గొంతు విప్పిన గువ్వ – 19

19
6

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

నళినీ విలా(పం)సం

జననీ జన్మ భూమిశ్చ…స్వర్గాదపి గరీయసి…

ఎన్ని రాజ భోగాలున్నా కన్న తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కన్నా మిన్న.

నా దేశం, కన్న తల్లి, మాతృ భాష….

ఈ మూడూ నాకెంతో విలువైనవి, ఇష్టమైనవి.

దురదృష్టమేమిటంటే ఇప్పుడు నా జీవితం ఈ మూడింటికీ దూరంగా గడుస్తోంది.

అంతకన్నా దురదృష్టమేమిటంటే పిల్లలు నా పునాదులు కూల్చటానికి నా మూలాలు నరకటానికి సమాయత్తమవుతుంటే నేను మాటలు పడిపోయి అభావంగా ముభావమై పోవటం. 

అసలు ఈ కాయమే ఒక అద్దె ఇల్లయినప్పుడు, కాయం నుండి ఈ ప్రాణం ఏదో ఒక రోజున కాస్త ముందూ వెనుకగా శరీరాన్ని విడిచి వెళ్ళి పోవాల్సినప్పుడు నేను కష్టబడి కట్టుకున్న ఇటుకల ఇంటి కోసం నేను పడే తాపత్రయానికి నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలోకి, తాత్వికతలోకి తోసి వేయబడ్డాను.

తెలియని దిగులు మేఘాలు కమ్ముకున్నాయి.

కూతురు శ్వేతతో ఆ సాయంత్రం జరిగిన వాగ్యుద్ధం తరువాత నన్ను ఉదాసీనత ఆవహించేసింది.

అకస్మాత్తుగా ప్రాపంచిక సుఖాల పైన మోహం అంతరించి పోయింది.

“అత్త వేరే రాష్ట్రంలో వుండి తన ఆస్తిని సంరక్షించుకోలేనని ఆస్తి అమ్మేసినప్పుడు మనం వేరే దేశంలో వుండి ఇండియాలో ఆస్తులు ఎలా మైంటైన్ చేస్తామమ్మా… కొంచం ప్రాక్టికల్ గా ఆలోచించు” శ్వేత చాలా ప్రాక్టికల్ మనిషి.

ప్రాక్టికాలిటీకి అనుబంధాలకు సమన్వయం కుదరదు.

నేను బంధాలకు తలవంచి మనసుతో జీవిస్తున్నాను.

నా పిల్లలు ప్రాక్టికాలిటి కొలమానంగా మెదడుతో బ్రతుకుతున్నారు.

అసలు ఈ లోకంలో ఏది శాశ్వతం..?

ఆలోచించే కొద్దీ, కొద్ది కాలపు ముచ్చట అయిన ఈ తాత్కాలిక జీవితం కోసం ఇంత ప్రాపంచిక తపన అవివేకమేమోననిపిస్తోంది.

నా పిల్లలన్న మమకారంతో, కన్న పాశంపై ప్రేమతో మనిషి ఎందుకంత అశాంతితో అలమటిస్తూ శ్రమిస్తాడా అనే ఆలోచన తొలిచేస్తోంది. 

చిత్రంగా మరొక వైపు ఐహిక ఇచ్ఛలు లేని జీవితమూ నిస్సారమే అనిపిస్తోంది. 

చాలా కన్‍ఫ్యుజింగ్‌గా గందరగోళంగా వుంది.

నాది, నా తల్లి జ్ఞాపకం అన్న మమకారంతో నిర్మించుకున్నానే నళినీ విలాసాన్ని. ఇలా విలపించటానికేనా నేను అంత అంకిత భావంతో శ్రమకోర్చి ప్రాణం పెట్టి కట్టుకున్నది.

నా అనుకున్నది నాది కాకుండా పోవటమేనా జీవిత పరమార్థం.

నా ఆలోచనలు గతంలోకి పరుగెట్టాయి.

జీవితం ఒక పరుగు పందెంలా ఊహ తెలిసినప్పటినుండీ పరుగు పెడుతూనే వున్నాను. జీవితమంతా తోడుంటాడనుకున్న సహచరుడు జీవితం మధ్యలో అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోతే అతని జ్ఞాపకాలైన బిడ్డలిద్దరినీ చెరో భుజాన మోస్తూ ఆయాస పడుతూ పరుగెత్తానే తప్ప పరుగెప్పుడూ ఆపలేదు. 

నా పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇయ్యాలన్న స్వార్థపూరిత ప్రేమతో ఒక్క క్షణం విరామం లేని శ్రమ జీవితం గడుపుతూ స్వేదం చిందిస్తూ ఆడంబరమైన అందాల సౌధం కట్టించాను. ఎండలో మాడుతూ వానలో తడుస్తూ తొమ్మిది నెలలు ఏకధాటిగా నిలబడి దగ్గరుండి కట్టించుకున్న నా లగ్జరీ భవంతి ‘నళినీ విలాసం’ నవ మాసాలు మోసి కన్న బిడ్డంత  అపురూపం నాకు.

నళినీ విలాసo నా ఆరో ప్రాణం. అది నా కన్నతల్లి పేరుతో వెలిసిన జ్ఞాపకాల పందిరి.

ఆమె త్యాగమయ జీవితానికి సంకేతంగా నిర్మించుకున్న అపురూపమైన తాజ్‌మహల్.

మా అమ్మ కడుపు కట్టుకుని జీవిత కాల పోరాటంలో సాధించిన, గెలుచుకున్న విజయానికి సంకేతం ఆ స్థిరాస్తి.

నా పసితనంలో అమ్మ కొంగు నడుముకి బిగించి, చీర కుచ్చెళ్ళు బొడ్డులో దోపుకుని తన స్వహస్తాలతో చమరించిన గోడలవి.

పాడు పడిపోయి శిధిలావస్థలో వున్నా ఆ ఇంటి అణువణువులో అమ్మ స్మృతులు దాగున్నాయి.

తను కష్టబడి స్వార్జనతో సంపాదించుకున్న ఆ ఆస్తి అంటే అమ్మకు ప్రాణం. అక్కడే తన తనువు చాలించాలని అమ్మ ప్రగాఢ వాంఛ.

అమ్మకిష్టమైన ఆ ఆస్తంటే నాకూ అంతే మక్కువ.

అమ్మకు మేము ఇద్దరమే మిగిలిన సంతానం. నేనూ, నా తరువాత పుట్టిన తమ్ముడూ. అమ్మ తన ఆస్తిని ఇద్దరికీ చెరి సగం రాసింది.

మొదటి నుండీ అమ్మ నాకు ఇచ్చిన వాటాలో నాతో పాటే హాయిగా తృప్తిగా వుండేది. నేను అమ్మ దగ్గర వున్నానో, అమ్మ నా దగ్గర వుందో తెలిసేది కాదు. తమ్ముడు ఉద్యోగ రీత్యా వేరే చోట వుండేవాడు. అమ్మను తన దగ్గరకు రమ్మనమని వాడు ఎన్ని సార్లు ఆహ్వానించినా అమ్మ తన ఇల్లు వదిలి రానంది.

దురదృష్టవశాత్తూ వాడు వాడి కాయాన్నే వదిలి వెళ్ళిపోయాడు.

ఒక రోజున అకస్మాత్తుగా తమ్ముడి వాటా చూడటానికి జనం రావటం మొదలు పెట్టారు. ఎందుకు వస్తున్నారని ఆరా తీస్తే నా మరదలు తన వాటా అమ్మకం పెట్టిందని తెలిసింది.

అమ్మకు తనలో అర్ధభాగాన్ని అమ్మేస్తున్నంత బాధ కలిగింది. కోడలు కూతురు కాలేక, మా అమ్మ దగ్గరకు వచ్చి వుండలేక, మరో చోట ఆస్తి కూడబెట్టుకునే ప్రయత్నంలో భాగమే ఆ అమ్మకం.

అయినా ఎవరికి అనుకూలంగా వున్న చోట వారు స్థిరపడటం, ఆస్తులు కూర్చుకోవటం తప్పెలా అవుతుంది..

కనీసం అమ్మ జీవించి వున్నంత కాలమైనా ఆస్తి అమ్మొద్దని అమ్మను బాధ పెట్టవద్దని వాళ్ళకు నచ్చచెప్పే ప్రయత్నం చేసాను. వారి అవసరాలు వాళ్ళకు వున్నాయన్నారు. నాకు అమ్మ బెంగను తట్టుకోవటం కష్టమైంది.

బాగా ఆలోచించి నా బిడ్డల భవిష్యత్తు కోసం జీవితమంతా కూడబెట్టిన పైకం, స్వచ్ఛంద పదవీ విరమణతో వచ్చిన మొత్తం, మరి కొంత లోను సేకరించి తమ్ముని భాగం కూడా నేనే తీసుకున్నాను. అమ్మ ఆనందానికి అవధులు లేవు. అమ్మ మొహంలో సంతోషం నాకెంతో సంతృప్తినిచ్చింది.

అయితే  నలభై ఏళ్ళ క్రితం అమ్మ కట్టించిన ఇల్లవటంతో ఇల్లు శిధిలావస్థలో వుండి రూఫ్ నుండి అక్కడక్కడా పెచ్చులు పెచ్చులుగా ఊడి పడుతూ ప్రమాదకరంగా మారి నివాసయోగ్యం కాకుండా వుంది.

శిధిలావస్థలో వున్న అమ్మ కట్టించిన గోడల మధ్యే చిరకాలం జీవించాలనుకోవటం అవివేకం. అమ్మ సంపాదించిన స్థలంలో ఇంటిని పునర్నిర్మించటం ఎంతైనా అవసరం.

ఇల్లంతా కూలగొట్టి నూతన నిర్మాణం చేయిద్దామని అమ్మకు చెప్పాను. ఆ మాట విన్న ఆమె కళ్ళల్లో మెరుపు చూసాను.

ఏ తల్లికైనా తను కూడబెట్టిన ఆస్తికి తన వారసులు మెరుగులు దిద్దితే మెరుపులు కాక మరేమిటి…

బిల్డరుకి ఇస్తే వాడు కొంత శాతం తీసేసుకుంటాడని పైగా పూర్తి చేయటానికి చాలాకాలం నానుస్తాడని ఈలోపు తను అద్దె కొంపలో తనువు చాలించాల్సి వస్తుందేమోనని వృద్ధాప్యంలో వున్న అమ్మ బెంగ పడింది.

కోడలు అమ్మ ఇచ్చిన ఆస్తిని బయటి వారికి అమ్మితే అంగీకరించని అమ్మ, బిల్డరు సగం ఆస్తి తీసుకుంటే ఎలా సహిస్తుంది..?

అమ్మ కష్టార్జితం మొత్తం వంశపారంపర్యంగా ఆమె జ్ఞాపకంగా కలకాలం కొనసాగాలని నిర్ణయించుకున్న నేను స్వయంగా కన్‍స్ట్రక్షన్ చేపట్టాను.

హోం లోను కోసం విదేశాల్లో మంచి స్థాయిలో స్థిరపడ్డ నా పిల్లలిద్దరి పేర్ల మీదకు ఆస్తి మార్పించాను.

ఇల్లు కట్టడం ఒక మహా యజ్ఞం. ఈ కరప్టెడ్ భారతదేశంలో ఏ అండదండలు లేని ఒంటరి ఆడదానికి ఇల్లు కట్టించటం అంత పెద్ద జటిల పరీక్ష మరొకటి వుండదు.

ఇంటి మునిసిపల్ ప్లాన్ నుండి ప్రారంభమైన లంచాల సమర్పణ గృహప్రవేశం వరకూ కొనసాగింది. బోరింగు, కరంటు మీటర్లు, డ్రైనేజీ, నీళ్ళ కుళాయి లైన్లు, ప్రతీ దాని శాంక్షను లంచగొండుల నుండి రాబట్టుకోవటం ఒక సమస్యే.

ఎంతో శారీరక మానసిక ఒత్తిడిల అనంతరం దాదాపు తొమ్మిది నెలల మానసిక సంక్షోభం తరువాత నళినీ విలాసానికి అమ్మతో టెంకాయలు కొట్టించి గృహప్రవేశం చేయించటం నా జీవన సాఫల్యంగా భావించాను.

సకల సౌకర్యాలతో కొత్త ఇంట్లో అమ్మ ఆఖరి రోజులు సంతృప్తికరంగా గడుపుతుందన్న తృప్తి, అమ్మ ఋణం తీర్చుకున్నానన్న సంతృప్తి నా జన్మను ధన్యం చేసాయి.

పిల్లల అవసరార్థం నేను ప్రేమతో కట్టుకున్న నా ఇంటిని వదిలి అనుకోకుండా విదేశంలో స్థిరపడ్డాను.

ఆ నళినీ విలాసపు అంగాంగంలోనూ నా ప్రేమ, పట్టుదల, శ్రమ వున్నాయి.

పరాయి దేశానికి వలస పోయిన పిల్లలకు ఆ విషయం అర్థం కాదు.

అపార్టుమెంటు పద్ధతిలో ఎవరికి వారు అమ్ముకునే పద్దతిలో కట్టించమన్న రోజున, ఆ సూచనకు నిలువునా నీరై పోయాను. నేను వంశపారంపర్యంగా కొనసాగాలనుకున్న ఆస్తిని పిల్లలు భవిష్యత్తులో అమ్ముకోవాలనుకుoటున్నారని తెలిసినప్పుడు అసలు నేను అంత శ్రమపడటం అవసరమా అనిపించింది.

ఆ క్షణమే ఇల్లు కట్టించాలన్న ఉత్సాహమంతా ఆవిరై పోయింది.

అచ్చం అమ్మ లాగే ఆ ఇంట్లో కడదేరి పోవాలన్న నా కాంక్ష పిల్లల తలకెక్కదు.

మనసుతో ఆలోచిస్తే కదా ఎక్కటానికి. ఈ తరం పిల్లలు మెదడును మాత్రమే ఉపయోగిస్తారు.

అమెరికా ఆస్ట్రేలియాలలో వుంటున్న మనకు ఇండియాలో ఆస్తి ఎందుకని శ్వేత వాదన. తల్లిదండ్రులిచ్చిన ఆస్తిని అభివృద్ధి చేయకపోయినా ఫరవాలేదు గాని అమ్ముకోకుండా వుండాలన్న మన కనీస సంప్రదాయం తెలియకపోవటం, నా తదనంతరం అమ్ముకున్నా కనీసం నేను బ్రతికున్నంత వరకైనా నా మూలాలను పరుల హస్తగతం చేయకూడదన్న ఆలోచన వాళ్ళకు రాకపోవటం నా దురదృష్టం.

స్థిరాస్తి అమ్మేశాక నా దేశంలో నాదంటూ నా అస్థిత్వాన్ని చాటుకునేందుకు ఏమి మిగిలి వుండదు.

నా దేశానికి నేను చుట్టపు చూపుగా వచ్చి హోటలులో నాలుగు రోజులుండి వెళ్ళిపోవటమే.

నా కళ్ళ ముందే నా దేశంలో నా ఉనికి సమాధి అయిపోతుందా…

నా పుట్టిన ఊళ్ళో నా అస్తిత్వపు స్మృతులన్నీ తుడిచి పెట్టుకు పోతాయా…

జన్మభూమి కన్నతల్లితో సమానమంటారే.

ఇల్లు అమ్ముకోవటం అమ్మను అమ్ముకోవటమే కదా.

నళినీ విలాసం అమ్మటం నన్ను నిలువునా హత్య చేయటమే.

అసలు నేనే శాశ్వతం కాని ఈ లోకంలో నాదైన ఇల్లు శాశ్వతంగా వుండాలను కోవటం ఎంతవరకూ సమంజసం.

ఏమో…

బహూశా మనసుకు నచ్చని సంఘటనలు మనలో తాత్విక దృష్టిని రేకెత్తిస్తాయేమో…

భోగి కాని వాడు యోగి కాలేడని కదా అంటారు. 

భోగత్వం దక్కని మనిషి కూడా యోగిగా మారతాడంటాను నేను.

ఇప్పుడు నా దేశమన్న ప్రేమా లేదు, నా ఇల్లన్న కోరికా లేదు.

రక్త పాశాల పైన మోహమూ లేదు, సిరి సంపదల పైన వ్యామోహమూ లేదు.

భవ బంధాల పైన అనురక్తి నశించి వైరాగ్యపు చీకట్లు చుట్టుముట్టాయి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here