గొంతు విప్పిన గువ్వ – 26

46
12

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

ప్రేమంటే…

రత్తాలు పదమూడో రోజున పనిలోకి వచ్చింది.

ఆమె మొహం కళ తప్పి వుంది. పది లంఖణాలు చేసినంత నీరసంగా వుంది. గట్టిగా పిటపిటలాడుతున్నట్టుండే ఆమె శరీరం జావకారినట్టుంది. ఆమె మొహంలో మహా శూన్యం తాండవిస్తోంది. ఆమె జీవితం చీకటై పోయినంత దిగాలుగా వుంది.

యాదయ్య పోయి అప్పటికే పన్నెండు రోజులయ్యింది.

“నీ దురదృష్టం కొద్దీ యాదయ్య గుండె జబ్బుతో పోయాడు. నీకు వైధవ్యం రాసి పెట్టి వుంది. తల రాతలను మార్చలేము రత్తీ, బాధపడకు, నువ్వు నీ శక్తికి మించి చేయగలిగింది చేసావు” అన్నాను ఓదార్పుగా.

శోకానికి నిలువెత్తు రూపంలా వున్న రత్తాలు నా మాటలకు విరక్తిగా నవ్వి మౌనంగా కూర్చుని అంట్లు తోముతోంది.

బాగా ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్టున్న ఆమె మొహం నూనెతో మర్దనా చేసినట్టు నల్లగా మెరుస్తోంది. చీదీ చీదీ ఆమె బండ ముక్కు మరింత లావయ్యింది.

నా మాటలకు ఒక్కసారి దుఃఖం వెల్లువై పొంగింది ఆమెలో. అంట్ల గిన్నెల ముందే రెండు మోకాళ్ళ మధ్య తల దూర్చుకుని వెక్కి పడుతూ ఏడవనారంభించింది.

“కొంచం సంబాళించుకో. ముందు వేడిగా టీ తాగు. తరువాత గిన్నెలు తోముదువు గాని” అంటూ నేను కాచిన వేడి వేడి టీని రెండు కప్పుల్లోకి వంపి రత్తాలుకి ఓ కప్పు అందించాను.

చీర కొంగుతో కళ్ళు, ముక్కు తుడుచుకుని టీ కప్పు అందుకుంది.

 

“మీలో పుని స్త్రీని ముండ మోపటం అనే ఆనవాయితీ ఉండదా…” మనిషి బెంగతో చిక్కిందే తప్ప అలంకారంలో మరే ఇతర మార్పులు లేని రత్తాలుని చూసి నాకున్న చనువుతో అడిగాను.

“ముండని ఏమి ముండమోపుతారమ్మా..” అంది నిర్వేదంగా రత్తాలు.

“అవేం మాటలే..” అన్నాను ఏమీ అర్థం కాక.

“యాదయ్య పెండ్లాన్ని నేను ముండమోపానమ్మా…” బాధగా అంది రత్తాలు.

నేను దిమ్మెర పోయాను.

“యాదయ్య నీ మొగుడు కాడా…” నమ్మలేక పోయాను.

“కాడమ్మా. నేను ముండ మోసి ఏడేళ్ళు అయ్యింది. రంకు ముండనయి రెండేళ్ళయ్యింది…” మళ్ళీ ఏడుపందుకుంది రత్తాలు.

* * *

రత్తాలు పెనిమిటి వెంకటయ్య బతికున్నంత కాలం నరకం చూసింది. ఆ నరకంలోనే ఓ నలుసును కని ఆ చిరుదీపపు వెలుతురులో బతుకుతోంది.

బిడ్డ పుట్టిన ఏడాదికే వెంకటయ్య ఆమెకు మోక్షం ప్రసాదించి కాలం చేసాడు.

వెంకటయ్య అకాలపు చావుతో ఆమె గుండెల మీద పుస్తెల బరువే కాకుండా గుండెల్లో పేరుకుపోయిన బాధల బరువు తీరిపోయింది. కాలి వేళ్ళకు చుట్టుకున్న మట్టెలతో పాటే ఆమెను చుట్టుముట్టిన చీకట్లు తొలగిపోయాయి.

వెంకటయ్య శ్వాస ఆగాక ఆమె స్వేచ్ఛగా శ్వాసించసాగింది.

ఆమెను బంధువులంతా కలిసి ఆమె నుదుటి పైన విధవ అని ముద్ర వేసారు.

ఆమెలో వాంఛలు వెంకటయ్య కాష్టంతోనే కాలిపోయి ఆమెను పునీతం చేసి ఆమె జీవితానికి ప్రశాంతతను చేకూర్చాయి.

ఆమె కాయకష్టం చేసుకుంటూ వెంకటయ్య కుదువపెట్టిన పుస్తెల తాడు, నల్ల పూసల గొలుసు విడిపించుకుని బిడ్డ కోసం దాచుకుంది. బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుక్షణం తపిస్తోంది.

బిడ్డ ధ్యాసలో బిడ్డ కోసమే బతికే ఆమె యాదయ్య కంట్లో పడింది. కంట్లో పడటం పడటమే వాడి మనసులోనూ పాతుకు పోయింది.

యాదయ్య ఆటో నడుపుతాడు. రత్తాలుండే గుడిసెలకు పది గుడిసెల అవతల రేకుల షెడ్డులో పెళ్ళాం పిల్లలతో వుంటాడు.

రత్తాలు ఇళ్ళ పనులకు వెళ్ళినప్పుడల్లా ఆటో ఎక్కమంటూ పని కాడ దింపుతానంటూ వెంబడించేవాడు.

ఎంచేతనో రత్తాలు పోరంబోకులకు, పోకిరీ వెధవలకూ జాడించి జవాబిచ్చినట్టు యాదయ్యను కసర లేకపోయింది. వాడిని పట్టించుకోకుండా వడివడిగా వెళ్ళిపోయేది. పట్టు వదలని విక్రమార్కునిలా యాదయ్య మళ్ళీ మళ్ళీ ప్రయత్నం మానలేదు. రత్తాలు కరగలేదు.

ఒక మబ్బులు పట్టి ముసురుగమ్మిన సాయంత్రం వేళ రత్తాలు ఆఖరి ఇంటి పని ముగించుకుని రోడ్డెక్కిన మరుక్షణం అమాంతం ఉధృతంగా కుంభవృష్టి మొదలయ్యింది. ఒంటిపై రాళ్ళలా వడగళ్ళు ఎడాపెడా పడటం మొదలయ్యాయి.

చుట్టుపక్కలా దరిదాపుల్లో వడగళ్ళ తాకిడి నుండి తనను తాను కాపాడుకోవటానికి రత్తాలుకి ఏ నీడ కనబడలేదు. లోతట్టు ప్రాంతమవటంతో అర క్షణంలో నీరు ఉధృతంగా ఏరై ప్రవహించసాగింది. తెగిన చెప్పుతో కాళ్ళకు చుట్టుకుంటున్న చీరతో తలపైన, మొహం పైన దెబ్బల్లా తగులుతున్న వడగళ్ళతో రత్తాలుకి దిక్కుతోచని వేళలో యాదయ్య ఆటో ఆమె పక్కగా సర్రున ఆగింది. ఆపటమే కాకుండా ఎంతో అధికారికంగా “రత్తీ తొందరగా ఆటో ఎక్కు” అన్నాడు యాదయ్య. ఎందుకో యాదిగాడు తనవాడే అనిపించింది. మారు మాటాడకుండా రత్తాలు ఆటో ఎక్కేసింది.

అలా ప్రారంభమయ్యింది యాదయ్యతో పరిచయం.

ఆ తరువాత వాడి రాకను ఆమె అరికట్టలేక పోయింది.

వాడి ప్రేమను ఆమె మనసు నిరాకరించలేక పోయింది.

మనిషి జీవితంలో ఒక్కసారయినా ప్రేమ రుచి చూడాలి.

ప్రేమంటే ఏమిటో తెలియకుండా జీవితం ముగిసిపోతే, ఆ జీవితం వృధాయే.

రత్తాలుకి చదువుసంధ్యలు లేవు.

ఆమెకు తాజ్‌మహల్ ఎవరు, ఎందుకు కట్టారో తెలియదు.

అనార్కలి అంటే మొగ్గో మనిషో అర్థం కాదు.

రోమియో జూలియట్ల కథ ఎప్పుడూ వినలేదు.

దేవదాసు సినిమా చూసి ఎరగదు.

భర్త నుండి ఒక బిడ్డను తప్ప పొందింది ఏమీ లేదు.

ఆమె జీవితంలో ఒక్క పిడికెడు ప్రేమ గాని ఒక్క ప్రేమానుభూతి గానీ లేవు.

అయినప్పటికీ ఆ అనుభూతి కోసం ఎప్పుడూ వెంపర్లాడ లేదు. ఎందరో వక్రమార్గాలలో తమ సహజాతాన్ని నెరవేర్చుకుంటారు. ఆమెకెప్పుడూ అలా తన ఇన్‌స్టింక్ట్స్‌ను తీర్చుకోవలసిన అగత్యం పట్టలేదు.

అలాంటి రత్తాలు యాదయ్యతో తల లోతు ప్రేమలో మునిగిపోయింది.

యాదయ్యకు పెళ్లయ్యిందని తెలుసు. వాడు ఇద్దరు పిల్లల తండ్రని తెలుసు.

అయినా మనసును నియంత్రించుకోలేక పోయింది.

పరాయి ఆడదాని గాలి పడని యాదయ్యను తన వేషాలతో లోబరుచుకుంది ‘రంకు ముండ’ అన్నారు చుట్టూ వున్న పతివ్రతా శిరోమణులనబడే ఆడంగులు.

ఆ ‘రంకు’ అనే పదం రత్తాలు గుండెను రంపంతో కోసేసింది. అయినా ఎంత గాయాన్నయినా తన ఇంద్రజాలమంటి తియ్యని ప్రేమతో మటుమాయం చేసే యాదయ్యను దూరం చేసుకోలేక పోయింది.

రత్తాలుకి ఎప్పుడూ చవి చూడని ప్రేమ మైకం కమ్మేసింది.

వాడి స్పర్శానుభూతి వశీకరణం చేసినట్టు సర్వం మరిపించి మురిపించేది.

స్వేదంతో తడిచిన వాడి చాతీపై రోమాల నుండి వచ్చే మత్తు గొలిపే మగ వాసన మైకంలా ఆమెను మైమరిపించేది.

ఉడుంపట్టు లాంటి వాడి మోహపు కౌగిలింత కలిగించే పులకింత స్వర్గాన్ని తలపించేది.

వాడిని శ్వాసిస్తూ వాడి సమక్షంలో మాత్రమే ఆమె నిజంగా జీవించేది.

ధర్మాధర్మాల గురించి ఆలోచించటం మానేసింది.

ఆమె వుండే గూడెంలో ఎవరెవరి పెళ్ళాలో ఎవరెవరి మొగుళ్ళతోనో తరుచూ లేచిపోతుంటారు.

ఆమె మాత్రం ఎంత నరకమైనా మొగుడితో పదేళ్ళు నిజాయితీగా కాపురం చేసింది.

వెంకటయ్య పోయాక యాదయ్య తన మీద మనసు పడనంత వరకూ ఐదేళ్ళు నిఖార్సుగా నిప్పులా బతికింది.

మొగుడు పోయాక మొగుడి జ్ఞాపకాల్లో బతికించే స్మృతులేవీ వెంకటయ్య ఆమెకివ్వలేదు.

అందుకే ఆమె ప్రమేయం ఏమీ లేకుండానే ఆమె మనసు యాది ప్రేమకు లొంగి పోయింది.

ఆమె మనసిప్పుడు ఆమె అదుపాజ్ఞల్లో లేదు. యుక్తాయుక్తాలు ఆలోచించనీయటం లేదు.

రత్తాలుకి గొప్పోళ్ళు చెప్పుకునే సహజీవనం అంటే అర్థం తెలియదు.

తన గూడెంలో “అలివేలును శంకరన్న ఉంచుకున్నాడు, సీతను ప్రసాదు ఉంచుకున్నాడు, మణిని పెంటయ్య ఉంచుకున్నాడు” అని చెప్పుకుంటుంటే ఉంచుకోవటమంటే ఏమిటో ఆమెకు నిజంగానే తెలియదు.

ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో జరిగే ఇష్ట పూర్వక జీవనం నేరం కాదని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం ఆమోదించిన 497 సెక్షను అసలే తెలియదు.

చలం అనేవాడు ఏమి చెప్పాడో అతని ఇజాన్ని అర్థం చేసుకునే స్థాయి ఆమెకు లేదు.

ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే.

యాదిగాడిపై రాచపుండులా సలుపుతున్న ప్రేమ.

ఇప్పుడు జనం తన గురించి ఏమనుకున్నా బాధ లేదు. యాదిగాడు తోడుంటే చాలు.

ఆ రేయెందుకో యాదిగాడు రాలేదు.

వాడి వెన్నెల స్మృతులు ఆమెను నిప్పులా కాల్చేసాయి.

నిద్రకు నోచని చింత నిప్పుల్లాంటి ఎర్రటి కళ్ళతో సూర్యోదయం అయ్యింది. ఆమె మనసులో నుండి చీకటిని పాలద్రోలే వెలుగు యాది మాత్రం రానే లేదు.

ఆమె యాదిగాడి ఇంటికి వెళ్ళే సాహసం చేయలేదు.

అన్యమనస్కంగా పనులకు వెళ్తోందే గాని అనుక్షణం తన పక్కన యాదిగాడి ఆటో ఆగిన భ్రమే.

రెండు రోజుల్లో రత్తాలు తిండి సయించక బుర్ర పని చేయక సగం పిచ్చిదై పోయింది.

మూడో రోజున తెల్లవారుజామున యాదిగాడి ఏడేళ్ళ పెద్దకొడుకు తలుపు తట్టాడు.

“మా నాయన దవాఖానల వున్నడు. మా అమ్మ నిన్ను తోల్క రమ్మంది..” అన్నాడు.

రత్తాలుకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయ్యింది.

అమాంతం ఒక్క పరుగులో యాదిగాడి మంచం పక్కన వాలింది రత్తాలు.

యాదిగాడి పెళ్ళాం గౌరమ్మ రత్తాలుని చూసి భోరున ఏడ్చింది.

యాదిగాడు స్పృహలో లేడు.

మెలకువ వచ్చినప్పుడల్లా ‘రత్తీ… రత్తీ…’ అంటూ కలవరిస్తున్నాడని గౌరమ్మ చెప్పింది.

రెండు రోజుల క్రితం రాత్రి గుండెపోటు వచ్చి స్పృహ తప్పితే ఆసుపత్రిలో చేర్చారు.

రత్తాలు వాడి మంచం పక్క నుండి కదలలేదు.

డాక్టరు బయట కొనుక్కు రమ్మని ఇచ్చిన మందుల చీటీ కొడుకుతో రత్తాలు చేతికి ఇప్పించింది గౌరమ్మ.

రత్తాలు ఒక్క ఉరుకులో గుడిసెకు పోయి కూతురి కోసం ట్రంకు పెట్టెలో భద్రంగా దాచిన పుస్తెల తాడు, నల్ల పూసల దండ తీసుకెళ్ళి అమ్మేసింది. ఆ వచ్చిన మొత్తాన్ని గౌరమ్మ చేతిలో పెట్టింది. ఏదో పెద్దాపరేషను చేసారు యాది గుండెకు. వాడి గుండెను ఎంత లోతుగా కోసినా రత్తాలు బొమ్మ మాత్రం అందులో నుండి చెరగ లేదు.

ఆపరేషను అయిన నలభై ఎనిమిది గంటలకు సగం మెలకువ వచ్చింది యాదికి.

సగం కళ్ళతో రత్తిని మనసారా చూసుకున్నాడు.

అరమోడ్పు కళ్ళు సగంలోనే ఆగిపోయాయి. ‘రత్తీ..’ అంటూ విచ్చుకున్న పెదవులు విచ్చుకున్నట్టే వుండి పోయాయి. వాడి ప్రాణం అనంతవాయువుల్లో కలిసి పోయింది.

వాడి చావుతో కట్టుకున్న గౌరమ్మ సంగతేమో గాని గంగలా నెత్తినెట్టుకున్న రత్తి పరిస్థితి దయనీయంగా మారింది.

తను పని చేస్తున్న అందరి ఇళ్ళల్లో మొగుడు పోయాడని పది రోజులపాటు పనికి రానని చెప్పి రత్తాలు యాదిగాడి దినాల ఖర్చుకని అడ్వాన్సు తీసుకుంది.

ఆ పది రోజులు తన శరీరానికి అలుపు కోసం, మనసుకి మరుపు కోసం అలవాటు లేని అడ్డ మీద కూలీకి వెళ్ళింది.

యాది చావు, దినాలు అన్నీ ఘనంగా చేయటమే కాకుండా గౌరమ్మ వితంతు తంతు దగ్గరుండి చేయించింది. యాది అస్థికలను అపురూపంగా కృష్ణలో కలిపింది.

రత్తాలు యాది పెళ్ళానికి అన్యాయం చేసిందన్న వాళ్ళు నోళ్ళు మూసుకున్నారు.

రత్తాలు తన రంకుతనం ప్రేమకు పర్యాయపదమేనని సమాజానికి ధీటుగా జవాబిచ్చింది.

యాదితో రెండేళ్ళ సంసారం ఇప్పుడు రత్తాలుని ముగ్గురు పిల్లలకు ఆజన్మాంతం అమ్మను చేసింది.

“యాదిని యాది మరువలేకున్నానమ్మా…” అంటూ వెక్కుతూనే వుంది రత్తాలు.

రత్తాలు వైవిధ్యభరితమైన ప్రేమకథ విన్నాక గుడిసె స్థాయి రత్తాలు నా కళ్ళకు మహోన్నత శిఖరంలా కనిపించింది.

అసలు ప్రేమంటే ఏమిటన్న ప్రశ్నకు జవాబు కొత్త కోణంలో నన్ను తొలిచేయసాగింది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here