[dropcap]ఆ[/dropcap]శలన్నీ ఆవిరులైన తరువాత
సేద తీర్చింది ఒక్క చెమట బిందువే!
ఎండిపోయిన ఆకాశం
ఏం మాట్లాడుతుంది?
ఒక్క చినుకు కోసం
అలమటించటం తప్ప.
శతాబ్దాల నిశ్శబ్దంలో
గొంతుపెగలని మనిషిలాగ.
మేఘాలు విహార యాత్రకు వెళ్లాయి
ఏం అనుభూతులను మోసుకొస్తాయో?
సముద్రం విరహంతో మరిగిపోతోంది
వలపు వర్షం కోసం.
కలానికి ఒక్క సిరా చుక్క కరువైంది,
భగ్న గీతం రచించటానికి.
నేలమ్మ గుండె పగిలి నోరు తెరచింది
ముసలి తనంలో ఆసరా కోసం.
వసంతం ఎండమావేనా?
ఈ శతాబ్దపు
మేధావి ప్రశ్న?