ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగే “గూఢచారి”

0
9

[box type=’note’ fontsize=’16’] “మనిషిని కట్టిపడేసే ఆసక్తికర కథనం, పాత్రల చిత్రీకరణ, తీర్చిదిద్దిన విధం, సస్పెన్సు. ఇవన్నీ ఈ చిత్రంలో బాగానే వున్నాయి” అంటూ “గూఢచారి” సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]తె[/dropcap]లుగులో గూఢచారి చిత్రాలు ఒకప్పుడు బాగానే వచ్చేవి, సంఖ్యాపరంగానూ, నాణ్యతపరంగానూ. కృష్ణ చిత్రాలు ముఖ్యంగా. తర్వాత తగ్గుతూ పోయాయి. ఇప్పుడొచ్చిన “గూఢచారి” తెలుగు చిత్రాల స్థాయిలో మంచి చిత్రమనే చెప్పాలి. ఇంగ్లీషులో జేమ్స్‌బాండ్ చిత్రాలు అందరికీ తెలిసినదే. భారీ బడ్జెట్టుతో, భారీ ఏక్షన్లతో తీసిన చిత్రాలు మనవాళ్ళు కూడా ఆసక్తిగానే చూస్తారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ హాస్యమాడినట్టు దీనికి అంత బడ్జెట్ లేదు. మరి ఆ భారీతనంతో పోల్చం సరే, వొక గూఢచారి చిత్రం బాగుందీ అనడానికి యేమేం కావాలి? మనిషిని కట్టిపడేసే ఆసక్తికర కథనం, పాత్రల చిత్రీకరణ, తీర్చిదిద్దిన విధం, సస్పెన్సు. ఇవన్నీ ఈ చిత్రంలో బాగానే వున్నాయి. ఇక కథంటారా! జేమ్స్‌బాండ్ చిత్రాలు కూడా కథ కోసం కాదుగా చూసేది!

క్లుప్తంగా కథ. గోపి (అడివి శేష్) చిన్నప్పుడే రా (RAW) అధికారి అయిన తండ్రిని కోల్పోయి మేనమామ సత్య (ప్రకాష్ రాజ్) పంచన పెరుగుతాడు. అతనికి తండ్రిలాగానే గూఢచారి కావాలని, దేశసేవకు దాన్ని మార్గంగా చేసుకోవాలని ఉబలాటం. సత్యకేమో తండ్రిని పొట్టన పెట్టుకున్న పనినుంచి కొడుకును దూరంగా పెట్టాలని అహర్నిశం ఆరాటం. కాని కొడుకేమో మొండివాడు. యెన్ని ఉద్యోగాలొచ్చినా తిరస్కరిస్తాడు. నూట పదహారు దరఖాస్తులూ వృథా పోగా చివరికి తన తండ్రి అసలు పేరు, చేసిన వృత్తి వెల్లడిచేస్తూ దరఖాస్తు పెడతాడు. దీనికి స్పందన వస్తుంది. రకరకాల పరీక్షల అనంతరం అతను గూఢచారి 116 గా త్రినేత్ర అన్న రహస్య సంస్థలో యెన్నికవుతాడు. అతను వుంటున్న ఫ్లాట్ కు యెదుటి ఫ్లాట్ లో సమీర (శోభిత ధూళిపాల) అన్న సైకియాట్రిస్టు దిగుతుంది. క్రమంగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంకురిస్తుంది. వొక పక్క వీళ్ళ ప్రేమాయణం, మరో పక్క దేశ రక్షణ లో భాగంగా అతని ఉరుకులు, పరుగులు; వొక్కొక్కటే బయటపడుతున్న రహస్యాలూనూ. ఈ కథ యెన్ని మలుపులు తిరిగి యే సస్పెన్సును చేదిస్తుంది అన్నది తెర మీదే చూడాలి. రెండు కారణాలు: వొకటి సస్పెన్సు వెల్లడి చేయకూడదని, రెండు ఈ కథ వ్రాసే/చెప్పుకునే కథ కాదు, తెరకెక్కించే/తెర మీద చూసే కథ.
“కర్మ” తో సినీరంగ ప్రవేశం చేసిన అడివి శేష్ క్రమంగా తనను తాను మెరుగుపరుచుకుంటున్నాడు. కర్మ దాని basic premise కారణంగా నాలాంటి వాళ్ళకు నచ్చకపోయినా అతనిలో ప్రయోగ కాంక్షను గుర్తించి అతని నుంచి మంచి చిత్రాలు ఆశించవచ్చు అనిపించేలా చేసింది. అయితే తిరుగులేని విధంగా అతను తనని తాను “క్షణం” తో నిరూపించుకున్నాడు. ఇక నటన విషయంలోకొస్తే రొమాంటిక్ హీరోగా, బలమైన పాత్రలు పోషించే నటుడుగా ఇతను అనుమానమే, కాని ఇలాంటి జానర్ లో అతను నిరాశపరచడు. క్షణం, తర్వాత ఇప్పుడు ఇది నిరూపిస్తాయి దీన్ని. ఇందులో ఇతను నటుడే కాదు, కథ సమకూర్చినవాడు, స్క్రీన్‌ప్లే లో పాలు దర్శకుడు, అబ్బూరి రవి లతో పాలు పంచుకున్నవాడూనూ. ఆ విషయంలో అతను నటుడుగా కన్నా యెక్కువ గణనీయమైన పాత్ర పోషించాడు. ఇతర నటులలో వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, అనిష్ కురువిల్లా, యార్లగడ్డ సుప్రియ బాగా చేశారు. కిషోర్ యెప్పటిలానే చేసినా విసుగనిపించదు. ప్రకాష్ రాజ్ ఇంకా బాగా చేయగల నటుడు మరి. శనీల్ దేవ్ చాయాచిత్రణ, శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం తోడు లేకపోతే ఈ చిత్రం అంతగా ప్రభావం చూపేది కాదు. చాలా బాగుంది వాళ్ళ పని. కథనంలో చివర్లో కాస్త సాగతీత వున్నా మొత్తం మీద బ్రెవిటిని పాటించాడు దర్శకుడు. చాలా అవసరమైన విషయం ఇది. వొక ముక్క చెప్పడానికి చాలా సేపు సాగదీసే చిత్రాల మధ్య ఇది వొయాసిస్సే. ఉదాహరణకు, గోపి ని కాపాడుకోవడానికి అతనికి వేరే identity అర్జున్ గా తయారు చేసి రాజమండ్రిలో వో స్కూల్లో చేరుస్తాడు. వొక సీన్లో నీవిక పాతపేరును మరచిపోయి కొత్త పేరుమాత్రమే గుర్తు పెట్టుకోవాలంటాడు. స్కూల్ దగ్గర విడిచిపెట్టి వెనుకనించి గోపీ అని పిలుస్తాడు సత్య. అబ్బాయి వెనుతిరగడు. ప్రకాష్ రాజ్ పెదాలమీద తృప్తిని సూచించే చిరునవ్వు. ఇంతే. వంద సీన్లెందుకు దీనికి?

కథ గురించి వివరంగా మాట్లాడుకోవడానికి వీలు లేదు కాబట్టి కొన్ని అంశాలు ప్రస్తావించను. కాని ఆ లోటుపాట్లు కూడా చిన్నవే. చిత్రాన్ని మొత్తంగా చూస్తే అంత బాధించేవి కావు. కాని బల్ల గుద్ది చెప్పాల్సిన విషయం ఓ న మః నుంచీ కథను దృశ్యరూపంలోనే వూహించి, చిత్రించి మన ముందు పెట్టారు. అందుకే మనం దీనిగురించి మాట్లాడుకుంటే చాలా పేలవంగా వుంటుంది. చూస్తే మాత్రం ఆసక్తికరంగా వుంటుంది. మంచి సినెమాకు వుండాల్సిన ప్రథమ లక్షణం అదే.

మొట్టమొదట చెప్పుకోవాల్సింది చివర్న చెప్తున్నాను. శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకుడు. నేను పేరు ఇదే వినడం. బహుశా మొదటి చిత్రమేనేమో. కాని సినెమా క్రాఫ్ట్ ని బాగా ఆకళింపు చేసుకున్న వ్యక్తిలా మనముందు కొస్తాడు. ఈ చిత్రం వరకూ అడివిశేష్ కు పూర్వానుభవం వుంది, కథ, స్క్రీన్‌ప్లే అందించాడు కాబట్టి దర్శకత్వం ఇంకా బాగా రాణించిందేమో అని నా అనుమానం. యేది యేమైనా ఇకనించి ఈ పేరు కూడా గుర్తు పెట్టుకుని ఇతని చిత్రాలు వస్తే చూడాల్సినవిగా మనసులో స్థిరపరచుకోతగ్గ దర్శకుడు. తెలుగు సినెమాకి మంచి రోజులే ఇవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here