గొంతు విప్పిన గువ్వ – 37

11
7

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

కొత్త లోకం-5             

[dropcap]ఆ[/dropcap]సుపత్రిలో పోరాటం… అమ్మ పడే ఆరాటం 

స్నేహం విలువ… బంధువుల ఆప్యాయత

నా మీద పిల్లల ప్రేమ… ఒంటరితనంలో వేధించిన ఆయన జ్ఞాపకాలు

కాళ్ళ ప్రాముఖ్యత… అవిటితనంలో పుష్టి పొందిన ఆలోచనలు

అనారోగ్యం… తోడు కోసం అలమటించిన హృదయం

మథించిన జీవిత సారం… శోధించిన జీవన సారాంశం

ఇలా ఒక్కటేమిటి నా కదల లేని కాళ్ళు కలాన్ని కదం తొక్కించి విభిన్నమైన అంశాల పైన కవిత్వం రాయించాయి. ఎప్పుడో టీనేజీలో పిచ్చి ప్రేమగీతాలు రాసుకున్న నేను ఈ గృహ ఖైదు కారణంగా తిరిగి కవిత్వంలో తలమునకలయ్యాను. 

నాలా కదలలేని అశక్తులే కాకుండా ఎందరో విజ్ఞానవంతులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సర్జన్లు, నిర్మాతలు, రచయితలు, కవులు, ఎడిటర్లు ముఖపుస్తక వేదికను ఆశ్రయించటం నాకు ఆశ్చర్యమనిపించింది. అక్కడ కొందరు ఆణిముత్యాల్లాంటి స్నేహితులు లభించటం నా అదృష్టం. మా ఇద్దరమ్మాయిల స్నేహితులు, క్లాస్మేట్స్ కూడా నా అభిమానులు కావటం మరీ విశేషం.

ఈ స్నేహబృందంలో అద్భుతమైన పీడియాట్రిషియన్లు, గైనకాలజిస్ట్లు, ఆర్థోపెడిక్ సర్జన్లు వున్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ అయిన మిత్రులు డాక్టర్ శేషగిరిరావుగారు, ఎప్పటికప్పుడు నా ఎక్స్‌రే రిపోర్ట్‌లు అడిగి చూస్తూ సముచిత సలహాలు ఇస్తుండేవారు.

చిత్రంగా నా ప్రపంచం నా కుటుంబ పరిధి దాటి బయటకు విస్తరించటం ప్రారంభమయ్యింది. నా ఆలోచనలు రూపాంతరం చెందుతూ నాలో పూర్ణ పరివర్తన కలగ సాగింది.

నాలో కలిగే స్వల్ప భావోద్వేగాలను కవితలుగా కాకుండా అంతకు మించి అనంత జీవితాన్ని ఆవిష్కరించాలన్న కోరిక నానాటికీ పెరుగుతూ వచ్చింది. జీవితాలను చిత్రించాలంటే అందుకు సాధనం కవిత్వం కాదని అందుకు సువిశాలమైన ప్లాట్ఫారం నవల అని అనిపించి, స్నేహితుల సలహా మేరకు నవలా ప్రక్రియ చేపట్టాను.

నవలంటే ఆషామాషీ కాదు… నాలుగు లొల్లాయి వాక్యాలు రాసి కవిత్వం అనుకోవటం కాదు. అసలు రాసేది ఎలా వుందన్నదీ నా కొత్త ఎఫ్బీ లోకంలో లభించిన మిత్రులే నిర్ణయించాలి. అనుకున్నదే తడవుగా నా ఆలోచనను వెంటనే అమలు చేసాను.

ఎఫ్బీలో ధారావాహికంగా నా తొలి నవల “అనాచ్ఛాదిత కథ”ను రాయటం జరిగింది. మిత్రుల పూర్తి మద్దతు, ప్రోత్సాహాలతో నిర్విఘ్నంగా కొనసాగిన నా నవల మిత్రులందరినీ కదిలించి కుదిపేసింది. ఎఫ్బీలో సక్సెస్ఫుల్‌గా అంత పెద్ద ఫాలోయింగ్‌తో నవల రాసిన తొలి రచయిత్రినన్న కితాబు నాకు దక్కింది.

అనాచ్చాదిత కథను నవలగా అచ్చు వేయించి రంగరంగ వైభవంగా 24 ఆగష్టు 2019 నాడు ఎ. జగన్నాధశర్మగారి అధ్యక్షతలో కె.శివారెడ్డిగారు ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత్రి ఓల్గాగారు రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. అసంఖ్యాక ఎఫ్బీ అభిమానులు దూరాభారాలను లెక్కచేయక రెండు తెలుగు రాష్ట్రాల నుండి నా పుస్తకావిష్కరణ సభకు రావటం, నాకు శాలువాలు కప్పి వారికి తోచిన రీతిలో నన్ను సత్కరించటం నేను ఏనాడూ కలలో కూడా ఊహించని మధురానుభూతిని మిగిల్చింది.

నా రచనా శైలి యద్దనపూడి సులోచనారాణిగారిని తలపిస్తోందని, విడవకుండా చదివించే గుణమున్న నవలని సాహిత్య ప్రముఖులు కొనియాడుతుంటే మైమరిచిపోయాను. నా డెబ్యూ నవలకు అంపశయ్య నవీన్ పురస్కారం లభించటం, గ్రంథాలయ సంస్థలకు ఎన్నికయి సైటేషన్ నంబరు రావటం, గ్రంథాలయాల్లో స్థానం సాధించటం అన్నీ కలలో లాగా జరిగిపోయాయి.

మొదటి నవల ఇచ్చిన ప్రోత్సాహంతో సరిగ్గా ఒక సంవత్సరంలో రెండో నవల “విరోధాభాస” విభిన్నమైన సబ్జెక్టు తీసుకుని రాయటం జరిగింది. 27 ఆగష్టు 2020 లో ఓల్గా, శీలా సుభద్రా దేవి గార్లు ఆత్మీయ అతిథులుగా స్ప్రెడింగ్ జ్యోతిగారి అద్బుత సమీక్షతో కరోనా కారణంగా అంతర్జాలంలో పుస్తకావిష్కరణ జరిగింది. రెండో నవల మొదటి నవల కన్నా అశేష పాఠకుల అభినందనలు పొందింది.

ఆ తరువాత అనేక కథలు వివిధ పత్రికల్లో ముద్రితమవ్వటం, కొన్ని బహుమతులను గెలుచుకోవటం  నన్నో రచయిత్రిగా నిలబెట్టటం జరిగింది.

మంచంలో మూడు నెలల మహా ప్రస్థానం నాలో ఓ కొత్త మనిషికి జీవం పోసింది.

3Cs of life… Chance, Choice and Change అంటారు.

కాలు విరిగి ఇండియాలో వుండిపోయే chance రావటం, నేను సాహిత్యాన్ని choose  చేసుకోవటం, ఆ ఛాయిస్ నాలో change తేవటం అసంకల్పితంగా జరిగి పోయాయి.

అసలు నాలో జరిగిన మెటామార్ఫిసిస్‌కి, ఈ సాహిత్య పురోగతికి, పునాది వేసింది ఏమిటని ఆలోచిస్తే ఆశ్చర్యంగా నాకు జరిగిన కాలు ప్రమాదమే.

ఆ ప్రమాదమే జరగకపోయి వుంటే, నేనలా రొటీనుకి భిన్నంగా విశ్రాంతిగా వుండక పోతే నాలోని కవయిత్రి, రచయిత్రి వెలుగు చూసేవారు కారు.

భగవంతుని ప్రతి చర్యకు ఒక కారణముంటుంది.

God has His own plans…

మరక మంచిదయ్యింది.. ప్రమాదం ప్రమోదం అయ్యింది.

అశేష అభిమానుల ప్రేమానురాగాలు, స్నేహితులుగా కొందరు అభిమానుల ప్రమోషన్.. నాలో కొత్త జీవితోత్సాహం నింపాయి.

అరా కొరా చిరు చేదు అనుభవాలు మినహాయించి నాకు ఇష్టమైన ప్రవృత్తిలో ఇప్పుడు నా ప్రపంచమంతా అందమే.. ఆనందమే..!

(మళ్ళీ కలుద్దాం)      

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here