గోమాలక్ష్మికి కోటిదండాలు-2

0
9

[dropcap]ధ[/dropcap]ర్మరాజుకి తాత చెప్పిన కపిలగోవు గురించి తెలుసుకోవాలని అనిపించింది. “తాతా! కపిలగోవుని దానమిస్తే మంచిదని చెప్పావు కదా! కపిలగోవుకి అంత గొప్పతనం ఎలా వచ్చిందో చెప్పు” అని అడిగాడు.

గోవులకి కపిలత్వం సిద్ధించిన విధానం చెప్తున్నాడు భీష్ముడు. “మనవడా! శ్రద్ధగా విను. దేవతలకి ఆకలి వేసింది. బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. ఆయన అమృతమిచ్చాడు. వాళ్లు తనివితీరా తాగారు. ఆ అమృతపు సువాసనకి కామధేనువు పుట్టింది. దానికి ఆవులు పుట్టాయి.

అవి ఒకసారి హిమలయం పైభాగంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటిలో ఒక లేగదూడ పాలు తాగుతుంటే దాని నోటి దగ్గర నురుగు గాలివాటానికి ఎగిరి అక్కడ తీవ్రంగా తపస్సు చేస్తున్న శివుడి మీద పడింది. శివుడికి చాలా కోపం వచ్చింది.

శివుడి అగ్నిమయమైన మూడవ కన్ను నిప్పులు కక్కుతూ తెరుచుకుంది. దేవతలు ఆశ్చర్యపడుతూ ఉండగా, ఆ ప్రాంతంలో ఉన్న ఆవులన్నీ ఎర్రని రంగులోకి మారాయి. రంగు మారిన ఆవులు బెదిరి పోయాయి. అది చూసి తక్కిన ఆవులు కూడా భయంతో పారిపోయాయి.

ఆ సంగతి తెలుసుకుని బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వచ్చి ఈశ్వరుడి కాళ్లకి మొక్కాడు. చేతులు జోడించి స్వామీ! నువ్వు అమృతంతో తడిశావు. ఆవులకి ఎంగిలి లేదు. చంద్రుడు అమృతం ఇచ్చినట్లు ఆవులు పాలిస్తాయి.

కాబట్టి వాటి దూడలు తాగిన పాలు కూడా పరిశుద్ధమైనవే. కనుక కోపం వదిలి వాటిని కరుణించు’ అని బలంగా అందంగా ఉన్న ఒక ఎద్దుని కానుకగా ఇచ్చాడు.

శివుడు ప్రీతి చెంది దానిని ధ్వజం మీద గుర్తుగా, వాహనంగా చేసుకుని వృషభకేతనుడు, వృషభవాహనుడు అని పిలవబడ్డాడు.

శివుడు ప్రసన్నుడై గోవులు ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగేలా వరం ఇచ్చాడు. ఆవుల మంద మళ్లీ ఆ కొండకి వచ్చి స్వేచ్ఛగా తిరగడం చూశాడు.

వాటి రంగు మారడం చూసి తన చూపుకి కపిలవర్ణం పొందిన ఆవులు, వేరే రంగులున్న ఆవులకంటే గొప్పవిగా ఉంటాయని వరమిచ్చాడు. బ్రహ్మ సంతోషంగా తన లోకానికి వెళ్లిపోయాడు.

కనుక గోదాన పద్ధతిలో కపిలగోవుల్ని దానం చెయ్యడం గొప్ప విషయం. ఈ కపిల గోవు కథ చాలా పవిత్రమైంది. దీన్ని చదివినా, విన్నా సకల పాపాలు నశిస్తాయి. మంచి సంతానాన్ని, గొప్ప ధనాల్ని పొందుతారు” అని చెప్పాడు.

తాత చెప్పింది విని ధర్మరాజూ, అతడి తమ్ముళ్లూ పరమానందం పొందారు. భీష్ముడికి సాష్టాంగ నమస్కారం చేశారు. శాస్త్ర విధానంతో ఏ లోపం లేకుండా గోదానాల్ని చెయ్యాలని అప్పటికప్పుడే సంకల్పించుకున్నారు.

ధర్మరాజుతో గోవు పవిత్రత గురించి చెప్తున్నాడు భీష్ముడు. “నాయనా! నేను ఇప్పుడు చెప్పేది కూడా విను. ఇక్ష్వాకువంశంలో సౌదాసుడనే రాజు ఉండేవాడు. మునుల్లో ఉత్తముడూ, తన పురోహితుడూ అయిన వసిష్ఠుడిని ఆ రాజు వినయంతో ‘స్వామీ! పవిత్రమైనది ఏదీ?’ అని అడిగాడు.

ఆ మహాత్ముడు ‘పుణ్యాత్ముడా! గోవు పవిత్రమైంది. హోమద్రవ్యాలకి పుట్టినిల్లు. అన్ని ప్రాణులకీ గోవే ఆధారం. అది పూజ్యమైంది. సాటిలేని సంపదలకి మూలం. మహాపాపాలనే సముద్రాన్ని దాటడానికి ఓడ, స్వర్గానికి నిచ్చెన, దేవతలకి నివాసస్థలం’ అని చెప్పాడు.

వసిష్ఠుడు ఇంకా చెప్తూ ‘పది ఆవులున్నవాళ్లు ఒక ఆవునీ, వంద ఆవులున్నవాళ్లు పదింటినీ, వెయ్యి ఆవులున్నవాళ్లు నూరింటినీ దానం చేస్తే ఆ మూడు దానాల ఫలమూ సమానం అవుతుంది.

ఉదయకాలంలో ఆవుల్ని తలవడమూ, వాటి గుణాల్ని పొగడడమూ, భక్తితో వాటిని చూడడమూ గొప్ప పుణ్యకార్యాలని వేదాలు తెలియచేస్తున్నాయి.

ఆవుల మలమూత్రాలకి రోతపడడం పాపం. అన్ని జంతువుల మాంసాలు తినేవాళ్లకి కూడా ఆవు మాంసం తినడం చాలా ఘోరమైన పాపం అని బ్రహ్మ మొదలైన దేవతలు అంటారు.

చెడు కలలు వచ్చినప్పుడు ఆవుల్ని గురించి మంచి మాటలు చెప్తే దోషాలు పోతాయి. ఆవు పేడ కలిపిన నీటితో స్నానం ఎంతో పరిశుద్ధినిస్తుంది.

పండితులతో ఉపదేశాలు పొందినవాళ్లు భయాందోళనలు కలిగినప్పుడు అవి ఉపశమించాలని ఆవుల్ని, దూడల్ని తమ వద్ద సుస్థిరంగా ఉంచుకోవాలని కోరుకుంటారు.

తాము వినయంతో వాటి యోగక్షేమాల్ని ప్రేమగా చూసుకుంటామని, గో సమూహం కూడా తమనెప్పుడూ చల్లగా చూడాలని వాళ్లు భావిస్తారు’ అని చెప్పాడు.

వసిష్ఠుడు సౌదాస మహారాజుతో ఇంకా చెప్తున్నాడు. ‘రాజా! ఎర్రని ఆవుల దానం – సూర్యలోక సుఖాన్ని; తెల్లని ఆవుల దానం – ఇంద్రలోక సుఖాన్ని; నల్లని ఆవుల దానం – అగ్నిలోక సుఖాన్ని; బూడిదరంగు ఆవుల దానం – వాయులోక సుఖాన్ని ఇస్తుంది. తక్కిన వర్ణాల ఆవుల దానం – గంధర్వ, సిద్ధ, సాధ్య నామాలు గల దేవజాతుల లోకాల సుఖాల్ని అనంతంగా ఇస్తాయి. అన్ని రకాల గోవుల దానాలు అప్సరకాంతలకు వల్లభుడయ్యే భాగ్యాన్ని కలుగచేస్తాయి.

ఆవెత్తు నువ్వుల ఆవుని దానం చేసిన వాళ్లు మంచి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారు. ఏ మాత్రం తక్కువకాని లోకాల్లో నివసిస్తూ ఆనందంతో విహరిస్తూ ఉంటారు.

ఎన్నో రూపాలతో, గొప్పతనం కలిగిన చక్కని ఆకారంతో, దేవలోకపు మహిమ కలిగి ఉండే ఆవుల మహనీయ రూపం నా బుద్ధిలో నిలిచి ఉండుగాక! అని అనుకోడం సంపదలని కలిగిస్తుంది’ అని చెప్పాడు.

వసిష్ఠుడు చెప్పినది విని సౌదాస మహారాజు ఆవుల పవిత్రత తెలుసుకుని శ్రద్ధగా దానం చెయ్యడంలో మనస్సుని లగ్నం చేసి శాశ్వత సుఖం కలిగించే పదాన్ని పొందాడు” అని భీష్ముడు ధర్మరాజుకి సంతోషంగా చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here