గొంతు విప్పిన గువ్వ – 5

8
9

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

చెదిరిన వసంతం

[dropcap]మా[/dropcap]నవ జీవన నాలుగు దశల్లోను యౌవ్వన దశనే వసంతమంటాను నేను. అప్పుడే వికసించిన అందంతో కూడిన అమాయకత్వం, అనాలోచిత అనుభవాల కొరకు ఆరాటం, ఉత్సాహ పూరిత అసాధ్యాల అన్వేషణ, నేననే ఉగ్రతతో కూడిన అహం, కలల సరాగాలు, దైహిక వాంఛలు…

అదో అసంతృప్త స్థాయిలో సాగిపోయే సంతృప్త దశ.

పదునైన తెగగోసే కత్తిని మృదు విరుల వరమాలగానూ, రాయిరప్పలను వజ్ర వైడూర్యాలుగానూ, కొండ కోనలను రాజ మహలుగానూ, కర్ణ కఠోర ఆర్తనాదాలను సుమధుర సంగీత స్వరాలుగానూ, అసలు దేనిని దేనిగానైనా ఊహించగల ఉచ్చ దశలో ఒక స్వాప్నిక జగత్తు అది.

పరిసరాల ప్రతి కదలికను, ప్రకృతిలోని ప్రతి మార్పును ఉద్వేగ పరిచే భావుకతలోకి తర్జుమా చేసుకోగల రాయంచల హేలలాంటి వసంతపు వయసు పొంగులో వున్నాను అప్పుడు నేను… నేననే అహంతో కూడిన నేను.

తొలిసారిగా కో-ఎడ్యుకేషన్ పేరుతో స్త్రీపురుషుల మేళాలో MA తెలుగులో చేరాను. అంతకాలం ఆడ పిల్లల స్కూలు, ఆడపిల్లల కాలేజీల్లో చదివిన నాకు ఆడ మగలు కలగలిసిన కాలేజీలో ఏదో తెలియని తత్తరపాటు, చిత్రమైన అనుభూతి.

డిగ్రీ వరకూ కూడా రిక్షాలలోనూ, ఆటో రిక్షాలలోనూ స్కూలు పిల్లలతో పిల్లల కోడిపెట్టలా వెళ్ళే నాకు తొలిసారిగా పబ్లిక్ రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకునే సదవకాశాన్ని అమ్మ ఇచ్చిన సందర్భం అది.

ఊహల పొదరిళ్ళు కట్టుకుంటూ కలల సరాగాల్లో గగన విహారం చేసే నాకు లోకంలో అణువణువూ అందాలు ప్రజ్వలిల్లుతూ తారసిల్లేది.

బస్సు కోసం బస్టాపులో వేచి వుండే పావు పావున్నర గంటలు కూడా అద్భుతమైన ఫీలింగునిచ్చేవి.

చుట్ట్టూ అబ్బాయిలు తదేకంగా నన్నే కన్రెప్పలు కదల్చకుండా చూడటం గమనించి నాలో నేనే ముసిముసి నవ్వులతో మిడిసిపడి గర్వపడే దానిని.

ఆ రోజుల్లోనే ఒక ఒప్పుకోలేని నిజాన్ని గ్రహించాను. నేను సౌందర్యోపాసకురలిననే భ్రమలో వున్న నాకు ఆ వయసులో సౌందర్యాన్ని మించిన వేరే ఆకర్షణలు వుంటాయని కొత్తగా అర్థమయ్యింది.

మంచి ముఖ వర్చస్సుతో ఆజానుబాహుడైన నవ యౌవ్వన సుందరాంగుడొకడు అదే సమయానికి నాతో పాటు ఆ బస్టాపులో తన బస్సు కోసం వేచి వుండేవాడు. అందాన్ని విరగబడి చూసే నేను మొదట్లో అతనిని కళ్ళప్పగించి చూస్తూ అతని మగసిరితో కూడిన అందాలను ఆస్వాదించేదానిని. అదే సమయంలో అదే చోట ఓ మోస్తరుగా వుండే మరో వ్యక్తి నన్ను అదే పనిగా చూస్తుండేవాడు. సుందరాంగుడు నా వైపు అస్సలు చూడకుండా తన ధ్యాసలో తానుండేవాడు. ఈ రెండో వ్యక్తి ఆ బస్టాపుకి నా కోసమే తన చిలకపచ్చ రంగు వెస్పాపై వచ్చి నేను ఎక్కిన బస్సును కాలేజీ వరకూ ఫాలో అయి, నేను కాలేజీ గేటులోకి వెళ్ళాక తను వెను తిరిగి వెళ్ళి పోతుండేవాడు. ఇంతలా వెంటపడి క్రమం తప్పకుండా రెండేళ్ల పాటు నన్ను వెంబడించిన రెండో వ్యక్తి పైనే నా దృష్టి వుండేది తప్ప నా వంక చూడని అందగాడి పైన నా ధ్యాస నిలిచేది కాదు. అప్పుడే తెలిసింది నాకు జీవన వసంతంలో అందాన్ని మించి వేరే ఆకర్షణలకు ప్రాముఖ్యమెక్కువని.

ఏ ఒక్క రోజయినా చిలకపచ్చ స్కూటరు కనిపించకపోతే వెలితిగా వుండేది. నా రెండేళ్ళ MA కాలం ఆసాంతమూ కాలేజికి వెళ్ళే దారిలో ఆ చిలకపచ్చ స్కూటరు నన్ను ఉద్వేగ పరిచే ఒక ఆకర్షణ అయితే కాలేజీ క్యాంపస్ లో మరో అసలైన ఆకర్షణ నా కోసం వేచి వుండేది.

మా నిజాం కాలేజీ భవంతి కొంచం ఎత్తు మీద వుండి అందులోకి ప్రవేశించాలంటే దాదాపుగా ఒక అంతస్తుకి ఎక్కాల్సినన్ని విశాలమైన మెట్లు ఎక్కాల్సి వచ్చేది. ప్రతి రోజూ నేను కాలేజీకి చేరి మెట్లెక్కే సమయానికి ఒకతను పై మెట్టుకి ఒక పక్క చివరన కూర్చుని మెట్లెక్కే నన్ను రెప్ప వేయకుండా చూసేవాడు.

అసలే కో ఎడ్యుకేషన్ కాలేజీ, అప్పటిదాకా అలవాటు లేని అబ్బాయిల సమక్షం, ఆపైన గుచ్చి గుచ్చి చూసే ఆ చూపులు. నాకు చాలా ఇబ్బందిగా వుండి పాదాలు తడబడేవి. తలెత్తి అతని వంక చూడకుండా నా కాళ్ళ మీదే దృష్టి పెట్టుకుని మెట్లెక్కేదాన్ని. నాతో పాటు మెట్లెక్కే నా స్నేహితురాళ్ళు అతని రెప్ప వేయని చూపులకు నన్ను ఆట పట్టించేవారు. నా కోసమే అతను ఆ మెట్ల మీద కాపు కాచేవాడని తరువాత తరువాత తెలిసింది. అతను చాలా ఆకర్షణీయంగా వుండేవాడు. అతను MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థి. అప్పటికే అతను ఏవో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఐపిఎస్‌కి ఎంపిక అయి వున్నాడుట.

మా బ్యాచ్‌లో మేము ఐదుగురు అమ్మాయిలం మంచి స్నేహంగా వుండేవాళ్ళం. పంచపాండవుల్లా ఐదుగురం కలిసికట్టుగా తిరిగేవాళ్ళం. అందులో రాధ నా ప్రాణ స్నేహితురాలు. చూపులతో మన్మథ బాణాలు విసిరే అతనికి రాధ ‘మదనుడు’ అని పేరు పెట్టింది.

ఒక రోజున నేను ఏదో కారణంగా కాలేజీకి వెళ్ళలేదు.

రాధ “నీ మదనుడు నిన్నటి రోజంతా పాపం మెట్ల మీదే కూర్చున్నాడ”ని మరుసటి రోజు నన్ను ఏడిపించింది.

క్రమంగా చూపుల నుండి నవ్వులను దాటి పలకరింతల వరకూ వెళ్ళింది మదనునితో మా స్నేహం. దానికి కూడా మా రాధే కారణం.

ఓ ఉదయం రాధ “ఇప్పటికే చూపులతో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఇంకెన్నాళ్ళు ఈ కళ్ళ భాషలో సంభాషించుకుంటారు. నేనీ మదనుడి సంగతేమిటో ఇవాళ తెల్చేస్తాను” అంది నాతో.

నేను వారించే లోపే మదనునితో “చూపులతో మా సౌజన్యను తాగేయక పోతే అలా క్యాంటీనుకి తీసుకెళ్ళి ఏమైనా కాఫీ టీలు తాగించొచ్చు కదా” అంటూ చమత్కారంగా అతనితో మాటలు కలిపింది.

నేను దాని వంక కోపంగా చూసి “అతను మనకు కాఫీ ఇప్పించటం ఏమిటే..ఛండాలంగా” అని కసురుకున్నాను.

“ఛండాలమేముందే ఇందులో… గురుడి రెప్పలార్చని చూపులు చండాలంగా లేవా మరి. ఈ దెబ్బతో మన జోలికి రాడు చూడు” అంది.

జోలికి రాకపోవటం అటుంచి అప్పటినుండీ ప్రతి రోజూ క్లాసులు అవగానే ఠంచనుగా ఎదురుగా వున్న సుధా హోటలులో ఆరుగురం ఫలహారాలు టీలు సేవించటం అలవాటుగా మారింది. మధ్యాహ్నం రెండింటికల్లా మా క్లాసులు అయిపోయేవి. అటునుండి హోటల్ సుధాకి వెళ్ళిపోయేవాళ్ళం అందరం. అతను వచ్చి మమ్మల్ని జాయినయేవాడు. అతని స్థితిగతులు తెలియవు గాని ఎప్పుడూ బిల్ కట్టటానికి వెనుకాడిన జాడలు లేవు. నాకు మాత్రం చాలా గిల్టీగా అనిపించేది. అతనికి నాపైనున్న ఇష్టాన్ని పురస్కరించుకుని ఐదుగురం అలా రోజూ పడి తినటం నాకు కష్టమనిపించేది.

రాధ అతని పేరును మదనుని నుండి ద్రౌపదిగా మార్చేసింది. మా పంచపాండవుల సేవలు అపార గౌరవాభిమానాలతో ద్రౌపది చేస్తోందని హాస్యమాడేది.

నేను సుధా హోటల్ కార్యక్రమం తప్పించే ప్రయత్నం చేస్తే అతను తెగ బాధ పడిపోయేవాడు.

రాధ “ద్రౌపదికి బాధ లేనప్పుడు నీకెందుకే బాధ” అనేది భీమసేనుడి పోజులో.

అతని చేత అలా ఖర్చు పెట్టించటం నాకు నచ్చేది కాదు. రాను రాను అతని నష్టం నా నష్టమే అన్నంతగా అతనిపై ఇష్టం పెరిగిపోయింది.

ప్రేమంటే అదేనేమో..

నేనతనిని ప్రేమిస్తున్నానేమో…

అతనయితే ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తున్నాడు అని బలంగా నమ్మేదాన్ని.

ప్రేమించబడటంలో ఆనందం గర్వం, అసలు ఆ ఫీల్ మాటల్లో చెప్పలేనిది.

నేను నేల పైన నడిచేదానిని కాదు. ఎక్కడో మేఘాల్లో తేలిపోతుండే దానిని. రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. విశ్వవ్యాప్తపు రహస్య భాషలో నా మనసు అతనితో సంభాషిస్తుండేది. అంతు లేని అలజడి. తలపుల నిండా అతనే.

మనం ఆనందంగా వుంటే చుట్టు పరిసరాలన్నీ సంతోషంగా వున్న భావన.

మొత్తం అంతా ప్రేమమయంగా సాక్షాత్కరించేది. ఎదలో సందడిగా వుండేది. ఆకులన్నీ పచ్చగా నవ్వుతున్నట్లనిపించేది. పూలన్నీ పరిమళాలు వెదజల్లుతున్నట్లనిపించేది. మండుటెండలో కూడా వెన్నెల కురుస్తున్నట్టుండేది. చుక్కలన్నీ పలకరిస్తున్నట్లనిపించేది. చంద్రుడు సరాగాలు ఆడుతున్నట్టనిపించేది. ఎక్కువ సేపు అతనితో సమయం గడపాలనిపించేది.

క్రమంగా నా స్నేహితురాళ్ళు అంతా వెళ్ళిపోయాక ఇంకాసేపు హోటల్ సుధలోనే మేమిద్దరం కూర్చునేవాళ్ళం.

ఒకరోజున మదనుడు సినిమాకు వెళ్దామన్నాడు. ఒంటరిగా రానని జతగా రాధ వస్తే వస్తానన్నాను. సంతోషంగా ఒప్పుకున్నాడు. అలా రాధతో పాటు అతనితో కొన్ని సినిమాలు చూసాను. సినిమాల్లో హీరో హీరోయిన్లు తెర పైకి వచ్చినప్పుడల్లా తెర పైన వాళ్ళకు బదులు నేనూ మదనుడే కనిపించేవాళ్ళo.

 ప్రేమించి పెళ్ళి చేసుకోవటంలో వుండే ఆనందాన్ని ఆస్వాదిస్తూ మదనుడి విషయం అమ్మకెలా చెప్పాలా అని ఆలోచిస్తుండేదాన్ని నిత్యం.

నా స్నేహితురాళ్ళందరకీ చెప్పాను పెళ్ళికి ముందు ప్రేమ అద్భుతమైన ఫీల్ అని ఏ మాత్రం అవకాశమున్నా ఆ అనుభూతిని మిస్ కావద్దని, ఆ మహోల్లాస మనఃస్థితిని అనుభూతించమని.

ప్రేమించబడటం గొప్ప వరమని భావించేదాన్ని. అతనికి నాపైనున్న అపరిమితమైన ప్రేమకు, నా అదృష్టానికి మురిసిపోయేదాన్ని.

మరో రెండు నెలల్లో ఫైనల్ సెమిస్టర్ ముగిసి పోతుందనగా కాలేజీ షార్ట్ వెకేషన్‌లో అతను తన హాస్టల్ రూముకి రమ్మన్నాడు. అదేమీ అతని స్వంత ఇల్లు కానప్పుడు, రేపు పెళ్ళయ్యాక అక్కడ నేను కాపురం వుండాల్సిన అవసరం లేనప్పుడు అక్కడికి వెళ్ళటం అనవసరమనిపించింది నాకు. కాని విద్యార్థులందరూ సెలవులకు వాళ్ళ వాళ్ళ ఊరెళ్ళి పోయారని హాస్టలులో అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదని ఒక్కసారి రమ్మని బ్రతిమిలాడాడు. అతని పైన పీకలోతు ప్రేమలో తలమునకలై వున్నానేమో కాదనలేక పోయాను. మెట్టినింట్లో అడుగు పెట్టినంత ఉద్విగ్నతతో అతని రూములో కుడి పాదం పెట్టి మరీ ప్రవేశించాను.

రూములో అడుగు పెట్టీ పెట్టగానే తలుపులు మూసేసి అమాంతం నన్ను కౌగిలించుకున్నాడు. నా జీవితంలో అది తొలి పురుష పరిష్వంగం. బలిష్టమైన అతని బాహువుల్లో గువ్వలా పరవశంగా ఒదిగిపోయాను. అతనిపై గుండెల నిండా వున్న ప్రేమ మైకంలో నా కళ్ళు అరమోడ్పులయ్యాయి. నేను తాదాత్మ్యంలోనుండగా అతని చేయి నా ఓణీ కొంగులోకి వెళ్ళింది. గబుక్కున విడిపించుకుని అలాంటివన్నీ పెళ్ళయ్యాకే అన్నాను. నా మెత్తటి ఎదస్పర్శతో పులకించిపోయిన అతను ఏదో ట్రాన్స్ లో వున్నట్టున్నాడు. కొద్దిగా అతని శరీరం కంపిస్తోంది. బహూశా అతనికీ అది మొదటి అనుభవం కావచ్చనుకుంటా.

“సుజీ, ఐ లవ్యూ. ప్లీజ్ నన్నాపకు. మనకు పెళ్ళయ్యే అవకాశం లేదు. నాకు మేనరికం వుంది. మా మేనమామ పరపతి పలుకుబడులతో త్వరలో DSP కాబోతున్నాను. ఉద్యోగంలో చేరిన వెంటనే నాకిష్టం లేని మా మరదలితో నా పెళ్ళి. ఒక్కసారి వుందాంరా. కాదనకురా… ప్లీజ్…ఐ బెగ్ యు…” తమకంతో ఇంకా ఏవేవో అంటున్నాడు.

మరదలితో పెళ్ళి అన్న మాట విన్నాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నాకు తరువాతేమీ వినపడలేదు.

నా నెత్తిన పిడుగు పడ్డంత విస్ఫోటనం…

బలమంతా ఉపయోగించి అతనిని ఒక్క తోపు తోసి తలుపులు తీసుకుని బయటకు వచ్చేసాను.

బయట హోరున వర్షం… భోరున కారుతున్న నా కన్నీళ్ళు ఆ వర్షం నీటిలో కలిసిపోయాయి. తన మరదలితో పెళ్ళి విషయం నిజాయితీగా అతను చెప్పకపోయి వుంటే ఏమయి వుండేదని తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది….

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here