గోరింక సాయం

0
9

[dropcap]అ[/dropcap]డవి అంతా ఒకటే ఈదురుగాలితో కూడిన వర్షం. దాంతో ఎక్కడి జంతువులు అక్కడే ఆగిపోయి దగ్గర్లోని చెట్ల కిందకి చేరాయి.

అక్కడికి ఎంతో దూరంలో ఉన్న తన గూటికి రివ్వున ఎగురుతూ వెళ్ళిపోతున్న గోరింక కూడా విసురుగా వస్తున్న గాలి,వానకి భయపడి అక్కడే ఉన్న రావిచెట్టు గుబురు కొమ్మల్లో లోనికంటా దూరి కూర్చుంది. అంతకంతకీ గాలి విసురు పెరిగి పోసాగింది. దాంతో చెట్టు మీద ఉన్న పక్షుల గూళ్లన్నీ దూరంగా పడిపోసాగాయి.

ఇదంతా కొమ్మల్లో కూర్చుని గమనిస్తున్న గోరింక ..“ అయ్యో..! నా గూడు కూడా ఇలాగే పడిపోయి ఉంటుంది. మళ్ళీ కట్టుకోవాలంటే ఎంత కష్టం.” అనుకుంది మనసులో. ఇంతలో చెట్టు పైనుండి “కిచ కిచ “ అని అరుస్తూ కొంగ పిల్లల ఏడుపు వినిపించి పైకి చూసింది.

అప్పటికే రావిచెట్టు మీదున్న గూళ్లన్నీ గాలికి నేల మీద పడిపోయాయి. ఒక్క గూడు మాత్రం ఇంకా పైనే కొమ్మకు వేల్లాడుతూంది. అది కింద పడిపోతే తాము చనిపోతామేమో అని ఆ గూట్లో ఉన్న కొంగపిల్లలు భయంతో “అమ్మా..! అమ్మా..!” అంటూ అరుస్తున్నాయి. అది చూసి గోరింక ఎంతో బాధపడింది.

గాలి మరింత గట్టిగా వీస్తే గూడు కిందపడిపోతుందని, దాంతో పిల్లలు చచ్చిపోతాయని భయపడ్డ గోరింక వర్షంలో తడుస్తున్నా లెక్క చేయక పైన ఉన్న కొంగపిల్లల దగ్గరకి వెళ్ళి “మీరేం భయపడకండి. మీరు కింద పడకుండా నేను రక్షిస్తాను” అని వాటికి ధైర్యం ఇచ్చింది. ఆ మాటలకి కొంగ పిల్లలు రెండూ ఏడవటం మానేసి గోరింక వైపు అశ్చర్యంగా చూశాయి.

వాటి చూపులను పట్టించుకోని గోరింక తన పని తాను చేసుకు పోతూ..

“మీరు గట్టిగా ఈ కొమ్మను పట్టుకునే ఉండండి. నేను చెప్పేదాకా విడువ వద్దు” అని వాటికి చెప్పింది. దాంతో కొంగపిల్లలు కొమ్మలను గట్టిగా పట్టుకున్నాయి. దాంతో గోరింక వర్షంలో తడుస్తూనే కిందకి వెళ్ళి కింద ప్రవహిస్తున్న వాన నీటిలో తేలుతూ వెలుతున్న పుల్లల్లో లావాటి ఎండు గట్టి పుల్లల్ని ఏరి తీసుకువచ్చి గూడుని గట్టిగా ఉండేట్టు చేసి కొంగపిల్లల్ని మెల్లగా రమ్మని పిలిచింది. అదంతా అక్కడే ఉండి గమనిస్తున్న కొంగపిల్లలు “హమ్మయ్యా..!” అనుకుంటూ గూట్లో చేరాయి. కాసేపటికి గాలీ, వర్షం రెండూ తగ్గుముఖం పట్టాయి.

 అది చూసి “ సరే..! ఇక వెళ్ళొస్తాను” అని గోరింక బయలుదేరబోయింది.

“అమ్మ వచ్చే వరకూ వెళ్లవద్దు” అని కొంగపిల్లలు గోరింకను ఉండిపొమ్మని కోరాయి.

కొంగపిల్లలు భయపడుతున్నాయని భావించిన గోరింక సర్లెమ్మని అక్కడే ఆగిపోయింది.

ఇంతలో “పిల్లలు ఏమైపోయారో, ఏమిటో” అనుకుంటూ భయం భయంగా వచ్చింది తల్లి కొంగ. వచ్చీ రాగానే తన గూట్లో ఉన్న గోరింకను చూసి కోపంతో ఏదో అనబోయేసరికి కొంగ పిల్లలు తల్లిని వారించి అసలు విషయాన్ని తల్లితో చెప్పాయి.

కృతజ్ఞతగా చూసింది కొంగ గోరింకవైపు. అలా చూస్తూ..

“నా పిల్లలు గాలికి కిందపడి ఉంటే నీళ్లల్లో కొట్టుకుని పోయి ఉండేవి. నేను ఎంతో దూరంలో ఉన్నాను. ఎంత ప్రయత్నించినా త్వరగా రాలేకపోయాను. నేనెవరో, పిల్లలెవరో తెలియకపోయినా నా పిల్లలను నువ్వు రక్షించావు. ఈ రోజు నుండీ మనిద్దరం స్నేహితులం. నీకే సహాయం అవసరమైనా అడుగు. నేను చేస్తాను” అంది తల్లి కొంగ.

“మనకు ఎవరో తెలియక పోయినా చేసేదే అసలైన సహాయం. మనకు అంతకు ముందు ఏమి పరిచయం ఉందని మనకు చెట్టు ఆశ్రయం ఇస్తుంది? మనమూ అలాగే. నేనీ సహాయం చేసాను కాబట్టి నువ్వే నాకు సహాయం చేయక్కరలేదు. ఆ సమయంలో ఎవరు ఉంటే వాళ్ళు ఎవరికి అవసరమైన సహాయం వాళ్లు చేయటం వాళ్ల విధి” అని కొంగపిల్లల్ని మరోసారి ముద్దాడి తన గూటి వైపుగా సాగిపోయింది గోరింక.

కొంగలన్నీ ప్రేమగా చూశాయి గోరింక వైపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here