గొంతు విప్పిన గువ్వ – 9

11
9

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

పరిహారం

[dropcap]C[/dropcap]hange is the law of life and it is inevitable…

ఓడలు బళ్ళవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి.

జీవితంలో కొన్ని సంఘటనలు మన చేతుల్లో వుండవు. కొన్ని సంఘటనలు మనలో మార్పు తెచ్చినా ఒక్కోసారి జరిగిపోయిన నష్టం పూడ్చుకోలేము.

ఎంతో ప్రయాసపడి మా బాస్ అపాయింట్మెంట్ సంపాదించి అతనిని కలవటానికి నా క్యాబిన్ లోకి వచ్చిన ద్వారకను చూసి ఆశ్చర్యపోయాను.

ఒక్కసారిగా ఎంత మార్పు ఆమె రూపంలో. అమాంతం వృద్దాప్యం మీద పడ్డట్టుంది. వయసు పైబడకుండానే మనిషిని కష్టాలు ఎలా కృంగదీస్తాయో ఆమె రూపమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ద్వారక మొహం చూస్తే ఏదో తెలియని జాలి వేసింది.

ఒక్కసారిగా ఆమెతో గతం నా కళ్ళ ముందు మెదిలింది.

ఆ రోజున అటెండర్ పెంటయ్య తలవంచుకుని పని చేసుకుంటున్న నాతో అన్నాడు..

“మేడం, సీఓ సారు నిన్ను పిలుస్తుండు…”

ఈ ప్రపంచంలో నేను భరించలేనిది పెద్దగా చనువు లేని పరాయి పురుషులు నన్ను ఏకవచనంతో సంభోదించటం.

ఎంచేతనో నచ్చదు.

కొందరు మిత్రులు, కొద్దిపాటి పరిచయానికే ఏకవచనంలో సంభోదిస్తూ మాటాడితే స్నేహం కట్ చేసేయాలన్నంత చిరాకు వేస్తుంది.

అయితే అనుభవం మీద కొంత తెలిసింది. కొన్ని ప్రాంతాల వాళ్ళకు మరే దురుద్దేశం/చులకన భావం లేకుండానే అలవాటుగా ఏకవచనంలో మాటాడతారు.

ఏకవచనంలో సంభోదించటంలోనే దగ్గరితనం, చనువు, ప్రేమ వుంటాయంటే నేను అస్సలు ఒప్పుకోను. ఒళ్ళెరగని కోపావేశంలోనూ శ్రీవారిని ఏకవచనంలో పిలిచిన జాడలు నా జీవిత నిఘంటువులో లేవు. అలాగని ఆయన పైన నా ప్రేమకు కొదువేమీ లేదు.

తలెత్తి పెంటయ్య వైపు చూసాను.

అతడి చూపులో తేడా, మొహంలో ఏదో తెలియని పైశాచికానందం కనిపిస్తోంది.

“సీఓ సారు పిలుస్తుండoటే ఇనబడ్తలే…”

“నువ్వు నడువు.. నీ పని అయితది..” అనే ధోరణిలో అతని కంఠoలో రుబాబు, అతని వెకిలి నవ్వులో అవహేళన.

లేచి వెళ్ళాను సీ ఓ ఆఫీసులోకి. అప్పటికే అక్కడ ద్వారక వుంది. నా వెనుకే పెంటయ్య వచ్చాడు.

సీఓ కల్నల్ పూరీ పెంటయ్యను బయట ఉండమన్నాడు.

నాకెప్పుడూ కల్నల్ పూరీలో వాత్సల్యపూరిత తండ్రి కనిపిస్తాడు. అతనిలో నాకు పాత సినిమాల్లో నాగయ్య లాంటి మెత్తని మనసున్న తండ్రి కనబరిచే పితృవాత్సల్యం కనిపిస్తుంది.

కల్నల్ పూరీ ఏదో మథన పడుతున్నాడు. నన్ను ఏదో అడగలేక తెగ ఇబ్బంది పడుతున్నాడు. కాని ఏదయినా ఫిర్యాదు వచ్చినప్పుడు సీఓగా విచారించవలసిన బాధ్యత తనపై వుంది. నేను విష్ చేసి నిలబడ్డాను.

“మీరు పెంటయ్య దగ్గర డబ్బు తీసుకున్నారట… నిజమేనా..?” నా ముఖకవళికలు గమనిస్తూ అడిగారు సీఓ.

“డబ్బా… నేను తీసుకోవటమేమిటి.. నా దగ్గరే పుష్కలంగా వుంది. మరొకరిని యాచించాల్సిన అవసరం నాకు లేదు..” ఆశ్చర్యబోతూ స్థిరంగా జవాబిచ్చాను.

“వస్తానని తీసుకున్నారట…” చాలా కష్టం మీద అన్నారు సీఓ.

“అయినా ఎవరయినా తిరిగి ఇస్తానని తీసుకుంటారు గాని వస్తానని తీసుకోవటమేమిటి సార్..?” అమాయకంగా అడిగాను నేను.

నా మాట పూర్తి కాకుండానే ద్వారక గబుక్కున సీఓ టేబుల్ మీదున్న నీళ్ళ గ్లాసు అందుకుని మరో చెయ్యి దాని పైన ఆన్చి “ఈ నీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను సాబ్.. నా కడుపున పుట్టిన పిల్లల మీద ప్రమాణం చేస్తున్నాను. సౌజన్య వస్తానని పెంటయ్య దగ్గర డబ్బు తీసుకోవటం నేను కళ్ళారా చూసాను. నేను చెప్పేది అబద్దమయితే నేను గొంతులో గుక్కెడు నీళ్ళు పోసే దిక్కు లేని చావు చస్తాను, నా పిల్లలు కూడా పుట్టగతులు లేని చావు చస్తారు… ‘డబ్బు తీసేసుకుంది, రావటం లేదు, డబ్బూ తిరిగి ఇవ్వటం లేదు’ అని యాదయ్య నాకు చెప్పుకుని ఏడిస్తేనే మీ దృష్టికి తీసుకు వచ్చాను సాబ్..” గబగబా గుక్క తిప్పుకోకుండా అన్నది ద్వారక.

విషయమేమీ అర్థం కాక తెల్లమొహo వేసిన నన్ను సీఓ “సౌజన్యా, నౌ యు కాన్ గో..” అన్నారు.

నేను వెళ్ళిపోతుంటే పెంటయ్యను లోపలికి పిలిచారు.

తరువాత నా వెనుక ఏమి జరిగింది నాకు తెలియదు.

ఆ సంఘటన జరిగిన రెండు రోజుల్లోనే అప్పటికే రాసిన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చి నేను క్లర్క్ నుండి స్టెనోగా ప్రమోట్ అయి హెడ్ ఆఫీసుకి ట్రాన్స్ఫర్ అయిపోయాను. ద్వారక లాంటివారు ఎంత బురద చిమ్మినా మరక అంటని ఎవరికీ ప్రవేశం లేని గాజు గోడల గదిలోకి బదిలీ అయ్యాను.

సీఓ వాళ్ళిద్దరి మీదా డిస్సిప్లినరీ ఏక్షన్ తీసుకున్నారని విన్నాను.

ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత మళ్ళీ ద్వారకను చూస్తున్నాను.

ద్వారక కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ “ముఝే మాఫ్ కర్దే సుజీ…మేరే బేటికా జిందగీ బచావో” అంటూ నా కాళ్ళ మీద పడిపోయింది. మనిషి ఏటిట్యూడ్ మొత్తం మారిపోయింది.

“ఛఛ… ముందు లేచి సరిగ్గా కుర్చీలో కూర్చో. తరువాత కుదురుగా చెప్పు నీ ప్రాబ్లం ఏమిటో. నేను మా కమాండెంట్‌తో మాటాడతాను.” అన్నాను అనునయంగా.

ద్వారక నా ఊహకు అందని తన బాధాకర జీవితాన్ని విప్పి నా ముందు పరిచింది.

ద్వారకకు సంతానం నలుగురు. ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి. అప్పట్లో ఒక RTC కండక్టరుతో కలిసి వుండేది. అతనే భర్త అని ఆఫీసులో అందరికీ చెప్పుకునేది. ఇప్పుడు అతను ఆమెను వదిలేశాడు. తన కుమార్తెలు తనలా పతనం కాకూడదని ప్రావిడెంట్ ఫండ్ నుండి లోను తీసి చాలా కష్టబడి పెద్ద కూతురికి పెళ్ళి చేసింది. తల్లి కారణంగా అత్తింటి దెప్పుళ్ళు భరించలేక ఆ అమ్మాయి అత్తింట్లో ఆత్మహత్య చేసుకుంది.

రెండో కూతురికి ఆర్థికంగా తన కాళ్ళ పైన తను నిలబడేందుకు బ్యూటిషియన్ కోర్సు చేయించి కష్టబడి ఒక బ్యూటీ పార్లర్ పెట్టించిoది. ఆ అమ్మాయి ఎవరి ప్రేమలోనో పడి మోసపోయి క్షణికావేశంలో ఇంట్లో ఎవరూ లేని ఒక మధ్యాహ్న వేళ ఉరేసుకుని చనిపోయింది.

ఇద్దరు అక్కచెల్లెళ్ళ చావులకూ కారణమైన తల్లి మీద ద్వేషాన్ని విరక్తిగా మార్చుకున్న కొడుకు తన కుటుంబాన్ని కాదనుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.

ఇద్దరక్కల ఆత్మాహుతులకు భయపడిపోయిన చిన్న అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకుని కాచుకుంటూ నానా అగచాట్లు పడి ద్వారక తను పని చేసే ఆఫీసులోనే కూతురికి క్లర్కుగా ఉద్యోగం సంపాదించింది. కూతురికి ఉద్యోగార్హతకి తగిన వయసు లేకపోవటంతో నకిలీ SSC సర్టిఫికేట్ తప్పుడు పుట్టిన తేదీతో సంపాదించి ఉద్యోగంలో చేర్పించింది.

దాదాపు సంవత్సర కాలం చిన్నమ్మాయి ఉద్యోగం చేసింది. తల్లి కూతుళ్లిద్దరూ కలిసి ఆనందంగా ఆఫీసుకు వెళ్ళి వస్తుండేవారు.

ప్రొబేషన్ పీరియడ్ పూర్తి అయి ఉద్యోగం శాశ్వతం కావాల్సిన సమయంలో కిట్టని వారెవరో సర్టిఫికేట్ ఫేక్ అని ఇచ్చిన ఫిర్యాదుతో కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ జరిగి సర్టిఫికేట్ వెరిఫై చేసి అమ్మాయిని ఉద్యోగంలో నుండి తీసేశారు.

ఆ అవమానం భరించలేక వంటరిగా వదిలితే ఎక్కడ తన చిన్న కూతురు కూడా ఆత్మహత్య చేసుకుంటుందోనని ద్వారక ప్రతిరోజూ తనతో పాటు కూతురిని ఆఫీసుకి వెంట పెట్టుకుని వెళుతుంది.

మొత్తం ఉద్యోగ లావాదేవీలకు ఫైనల్ అథారిటి మా బాసు. ద్వారక నానా తిప్పలు పడి మా బాసు అప్పాయింట్మెంట్ సంపాదించింది. అతనికి తన వ్యథను చెప్పి కూతురిని తిరిగి ఉద్యోగంలో పెట్టించమని నా కాళ్ళ పైన పడిపోయింది.

ఆమె కడుపుకోత విన్న నా గుండె తరుక్కుపోయింది. ఇద్దరు చెట్టంత బిడ్డలను పోగొట్టుకుని, కొడుకు జాడ తెలియక, మిగిలిన ఒక్క కూతురి ప్రాణాలకు కాపలా కాస్తున్న ఆ శోకతప్త తల్లి వ్యథకు నా మనసు నీరయిపోయింది. ఏ తల్లికీ ఇలాంటి కష్టం రాకూడదు.

అప్రయత్నంగా ఒకనాటి సీఓ ఆఫీసులో ద్వారక మాటలు నా చెవుల్లో మారుమోగాయి…

“నేను చెప్పేది అబద్దమయితే నా పిల్లలు పుట్టగతులు లేని చావు చస్తారు సాబ్….”

ఆ రోజున అంత పచ్చిగా అబద్దమాడుతూ కన్నపిల్లల ప్రాణాల మీద తల్లిగా ఎలా ప్రమాణం చేయగలిగింది….

పాపం ఆ క్షణాన ఏ తథాస్తు దేవతలు దీవించారో…

నా మనసంతా మెలి పెట్టేసి పిండేస్తూ తట్టుకోలేని దుఃఖం…

ద్వారక నా మీద అంత పెద్ద అభాండం వేసి ద్రోహం చేసినా ఆమె కడుపుకోత కథ నా గుండెను నిలువునా కోసేసింది.

ఆమె నకిలీ సర్టిఫికేట్ తో ప్రభుత్వాన్ని మోసగించటం క్షమించ రాని నేరమని బోర్డు నిర్ణయించిoది.

ఉద్యోగ నియామకుల ముందు ఆమె ఆక్రోశం, ఆక్రందనలు అరణ్యరోదనలే అయ్యాయి.

ఒక తల్లి బాధను మానవీయ దృక్పథంతో అర్ధం చేసుకోమని మా బాసుతో నేను మొర పెట్టుకున్నాను. ఆర్మీ క్రమశిక్షణ ముందు ద్వారక చేసిన నేరం క్షమించరానిదయ్యింది.

నేను చూస్తూ బాధపడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయురాలినైపోయాను.

“ఇది నాకు జరగాల్సిన శాస్తే..” అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయిన ద్వారకకు సాయం చేయలేకపోయినందుకు చాలాకాలం మథనపడ్డాను.

కాలక్రమేణా అనేక ఆఫీసు గొడవల మధ్య ద్వారక మరుగున పడిపోయింది.

తరువాత నా వ్యక్తిగత కారణాల వలన నేను స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నాను.

ఈ మధ్యే నన్ను కలిసిన ఒక సహోద్యోగి చెప్పిన వార్త విని నోట మాట లేకుండా వుండిపోయాను.

ద్వారక చిన్న కూతురు తల్లిని వదిలేసి ఎవరితోనో వెళ్ళిపోయింది. ఇంట్లో ఒంటరిగా మిగిలిన ద్వారక కనీసం గొంతులో నీళ్ళు పోసే దిక్కు కూడా లేని స్థితిలో అస్వస్థతతో చనిపోయిoది. శవం కుళ్ళి వాసన వేసే వరకూ ఇరుగుపొరుగు ఎవరికీ తెలియలేదు. ద్వారక పిల్లలెవరి ఆచూకీ తెలియక మునిసిపాలిటీ సిబ్బంది ఆమెను అనాథ శవంగా ధృవీకరించి వారే దహనక్రియలు నిర్వహించారు.

మరుగున పడిపోయిన ద్వారక మాటలు మళ్ళీ చెవిలో హోరు పెట్టాయి..

“నేను చెప్పేది అబద్దమయితే నా గొంతులో గుక్కెడు నీళ్ళు పోసే దిక్కు లేని చావు చస్తాను సాబ్..”

మనిషి చేసే తప్పొప్పుల పట్టిక ఇక్కడే ఈ జన్మలోనే సంతులనం చేయబడుతుంది.

బకాయీలు మరో జన్మకంటూ వాయిదా పడవు. ఏ జన్మలో చేసిన పాపాలకు ఆ జన్మలోనే శిక్ష అనుభవించాలి.

అప్రయత్నంగా నా కళ్ళ నుండి బొటబొటా రెండు కన్నీటి బొట్లు రాలాయి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here