గొంతు విప్పిన గువ్వ – 11

32
7

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

స్వర బంధం

[dropcap]P[/dropcap]eople of opposite sex get attracted to each other just as opposite poles attract…

నిజమే…

స్త్రీ పురుషులు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవటం ప్రకృతి సహజమే. అయితే ఎఫ్బీలో స్త్రీ పేరుతో వున్న ప్రొఫైల్ పట్ల మగాళ్ళ క్యూరియాసిటి చిత్రంగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఆరోగ్యకర ఆకర్షణ శాతం చాలా తక్కువ. స్నేహం పేరుతో మాట కలపాలని ఉబలాట పడేవారూ, మాట కలిశాక కలవాలని ప్రయత్నిoచేవారూ, ఏదో సాహితీ సందర్భంలో కలిశాక స్నేహం కోసం అర్రులు చాచేవారూ కోకొల్లలు. కొందరిని మంచి స్నేహితుల పరిగణనలోకి తీసుకున్నాక స్నేహాన్ని మించిన మరేదో బంధాన్ని కాంక్షిoచే వారూ తారసపడ్డ సందర్భాలూ వున్నాయి.

చాలామంది మిత్రులు ఒకే స్కూలు విద్యార్థులవటం నాకు ఆశ్చర్యం గొలిపే విషయం.

అప్రోచ్ అయ్యే విధానంలోనే కొద్దిపాటి తేడా.

చిత్రంగా అందరి గోల్ ఒకటే.. ఫైనల్‌గా అందరి అభ్యర్ధన ఒక్కటే..

‘సౌజన్యా, మీతో స్నేహాన్ని మించిన బంధాన్ని కోరుకుంటున్నాను..’

పాట ఒకటే… రాగాల్లోనే తేడా..

ఒంటరి పురుషుడు ఆ పాట పాడినా కనీసం కోరస్‌గా గొంతు కలిపే విషయంలో పునరాలోచించే అవకాశముంటుంది. దురదృష్టమేమిటంటే భార్యలతో సంసారం చేస్తూ స్నేహం మాటున సరిగమలు ఆలాపించటం మరీ విడ్డూరం.

పైగా ఆ స్నేహాన్ని మించిన బంధాన్ని కోరుకోవటానికి చెప్పే కారణాలు ఇంకా విచిత్రంగా వుంటాయి.

ఆ కారణాల్లో మళ్ళీ పాపం అమాయకులైన భార్యలనే సమిధలను చేస్తారు.

కొందరు భార్యలను దైవ చింతనలో నిమగ్నo చేస్తే, మరి కొందరు ఫ్రిజిడిటిలో బిగించేస్తారు. మరికొందరు సెక్స్ ఫోబియా అంటగడతారు.

ఈ కారణాలేమీ నిజానికి నిజo కావలసిన అవసరం లేదు. అలవాటుగా చెప్పే అబద్ధాలే కావచ్చు.

జీవితంలానే సందె పొద్దు వాలుతున్న ఈ సంధ్య వేళలో స్నేహాన్ని మించిన బంధాన్ని ఆశించే మిత్రుల అవలోకనంలో నేనుండగా, నేనెప్పుడూ కలవని, నన్నెప్పుడూ కలవాలని ప్రయత్నించని ఓ మిత్రుడు నా ఆలోచనల్లోకి వచ్చాడు. దురదృష్టవశాత్తూ అతని అద్వితీయమైన సహాయం పొందీ అతనిని నేనింతవరకూ కలవలేక పోయాను. ఇప్పటికీ మా మధ్యనున్న స్వరస్నేహం పదేళ్ళయినా ఫోనులో వీనుల విందుకే పరిమితమయిపోయింది. అసలు ఈ శేష జీవితంలో ఎప్పటికయినా అతనిని కలవగలనో లేదో తెలియదు. ఎందుకనో అసలు ఎప్పటికీ కలవకపోవటమే ఈ అపూర్వ అనుబంధానికి అపురూపతను ఆపాదిస్తుందని నాకనిపిస్తుంది ఒక్కోసారి.

అవి నేను కమాండెంటుకి పియేగా పని చేసే రోజులు. నూటికి తొంభై శాతం మంది నన్ను వినటం తప్ప చూసి ఎరుగరు. మా సెక్రటేరియట్, అందులో నా క్యాబిన్ అందరికీ అవుట్ ఆఫ్ రీచ్. కనీసం మా సెక్రటేరియట్ ఎదురుగా నడవటానికి కూడా అందరూ జంకుతారు. ఫోనులో నా గొంతుతోనే నన్ను చాలామంది గుర్తించేవారు. గువ్వ గొంతు వినటమే తప్ప చూసిందెవరూ లేరు. నా గొంతు శ్రావ్యంగా వుంటుందని, నా మాట లైవ్లీగా, అథారిటేటివ్‌గా, కాన్పిడెంట్‌గా వుంటుందని దాదాపుగా అందరూ ప్రశంసిస్తుండేవారు.

నాతోనే కాకుండా మా బాసుతోనూ “యు హావ్ ఎ వెరీ స్వీట్ వాయిస్డ్ పియే” అంటుండేవారు.

రెండేళ్ళకో బాసు మారుతున్నా నా స్వరాన్ని ప్రశంసించే వాళ్ళ మెచ్చుకోలులో మార్పేమీ వుండేది కాదు. నాలుగు రోజులు సెలవు పెడితే నా స్థానంలో మరో అమ్మాయి కూర్చుంటే ఆమె గొంతు విని ఎప్పుడూ వుండే అమ్మాయి లేదా అని అడిగేవారు. అలా నా గొంతుతో నేను ప్రాచుర్యం పొందాను.

బ్రిగేడియర్ సంధు కమాండెంటుగా వున్న పద్దెనిమిది నెలల కాలంలో ఒకరి కాల్ తరచూ వస్తుండేది.

“హలో, దిస్ ఈజ్ కల్నల్ వారణాసి.. మే ఐ స్పీక్ టు బ్రిగేడియర్ సంధు”

వారణాసి ఏమిటి కాశీ రామేశ్వరంలా అనుకున్నాను మొదట్లో.

తరువాత అది ఇంటి పేరయి వుంటుoదనుకున్నాను. ఆ ఇంటి పేరును బట్టి తెలుగువారై వుండవచ్చనుకున్నాను.. ఇంకా చెప్పాలంటే బహూశా బ్రాహ్మలై వుండవచ్చని నిర్ధారించుకున్నాను. అయినా తెలుగులో మాటాడే సాహసం చేయలేను.

ఆ వారణాసికి మా బాసుకి మధ్య మంచి స్నేహo. సాయంత్రాలు, వారాంతాలు ఎక్కువగా కలుస్తూంటారనుకుంటా. ఒక రోజున బాసు వారణాసికి ఒక మెస్సేజి ఇమ్మన్నారు. వారణాసి సీట్లో లేక రెస్పాన్స్ లేదు. అర్జంటు సమాచారం కావటంతో బాసు వారణాసి మొబైల్ నంబరిచ్చి ట్రై చేయమన్నారు. సదరు వారణాసి పలకలేదు. ఆఫీసు టైం అయిపోయింది. బాసు వెళ్ళిపోతూ సాయంత్రం లోపు మెస్సేజీ వారణాసికి చేరాలంటూ ఆర్డరు వేసేసి వెళ్ళిపోయారు. ఆ నంబరు నా మొబైల్‌లో సేవ్ చేసుకుని మొత్తానికి ఆరు లోపు కబురు అందించగలిగాను.

అప్పటి నుండీ వాళ్ళ బిజీ స్కెడ్యూల్డ్ స్నేహానికి వారధిలా నేను అటూ ఇటూ సందేశాలు రాత్రనక పగలనక చేరవేస్తుండే దానిని. బాసు బదిలీ అయి వెళ్ళిపోయారు. నా వ్యక్తిగత కారణాల వలన నేను స్వచ్చంద పదవీ విరమణ తీసుకుని ఉద్యోగ పర్వానికి మంగళ హారతి పాడేసి విదేశం వెళ్ళిపోయాను.

విదేశంలో వుండగా మా అమ్మాయి వివాహం నిశ్చయమయ్యింది. నేను విదేశంలో.. పెళ్ళి ఇండియాలో. పైగా పెళ్ళికి వ్యవధి చాలా తక్కువగా వుంది. హైదరాబాదులో పెళ్ళి ఏర్పాట్లు ఎలా చేయగలుగుతానన్న మీమాంసలో నాకు నిద్ర కరువయ్యింది.

పంజాబి పెళ్ళికొడుకు గురుద్వారాలో పెళ్ళి కావాలన్నాడు. ఆఫీసులో పని చేసే రోజుల్లో మా ఆఫీసు అధీనంలో వున్న గురుద్వారా నుండి గురు సాహెబ్ గారు మా బాసు దర్శనార్థం రావటం తప్పించి గురుద్వారా మొహం నేనెన్నడూ చూసి ఎరుగను.

గురుద్వారాల గురించి గూగుల్ చేస్తే మా సెంటరు గురుద్వారాయే అతి సుందర ఆహ్లాదకర నిర్మలమైన వాతావరణంతో విశాలమైన కార్ పార్క్ వున్న మేటి రిలీజియస్ ఇన్‌స్టిట్యూట్ అని తెలిసింది.

అప్పటి బాసు ఎవరో అతని పేరేమిటో కూడా తెలియదు. ఆర్మీ వాళ్ళు రెండేసి సంవత్సరాలకి పోస్టింగ్ వెళ్ళిపోతుంటారు. నా సెక్రటేరియట్ స్టాఫ్ ఎవరో తెలియదు. సమయం తక్కువగా వుంది. ముందుగా అర్జంటుగా గురుద్వారా బుక్ చేయాలి. నాకు చేతులూ కాళ్ళూ ఆడలేదు. మొబైలులో నంబర్లు స్క్రోల్ చేస్తే వారణాసి నంబరు కనిపించింది. మొహమాటపడుతూనే వణుకుతున్న వేళ్ళతో నంబరు ప్రయత్నించాను.

అసలు అతనికి నేను గుర్తున్నానో లేదో. ఫోనులో మాటాడటం తప్ప ఎప్పుడూ కలవనేలేదు.

నేను ‘హలో’ అనగానే అవతలి నుండి “వాట్ ఎ సర్‌ప్రైజ్ పియే మేడం…ఎలా వున్నారు..” అన్నారు.

నేను సర్‌ప్రైజ్ అయ్యాను.

“ఇన్నేళ్ళయినా ‘హలో’ అన్న రెండక్షరాలకే ఎలా గుర్తు పట్టారు నన్ను” అడిగాను ఆశ్చర్యంగా.

“యువర్ యూనిక్ వాయిస్” అన్నారు సంభ్రమంగా.

మళ్ళీ తనే వెంటనే “హౌ కాన్ ఐ హెల్ప్ యూ…” అని అడిగారు.

తనూ రిటైర్ అయ్యానని హైదరాబాదులోనే స్థిరపడ్డానని చెప్పారు.

నేను అమ్మాయి పెళ్ళి విషయం, గురుద్వారాలో చేయాలనుకోవటం గురించి చెప్పాను. నా పేరు మీద గురుద్వారాను కేటాయించటం కష్టమని, తను తన పేరు మీద బుక్ చేస్తానన్నారు. సత్వరమే పెళ్ళి వివరాలు, వధూవరుల పేర్లు, ఇతర విషయాలు తెలుసుకుని తనే డబ్బు కట్టి బుక్ చేసేసారు.

డబ్బు పంపటానికి బ్యాంకు వివరాలు అడిగితే పెళ్ళిలో ఇద్డురుగానిలే అన్నారు. తన వ్యక్తిగత పలుకుబడిని ఉపయోగించి మంచి కేటరింగ్ తదితర ఏర్పాట్లన్నీ చేసేసారు. నేను ఇండియాలో లేకుండానే పెళ్ళి ఏర్పాట్లన్నీ దిగ్విజయంగా జరిగిపోయాయి.

కేవలం నా స్వర పరిచయంతో అతి క్లిష్టమైన ఆడపిల్ల పెళ్ళి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. పెళ్ళి నిమిత్తమే వచ్చిన నేను రెండు వారాలే ఇండియాలో వున్నాను. సరిగ్గా నేను ల్యాండ్ అయిన రోజునే వారి స్వగ్రామంలో తల్లిగారు పోవటంతో ఆదరా బాదరా వారణాసి నన్ను కలవకుండానే వెళ్ళిపోయారు.

అంతటి మాతృమూర్తి వియోగ దుఃఖంలోనూ ఫోను చేసి గురుద్వారాలో ఆచరించాల్సిన ఫార్మాలిటీలు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో అన్నీ వివరించి చెప్పారు. వారణాసి తన తల్లిగారి పదమూడో రోజు కార్యక్రమం పూర్తయినప్పటికీ కొన్ని ఆస్తిపాస్తుల లావాదేవీలతో స్వగ్రామంలో వుండిపోయారు.

నేను దిగ్విజయంగా అమ్మాయి వివాహం ముగించుకుని విదేశం వెళ్ళిపోయాను.

చాలాకాలం వరకూ వారణాసిని నేను నా బాకీ చెల్లింపు కోసం రోజూ బ్యాంకు వివరాలు అడుగుతూ వచ్చాను. అతను మాట దాటేస్తూ వచ్చారు. నేను పట్టుబడితే ఆఖరికి తను ఖర్చు చేసిన ఆ డబ్బు ఆడపిల్లకు తన తరపున పెళ్ళికానుక అని తేల్చేసారు. అది నాపై అభిమానమో, అతని ఔదార్యమో నాకు అంతు పట్టలేదు. కేవలం స్వర పరిచయానికే ఇంత హృదయవైశాల్యం ఎలా సాధ్యమని నేను ఆశ్చర్యపోయాను.

ఇప్పటికీ ఫోనులో మా స్వరస్నేహం కొనసాగుతూనే వుంది. ఈ జన్మకు వీలవుతుందో లేదో తెలీని అతని దర్శనభాగ్యం కోసం చకోరంలా ఎదురుచూస్తూనే వున్నాను. స్నేహాన్ని మించిన బంధాన్ని ఆశించే కొందరు మిత్రుల మాటలు విన్నప్పుడల్లా కనీసం ఎప్పుడూ నన్ను కలవాలనుకోని, అన్ని బంధాలను మించిన అతని అపూర్వ స్నేహబంధం గుర్తొస్తుంది నాకు…

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here