గోవా సముద్రపు అనుభూతులు

0
12

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘గోవా సముద్రపు అనుభూతులు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]గో[/dropcap]వా సముద్రంలో ఆటలు అంటే పర్యాటకులకు ఎంతిష్టమో! గోవా సముద్రమంటే ఏంటో తెలుసా? అరేబియా సముద్రం. ఈ అరేబియా సముద్రం నూట యాభై కిలోమిట్లర్ల తీరాన్ని గోవాలో కలిగి ఉన్నది. అరేబియా సముద్రమంటే ఏమిటనుకున్నారు? హిందూ మహా సముద్రంలో ఒక భాగం అన్నమాట. గోవాలో చాలా బీచ్‌లు ఉన్నాయి. పాలోలెమ్ బిచ్, అగోండా బీచ్, బాగా బీచ్, కోవలోసియమ్ బీచ్, ఆరంబోల్ బీచ్, వర్కా బీచ్, కాండోలిమ్ బీచ్, బెన్ క్యులిమ్ బీచ్, మార్జిమ్ బీచ్, కోలంగూట్ బీచ్, కోల్వా బీచ్, మాండరిమ్ బీచ్ అనేవి గోవా లోని ప్రసిద్ధ బీచ్‌లు.

గోవా అరేబియా సముద్ర తీరాన ఉంటుంది. అరేబియా సముద్ర తీరాన్ని ఆనుకుని ఉండే నగరాల్లో ముంబయి, కరాచీ ప్రసిధ్ధమైనవి. గోవాకు సరిహద్దులుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఉటాయి. మేము మొదటి సారిగా గోవా వెళ్ళినపుడు ఉడిపి నుంచే వెళ్ళాము. ఉడిపి నుంచి మాడ్గావ్‌కు రైల్లో వెళ్ళాము.

ఆరంబోల్ బీచ్

గోవా రాజధాని పనాజీ నగరం. గోవాను ‘పోర్చుగీసు ఇండియా’ అని కూడా అంటారు. గోవాను గోమంతక్ అని కూడా పిలుస్తారు. గోవారాష్ట్రం, గోపకపురి, గోమంచాల, గోపక పట్టణం అనే పేర్లు గోవాకు ఉన్నాయి. ఈ పేర్లు మహాభారతం లోనూ, ఇంకా పురాతన గ్రంథాలలోనూ చెప్పబడ్డాయి ఈ గోవాను పోర్చుగీసు వారు 16వ శతాబ్దంలో ఆక్రమించుకున్నారు. 450 ఏళ్ళ తర్వాత గోవాను సైనిక చర్య తర్వాత భారతదేగం తిరిగి తీసుకున్నది. 1498లో తొలి ఐరోపా వర్తకుడు వాస్కోడగామా గోవాను చేరాడు. భారతదేశానికి స్వాతంత్య్ర్యం వచ్చాక కూడా గోవాను పోర్చుగీసు మనకు ఇవ్వలేదు. అందువల్ల 1961లో భారతదేశం సైనిక చర్య జరిపి గోవా, డయ్యు, డామన్ లను అధీనం లోకి తెచ్చుకుంది. అయినప్పటికీ పోర్చుగీసు ప్రభుత్వం 1987 దాకా గోవాను భారతదేశానికి అప్పగించలేదు. 1987 మే 30వ తేదిన గోవాను కేంద్ర పాలిత ప్రాంతం నుంచి భారతదేశంలోని రాష్ట్రంగా మార్చారు. ఇది భారతంలో 25వ రాష్ట్రంగా ఏర్పడింది. గోవాలో ఐదు నదులు పారుతూ ఉన్నాయి. పడమటి కనుమల్లో ఉన్న గోవాను కొంకణ తీరమని అంటారు. ఇక్కడి అధికార భాషలు కొంకణ, కన్నడ భాషలు. విస్తీర్ణపరంగా ఇది భారతదేశంలోని రెండవ చిన్న రాష్ట్రంగా ఉన్నది. జనాభా పరంగా గోవా నాలుగవ చిన్న రాష్ట్రంగా ఉన్నది.

అరేబియా సముద్రాన్ని వేదకాలంలో ‘సింధూ సాగరం’ అని పిలిచేవారు. భారతదేశం, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమన్, ఒమన్, పాకిస్తాన్ మొదలైన దేశాలన్నీ అరేబియా సముద్రానికి ఎల్లలుగా ఉన్నాయి. అరేబియా సముద్రాన్ని అరబ్బీ సముద్రం, అరబ్ సాగర్ అని కూడా షేర్లున్నాయి. నావికులు, సంచార జాతుల వారు ఈ సముద్రాన్ని ఆకుపచ్చ సముద్రం, పర్షియన్ సముద్రం, ఒమన్ సముద్రం అని పిలుస్తారు. అరేబియా సముద్రంలో అనేక ద్వీపాలున్నాయి. భారతదేశంలోని లక్షద్వీప్ దీవులు అరేబియా సముద్రం లోనే ఉంటాయి. అంతేకాక పాకిస్తాన్ లోని అస్టోలా ద్వీపం, ఒమన్ లోని మసిరా ద్వీపాలు, యెమన్ లోకి సాకోత్రా ద్వీపాలు కూడా ఉన్నాయి. భారతదేశ నైరుతీ తీరంలో 200 నుండి 440 కి.మీ.ల దూరంలో లక్షద్వీప్ దీవులున్నాయి.

కోలంగూట్ బీచ్

మేమొక డెస్టినేషన్ వెడ్డింగ్‌కు గోవాకు వెళ్ళాము. మేము గోవా ఇంటర్సేషనల్ ఎయిరో పోర్టులో దిగాము. ఇంతకు ముందు అంటే మేము మొదటిసారిగా గోవా వెళ్ళినపుడు ‘డాబోలిన్ ఎయిర్ పోర్టు’ అనే పేరుతో ఉన్నది. ఇప్పుడు గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే కారు తీసుకుని మా రూమ్‌కు చేరాము. ఈ రూము సముద్రం అంచున కట్టబడిన హోటల్లో ఉన్నది. రూములో నుంచి బయటకు వస్తే సముద్రం నీళ్ళతో కాళ్ళు తడుపుతున్నది. సముద్ర నీళ్ళలో నుంచే వివాహ వేదికను పైకి ఎత్తుగా కట్టారు. నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది. నేను ఇలా సముద్రపు వేదికపై పెళ్ళిని తొలిసారిగా చూస్తున్నాను. పెళ్ళి రాత్రి పూట. ముహుర్తం పదకొండు గంటలకు జరుగుతుంది. కాబట్టి అందరం ఏడు గంటలకు తయారయ్యాం. అప్పటికే పెళ్ళి మండపంలో పెళ్ళి కూతురు హడావిడి మొదలయింది. మండపానికి రెండు వైపులా రూములున్నాయి. పెళ్ళి మండపం కిందంతా సముద్రపు నీరే. సముద్రం సాక్షిగా పెళ్ళి జరుగుతన్నట్లనిపించింది. పూలమాలలు, సీరియల్ బల్బుల అలంకరణలతో ఆవరణ అంతా మిరుమిట్లు గొలుపుతూ ఉన్నది. పెళ్ళి మంత్రాలు, వాయిద్యాలతో సందడిగా ఉన్నది. మధ్యలో కుర్చీలు వేసి ఉన్నాయి. ఎదురుగా ఉన్న రూముల్లో విదేశీయులు ఉన్నారు. భారతీయుల పెళ్ళి ఎలా ఉంటుందో అని వాళ్ళు ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. నేను పట్టుచీర కట్టుకుని, నగలు వేసుకుని, తలలో పూలు పెట్టుకుని తయారయ్యాను. అందరం రూములో నుంచి బయటకు వచ్చి పెళ్ళి మంటపం దగ్గరకు వెళుతున్నాం. అంతే ఐదారుగురు విదేశీ వనితలు ముందుకు వచ్చి నన్ను చుట్టుముట్టారు. “మీతో ఫోటో తీసుకోవచ్చా”  అని మర్యాదగా అడిగారు. నేను ఆశ్చర్యంగా నిలబడి పోయాను. ఎక్కడైనా మన భారతీయులు పోటో తీసుకుంటామని విదేశీయుల్ని అడుగుతారు కదా! వాళ్ళంతా నాతో పోటోలు తీసుకున్నారు. అలా విదేశీ వనితలు నాతో ఫోటో తీసుకోవడం నాకు ఆనందంగా ఉన్నది. భారతీయుల కట్టు బొట్టు విదేశీయులకు ఎంతిష్టమో అర్థం అయింది. నాకు చైనాను సందర్శించిన మొదటిసారే ఈ విషయం అర్ధం అయింది.

పెళ్ళి వేడుకలు చూస్తూ ఆనందిస్తున్నాం. నార్త్ ఇండియన్స్ వాళ్ళ పెళ్ళి కావటంతో డాన్సులు బాగా చేస్తున్నారు. మేము కూడా డాన్సులతో పాటలతో పెళ్ళిని బాగా ఎంజాయ్ చేశాం. పెళ్ళిలో ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలు చూపిస్తునారు. గోవా సముద్ర తీరంలో ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ చాలా బాగా వచ్చాయి. ఇసుకలో సీతాకోక చిలుక బొమ్మను గీసి మధ్యలో పెళ్లి కూతుర్ని పడుకోబెట్టి ఫోటోలు తీశారు. ఉయ్యాల బొమ్మను గీసి వధూవరులను ఊగుతున్నట్లుగా పెట్టి ఫొటోలు అద్భుతంగా తీశారు. సముద్ర తీరంలో ఇలాంటి ఫోటోలు తీయవచ్చనే ఆలోచనే అద్భుతంగా ఉన్నది. మా చిన్నతనంలో మా ఊరి సముద్రంలో మా పేర్లు రాసుకుని ఆనందించే వాళ్ళం. వేళ్ళతో గీస్తూ, బొమ్మలు వేస్తూ, అవి సముద్ర నీళ్ళకు కొట్టుకుపోతుంటే సరదాగా నవ్వుకునే వాళ్ళం.

కాండోలిమ్ బీచ్

ఉదయం నిద్రలేచి సముద్రుపు ఒడ్డున వాకింగ్‌కు వెళ్ళాం. తెల్లని ఇసుకలో చాలా గవ్వలు కనిపించాయి. ఇక్కడ చిన్న చిన్న గవ్వలు బోలెడు దొరికాయి. వాటిని ఏరుకుని కవర్లో వేసుకున్నాను. సముద్రపు ఒడ్డున వాకింగ్ చెయ్యడం చాలా గమ్మత్తుగా అనిపించింది. చిన్నచిన్న నీటి పాయలు మధ్యలో కనిపించాయి. మామూలు నీటి పాయలే అనిపించి కాలు వేయగానే మొకాలు లోతు వరకు కూరుకు పోయింది. చాలా భయమేసింది. సముద్రపు ఒడ్డునే ఇలాంటి అనుభవాలు వస్తే కొద్దిగా లోపలకు వెళ్తే పరిస్థితి ఏమిటో. ఇదంతా చూస్తూ నడుస్తున్న మాకు రాత్రి వేసిన పెళ్ళి మండపం కనిపించింది. అక్కడ నీళ్ళే లేవు. సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. అంటే రాత్రపూట చివరిదాకా ఉన్న సముద్రపు నీళ్ళు ఉదయం పూట చాలా లోపలికి వెళ్ళిపోతాయన్నమాట. అద్భుతమైన అనుభవాలు ఇవి. నేను ఏరుకున్న గవ్వలతో బొమ్మలు చేస్తాను. అది నాకిష్టం గోవా సముద్ర గవ్వలు అని బొమ్మలు చేస్తాను. నాపు హిందూ మహాసముద్రం, బంగాళా ఖాతం నుంచి గవ్వలు తెచ్చుకున్నాను. గోవా సముద్రం లోని అమర తీర ప్రాంతపు ఇసుక తెల్లగా ఉంటుంది.

సముద్రంతో అనుభూతులు, అనుభవాలు అద్భుతంగా అనిపించాయి.

Images Credit: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here