గోమాలక్ష్మికి కోటిదండాలు-6

0
11

[box type=’note’ fontsize=’16’] గోమాత గురించి మహాభారతంలో తెలియచేసిన వివరాలతో ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి. [/box]

వేదవ్యాస మహాముని శుకుడికి చెప్పిన కపిల గోమహత్యము:

[dropcap]“తా[/dropcap]ము పుట్టిన జాతికి తగిన కర్మల యోగ్యతలు లేని మానవులు కపిల గోవుల్ని ఎక్కువగా పూజిస్తారు. దానం చేస్తారు. అవి వాళ్ల పాపాలనన్నింటినీ పోగొడతాయా?” అన్నాడు శుకుడు.

కుమారుడు ఇలా మాట్లాడగానే వ్యాసుడు “నాయనా! నీకు సందేహమెందుకు? కపిల గోవుని పూజించినా దానమిచ్చినా పాపాలు మిగిలి ఉంటాయా?” అన్నాడు.

అప్పుడు శుకుడు తండ్రి మాటలు విని “పుల్లావుకి అంతటి మహిమ రావడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు.

అది విని ఆ మహర్షి “పూర్వం అగ్నిదేవుడు ఒక కారణంగా దేవతల కన్నుకప్పి తనను తాను దాచుకునేందుకు గోవుల్ని ఆశ్రయించాడు. అవి అగ్నిదేవుణ్ని దాచాయి.

దేవతలు అన్నిప్రదేశాల్లోను వెతికి అగ్ని ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. గోవుల దగ్గరికి వచ్చి వాటితో “అగ్నిని దాచడం వల్ల అన్ని లోకాల జనానికి కీడు చెయ్యడం కదా! దాచి చూపించకపోవడం మంచిది కాదు” అని అంటే గోవులు చిన్నబుచ్చుకుని అగ్నిని చూపించాయి.

దేవతలు సంతోషించి ఆవులకి వరమిమ్మని అగ్నికి చెప్పారు. తన వల్ల కపిల వర్ణం పొందిన ఆవుల్ని చూసి “గోవులన్నింటిలో కపిలగోవు గొప్పదనీ; దాన్ని పూజించడం, దానమివ్వడం గొప్ప పుణ్యకార్యాలుగా పాపాల్ని పోగొట్టి ఉత్తమలోకాల్ని పొందేలా చేస్తాయి” అని వరాలిచ్చాడు.

“కపిలగోవు దానమిచ్చినవాడినే కాదు, పుచ్చుకున్నవాడిని కూడా పుణ్యాత్ముణ్ని చేస్తుంది. మంచి నియమ నిష్ఠలు గల కుమారా! నువ్వు కూడా కపిల గోవుల్ని ఆసక్తితో పూజించు” అని చెప్పాడు.

వ్యాసుడి మాటలు విని శుకుడు “తండ్రీ! దయతో నాకు కపిల గోవుల లక్షణం తెలియచెయ్యి” అని అడిగాడు.

వ్యాసుడు అతడితో “చెవులు, కొమ్ములు, కన్నులు, గిట్టలు, ముక్కులు, మెడ, అండాలు కపిలవర్ణంలో ఉండాలి. వీటిలో ఏ ఒక్క చోటున ఆ రంగు ఉన్నా ‘కపిల’ అవడానికి అదే చాలు. ఇంక ఒళ్లంతా కపిలవర్ణమే అయితే దాని మహిమని గురించి చెప్పడమెందుకు?

కపిల గోవుల పాలు పిండి తాగకూడదు. ఏ బలికీ ఉపయోగించకూడదు. బరువుల్ని వాటి మీద వేసి కట్టకూడదు. కాళ్లతో, చేతితో, కర్రతో కొడితే నరకానికి పోతారు.

మంచి మేత, నీరూ తగిన వేళల్లో చూసుకుంటూ మన్ననతో కాపాడితే స్వర్గం లభిస్తుంది. కపిలగోవుల్ని దానం చెయ్యడం వల్ల కలిగే పుణ్యం ఇది అని చెప్పడానికి శక్యం కాదు. బ్రహ్మదేవుడు కూడా అది గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది” అని చెప్పాడు.

“ఇంత కంటే నేనేం చెప్పగలను? బ్రాహ్మణులు, గాయత్రి, వసంతకాలం, సత్యం, గోవులు, బంగారం అనేవి ఒకదాని నుంచే పుట్టాయని, గొప్ప పండితులు చెప్తారు. కాబట్టి భూమి, బంగారము, ఆవూ దానమివ్వతగిన వస్తువులన్నింటికంటే గొప్పవని నీ మనస్సులో చెదరకుండా నిలుపుకో. వ్యాసుడు చెప్పింది విని శుకుడు తృప్తిగా ఉన్నాడు” అని చెప్పాడు.

ధర్మరాజుకి గో, శ్రీ సంవాదంచెప్తున్న భీష్ముడు

“ఒకప్పుడు లక్ష్మీదేవి గోవుల మందలోకి వెళ్లింది. ఆవులు ‘నువ్వు ఎవరు?’ అని అడిగాయి. ఆమె ‘నేను లక్ష్మిని, మీతో కలిసి ఉందామని వచ్చాను’ అంది. అప్పుడవి ‘నువ్వు చంచల స్వభావం కలదానివి. మాలో ఉంచుకోడానికి ఇష్టపడం’ అని చెప్పాయి.

దానికి ఆమె బాధపడి ‘నేను వదిలిపోతే రాక్షసులంతా చెడిపోయారు. నేను చేరడం వల్ల దేవతలు రాజ్యం పొందారు. నా రాక కోసమే కదా మనుషులంతా తపస్సులు చేస్తారు. అటువంటి నన్ను ఇలా అవమానించడం బాగుందా?’ అని అడిగింది.

అప్పుడవి ‘స్థిరత్వం లేనిదాన్ని మేమిష్టపడం అనడం అవమానమా? నీకు తోచిన చోటికి వెళ్లు!’ అన్నాయి.

లక్ష్మీదేవి ఆవులతో ‘మీరిలా నన్ను అవమానిస్తే నేను ఎక్కడికి వెళ్లినా నన్నెవరూ రానివ్వరు. మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాకు ఆశ్రయం ఇవ్వండి’ అంది. గోవులన్నీ ఒక్క అభిప్రాయంతో ఎంతో ఆదరంతో లక్ష్మీదేవితో ‘లక్ష్మీ! మా మలమూత్రాలు పరమ పవిత్రాలని వేదాలకి తెలుసు. నువ్వు ఈ గొప్ప వస్తువుల్లో నివసించు’ అన్నాయి.

ఆవులు చెప్పినదానికి ‘నా పుణ్యం వల్ల మీ దయ పొందగలిగాను’ అంటూ వాటి మలమూత్రాల్లో నివసించింది. ఇలా ఆవుపేడ గొప్పతనం పొందింది. ఆవుల మహిమ నాశనము లేనిది.

ఇంకో గొప్ప విషయం చెప్తాను విను. కామధేనువు తపస్సు చేస్తే బ్రహ్మ కనిపించి ఏం కావాలో అడగమన్నాడు. అది ‘మహాత్మా! నిన్ను దర్శించడం కంటే కోరదగినది ఇంకేముంది?’ అంది.

బ్రహ్మ ఆ మాటకి సంతోషించి సురభిని చూసి దేవలోకం మొదలైన ఊర్థ్వలోకాలకన్నింటికీ గోలోకం పైన ఉండేలా వరమిస్తాను అనబోయాడు. ఆ విషయం ఇంతకుముందే చెప్పినట్టు గుర్తొచ్చి అది జరిగేలా అనుగ్రహించాడు.  ధర్మరాజా! బ్రహ్మ ఇలా గోలోకాన్ని, తన సత్యలోకం కంటే పైన ఉండి ప్రకాశించేదిగా చేశాడు. అందువల్ల గోలోకం ఎంతో గొప్పతనం పొందింది” అని చెప్పాడు.

“ధర్మరాజా! గోవుకి సంబంధించిన మాటలు చదవడం, వినిపించడం, వినడం అనేవి ఆయువునీ, సంపదనీ, అధికారాన్నీ, కీర్తినీ, మంచిగతిని కలగచేస్తాయి. కనుక ఈ విషయాల్లో శ్రద్ధగా ఉండు” అని చెప్పాడు.

భీష్ముడు చెప్పింది విని ధర్మరాజు అతడితో “మహాత్మా! ఆవుల మహిమ చక్కగా తెలిసే విధంగా ఎన్నో విధాలుగా చెప్పి నన్ను ధన్యుణ్ని చేశావు. గోమాతని శ్రద్ధగా పూజించి, గో సంపద పెరిగేలా చూసి సద్గతులు పొందుతాను” అని వినయపుర్వకంగా నమస్కరించాడు.

మనం కూడా గోమాత గొప్పతనాన్ని తెలుసుకున్నాం కనుక, గోమాతని రక్షించుకుందాం! గోమాతని శిక్షించేవాళ్లకి శిక్షపడేలా చేద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here