గోడతో మాట్లాడే మనిషి

3
7

[శ్రీలంక తమిళ రచయిత శ్రీ అప్పాదురై ముత్తులింగం రచించిన కథని తెలుగులో అందిస్తున్నారు శ్రీ అవినేని భాస్కర్]

[dropcap]కె[/dropcap]నడా వచ్చాక నేను ఎదుర్కొన్న సమస్యల్లో ఒకటి జుట్టు కత్తిరించుకోవడం. నేను ఉంటున్న ఇంటికి నాలుగు నిముషాల దూరంలోనే బార్బర్ షాప్ ఉంది. గత ఏడేళ్ళుగా నెలకు కనీసం ఒకసారైనా అక్కడికి ‌వెళ్ళి ఉంటాను. యజమాని ఇటాలియన్, పేరు రోని. అతనూ అతని ఇద్దరు సహాయకులూ అక్కడ క్షవరం చేస్తుంటారు.

రోని స్నేహశీలి. అతని జుట్టు చిందరవందరగా ఉంటుంది. నేను అతని దగ్గరే క్షవరం చేయించుకునేవాడిని.  “ఏంటి మీ జుట్టు ఎప్పుడూ చిందరవందరగానే ఉంటుంది? అది చూస్తే వచ్చిన కష్టమర్లు పారిపోతారేమో” అని నవ్వుతూ ఆట పట్టించేవాడిని.

అతను “ఏం చెయ్యను! నాలాంటి ఒక మంచి బార్బరు దొరికితే నా తలని అతని చేతిలో పెట్టేసేవాడిని. ఇక్కడ ఎవరికీ సరిగ్గా పని చేతకాదు. అందుకే నేను వీలైనన్ని రోజులు వాయిదా వేసుకుంటూ ఉంటాను” అని జవాబిచ్చాడు.

నేను కూడా రోనీలాగే! అతని సహాయకుల చేతుల్లో నా తలను పెట్టను.

వచ్చిన కస్టమర్లతోబాటు నా వంతు వచ్చేంతవరకు అతనికోసం ఎదురు చూస్తుంటాను. రోని దగ్గర నాకు నచ్చేది అతని శ్రద్ధ, పనితనం. ‘ఎలా కత్తిరించాలి, ఏ సైజు క్లిప్ వాడాలి, మూపు దగ్గర గుండ్రంగా ఉండాలా కోలగా ఉండాలా?’ అన్న ప్రశ్నలతో విసిగించడు. తన దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్‍కీ ఎలా కత్తిరించాలి అన్న వివరాల పట్టిక అతని మెదడులోనే ఉంటుంది. టైలర్ దగ్గర, డాక్టర్ దగ్గరా తన కస్టమర్‍ల వివరాలు ఉన్నట్టు. ఆ వివరాలతో పని చక్కగా పూర్తి చేసి పంపిస్తుంటాడు.

అతని దగ్గర నాకు నచ్చని ఒక అంశం కూడా ఉంది. రోని క్రీడాభిమాని. తను జుట్టు కత్తిరించేప్పుడు ముందురోజు జరిగిన ఐస్ హాకీ గురించో బేస్కెట్‍బాల్ గురించో లేదా బేస్‍బాల్ గురించో ఆపకుండా మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఆటల గురించి తెలియదు అని అంటే కెనడాలో పురుగుని చూసినట్టు చూస్తారు. కాబట్టి, ముందురోజే నన్ను నేను తయారు చేసుకోవాలి. టీవీలో స్పోర్ట్ న్యూస్ చూసి ముఖ్యమైన వివరాలు రాసిపెట్టుకునేవాడిని. మర్నాడు క్షవరం చేయించుకునేటప్పుడు ఆటలో జరిగిన  ఏదో ఒక సంఘటన గురించి మాట్లాడేవాణ్ణి. అతని హుషారు కలిగేది. ఆ రోజు నా జుట్టు మరింత చక్కగా కుదిరేది.

అయితే ఈ నాటకాన్ని ఎంతకాలం కొనసాగించగలను? నాకూ విసుగనిపించింది. ఇక నేను జుట్టు కత్తిరించుకోడానికి మరో చోటికి వెళ్ళడం మొదలు పెట్టాను. అది మా ఇంటినుండి ఇరవై నిముషాల దూరంలో ఉండే పెద్ద క్షౌరశాల. అందులో ఆడవాళ్ళ విభాగం కూడా ఉంది. జనం రావడం పోవడం అంటూ రద్దీగా ఉంటుంది. నోరు అసలు మెదపకుండా జుట్టు కత్తిరిస్తున్న ఒక క్షురకుడి దగ్గరకు వెళ్ళి జుట్టు కత్తిరించుకోవాలి అన్న ఆలోచనతో కూర్చుని ఉన్నాను. నా వంతు వచ్చినప్పుడు, బుధవారం అని రాసున్న ఏప్రాన్‍ని గురువారం రోజున తొడుక్కుని జుట్టు కత్తిరిస్తున్న యాభైయేళ్ళ వయసున్న క్షురకుడు నా జుట్టు కత్తిరించడానికి సిద్ధంగా ఉన్నట్టు పిలిచాడు. ఒక రోజు వెనకబడిన మనిషయినప్పటికీ తలను ఒక పక్కకు వాల్చి చిరునవ్వు చిందిస్తూ పిలిచిన తీరు నాకు బాగా నచ్చింది.

అతను నోరు తెరవలేదు. యజ్ఞం చేసేవాడి శ్రద్ధకు ఏ మాత్రం తీసిపోనంత ఏకాగ్రతతో జుట్టు కత్తిరించాడు. అయ్యాక అద్దంలో చూస్తే చక్కగా కుదిరింది. నైపుణ్యంగల పనివాడన్నదాంట్లో ఎలాంటి సందేహమూ లేదు. అతని చేతులు సీతాకోకచిలుక రెక్కలంత వేగంగా, సుకుమారంగా కదిలాయి. తలలో ఉన్న లక్షలాది వెంట్రుకల్లో ప్రత్యేకించి ఏ ఒక్క వెంట్రుకనో కావాలంటే కూడా వెతికి పట్టి కత్తిరించగల లాఘవం ఉంది అతని చేతులకి. అంతటి ఉపాయమెరిగిన పనిమంతుడు.

మరుసటి సారి వెళ్ళినప్పుడు కూడా నాకు అతనే జుట్టు కత్తిరించాడు. ఆ తర్వాత సారి వెళ్ళినప్పుడు వరుసలో నా వంతు వదులుకుని మరీ అతనికోసం కాచుకుని ఉండి జుట్టు కత్తిరించుకోడానికి నా తలను అతని చేతికి ఇచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. అతను చూడటానికి మిడిల్ ఈస్ట్ ప్రాంతపు వాడిలా అనిపించాడు. తేనెరంగు కళ్ళు, నల్లటి జుట్టు. అతని కట్టు, బొట్టు, నడవడులలో ఏదో వ్యత్యాసం కనిపించింది. అతని ఉచ్చారణ కూడా అరబ్బు దేశస్థుల ఉచ్చారణలా ఉంది.

ఆరోజు ఆడవాళ్ళ విభాగంనుండి మోడరన్ దుస్తులు ధరించిన ఒక అమ్మాయి ఇతని దగ్గరకు వచ్చింది. నల్ల షూస్, ఎర్ర గ్లౌజులు వేసుకున్న ఆమెను చూడగానే ఆమె అరేబియన్ అని చెప్పేయొచ్చు. వయసు ముప్పైలోపే ఉంటుంది. అధికారం చేసే ధోరణికే అలవాటు పడిపోయినట్టు ఒక చేయిని నడుముమీద పెట్టుకుని నిల్చునుంది. అరబిక్ భాషలో అతనితో ఏదో గబగబా చెప్పింది. అతను ఒకే మాటతో జవాబిచ్చాడు. ఆమె మళ్ళీ ఆపకుండా గబగబా గొలుసుకట్టు రాత వాక్యాలను చదువుతున్నట్టు పొడవుగా మాట్లాడింది. అతను మళ్ళీ క్లుప్తంగా జవాబిచ్చాడు. ఆమె మళ్ళీ ఏదో అడగితే “నీకు వినిపించలేదా! నాకు అరబిక్ రాదు” అని ఆంగ్లంలో గట్టిగా అన్నాడు. గుఱ్ఱం పక్కకు తప్పుకున్నట్టు ఆమె చిరాగ్గా అక్కడినుండి వెళ్ళిపోయింది.

అందరూ ఆమెనే చూశారు. క్షణం క్రితం అక్కడ ఏమీ జరగనట్టే మామూలుగా ఆతను నా జుట్టు కత్తిరిస్తున్నాడు. నా అంతట నేనే అతనితో మాటలు కలిపాను. అతను ఇరాక్‍నుండి యుద్ధానికి పూర్వం సద్దాం హుసేన్ కాలంలో కెనడాకు వలస వచ్చినవాడు. ఆ అమ్మాయి  హెయిర్ డ్రసింగ్ కోసం వచ్చింది. ఆమెకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. ఆమె మాట్లాడే అరబిక్ భాషను ఇంగ్లీష్‍లో అనువాదం చేసి చెప్పమని అడగటానికి వచ్చింది. అతను తనకు అరబిక్ రాదు అని చెప్పాడు. ఇరాక్‍నుండి వలసవచ్చిన వ్యక్తికి అరబిక్ రాదు అన్నది ఆమె నమ్మలేదు. అందుకే కోపంతో వెనుకకు తిరిగింది.

నాకూ ఆశ్చర్యమే. నేను మొట్టమొదటిసారి కలిసిన ఇరాక్ దేశస్థుడు ఇతనే. ఆదికావ్యంగా చెప్పబడే గిల్గమేష్ సాహిత్యం ఉద్భవించిన దేశం అది అని ఇరాక్ మీద నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. నాలుగువేల ఏళ్ళకు పూర్వం సుమేరియన్ భాషలో మట్టి పలకలమీద రాయబడిన కావ్యం అది. ఇప్పటికీ ఆ మట్టి పలకల్ని కాపాడుకుంటున్నారు.

నేను అతన్ని “మీకు అరబిక్ ఎందుకు రాదు?” అని అడిగాను.

“నేను ఇరాక్‍లో పుట్టానుగానీ పెరిగినదంతా విదేశాల్లోనే. మా నాన్న ఇరాన్, సిరియా వంటి దేశాల్లో ఉద్యోగం చేశారు. నేను ఇంజినీరింగ్ చదువుకున్నాను. ఇరాక్‍లో బతకడం వీలు కాక శరణార్థిగా కెనడాకు వచ్చేశాము. నా కొడుకు ఇప్పుడు మరో దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. నేను ఇక్కడ ఒక్కడ్నే ఉంటాను” అని సెలవిచ్చాడు.

“ఇంజినీరింగ్ చదివి ఈ ఉద్యోగానికి ఎలా వచ్చారు?”

“నేనే కాదు, నాలా చాలా మంది ఇక్కడికి శరణార్థులుగా వచ్చి వాళ్ళ చదువుకు సంబంధంలేని పనులే చేస్తున్నారు. ఇంగ్లీష్‍లో మళ్ళీ ఇంజినీరింగ్ చదివితేగానీ ఇక్కడ ఇంజినీర్‍గా ఉద్యోగం రాదు. మరోసారి ఇంజినీరింగ్ చదవడం వీలు కాలేదు. నాకు ఈ వృత్తిమీద కొంత ఆసక్తి అని కూడా చెప్పొచ్చు. మూడు నెలల శిక్షణతో నాకు క్షవరం బాగా వచ్చేసింది. ఇది కూడా ఇంజినీరింగ్‍ లాంటిదే. గొప్ప కళ. ప్రతిరోజూ సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయానికి ఆ రోజుకంటూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే ఉంటాను.”

నేను నమ్మలేకపోయాను. ఈ మనిషిని ఆశ్చర్యంగా చూశాను. వెచ్చని చిరునవ్వు చెదరకుండా శ్రద్ధగా పనిలో నిమగ్నుడయి ఉన్నాడు.

“మీరింకా నా తొలి ప్రశ్నకు జవాబు చెప్పలేదు. మీరు ఏం భాష మాట్లాడుతారు?”

“నేను చదువుకుంది పెర్షియన్. అది వృత్తికోసం. ఇంట్లో అరమియాక్ మాట్లాడుతాం.”

“అరమియాకా? అలాంటి భాష గురించి ఎప్పుడూ వినలేదే!”

“అలాంటొక భాష ఉంది. మా అబ్బాయికి వచ్చు. నా భార్య, నేను ఇంట్లో అదే మాట్లాడే వాళ్ళం. గత ఏడాది మా ఇంటావిడ పోయింది. నాకు ఇప్పుడు మా భాష మాట్లాడడానికి ఇక్కడ ఎవరూ లేరు. కెనడాలో అరమియాక్ మాట్లాడేవాళ్ళు కొందరు ఉన్నారు అని విన్నాను. అయితే వాళ్ళను ఎవర్నీ వెతికి పట్టుకోలేకపోయాను.”

“ఆ భాష మాట్లాడే దేశం ఏదైనా ఉందా?”

“అలాంటిది ఉంటే అదో మహత్తరమైన వరం కదా! నేను సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్‌కి చెందిన క్రైస్తవుణ్ణి. సద్దాం పాలనలో మాపై జరిగిన ఘోరాలు, అకృత్యాలు మాటల్లో చెప్పలేము. ప్రపంచం అంతటా ఇప్పటికీ ఒక మిలియన్ మంది అరమియాక్ మాట్లాడుతారు. అయితే దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళంతా ఎన్నో దేశాల్లో మూలకొకరు ఉన్నారు. ఒక్కచోట లేరు. వాళ్ళకంటూ ఒక దేశంలేదు. చెల్లాచెదరయ్యి ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, లెబనాన్, సిరియా లాంటి ఎన్నో దేశాల్లో చిన్న చిన్న సమూహాలుగా బతుకుతున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా అణచివేయబడ్డ వాళ్ళే. ప్రపంచానికి మొట్టమొదటి సారి సంక్షిప్త పాలనాచట్టాలను అందించినవాడు 3700 సంవత్సరాలక్రితం బ్రతికిన మా రాజు హమ్మురాబి. అణచివేయబడినవాళ్ళను రక్షించడానికోసం చట్టాలు రాశాడు. అయితే మేము ఇప్పడు అణచివేయబడుతూ, తరిమికొట్టబడుతూ చెల్లాచెదురయ్యి పొట్టలు చేతబట్టుకుని దేశాలు తిరుగుతున్నాం.”

“కెనడా మీరు ఎంచుకున్న దేశమే కదా! ఇక్కడ మీకు అన్ని రకాల స్వేచ్ఛా ఉంది కదా?”

“మిత్రమా, ఇది స్వర్గమే! సందేహమే లేదు. ఇక్కడికి వచ్చాక అనిపించింది, ప్రపంచ దేశాల్లో అణచివేయబడిన ప్రతి ఒక్కరూ ఒకే ఒక్క రోజైనా కెనడాలో జీవించి చూడాలి అని. అప్పుడే వాళ్ళకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడంలోని హాయి ఏంటో తెలుస్తుంది. అయితే మా భాష విషయం మాత్రం నన్ను బాధపెడుతూనే ఉంటుంది. మా భాష అంతరించిపోతోంది. ఎక్కెడెక్కడైతే మా వాళ్ళు ఉంటున్నారో అక్కడంతా మా భాష మరుగున పడిపోతోంది. ‘అంతరిస్తున్న భాషగా’ మా భాష ఇప్పటికే ప్రకటించబడింది. కొన్ని ఏళ్ళలో అంతరించిపోవచ్చు.”

“అంత కచ్చితంగా ఎలా చెప్పగలరు?”

“అలాగే ప్రకటించారు మరి. రాత్రి వేళల్లో మా ఇంటికి వచ్చారంటే నేను అరమియాక్ పుస్తకాలు చదువుతూ ఉంటాను. గోడలతో అరమియాక్‍లో మాట్లాడుతు ఉంటాను. అలవాటు తప్పిపోతుందేమోనన్న భయం. నేను మాట్లాడుతూ ఉన్న ప్రతి నిముషమూ నా భాష సజీవంగా ఉంటుంది.”

జుట్టుకత్తిరించడం ఆపి కొంచం దూరం జరిగి తలను రెండు వైపులకీ వాల్చి నా జుట్టును క్షుణ్ణంగా చూశాడు. తర్వాత ముఖాన్ని చూశాడు. “షాంపూ చెయ్యనా?” అని అడిగాడు. నేను సంభాషణ కొనసాగడంలో ఆసక్తితో సరేనని తల ఊపాను.

“నేను చాలా మాట్లాడేశాను. మీరు ఏ దేశస్థులు, ఏం భాష మాట్లాడుతారు అనేది చెప్పలేదే?”

“నేనూ మీలాగే. నేను మాట్లాడేది తమిళభాష. శ్రీలంకకు చెందినవాడిని. అక్కడ మా భాషను సింహళం కబళించేస్తుంది.”

“మీ భాష గుంచి విన్నాను. అది ప్రాచీనమైన భాషే కదా?”

“అవును. రెండువేల ఏళ్ళనాటి ప్రాచీన సాహిత్యం మా భాషలో ఉంది. ఏసు క్రిస్తు పుట్టడానికి 300 ఏళ్ళకు ముందే బ్రాహ్మి లిపిలో లిఖించబడిన శిలాశాసనాలు గుహల్లోనూ తవ్వకాల్లోనూ లభించాయి. నేటికీ పలు దేశాల్లో ఎనభై మిలియన్‍ల మంది తమిళం మాట్లాడుతున్నారు.”

“ఎనభై మిలియన్‍? నమ్మశక్యంగా లేదు. మా భాషతో పోలిస్తే సంఖ్య ఎనభైరెట్లు ఎక్కువే! అదృష్టం చేసుకున్న భాషే! మీకంటూ దేశం ఉందా?”

“లేదు”

“మీ భాషలో జాతీయ గీతం ఉందా?”

“లేదు”

“అయితే మీ భాషకూ నా భాషకూ పెద్ద తేడా లేదు.”

“అలా అనేశారేంటి?”

“అది అంతే”

“అంత నిర్దిష్టంగా ఎలా చెప్తున్నారు?”

“చరిత్ర చదివితే మీకే తెలిసిపోతుంది. క్రీస్తు పుట్టడానికి 1000 ఏళ్ళకు ముందే హీబ్రూ, అరమియాక్ భాషలు పరిపక్వత చెంది  సమాన స్థాయిలో సాహిత్యం పుష్కలంగా ఉండేది. రెంటికీ సమానమైన వయసే. రెండు భాషల్లోనూ రాయబడిన వాఙ్మయం నేటి వరకు రక్షించబడుతోంది. క్రమేణా రెండు భాషలూ నశిస్తూ వచ్చాయి. వందేళ్ళ క్రితం హీబ్రూ భాష అక్షరరూపంలో మాత్రమే మిగిలింది. మాట్లాడడానికి ఒక నాథుడు లేడు. ఇప్పుడు యాభై లక్షలమంది హీబ్రూ మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. ప్రాచీన సాహిత్యం చదవబడుతోంది, కొత్త సాహిత్యం రాయబడుతోంది. వాళ్ళకంటూ ఒక దేశం ఉంది. దాని పేరు ఇజ్రాయిల్. వాళ్ళ భాష ఇక ఎప్పటికీ అంతరించదు.”

“దేశం లేకుంటే ఒక భాష మనుగడ సాగించలేదు అని అంటున్నారా?”

“నేను క్షవరం చేసేవాడిని. భాషా శాస్త్రవేత్తను కాను. చరిత్రను చూస్తుంటే నాకు అనిపించింది అది. దేశం లేకే కదా నా భాష నశించిపోతోంది? దేశం ఉంది కాబట్టే హీబ్రూ భాష నశించిపోకుండా మళ్ళీ నిలదొక్కుకుని కొత్త పుంతలు తొక్కుతోంది. మీ భాష, తమిళం, తనకంటూ ఒక దేశం లేకుండానే వర్ధిల్లుతుంది అనిపిస్తుందా?”

“అయితే ఇం‍డియాలో ఒక రాష్ట్రం ఉంది.”

“రాష్ట్రం వేరు, దేశం ఉండటం వేరు. ఇవాళ ప్రపంచంలో ఉన్న అతి చిన్న దేశమైన మాల్టాని తీసుకోండి. అక్కడ మహా అయితే 400,000 మందే ఉంటారు. వాళ్ళ భాష మాల్టీష్. ఆ భాష నశిస్తుందా? నశించదు. మైలురాయి సత్యాన్ని పలికినట్టు నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ భాష అంతరించాలి అంటే ముందుగా ఆ దేశం అంతరించాలి. మీ దేశానికి దగ్గర్లో ఉండే మాల్దీవులు తీసుకోండి. వారి జనాభా 350,000 మంది. వాళ్ళ భాష దివేహి. అది అంతరిస్తుందా? 300,000 మంది ఉండే మరో దేశం ఐస్లాండ్. వాళ్ళ భాష ఐస్లాండిక్. అది అంతరిస్తుందా? లేదు. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు.”

“నమ్మటానికి కష్టంగా ఉంది. ఒక భాషను మాట్లాడే జనం పది మిలియన్‍ల మంది ఉన్నా దానికంటూ ఒక దేశం లేకుంటే అది అంతరించిపోతుంది అని అంటారా?”

షాంపూ చెయ్యడం పూర్తి చేసి దువ్వెనతో దువ్వుతూ డ్రైయర్ వేసి ఆరబెడుతున్నాడు. అతని నోరు మాత్రమే మాట్లాడుతోంది. చేతులు వేరే ఎవరివో అన్నట్టు వేగంగా వాటి పని అవి చేసుకుపోతున్నాయి.

“నాకున్న చిన్నపాటి ‍జ్ఞానాన్నిబట్టి చూస్తే అలానే అనిపిస్తుంది. ఏ భాషకైనా రక్షణ ఉండాలి. ఆ రక్షణని దేశం మాత్రమే ఇవ్వగలదు. ప్రపంచంలో 7000 భాషలున్నాయి అని చదివాను. వాటిల్లో రెండువేలకు పైబడిన భాషలు అంతరించే దశకు అతి దగ్గరగా ఉన్నాయి. మిగిలిన భాషలుకూడా వేటికైతే దేశపాలనా వ్యవస్థలో చోటులేదో, వేటినైతే పాలనా వ్యవస్థ పట్టించుకోదో అవి కూడా అంతరించిపోయే దారి పడుతున్నాయి. అన్ని భాషలనూ కాపాడలేకపోయినా వాటిని పొందు పరచాలి. డాక్యుమెంట్రీలుగా, ఆ‍డియోరూపంగా నేడు మనకున్న కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని భావితరాలకోసం పొందుపరచవచ్చు. ఒక భాష అంతరించడం అంటే ఒక జాతి, ఒక సంస్కృతి అంతరించడంతో సమానం. ఊ‍డిపోయిన జుట్టుని మళ్ళీ అతికించలేము. భాష కూడా అంతే. చరిత్రలో రూపులేఖలుకూడా లేకుండా అంతరించిపోగలదు.”

మాటలు రాక అతన్నే అలా చూస్తు ఉండిపోయాను.

“ఒక భాషయొక్క భవిష్యత్తుని ఆ భాషని మాట్లాడే జనంకాదు నిర్ణయించేది. భాష అభివృద్ధికీ మాట్లాడే జనాభా సంఖ్యకూ సంబంధంలేదు. ఒక చిన్న పరిశీలన చేసుకుని చూడండి.  గత యాభై ఏళ్ళగా మీ దేశంలోని సింహళ భాష అభివృద్ధితో తమిళభాష అభివృద్ధిని పోల్చుకుని చూడండి మీకే అర్థం అవుతుంది.”

జుట్టు పని పూర్తయ్యాక అద్దంలో చూసుకున్నాను. తృప్తిగా అనిపించింది. కౌంటర్‍లో డబ్బు చెల్లించాను. ఆ ఇరాక్ దేశ మిత్రుడి పేరు కూడా ఇప్పటిదాకా తెలుసుకోలేదు. అదేమీ అంత ముఖ్యమైన విషయం అని కూడా అనిపించలేదు.

నాకు ఒక కవి రాసిన ఈ వాక్యాలు గుర్తొచ్చాయి.

నేను మురికికాలువలో
పడి ఉన్నాను.
నా కళ్ళు
నక్షత్రాల్లో తేలుతున్నాయి.

నాకు నా భాష పట్ల ఉన్న ‌‌‌విశ్వాసాన్ని కోల్పోవాలని లేదు.

నాకు కప్పిన నల్ల గుడ్డను విప్పి పట్టుకుని ఎద్దును పందేనికి ఉసిగొలిపేవాడిలా నిల్చుని ఉన్నాడు. సొంత భాషలను కోల్పోతున్న ఇద్దరి మధ్య ఒక గుడ్డ అడ్డుగా నిలిచి విడదీసినా ఇద్దరి బాధా ఒకటే అనిపించింది. అతని నుంచి ఎలా సెలవు తీసుకోవాలో నాకు అర్థం కాలేదు.

ఆ సమయంలో ఏదైతే చెప్పకూడదో అదే చెప్పాను – “మిత్రమా, అంతరించేదశగా సాగుతున్న ఒక భాషను ఆపడానికి, ఒకే ఒక వ్యక్తి ఏమీ చెయ్యలేడు. ఈ రాత్రికి గోడతో సాగే మీ సంభాషణ శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను.”

“ఏంటి, అలా అనేశారు! ఒక భాషను అలా అంతరించిపోడానికి వదిలేస్తామా? అది ఏసుక్రీస్తు మాట్లాడిన భాష కదా!”

నేను దిగ్భ్రాంతి చెందాను. దాటుకుని వచ్చేశాకకూడా చాలాసేపు ఆ బార్బర్ షాప్ రెక్కల తలుపులు ఊగుతూనే ఉన్నాయి.

*

మూల కథ: సువరుడన్ పేసుం మనిదర్ [2008] అమెరిక్కక్కారి [2009] కథా సంపుటం.

రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్ గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్ గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలు, వ్యాసాలు, నవలలూ రాస్తున్నారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది. ఈయన రాసిన కొన్ని కథలు తెలుగులోకి అనువాదమయ్యి “ఐదు కాళ్ళ మనిషి” అన్న పేరిట అందుబాటులో ఉన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here