గొడుగూ – కొత్త ఏనుగు

1
9

[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘గొడుగూ – కొత్త ఏనుగు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“పా[/dropcap]పా, ఈ బొమ్మ ఎంత బాగుందో కదా! తీసుకుందామా?ఎంతుంటుందో.. ఓ సారి అడుగు బేబీ..”

“మరీ చిన్న పిల్లాడిలా ఈ బొమ్మలంటే ఇంత ఇష్టం ఏంటి నాన్నా మీకు..?” అని

“ఇప్పటికే అల్మెరా నిండా బోలెడు బొమ్మలు ఉన్నాయి, ఇంకో బొమ్మకైతే చోటే లేదు” అంటునే,

“సరే మీ ఇష్టం, అయితే తీసుకోండి” అని ముక్తాయించింది; పాపా, బేబీ అని పిలవబడే గంగాధర్ కూతురు సుభాషిణి.

మొత్తం పైన ఆ బొమ్మని బేరమాడకుండానే, షాప్ వాడు చెప్పినంత డబ్బు ఇచ్చి సొంతం చేసుకున్నాడు గంగాధర్.

‘ఏది కొనాలన్నా గీచి, గీచి బేరమాడే మా నాన్నేంటి ఈ రోజు ఎంతడిగే అంతిచ్చి కొనేసారు, ఆశ్చర్యం..!’ అనుకుంది సుభాషిణి. బహుశా ఆ బొమ్మ అంతగా నచ్చిందేమో అని సమాధానపడి ఊరుకుంది.

అది ఓ ఏనుగు బొమ్మ, ఆ బొమ్మ గంగాధర్‌కి అంతగా నచ్చడానికి కారణం, అటువంటి బొమ్మే ఒకటి చిన్నప్పడు తన దగ్గర ఉండేది. వాళ్లింట్లో ఉన్న బొమ్మలు రెండే.. ఒకటి అడుగెత్తులో ఉన్న ఓ వెంకటేశ్వరుడి రూపు, కొందరు దాన్ని ఎర్రచందనపు కర్రతో తయారు చేసారని చెప్పడం గంగాధర్‌కి ఇంకా లీలాగా గుర్తు. ఇంకోటి ఏనుగు బొమ్మ, అది మాత్రం ప్లాస్టిక్‌తో చేసినా నల్లగా చాలా ముద్దొచ్చేది. కాల ప్రవాహంలో అవి రెండూ కనుమరుగైపోయాయి.

గంగాధర్, తన కుటుంబంలో ఎప్పుడూ బొమ్మల కొలువు దీర్చే సాంప్రదాయం లేకపోయినా, తను కొన్నేళ్లుగా ముచ్చట పడి కొనుక్కున్న అందమైన బొమ్మలన్నీ చేర్చి ఈ సారి దసరాకు ఓ అనధికార బొమ్మల కొలువు ఏర్పాటు చేయదలిచాడు. దాని కోసమై మెట్లతో కూడిన ఓ ఫ్రేమ్ కొందామని మార్కెట్‌కి వెళ్లి ఆ ఏనుగు బొమ్మతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు.

బొమ్మలు కొలువు తీరాయి. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న పిల్లలందరిని పిలిచి బొమ్మల కొలువుని చూపించింది సుభాషిణి. పిల్లలందరూ ఆ కొలువును చూసి బాగుంది, బాగుంది అంటూ ఉంటే గంగాధర్ చిన్న పిల్లాడిలా చాలా ఆనందించాడు.

ఆ పిల్లల సమూహంలో ఎనిమిదేళ్ల వాడు ఒకడు, ఆ అపార్ట్ మెంట్ సహాయకుని మనవడు. వాడిని గంగాధర్ వాళ్లు గొడుగు అని పిలుస్తారు, ఎందుకంటే వాడి హెయిర్ స్టైల్ గొడుగు ఆకృతిలో తల చుట్టూ పరుచుకుని ఉంటుంది, అందుకని అలా ముద్దుగా పిలుస్తారు.

వాడి కన్ను, గంగాధర్ ముచ్చటగా కొనుక్కున్న కొత్త ఏనుగు మీద పడింది.

“అక్కా, నాకా ఏనుగు బొమ్మనిస్తావా?” మొహమాటం లేకుండా అడిగేసాడు గొడుగు.

దానిని వినీ వినట్టు ఊరుకుంది సుభాషిణి, ఎందుకంటే వాళ్ల నాన్న ముచ్చట పడి కొనుక్కున్నది అది.

సుభాషిణి విన్నా, విననట్టు ఊరుకుందని వాడికి అర్థమైనట్టుంది. వాడు ఇంకోసారి అడగడానికి మొహం చెల్లక, పాపం తలదించుకు కూర్చున్నాడు.

ఇదంతా గమనిస్తున్న గంగాధర్‌కి వాడి ఆత్మగౌరవాన్ని చూసి ముచ్చట అనిపించింది. తనకేదో పెద్ద అవమానం జరిగి పోయిందన్నట్టు అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలానే మార్గాన్ని వెతుకుతున్నట్టున్నాడు. ఊరికే లేచినట్టు లేచి ద్వారం దగ్గరకు పోయి కూచున్నాడు. అంటే అక్కడ నుండి పారిపోవడానికి వీలుంటుందని.

సుభాషిణి పిల్లలందరినీ కేక్ కట్ చేయడానికి పిలిచింది. అందరూ ఇటువైపు వస్తుండగా, గొడుగు ఇదే అదనుగా, తననెవరూ చూడటం లేదని నిర్థారించుకుని ద్వారం దాటబోతుంటే, ఇదంతా క్రీగంట గమనిస్తున్న గంగాధర్, “ఓరేయి గొడుగు, ఎక్కడికి పారిపోతున్నావురా, రా లోపలికి” అని గద్దించాడు. పాపం చేసేదేమీ లేక గొడుగు గుంపులో కొచ్చి నిలుచున్నాడు.

కేక్ కటింగ్ అయ్యి అందరూ పంచుకు తిన్న తరువాత, పిల్లలు ఎవరిళ్లకు వాళ్లు బయలుదేరారు, వాళ్లతో గొడుగు కూడా.

“ఒరేయి గొడుగు! నీవు కాసేపాగు, నీతో చిన్న పని ఉంది, తరువాత వెళుదువు గాని..” అని ఆపాడు గంగాధర్ గొడుగుని. బెరుకు బెరుకుగా చూస్తున్నాడు గొడుగు.

అప్పుడు గంగాధర్ వాడికి నచ్చిందన్న కొత్త ఏనుగు బొమ్మని కొలువులోంచి బయటకు తీసి వాడి చేతిలో పెట్టి, “ఇది నీకే తీసుకో” అంటూ ముందుకు వంగి వాడి కళ్ల లోకి చూస్తూ తల నిమిరాడు.

అప్పుడు గంగాధర్ వాడి కళ్లలో సన్నటి నీటి పొరలని గమనించాడు. మరి ఆ కళ్లు ఎందుకు చెమ్మగిల్లాయో? బహుశా కోరినది దక్కినందుకు పొంగిన ఆనంద బాష్పాలో లేక తనలోని సంఘర్షణని ఎదుటి వ్యక్తి గుర్తించి అనునయించినందుకు కలిగిన ఉద్వేగమో?

సుభాషిణి తండ్రి వంక అభినందనగా, ఆశ్చర్యంగా చూస్తూ అలా ఉండిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here