆగస్టు వరకు ఇచ్చారు. నా మీద కొందరు అనుకూల శత్రువులు – ‘పుస్తకాలు అమ్ముకొంటున్నాడ’నీ, ‘బంధువులకు బయటి ఆఫీసులలో ఉద్యోగాలిప్పించాడ’నీ డైరక్టరేట్‍కి ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ స్టేషన్ డైరక్టర్ జె.డి.బవేజాను డైరక్టరు జనరల్ ఎంక్వయిరీకి పంపారు. ఆయన నన్ను, ఫిర్యాదుదారులను విచారించారు. ఆ సాయంకాలం ఒక సూచన చేశా రాయన:

“విజయవాడ ఆకాశవాణి పంపిస్తే వెళతారా?” అన్నారు.

‘తన్నితే గారెల బుట్టలో పడ్డట్టు’ అన్న సామెత గుర్తుకు వచ్చి, “రేపు సాయంత్రమే వెళ్ళి చేరుతా” అన్నాను. ఉషశ్రీ స్థానంలో నన్ను విజయవాడ వేసి, ఆయనను కడప వేశారు. 1978 నవంబరులో విజయవాడ చేరిన 20 రోజుల్లో నన్ను మళ్ళీ కడప వేస్తున్నట్లుగా ఆర్డర్లు వచ్చాయి. ఎదురుదాడి చేసి నేను ఆ ఆర్డర్లు ఉపసంహరింపజేశాను. ఉషశ్రీ కోరిన మీదట నేను 1980 జూన్‍లో మళ్ళీ కడపకి బదిలీ మీద వెళ్ళాను.

సాహిత్య అకాడమీ డిప్యూటీ సెక్రటరీగా:

1982లో కేంద్ర సాహిత్య అకాడమీ వారు మదరాసు ప్రాంతీయ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీ పోస్టు ప్రకటించారు. చల్లా రాధాకృష్ణశర్మ మధురై కామరాజ్ యూనివర్సిటీలో చేరడంతో ఆ ఖాళీ వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, అకాడమీ అధ్యక్షులు అయిన డా. ఉమాశంకర్ జోషీ, వి.కె.గోకక్, కె. ఆర్. శ్రీనివాస అయ్యంగార్ నన్ను ఇంటర్వ్యూ చేశారు. వారు నాకిచ్చిన సూచనలు:

(1) ఎంత తొందరగా మీరు చేరగలరు?

(2) ఆకాశవాణిని ఎందుకు వదులుతున్నారు?

“నేను పని చేసే ప్రొడ్యూసర్ ఉద్యోగంలో ప్రమోషన్ లేదు. ఈ పోస్టు స్టేషన్ డైరక్టర్ స్కేలులో వుంది” అని సమాధానపరిచాను. 1982లో UPSC నిర్వహించిన అసిస్టెంట్ డైరక్టరు ఇంటర్వ్యూలో నేను సెలెక్టు కాలేదని ఉత్తర్వు వచ్చింది. అకాడమీ వారు ఆర్డరు పంపారు. మదరాసు వెళ్ళి బాడుగ ఇల్లు మాట్లాడుకొన్నాను.

అనుకోని మలుపు:

UPSC చరిత్రలోనే ఎన్నడూ లేనిది, కొత్త ఖాళీల భర్తీ కోసం ప్యానల్‌లో వున్న 14మందిని ఎంపిక చేస్తూ నాకు సెలెక్షన్ ఆర్డరు పంపారు. దాని స్కేలు రూ.900/-. అకాడమీ స్కేలు రూ. 1100/- ఏమీ తోచలేదు. బెజవాడ గోపాలరెడ్డి గారితో వున్న చనువుతో సలహా అడిగాను. జీతం తక్కువైనా ఆకాశవాణిలో కొనసాగమన్నారు. విజయవాడ డైరక్టరు పి. శ్రీనివాసన్ కూడా అదే సలహా ఇచ్చారు. వారిద్దరి మాట శిరోధార్యం. అయితే కడపలోనే అసిస్టెంట్ డైరక్టరుగా చేరడం నాకిష్టం లేదు. హైదరాబాదు వెళితే బాగుండునని ఆలోచన. రాజ్యసభ సభ్యులు రహీంతుల్లా లెటర్ హెడ్ మీద అప్పటి సమాచార ప్రసార శాఖ సహాయమంత్రి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు ఉత్తరం వ్రాసి నన్ను కడపలోనే వుంచమని కోరాను. నేను కడప అడిగితే వాళ్ళు హైదరాబాద్ ఇస్తారని నా ప్రగాఢ నమ్మకం. నన్ను 1982 అక్టోబరులో హైదరాబాదుకు వేశారు.

పక్కకు తప్పుకొన్నాను:

1982 అక్టోబరు 5న చేరిన నేను 1983 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు రేడియో ప్రసంగం నిలిపివేత ఉదంతంలో నన్ను అనవసరంగా బాధ్యుడిని చేస్తారని భయపడ్డాను. కానీ పార్లమెంటులో వాడి, వేడి చర్చలు జరిగినా నన్ను కదపలేదు. దరిమిలా లీలా బవ్‌డేకర్ స్టేషన్ డైరక్టర్‍గా వచ్చాను. ఆమె చండశాసనురాలు. ప్రోగ్రామ్ అధికారులకు, ఆమెకు మధ్య నేను ఒక వారధి. ఆమె ధాటి తట్టుకోలేక నేనే కోరి వాణిజ్య ప్రసార విభాగాధిపతిగా అక్కడే చేరాను. శిక్షణా సంస్థ కూడా కట్టబెట్టారు.

అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావుగారితో స్టేజ్ మీద

అర్ధాంతరంగా ఢిల్లీ బదిలీ:

1985 జనవరి నుంచి 1987 జనవరి వరకు రెండు గుర్రాల స్వారీ చేశాను. శిక్షణా సంస్థలో నేను అద్భుతాలు సృష్టించాను. అది డైరక్టర్ జనరల్ దృష్టిలో పడి 1987 జనవరిలో నన్ను ఢిల్లీ లోని కేంద్ర శిక్షణా సంస్థకు మార్చారు. 1987 ఏప్రిల్‍లో ఢిల్లీలో చేరాను. మంచిగా పని చేస్తే ఆఫీసులో వచ్చే బదిలీ అది. 1988లో యు.పి.యస్.సి. ద్వారా స్టేషన్ డైరక్టర్‍గా సెలెక్ట్ అయ్యాను. ప్రొడ్యూసర్ గానే మిగిలిపోవలసిన నేను అసిస్టెంట్ డైరక్టర్ కావడం విశేషం. అలానే వుండి వుంటే స్టేషన్ డైరక్టర్‍గా మిగిలిన అధికారుల వలె నేనూ రిటైరయ్యేవాడిని. పోటీతత్వంతో డైరక్టర్‍గా ఎంపికయ్యాను.

ఢిల్లీ నుండి గల్లీకి:

పిల్లల చదువులకు మాటిమాటికీ భంగం కలుగుతూనే వుంది. ఆంధ్రాకు వెళ్ళి వారు నాన్-లోకల్ కాకుండా చూడాలని ఆంధ్రాకు మార్చమని మా డైరక్టర్ జనరల్‍ని అడిగాను. 1988లో హైదరాబాదు ట్రయినింగ్ సెంటర్‍కు మారుస్తూ కొత్తగూడెం కేంద్ర ప్రారంభ బాధ్యతలు అప్పగించారు. ఒక పెళ్ళి విందులో మా ఆవిడ ఈ అర్ధాంతర మార్పు బాగులేదని వచ్చే రాని హిందీలో ప్రశ్నించింది. వెంటనే ఆర్డర్లు మార్చారు. కొత్తగూడెం ప్రారంభం చేసి రెండు నెలల్లో తిరిగి ఢిల్లీ వచ్చేశాను. 1990 ఆగస్టులో కొత్తగా పెట్టబోయే అనంతపురం కేంద్ర డైరక్టర్‌గా వేశారు. పెద్దబ్బాయి రమేష్‌ను ఇంజనీరింగ్‍లో కోపర్గాంలో చేర్చి మిగతా ఇద్దరు పిల్లలు – అమ్మాయి బి.యస్.సి. రెండో సంవత్సరం, అబ్బాయి ఇంటర్‍లో చేరారు. చిన్న పట్టణమే అయినా సర్దుబాటుగా పనులు కొనసాగించి 1991 మేలో ఆకాశవాణి ప్రారంభోత్సవం చేయించాను. మా అమ్మాయి వివాహం కూడా అదే నెలలో ఘనంగా జరిపాము. మూడేళ్ళు అనంతపురంలో గడిపి 1993 ఏప్రిల్‍లో కోరి కడప డైరక్టర్‍గా వెళ్ళాను. రెండేళ్ళ కొకసారి నేనే కోరి బదిలీపై వెళతాను. 1995లో హైదరాబాద్ డైరక్టర్‍గా వేయమని కోరాను. వేయలేదు. 1995 మార్చిలో విజయవాడ వేశారు. అయినా నా చూపు హైదరాబాదు పైనే.

భగవంతుని చూపు మరోలా వుంది:

హైదరాబాద్ వేయలేదనే ఆవేదనలో వుండగా అనూహ్యంగా మా డైరక్టర్ జనరల్ కెజ్రివాల్ నన్ను ఢిల్లీ స్టేషన్ డైరక్టర్‍గా నియమించారు. 50 ఏళ్ళ తరువాత నియమింపబడిన తెలుగువాడిని నేనే. 1997 అక్టోబరు నుండి 2000 జూన్ వరకు డైరక్టర్‍గా పనిచేశాను. 18 సంవత్సరాలు క్లాస్ వన్ అధికారిగా వుంటే తర్వాతి ప్రమోషన్ డిప్యూటీ డైరక్టర్ జనరల్ రావాలి. ఇవ్వలేదు. CATలో కేసు వేసి గెలిచాను. 2001 ఆగస్టులో ప్రమోషన్ ఇచ్చి దూరదర్శన్ వేశారు. నేను ఆకాశవాణిలోనే వుంటానని వ్రాసి ఇచ్చాను. మా మంత్రిణి సుష్మా స్వరాజ్ పిలిపించి భరోసా ఇచ్చారు. చేరిపోయాను.

స్వామి సేవలో:

2005 ఫిబ్రవరి 28న దూరదర్శన్ నుండి (58 సంవత్సరాలకే – అసలు వయస్సు) రిటైరయ్యాను. విమానాశ్రయంలో కలిసిన తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి, సౌజన్యమూర్తి అయిన ఏ.పి.వి. నారాయణశర్మ గారి సౌజన్యంతో దృశ్య శ్రవణ ప్రాజెక్టులో కోఆర్డినేటర్‍గా 2005 మేలో చేరాను. స్వామి సేవలో ఐదేళ్ళూ పని చేసే భాగ్యం, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ లైసెన్సు సంపాదించే విషయంలో చొరవగా పని చేసి అప్పటి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, కార్యనిర్వహణాధికారి కె.వి.రమణాచారి ప్రశంసలందుకొన్నాను. రిటైరైన వారిని తొలగించండి – అనే కోర్టు ఆర్డరుతో 24 మందిమి 2010 జూన్‍లో బయటపడ్డాము.

నా షష్టిపూర్తి మహోత్సవంలో

మలుపు తిప్పిన ప్రిన్సిపాల్ పదవి:

2011 జూన్‍లో అనూహ్యంగా హైదరాబాదులోని నారాయణ IAS అకాడమీ వ్యవస్థాపక ప్రిన్సిపాల్ చేరాను. కేవలం ఒక్క సంవత్సరమే పని చేస్తానని 2012 జూన్‍లో బయటకొచ్చాను. గత దశాబ్ది కాలం నా జీవితంలో కొత్తమలుపు. అధ్యాపకుడిగా జీవితం కొనసాగించవల్సిన నేను రేడియోలో 25 సంవత్సరాలు పనిచేశాను. అయిష్టంగానైనా ఐదేళ్ళు దూరదర్శన్ పదవి తప్పలేదు. 2011 నుండి 2020 డిసెంబరు వరకు సరిగ్గా ఒక దశాబ్దం పాటు సివిల్స్ కోచింగ్ సెంటర్లలో బాధ్యతలు వచ్చాయి. హైదరాబాద్ స్టడీ సర్కిల్, ఆర్.సి.రెడ్డి, లా ఎక్స్‌లెన్స్ సంస్థలలో పాఠాలు చెప్పాను. ‘ఉద్యోగ సోపానం’ సంపాదకులు సురేష్ కోరిక మేరకు వందకు పైగా వ్యాసాలు వ్రాశాను. తెలుగు అకాడమీ, జి.వి.కె. పబ్లికేషన్స్, 21st సెంచరీలకు సివిల్స్‌కి సంబంధించి 10 పుస్తకాలు వ్రాశాను.

21 సెంచరీ లోకి:

కృష్ణ ప్రదీప్ అనే ‘విజనరీ’ కోరిక మేరకు 2019 జూన్‌లో శంషాబాద్‌లోని 21 సెంచరీ IAS అకాడమీలో అకడెమిక్ డీన్‌గా చేరాను. గత ఏడెనిమిది సంవత్సరాలుగా వారి సంస్థలో పాఠాలు చెబుతున్నాను. మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించాను. రోణంకి గోపాలకృష్ణ, కార్తీక్ వంటి అభ్యర్థులు ఐ.ఎ.ఎస్.లో విజయకేతనం ఎగురవేశారు.

పాదాభివందనం:

21 సెంచరీ పక్షాన గ్రూప్-II తెలంగాణా అభ్యర్థులకు 2019లో మాక్ ఇంటర్వ్యూలు వంద మందికి పైగా నిర్వహించాము. దాదాపు 32 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. Success Meetలో ఒకరిద్దరు నాకు పాదాభివందనం చేస్తే ‘జన్మ ధన్యమైంది’ అనిపించింది. 74 ఏళ్ళు నిండి 2021 జనవరి 29న వజ్రోత్సవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను.

ధన్యోస్మి భగవాన్! నీ కరుణాకటాక్షం ఇలానే ప్రసరింపజేయి! శుభమస్తు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here