గొంతు విప్పిన గువ్వ – 35

29
10

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

కొత్త లోకం-3             

[dropcap]రూ[/dropcap]ములోకి నన్ను షిఫ్ట్ చేసేసరికి దావానలంలా రాజుకున్న నా ఏక్సిడెంట్ వార్త తెలిసిన బంధుమిత్రులంతా హాస్పిటల్‌కి చేరిపోయారు. ఒకరు ఇద్దరు కాదు.. ఎమెర్జెన్సీ వార్డ్ బయట కనీసం పాతిక ముప్పై మంది బంధువులు లోనికి ప్రవేశం కోసం స్టాఫ్‌తో గొడవ పడుతున్నారు.

ఫార్మాలిటీ కోసం అటెండెన్స్ వేయించుకోటానికి వచ్చిన బంధుమిత్రులు కారు వారు. వార్త విన్న కలవరంలో అల్లకల్లోలమైన మనసుతో షాకును తట్టుకోలేక కంపించిన హృదయంతో దుఃఖంలో గుండె చెదిరి ముసిరిన అనుబంధాల తుంపరలు వారు.

ఒక్కసారి చూసి వెళ్ళిపోతామని బతిమాలుకుంటున్నారు. అదేమీ షాపింగ్ మాల్ కాదని సెక్యూరిటీ నిరాకరించింది. క్రమంగా గొడవ సర్డుబాటుగా మారింది. ఒకేసారి ఇద్దరి కన్నా ఎక్కువ మంది వెళ్ళమని అంతా కలిసి రాజీకి వచ్చారు. వంతులవారీగా ఇద్దరేసి లోపలికి రావటం మొదలెట్టారు. ఆ ప్రేమపూరిత పలకరింపుల వెల్లువకు నా మనసు తడిచి ముద్దయి పోయింది.

మన శ్రేయస్సు కోసం కన్నీరు కార్చే నాలుగు జతల కళ్ళు, మనం పోయినప్పుడు మోసే నాలుగు భుజాల కన్నా కోరుకునేదేముంటుంది ఎవరైనా. ఈ విషయంలో నేను సుసంపన్నురాలిని. మానవతానుబంధాల విలువ అర్థమవసాగింది.

విజయ్ నన్ను డాక్టర్ గురవారెడ్డి కేసుగా రాయించటంలో కృతకృత్యుడయ్యాడు. ఎక్స్‌రే, MRI లు తీసాక డాక్టరుగారు నాకు జరిగినది ట్రైమేలియోలార్ ఫ్రాక్చర్ అని నిర్ధారించారు. గురవారెడ్డి టీం మెంబర్లు ఒక్కొక్కరుగా వచ్చి నా కాలుని చూసి వెళ్ళసాగారు. మరుసటి రోజు సర్జరీ చేయటానికి నిర్ణయించారు. ఈ లోపు కదిలిపోయిన, చిట్లిపోయిన ఎముకలను సరిగ్గా అలైన్ చేసి కట్టు కట్టాలి.

భోజనానికి అనవసరంగా పిలిచానని దుఃఖంతో కుమిలిపోతున్న మా వదిన, నేను వాళ్ళ ఇంట్లో పడిపోయినందుకు తనే బాధ్యురాలిగా బాధపడుతూ పరిహారంగా నాతో ఆసుపత్రిలో తనే వుంటానని వుండి పోయింది.

ఒక కుర్ర డాక్టరు కాలిని అలైన్ చేసి పట్టీ వేయటానికి వచ్చాడు. అంతవరకూ చీలమండలో మల్టిపుల్ ఫ్రాక్చర్లయినా పెయిన్ కిల్లర్స్ మీద వున్న నాకు పెద్దగా నొప్పి తెలియలేదు. ఆ డాక్టరు మరో నర్సు సాయంతో కాలిని లాగి పట్టుకుని బోన్స్ అలైన్ చేసే ప్రయత్నం చేసాడు. అసలు నొప్పికి నిర్వచనం ఆ క్షణంలో తెలిసింది. గిలగిలలాడిపోతూ ఆసుపత్రి దద్దరిల్లిపోయేలా గావుకేకలు పెట్టాను. వదిన అమాంతం లేచి ఆ కుర్ర డాక్టరు పైన విరుచుకుపడింది.

“ఏమి డాక్టరీ చదివావయ్యా.. పిల్లను చంపేస్తున్నావు. నీకు నొప్పి తెలియకుండా కట్టేయటం చాత కాకపొతే వేరే డాక్టరుని పంపించు. నువ్వు వెయ్యకు…” అంటూ వదిన అడ్డుకుంది.

“చెదిరిన ఎముకలను సరి చేసేటప్పుడు నొప్పి అలాగే ఉంటుందమ్మా ఎవరు చేసినా…” వదిన దబాయింపుకి బెదిరిపోయిన డాక్టరు బేలగా అన్నాడు.

నర్సు వదినను బయటకు పంపేసింది.

నా గావుకేకలకు వదిన శోకండాలు శృతి కలిపాయి.

డాక్టరు వెళ్ళిపోయాక లోపలికి వచ్చిన వదిన నా తల నిమురుతూ డాక్టరుని శాపనార్థాలు పెట్టింది. నీరసపడిపోయిన నేను వదిన నోటికి ఆనకట్ట వేయలేక నిస్సహాయంగా చూస్తూండిపోయాను.

కన్న తల్లి, కన్న బిడ్డ, కట్టుకున్న మొగుడూ… వీటిలో ఏమీ కాని బంధం కోసం ఇంత ప్రేమతో అంత తపన పడుతూ రోదించటం వదినకు ఎలా సాధ్యం..? నా పెళ్ళిలో కన్యాదానం చేసిన పాశమా అది..?

ఎంత ప్రాణప్రదమైన బంధుమిత్రులైనా ఇంత స్వచ్ఛంగా బాహాటంగా ఏడవాలంటే ఎంత నిర్మలమైన అమాయక మనసుండాలి..?

నేను పరిపరి విధాల ఆలోచిస్తూ అలిసిపోయి నిశ్శబ్దంగా రోదిస్తున్న వదిన వంక చూసాను.

కట్టు కట్టాక ఎక్స్‌రే తీసారు. గురవారెడ్డి గారు ఎక్స్‌రే రిపోర్టు చూసి అతని టీం సభ్యులకు ఏవో సూచనలు ఇచ్చాడు. మళ్ళీ మరో ఇద్దరు డాక్టర్లు వచ్చారు. అలైన్మెంట్ కుదరలేదట. కట్టు విప్పి మళ్ళీ అలైన్ చేసి కట్టు వేయటానికి వదిన ససేమిరా ఒప్పుకోలేదు. నేను లోకల్ అనీస్తీషియా ఇచ్చి కట్టు వేయమన్నాను. వాళ్ళు నవ్వి కట్టు వేయటానికి అనీస్తీషియా ఇవ్వరని ఒక్క నిముషం వాళ్ళతో కోపరేట్ చేయమని అర్థించారు.

మా వదినతో అనుభవమైన నర్సు ముందు మా వదినను బయటకు వెళ్ళమన్నది.

వదిన నా మీదున్న ప్రేమనంతా డాక్టర్ల మీద అక్కసుగా మార్చుకుని భాషా సంస్కారాన్ని కూడా మరిచిపోయి డాక్టర్లను దూషించటం మొదలెట్టింది.

నాకు భూలోక నరకాన్ని మరోసారి చవి చూపించారు వాళ్ళు. గావుకేకలతో ఒరుసుకు పోయి బొంగురుపోయిన గొంతుతో ‘సర్జరీ కూడా ఇలాగే వుంటుందా’ అని అడిగాను.

“లేదు. సర్జరీ అనీస్తీషియా ఇచ్చి చేస్తారు. నొప్పి తెలియదు” అన్నాడు ఓ డాక్టరు.

కళ్ళ చివర్ల నుండి నీరు కారుతూండగా నొప్పిని పంటి బిగువున అదిమిపెట్టి కళ్ళు మూసుకున్నాను.

ఆపరేషను రోజున నా బందుమిత్రులంతా ఆసుపత్రి ముంగిట్లోనే వున్నారు. అమ్మాయిలిద్దరూ మాటి మాటికీ ఫోనులు చేసి నా అప్‌డేట్స్ తీసుకుంటున్నారు. పెద్దమ్మాయి తన పేషెంట్లందరినీ కాన్సిల్ చేసుకుని ఇండియాకి టికెట్ బుక్ చేసుకుంది.

డాక్టర్ చెప్పినట్టుగా లోకల్ అనీస్తీషియా వలన సర్జరీ ఏమంత బాధనిపించలేదు. కేవలం కాలు భాగం మాత్రమే స్పర్శ తెలియటం లేదు తప్ప నేను పూర్తి స్పృహలో వున్నాను. అరడజను ఆర్ధోపెడిక్ స్టూడెంట్ డాక్టర్లు, డాక్టర్ గురవారెడ్డితో పాటు నా పాదం చుట్టూ చేరి వున్నారు.

నా మొహానికి అడ్డు తెర కట్టారు. అసలు ఆపరేషన్ ఎవరు చేసారన్నదీ నాకు అర్థం కాలేదు. వాళ్ళ మెడికల్ టెర్మినాలజీలో వైర్లు, స్క్రూలు, నట్టులు లాంటి పదాలు విని ఆశ్చర్యపోయాను. నా బయోలాజికల్ బాడీలో హార్డువేర్ సామగ్రి చేరుతోందని తెలిసింది.

చిత్రంగా స్క్రూలతో బిగింపబడి కదులుతున్న రోబోలు నా కళ్ళ ముందు కదలాడాయి. సృష్టికి ప్రతిసృష్టి చేసే డాక్టర్ల ప్రతిభా పాటవాలను సంభ్రమంగా అభినందించుకుంటూ భవిష్యత్తులో నా నడక ఎలా వుంటుందోనని ఆలోచనలో పడ్డాను.

“నెమలికి నేర్పిన నడకలివీ….” ఎప్పుడో ఎవరో నా నడకకు అభినందన పూర్వకంగా పాడిన పాట మనసులో మూలిగింది.

“ఎంత దర్పంగా నడుస్తారండీ వ్యక్తిత్వాన్నంతా వ్యక్తపరుస్తూ…” ఒకప్పటి నా సహోద్యోగి ప్రశంస వెక్కిరించినట్టనిపించింది. నడతలోనే కాకుండా నడకలో కూడా వ్యక్తిత్వం వెల్లడి అవుతుందని తెలియని నేను అప్పుడు అతని మాటలకు ఆశ్చర్యపోయాను.

ఒకప్పుడు “క్యా మస్త్ చల్తీ హై యార్.. ” అనే కుర్రకారు ఇప్పుడు “బెచారీ లంగ్డీ…” అంటూ ఏమి పేలతారో ఊహించటానికే భయం వేసింది.

“ఎంత ఫ్లెక్సిబుల్ బాడీ అండీ… టీనేజర్స్ కూడా మీలా ఆసనాలు వేయలేరు” అంటూ ఎప్పుడూ మెచ్చుకునే యోగా టీచరు కళ్ళ ముందాడింది.

“భలే కూర్చుంటావే నేలమీద బాసింపెట్టు వేసుకుని చిన్న పిల్లలా” ఆనంద పడే స్నేహితులు గుర్తొచ్చి దుఃఖం ముంచుకొచ్చింది.

“యాభై దాటినా సిన్న పోరి లెక్క ఎప్పుడూ ఉర్కులాడ్తనే ఉంటది” అక్కసు పడే పక్కింటావిడ వంకరగా నవ్వుతున్నట్టనిపించింది.

అసలు మత్తు కాలికి కాకుండా నా మెదడుకి ఇచ్చి వుంటే బావుండేది.

పిచ్చి ఆలోచనలను నిద్రపుచ్చలేకపోయాను.

సర్జరీ అయిన వెంటనే రూములోకి పంపేశారు.

వెన్నుపూసకు పొడిచిన అనీస్తీషియా పోటుతో వీపులో విపరీతంగా నొప్పి.. సెలీన్, బ్లడ్ కోసం కుళ్ళపొడిచిన చేతి నరాలన్నీ పచ్చి పుళ్ళయిపోయాయి.

పురుటి నొప్పులు తప్ప మరే నొప్పులు ఎరుగని ప్రాణం. కనీసం జలుబు, జ్వరం కూడా తెలియనిదాన్ని.

అప్పట్లో ఆయనతో అంటుండేదాన్ని… ‘నాకోసారి జ్వరం వస్తే బావుండు… మీరెలా సేవ చేస్తారో చూడాలని వుంది’ అని.

ఈ రోజున ఇంత పెద్ద ఆపరేషను అయ్యింది.. తను లేరు. నా జ్వరం కోరికయినా తీరకుండానే వెళ్ళిపోయారు. మంచం మీద నిస్సహాయంగా కదిలాను.

అరవై నాలుగు కేజీల బాడీ కాలికి ముప్పయి కేజీల కట్టు కట్టారు. కాలుని ఎత్తులో కట్టి పెట్టారు. ఓ పర్వతాన్ని మోస్తున్నట్టే వుంది. నిద్ర పట్టని నేను తెల్లవార్లూ గాలిలోకి కాలి వంకే చూస్తూండిపోయాను.

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చాక కజిన్ మంచం పైనే కూర్చోబెట్టి కాలకృత్యాలు చేయిస్తుంటే మొదటిసారి మొగుడు లేనితనం మనసును కృంగదీసింది. కట్టుకున్నవాడి కొరత కొట్టొచ్చినట్టుగా కనపడింది.

ఏవేవో రిలేషన్స్… ఎవరో బంధువర్గం ఇష్టంగానే సేవలందిస్తున్నారు. అయినా మనస్సెందుకో మూగగా రోదిస్తోంది. ఎంత మంది వచ్చి చూసి పోయినా ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా రాత్రింబవళ్ళు పక్కనుండాల్సిన మొగుడి స్థానం భర్తీ కాదు. ఆ వెచ్చని కౌగిలి ఇచ్చే స్వాంతన దొరకదు. తల్లి స్థానాన్ని భర్తీ చేయలేమంటారు కాని నా వరకూ భర్త స్థానం కూడా భర్తీ చేయలేనిదే…

(మళ్ళీ కలుద్దాం)      

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here