చలం కథకు దీటైన సినిమా రూపం – గ్రహణం

1
9

[dropcap]ఒ[/dropcap]క కథలోని ఆలోచనా సరళిని, అందులో దాగి యున్న సహజమైన స్క్రీన్‌ప్లేను ఆకళింపు చేసుకొని డ్రామా, ఎలిమెంట్‌ను ఆవిష్కరించే కౌశలాన్ని సూటిగా, దీటుగా ప్రదర్శించిన చిత్రం ‘గ్రహణం’.

ఇంద్రగంటి మోహనకృష్ణ 2004లో మన ముందుకు తెచ్చిన చిత్రం ఇది. 2005లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. ఉత్తమ ‘దర్శకుని తొలి చిత్రం’ క్రింద పురస్కృతమైన చిత్రం ఇది. గుడిపాటి వెంకటచలం కథ ‘దోషగుణం’ తెర మీదకి ఇంత చక్కగా విస్తరించగలదా అనే ఆలోచన కలుగుతుంది. ఈ కథ శీర్షిక, చిత్రం శీర్షిక, రెండూ ఆలోచింప జేస్తాయి.

గుణములు, దోషములు అనునవి సామాన్యంగా అందరూ వ్యవహరించే అంశాలు. చలం ఎంతో సుందరంగా దోషగుణం అని వ్యవహరించాడు. ఆయుర్వేదంలో వాత దోషం, పిత్త దోషం అని ఉంటాయి. అవన్నీ కాకుండా ఒక స్త్రీకి గల సహజమైన ప్రేమ, అనురాగం వంటివి గుణములైనప్పటికీ అవి దోషములుగా చూపించిన ఒక సామాజిక ఒరవడిని దోషగుణం అన్నాడాయన. అదలా ఉంచండి. కథలో జరిగిన నాటకీయతను ఎంచుకుని గ్రహణం, దాని తాలూకు ప్రారంభం, విలువ, దోషం వంటివి బహుశః ఎంచుకుని తెర మీద దీనికి ‘గ్రహణం’ అనే నామకరణం చేసినట్లుంది.

శారదాంబ (జయలలిత) కనకయ్య అనే వారాలబ్బాయితో చనువుగా ఉంటుంది. ఈ కుర్రాడికి ఓ రోజు ఎంతకీ తగ్గని జ్వరం వచ్చింది. గ్రామంలోని వైద్యుడిచ్చిన మందుకు ఇది తగ్గదు. మరో ఊరు నుంచి ఒక కాళికా ఉపాసకుని తీసుకుని వస్తారు (సుందరం). ఇతను పరీక్షలు చేసి వాకిట్లోకి వచ్చి దోషగుణం అంటాడు. వయసులో పెద్దవాళ్లతో శారీరిక సంబందం వలన ఏర్పడే జబ్బు అని నిర్ధారిస్తాడు. దీనికి మందు ఆ స్త్రీ యొక్క రక్తమేనని చెబుతాడు. తొడలోంచి తీసిన రక్తాన్ని రోగి కళ్లల్లో మరో మందులో కలిపి పోస్తే తగ్గుతుంది అంటాడు. ఈ మందు కోసం పడే ఘర్షణ ఆసక్తికరంగా సాగుతుంది.

శారదాంబ భర్త నారాయణస్వామి (తనికెళ్ల భరణి) ఇంటిపట్టున తక్కువగా ఉండే వ్యక్తి. కనకయ్య తండ్రి, మేనమామ రంగంలో పూర్తిగా దిగే లోపలే కనకయ్య తల్లి ఆదుర్దాగా వెళ్లి శారదాంబతో విషయం చెప్పి అలజడి రేపుతుంది. అప్పుడే ఇంటికి వస్తున్న నారాయణస్వామి ఆమె వెళ్లటాన్ని చూసి శారదాంబను నిలదీయటం ప్రారంభిస్తాడు. మనసేమీ బాగుండక అలా నడవలో కొద్ది సేపు ప్రయాణిస్తూ శారదాంబ, కనకయ్యల మధ్య చనువును గుర్తు తెచ్చే సంఘటనలను నెమరు వేసుకుంటూ తిరిగి వస్తూ కనకయ్య తండ్రిని, అతని బావమరిదిని చూస్తాడు. వాళ్లు చెప్పిన దానికి వాళ్లని చీదరించుకుని పంపేస్తాడు. ఎలాగో నిజాలు తెలిసాక అన్నీ బజారులోకే రాగలవనే మాట అతన్ని కలవరపెడుతుంది. మరోసారి శారదాంబను నిలదీస్తాడు. పొరుగూరి వైద్యుడు, కనకయ్య తండ్రి, మేనమామ రక్తం కోసం ఇంటికి వస్తారు. నారాయణస్వామికి, శారదాంబకీ తీవ్రమైన ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణలో శారదాంబ స్పృహ తప్పి పడిపోతుంది. ఆ సమయంలో తొడలోంచి రక్తం కొద్దిగా తీసి వాళ్లను పంపేస్తాడు నారాయణస్వామి.

ఈ మందు వల్ల జ్వరం తగ్గితే సమస్య అతనికి. తగ్గకపోతే వాళ్లదనే అంశంలో ఆగుతాడు నారాయణస్వామి. కనకయ్యకు నయమవుతుంది. నారాయణస్వామి శారదాంబను ఇంట్లోంచి, ఊళ్లోంచి పంపించి వేస్తాడు. కొడుకుని ఇంట్లోకి పంపిచేస్తాడు.

కాలక్రమంలో కనకయ్య డాక్టరుగా హైదరాబాదులో స్థిరపడతాడు. నారాయణస్వామి కొడుకుకి వైద్యం చేసి నయం చేస్తాడు. అతన్ని చూడటానికి వచ్చిన శారదాంబను గుర్తు పడతాడు. ఆవిడ పారిపోతుంది. మర్నాడు వస్తుందో రాదోనని ఆలోచిస్తూ జరిగినదంతా తోటి డాక్టరుతో చెబుతాడు. ఈ మందు వలన నిజంగా చిన్నప్పుడు నయమయినదా లేక అది యాదృచ్చికమా అని చర్చించుకుంటారు. వైరల్ జ్వరం కావచ్చు. అదే తగ్గిపోయే సమయానికి ఆ వైద్యుడు మందు వేసి ఉండవచ్చని అనుకుంటారు….

శారదాంబ మర్నాడు రాదు. క్రిందటి రోజు తన కొడుకు కూడా మరల ఆవిడని రానీయవద్దు అనటం కూడా మనం చూస్తాం.

పట్టణం వెళ్లి పెద్ద డాక్టరుని రంగంలో దింపగలిగే అవకాశం ఉన్నప్పటికీ నారాయణస్వామి అలా చేయలేదెందుకూ అనే ప్రశ్న కూడా మిగిలిపోతుంది.

చిత్రంలో ఒక చోట శారదంబ తన మంగళసూత్రాన్ని తీసి టేబిల్ మీద పెడుతుంది. ఇంట్లోని పెద్దావిడ “కనీసం ఇతరుల ముందైనా దానిని మెడలో ఉంచు” అంటుంది. అప్పుడు తిరిగి దానిని మెడలో వేసుకుంటుంది. శారదాంబ యొక్క ఈ కోణం చిత్రంలో ముందుకు రాలేదు. సమృద్ధిగా చెప్పవలసిన అంశం అది.

నాటక కళ నుంచి వచ్చిన వారు ఎంతో నైపుణ్యంతో రక్తి కట్టించిన చిత్రం ఇది. జయలలితకు తెలుగు చలన చిత్రరంగంలో మంచి పాత్రలు రాలేదని ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. అధిక ప్రసంగం లేకుండా ఎంత పాత్రోచితంగా ఎలా నటించాలి, సంవాదాన్ని ఎంత బరువుగా, ఎంత మాత్రం ఆవేశంతో చెప్పాలి అనేది భరణి ఎంతో చక్కగా చూపించారు. సుందరం నటన కూడా బాగుంది. ఒక సంవాదం ముగుస్తున్న సమయంలోనే టేక్ ఆఫ్ అవటం స్టేజ్ మీది అనుభవం. అది కథను తెలియకుండానే ముందుకు నడిపిస్తుంది. గ్రహణం టీమ్‌ని ఈ విధంగా ఎంతైనా అబినందించవలసి ఉంటుంది.

ఈ చిత్రానికి దర్శకుని మొదట చిత్రం క్రింద నంది బహుమతి కూడా లభించింది. అలాగే ఉత్తమ చిత్రం క్రింద కూడా నంది పురస్కారం అందుతుంది.

చలం రచనలో ఒక క్రాఫ్ట్స్‌మన్ షిప్ కనిపిస్తుంది. ప్రధానమైన పాత్రను కొంత దూరం తీసుకు వచ్చి ఇతర పాత్రలు, సంఘటనలు తెలియకుండానే అలా గుమిగూడి చివరకు ఒక విక్టిమైజేషన్… ఒక సహజమైన పరిణామంగా తేలిపోవటం విశేషంగా కనిపిస్తుంది. ఆ సరళిని చక్కగా, ఇబ్బంది పెట్టకుండా తెర మీద చూపించగల్గటం సామాన్యమైన విషయం కాదు. ఇందులకు దర్శకుడు ఎంత అభినందనీయుడు. చిత్రం తెలుపు నలుపులో చూపించటం కూడా మంచి ఆలోచన. ఆ కాలమైన, ఈ కాలమైనా స్త్రీ విషయంలో కథ ఇంతే కదా అని చాలా మంది అనుకోవచ్చు. సామాజిక పరమైన ఆ అంశాన్ని ఇక్కడ చర్చించే అవకాశం లేదు. కాలం భిన్న రీతులలో మారింది…

1975లో లారా ముల్వే చేసిన చర్చ ఒకటి గుర్తుకు వస్తుంది. ‘విసువల్ ప్లెసర్ అండ్ నెరటివ్ సినిమా’ శీర్షిక క్రింద ఒక ఆసక్తికరమైన విషయం ముందుకు వస్తుంది. చిత్రంలో ఉన్న విషయాల మధ్యగల సంబంధం ఒక వైపు, తెరకూ, ప్రేక్షకులకీ మధ్య గల సంబంధం మరో వైపు ఉంచి ‘స్కోఫోఫీలియా’ను వాడుకుని దర్శకుడి కుర్చీని రెండు అడుగులు వెనక్కి జరిపి ఆలోచిస్తే కథనంలో చాలా మార్పు వస్తుంది.

ఈ చిత్రంలో ఒక సంవాదం ఆలోచింపజేస్తుంది. శారదాంబను నారాయణస్వామి మాటలతో పరీక్షిస్తున్నప్పుడు “ఇక్కడ ఏం జరుగుతుందో అన్నది ఎప్పుడు పట్టించుకున్నావు?” అని స్త్రీలు సహజంగా అడిగే ప్రశ్నను అడిగినప్పుడు నారాయణస్వామి “అదే నే చేసిన పొరపాటు” అంటాడు. ఈ సంవాదం చాలా చోట్ల చూస్తాం. కానీ పర్యవసానంగా పురుషుని వైపు తరాజు తూగిపోతుంది.

“నా శీలం మీద ఈ ఇంటి పరువు ఆధారపడి ఉన్నదా?” అని ఆమె అడిగినప్పుడు ‘స్కోఫోఫీలియా’ ముందుకు వస్తుంది! ప్రేక్షకుడు ఇద్దరినీ అనుమానించటం ప్రారంభిస్తాడు.

ఈ చిత్రానికి ధ్వనిని అందించింది కె. విజయ్. మాములుగా సాగే జీవితంలో ఒక అలజడి రేగి అలా ఎక్కడికో వెళ్లిపోయే ఇతివృత్తంలో ఎంచుకుని వాడిన సంగీతం వలన ఒక్క క్షణం చిత్రంలో రిలాక్స్ అయ్యేందుకు ఉండదు. పి.జి.విందా కెమెరా పని ఎంతగానో ఆకట్టుకుంది.

కథాపరంగా, కథనం విషయంలోనూ, నాటకీయత కోసం చక్కని నటన, స్క్రీన్‌ప్లే పరంగా మోహనకృష్ణగారు వారెన్నో ఇటువంటి చిత్రాలని చేపట్టాలని ఆశిస్తున్నాను. ‘గ్రహణం’ తరువాత కొన్ని చిత్రాలు చేసినప్పటికీ మరల ‘గ్రహణం’ సంభవించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here