గుజరాత్ రాజస్థాన్ పర్యటనానుభూతులు-4

1
9

[2023 ఫిబ్రవరి నెలలో గుజరాత్, రాజస్థాన్ లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]“తుం[/dropcap]గభద్ర, నాకు తెలిసి, సముద్రంలో డైరెక్ట్‌గా కలువదురా శర్మా! అది జోగులాంబ గద్వాల జిల్లాలోని ‘గుండిమళ్లి’ హంసల దీవి వద్ద సముద్రంలో కలుస్తుంది.”

“నిజమేరోయ్! అంటే తెనాలి వారి పద్యం..?”

“ఛ. ఛ. ఆ మహాకవిని తప్పుపట్టగలిగేంత వాణ్నారా నేను? నాకు తెలిసింది చెప్పానంతే!”

“మొత్తానికి కృష్ణలో కూడా తుంగభద్ర కలిసే ఉంటుంది కదా, రెండు నదులూ కలిసే సాగరునిలో లీనమవుతాయి కదా! కాబట్టి ఫరవాలేదు. మనం ఆ పద్యంలోని భావ వైశిష్ట్యాన్నే చూడాలి కాని, భౌగోళిక సత్యాన్ని (geographical authenticity)ని కాదు. పైగా ‘నిరంకుశాః కవయః’ అన్నారు కదా!”

అలా ఇద్దరం కవిగారిని సమర్థించాం. సుదామసేతు దగ్గరికి వెళ్లాం.

గోమతీనది మీద, ఇటు ద్వారకాధీశుని మందిరం వైపు నుండి, అటు సముద్రం వరకు కట్టిన ‘వేలాడే వంతెన’ అది. కేవలం పాదచారులకు మాత్రమే దాని మీద అనుమతి ఉంది. దాన్ని 2005లో సంకల్పించి, 2016లో పూర్తి చేశారు. దాని పొడవు 166 మాటర్లు, వెడల్పు కేవలం నాలుగు మీటర్లు. దాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు కట్టారు. దానికి ఇంచు మించు ఏడున్నర కోట్లరూపాయలు ఖర్చుయింది.

వంతెనకు అటువైపు ‘పంచనద్ తీర్థ్’ ఉంది. అక్కడికి బ్రడ్జి మీద నడుచుకుంటూ వెళుతున్నాము. చీకటి పడింది. వంతెన మీద లైట్లు వెలిగాయి. ద్వారకాధీశుని మందిరం లైట్లు వెలుగులో మెరిసిపోతుంది. అక్కడ ఎవరూ స్వామిని శ్రీకృష్ణుడని పిలవడం లేదు. అందరూ ఆ పరమాత్మను ద్వారాకాధీశ్ అనే పిలుస్తున్నారు. అందుకే నేనూ..

అటు వైపు, నదికి సముద్రానికి మధ్య ఒక చిన్న ద్వీపం లాగా ఏర్పడి ఉంది. అక్కడ అయిదు మంచి నీట బావులు ఉన్నాయి. వాటిని పంచపాండవులు తవ్వించారని ఐతిహ్యం.

బ్రడ్జి మీదకు వెళ్లడానికి తలకు పది రూపాయలు చెల్లించి టికెట్లు తీసుకున్నాము. ఏడున్నరకు మూసేస్తారని, ఆ లోపు తిరిగి వచ్చేయాలని చెప్పాడు కౌంటర్ లోని వ్యక్తి.

వంతెన మీద ఇరవై నిమిషాలు గడిపాము. ఒక వైపు అనంత సాగరం, మరో వైపు గోమతీ నది, ద్వారకానాధుడు కొలువుండే ‘జగత్ మందిర్’. వంతెన మీది యల్.ఇ.డి లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. వాటి కాంతులు క్రింద నదిలో ప్రతిఫలిస్తున్నాయి. ఒక అద్భుతమైన అనుభూతికి లోనయ్యాము.

ద్వారకను ‘దేవభూమి’ అని పిలుస్తారు. గుజరాత్ టూరిజం డిపార్టుమెంటు ప్రకటనల్లో కూడ దేవభూమి ద్వారక అనే ఉంటుంది.

వంతెన మీద నుంచి బయటకు వచ్చి, అక్కడ ‘సువిధ’ కాంప్లెక్స్‌లో (పబ్లిక్ టాయిలెట్ల్) మా ‘ప్రకృతి పిలుపు’ను అటెండ్ అయ్యాం. కాళ్లూ చేతులు, ముఖం కుడుక్కున్నాం. ‘సువిధ’ చాలా పరిశుభ్రంగా ఉంది. పది రూపాయలు ఎంట్రీ ఫీజు.

మేం ముందుగా మా సెల్ ఫోన్లను అక్కడి కౌంటర్లో డిపాజిట్ చేశాము. మా చెప్పులు భద్రపరచుకోవడానికి చిన్న నీలి రంగు గోనె సంచులిచ్చారు. వాటి మీద నంబర్లు వేసి ఉన్నాయి. అదే నెంబరు గల టోకెన్లు మాకిచ్చారు. రెండు చోట్లా ‘నిశ్శుల్క్’ అంటే ఉచితం!

సెల్ ఫోన్ల డిపాజిట్ స్లిప్పులు, చెప్పుల టోకెన్లు జాగ్రత్తగా పర్సులో పెట్టుకున్నాము. ఆ రెండూ పూర్తి చేయడానికే అరగంట పట్టింది.

మేం మందిరం క్యూలో ప్రవేశించే సరికి ఎనిమిది కావస్తూంది. చాలా పెద్దది ద్వారకాధీశుడుండే జగత్ మందిరం. ఆ పేరులోనే నాకు ఆయన విశ్వవ్యాప్తత గోచరించింది. ఈ జగత్తంతా ఆయన మందిరమే! రెడ్ స్టోన్‌తో నిర్మించారు దేవాలయాన్ని. సమున్నతమైన, కళాత్మకమైన గోపురాలు, ఆలయశిఖరానికి నలువైపుల తీర్చిదిద్దారు. మందిరమంతా చిత్ర విచిత్ర కళాకృతులు చెక్కబడిన (carvings) స్తంభాలు! అవి మరీ దగ్గర దగ్గరగా ఉన్నాయి.

క్యూ చాలా పొడవుగా ఉంది. భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. గర్భగుడిని చేరుకోవడానికి గంటన్నర పట్టింది. చివర రెయిలింగ్స్ లేవు. సింగిల్ లైన్ మెయిన్‌టెయిన్ చేయలేకపోతున్నారు. భక్తులు ఎంత స్వీయ క్రమశిక్షణ పాటించినా, కొంత తోపులాట తప్పడం లేదు.

కాని అందరిలో భక్తి పారవశ్యం! ఆ జగన్మోహనుని దర్శించబోతున్నామనే ఎక్సయిట్‌మెంట్! కొందరు బిగ్గరగా గుజరాతీ భాషలో కీర్తనలు పాడుతున్నారు. కొందరు భజన చేస్తున్నారు. చిడతలు, తాళాలు, చిన్న డక్కలు కూడ తెచ్చుకున్నారు. కొందరు ఏడుస్తున్నారు. గుండెలు బాదుకుంటున్నారు.

కన్హయ్యలాల్ కీ జయ్ హో!

కృపాకరో ప్రభూ!

జై ద్వారకాధీశ్!

అన్న నినాదాలతో పరిసరాలు ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీకృష్ణపరమాత్మ అందరి హృదయాలలో ప్రవేశించి సందడి చేస్తున్నాడు. నాకు కూడా భక్త్యావేశంతో దుఃఖం వచ్చింది. కళ్ల వెంట నీళ్లు కారిపోతున్నాయి. గొంతు పూడుకుపోయింది. బిగ్గరగా

“కస్తూరీ తిలకం లలాటఫలకే
వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం
కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం
కంఠేచ ముక్తావళీం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ”

అన్న లీలాశుకులవారి, కృష్ణకర్లామృత కావ్యంలోని శ్లోకాన్ని భూపాల రాగంలో పాడాను. ఎవరి పారవశ్యంలో వారుండి నా శ్లోకాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.

భక్తులదంరితో పాటు మేమూ “కృపాకరోప్రభూ హే కన్హయ్యాలాల్, జై ద్వారకాధీశ్” అని నినదించసాగాము. ఒళ్లు గగుర్పాటు చెందుతూంది. అది దుఃఖమో లేదా ఆనందమో తెలియడంలేదు.

గర్భగుడి కేవలం పది మీటర్ల దూరంలో ఉంది. ఇంతలో సడన్‌గా క్యూ ఆగిపోయింది! పావుగంట గడిచినా కదలటం లేదు. స్వామి వారికి హారతి టైమట!

నాకు భయమేసింది. ఎందుకంటే గురువాయూరులో హారతి టైంలో భక్తులకు లోపలికి అనుమతించలేదు. క్యూ చాలా సేపు ఆపేశారు. ఇక్కడ కూడా?.. ఒక వేళ ఈ లోపు దర్శనం సమయం పూర్తయతే?

కాని క్యూ కదిలింది. హారతి మొదలైంది. హారతి దర్శనాలు సైమల్టేనియస్‌గా నడుస్తున్నాయని అర్థమైంది. హారతి కీర్తన గుజరాతీ భాషలో పాడుతున్నారు. అందులోని సంస్కృత పదాల వల్ల బాగానే అర్థం అవుతూంది. కీర్తనకనుగుణంగా వాయిద్యాలు మోగుతున్నాయి.

గర్భగుడిని చేరుకున్నాము. నల్లని విగ్రహం. దాని మీద ఒక అంగరఖా ధరించారు స్వామివారు. చేతులో వెండి వేణువు. దుస్తుల మీద పొదిగిన తెలుపు, ఎరుపు విలువైన రాళ్లు. దీపారాధనల వెలుగులో గీతాచార్యుడు జాజ్వాల్యమానంగా ప్రకాశిస్తున్నాడు.

“కృష్ణా! యదుభూషణా, నరసభా, శృంగార రత్నాకరా!” అంటూ స్వామికి ప్రణమిల్లాము. జన్మ చరితార్థమైంది. ఆ విగ్రహంలోనే ఏదో ప్రబలమైన ఆకర్షణ శక్తి ఉంది. వజ్రాలు పొదిగిన స్వామి వారి నేత్రాలు మనల్నే చూస్తున్నట్లున్నాయి. ఆయన మీద నుండి చూపూలు తిప్పుకోలేకపోతున్నాము.

తొందరగా జరగమని ఎవరూ తోయడం లేదు. భక్తులే కొన్ని సెకండ్లు స్వామిని దర్శించుకొని బయటకు వెళ్లిపోతున్నారు. గుండెల నిండిపోగా మేమూ బయటకు వచ్చాము.

లోపల హారతి ఇంకా జరుగుతోంది. బయట కొన్ని వందల మంది భక్తులు గుంపులు గుంపులుగా నిలబడి హారతి కీర్తన కనుగుణంగా భజన చేస్తున్నారు. లయబద్దంగా కొందరు నృత్యం చేస్తున్నారు. కొందరు కళ్లు మూసుకొని ఊగుతున్నారు. ఒక అలౌకిక వాతావరణం అది!

ఇద్దరం మౌనంగా ఉన్నాం. ఏం మాట్లాడుకోలేదు. స్వామి వారి దర్శనం కలిగించిన పవిత్రానుభూతిలోంచి తేరుకోడానికి మాకు పది నిముషాలు పట్టింది.

సెల్ ఫోన్లు, చెప్పులు తీసుకొని డ్రైవర్‌కు ఫోన్ చేశాము. మేము ఎక్కడ దిగామో అక్కడ ఒక మంటపం ఉన్నట్లు గుర్తు. కాని దాన్ని కనుక్కోలేక తిరగసాగాము. అన్ని సందులూ ఒకేలా ఉన్నాయి. “మండప్ కీ ఓర్ కైసా జానా భయ్యా?” అని ఎవర్ని అడిగినా, “కౌన్ సా మండప్ హైజీ?” అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు.

చివరకి పానీ పూరీ బండి మమ్మల్ని రక్షించింది. దాన్ని గుర్తు పట్టాము. దానికి కొద్ది దూరంలోనే మండపం. కారు వచ్చి ఉంది.

“త్వరగా ఎక్కండి సార్, ఇక్కడ ఎక్కవ సేపు ఉండనివ్వరు” అని తొందరపెట్టాడు ఖురానా. మేం బస చేసిన ‘రుద్రప్లాజా’కు చేరుకునే సరికి పదిన్నరైంది. త్రోవంతా హెవీ ట్రాఫిక్. ఆకలి దంచేస్తూంది.

మమ్మల్ని దింపి వెళ్లి పోతూ చెప్పాడు ఖురానా. “సార్, రేపు ఉదయాన్నే మనం సోమనాథ్‌కు బయలుదేరాలి. ఐదున్నర కల్లా వస్తాను. సిద్ధంగా ఉండండి.”

సరే అన్నాం. హోటల్ ఎదురుగా ‘నందనందన్, ప్యూర్ వెజ్’ అని కనబడింది. వెళ్లి డిన్నర్ చేశాం. ప్లెయిన్ రైస్, ఆలూ జీరా, దాల్ తడ్కా, మసాలా పాపడ్, దహీ (పెరుగు) ఆర్డరిచ్చాం. ఆ సమయంలో కూడా హోటల్ కిటకిట లాడుతూంది. భోజనం బ్రహ్మాండంగా ఉందనిపించింది. బహుశా విపరీతమైన ఆకలివల్లనేమో.. రూంకి వెళ్లి పడుకొని, ఒళ్లెరగకుండా నిద్రపోయాము.

***

ఉదయం నాలుగున్నరకు సెల్ అలారం మోగింది. లేచి, తెమిలి, రడీగా ఉన్నాము. ఖురానా ఫోన్.

“సార్, గుడ్ మార్నింగ్ ఫాగ్ (పోగమంచు) చాలా దట్టంగా ఉంది. రోడ్ విజిబిలిటీ చాలా పూర్‌గా ఉంది. ఒక గంటాగి బయలుదేరదాం. రిస్క్ తీసుకోవడం ఎందుకు?”

“మరి సాయంత్రానికి తిరిగి రాగలమా? మేము మళ్లీ రాత్రి పదకొండు గంటలకు అహమ్మదాబాద్‌కు ట్రయిన్ క్యాచ్ చేయాలి.”

“అంత వరకు ఎందుకు సార్, సోమనాథ్ రోడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. గట్టిగా మూడున్నర గంటలు ప్రయాణం! పది గంటలలోపే చేరుకుంటాం సార్. సాయంత్రం ఐదులోపే తిరిగివస్తాం. ఇంకా ద్వారకలో మీకు చూపించాల్సినవి కొన్ని ఉన్నాయి. మీరు హ్యాపీగా అన్నీ కవర్ చేసుకుని, డిన్నర్ చేసి, కాసేపు రిలాక్స్ అయి, స్టేషన్‌కు వెళ్లవచ్చు.”

“అయితే ఓ.కె” అన్నాను.

ఇద్దరం క్రిందికి వచ్చి రిసెప్షన్ దగ్గర సోఫాలో కూర్చున్నాము. ఐదున్నర దాటింది. “కాఫీ దొరకుతుందా?” అని అడిగితే “పావుగంటలో తెప్పిస్తాను సార్” అన్నాడు రిసెప్షనిస్టు. “బిల్ కుల్ చీనీ మత్ డాల్‌నా భయ్యా” అని చెప్పాం. లేకపోతే శ్రీరామనవమి రోజు ఇచ్చే పానకం తెచ్చిస్తాడు.

“ద్వారకాధీశ్ మందిరం ఎంత బాగుంది కదా శర్మా!” అన్నాడు మావాడు.

“అవునురా. సాక్షాత్తు దేవభూమికి వచ్చాం. దాదాపు 2500 సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణుని ముని మనవడు వజ్రనాభుడు దీన్ని స్థాపించాడు. అదిగో చూడు! అక్కడ వివరాలన్నీ రాసిన పెద్ద ఆయిల్ పెయింటింగ్! పద, చదువుదాం.”

ఒక గోడనంతా ఆక్రమించుకొని పెద్ద ఆయిల్ పెయింటింగ్ ఉంది. జగత్ మందిరం పూర్తి వ్యూ దాని మీద అందంగా ముద్రించి ఉంది. దాని మీదే మందిరం గురించిన వివరాలు చిన్న అక్షరాలతో రాశారు.

మందిరనిర్మాణం మారూ – గుర్జారా శల్పిశైలిలో నిర్మించబడింది. చాళుక్యుల నిర్మాణ శైలి కూడ ఉంది. అరేబియా సముద్రంలో మొదట ద్వారకా నగరం ఉండేదట. ద్వారక ఒక జిల్లా కేంద్రం. జగత్ మందిర్‌ను ‘త్రిలోక్ సుందర్’ అని కూడా పిలుస్తారు. అంత దివ్యమైనదా గుడి. భారత పురావస్తు పరిశోధన శాఖ ఆధ్వర్యంలో ఆ దేవాలయం పరిరక్షించబడుతూ ఉంది.

నగర నిర్మాణం కోసం శ్రీకృష్ణుడు 96 చదరపు కిలో మీటర్లు భూభాగాన్ని సముద్రం నుంచి వెలికి తీశాడని ఐతిహ్యం. క్రీ.శ. 800 సంవత్సరంలో ఆదిశంకరులు ఈ మందిరాన్ని పునరుద్ధరించారు. 1472లో ఇది విదేశీ దండయాత్రల్లో చాలా వరకు ధ్వంసమైంది. దాన్ని 16వ శతాబ్దంలో పునర్మించారు చాళుక్య నిర్మాణశైలిలో. గొప్ప కృష్ణభక్తురాలు మీరాబాయి శ్రీకృష్ణ విగ్రహంలో జ్యోతి రూపంలో లీనమయింది ఇక్కడే.

పురావస్తు శాఖ త్రవ్వకాల్లో సముద్రంలో ఎన్నో గుడులు, కోటల శిధిలాలు బయటపడ్డాయి. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వారి మెరైన్ ఆర్కియాలజీ విభాగం 1983లో, 1991లో, పరిశోధనలు చేసింది. డా. ఐస్. ఆర్. రావు అనే పురావస్తు శాస్త్రవేత్త సమర్పించిన ఒక పత్రంలో, మహాభారతంలో వర్ణించబడిన ద్వారకానగరం యొక్క ఎన్నో ఆనవాళ్లు సముద్ర గర్భంలో లభించాయి.

జగత్ మందిరంలో ఐదంతస్తులుంటాయి. అంతరాలయంలోనే 72 స్తంభాలున్నాయి. పైన 43 మీటర్లు ఎత్తున శిఖరం. అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు. దాని మీద ఒక పెద్ద జెండా ఎగురుతూ ఉంటుంది. 52 గజాల బట్టతో దానిని నేశారు. దాని మీద సూర్యచంద్రుల చిత్రాలుంటాయి.

మందిరానికి రెండు ప్రవేశ ద్వారాలు. ఒకటి స్వర్గ్ ద్వార్, రెండు మోక్షద్వార్. జన్మాష్టమి వేడుకలు ద్వారకలో మహా వైభవంగా జరుగుతాయి. లక్షలమంది భక్తులు వస్తారు.

చూస్తూండగానే గంటసేపు గడిచింది. కాఫీ వచ్చింది. తాగాము. నార్త్ లో ఫిల్టర్ కాఫీ దొరకదు అంత సులభంగా. ఇన్‌స్టెంట్ కాఫీయే శరణ్యం. ఆరున్నరకు ఖురానా వచ్చేశాడు.

ద్వారక నుంచి సోమనాధ్ దాదాపు 230 కి.మీ. ఉంటుంది. ఎనిమిది తర్వాత భళ్లున ఎండ కాసింది. ఎనిమిదిన్నరకు ఒక ధాబా దగ్గర బ్రేక్ ఫాస్ట్ కోసం ఆపాడు. అక్కడ ఢోక్లా, పోహా, కచోరీ మాత్రమే ఉన్నాయి. బోర్డు మీద పూరీ సబ్జీ బొమ్మ వేశారు గాని, తొమ్మిది తర్వాత గాని అది తయారవదట.

ఎలా వుంటుందో చూద్దామని ఒక ప్లేటు ఢోక్లా తెప్పించాము. పసుపుపచ్చగా మైసూరుపాక్‌లా ఉన్న కేకులు నాలుగు తెచ్చిచ్చాడు. ఫ్రై చేసిన చిల్లీలతో సహా. చాలా రోజులు నేను ఢోక్లా అంటే స్వీటు అనుకునేవాడిని. మన హైదరాబాదులో కూడ అవి కొన్న స్వీటు షాపుల్లో దొరుకుతాయి. మన ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీగారికి అవంటే ఎంతో ఇష్టమట.

కానీ ఢోక్లా స్వీట్ కాదు. శనగపిండిని నానపెట్టి, అందులో ఉప్పు, మిరియాలపొడి కలిపి, మన ఇడ్లీలలాగా ఆవిరి మీద బహుశా కుక్ చేస్తారనుకుంటాను. బాగానే ఉన్నాయి. మా యోగా అన్నాడు “సాల్ట్ కేకుల్లా ఉన్నాయి” అని. నిజమే!

తర్వాత ‘పోహా’ రెండు ప్లేట్లు ఆర్డరిచ్చాము. మన అటుకుల పులిహోరనే వాళ్లు ‘పోహా’ అంటారు. ముందు చెప్పకపోతే దాంట్లో కూడ చెక్కర వేసితెస్తారు. మొత్తానికి మా బ్రేక్‌ఫాస్ట్ అసంపన్నమయింది. టీ తాగాము. అది మాత్రం అద్భుతంగా ఉంది.

మేం పదింబావుకు సోమనాథ్ చేరుకున్నాము. అది టెంపుల్ టవున్ మాత్రమే. అంటే పెద్ద ఊరేమీ లేదు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథాలయం అక్కడ ఉంది. కారు ఒక చోట ఆపాడు ఖురానా. ఆ పక్కనే జి.ఎస్.ఆర్.టి.సి బస్టాండు ఉంది. “దానిలో నుంచి వెళ్లండి సార్. గుడికి దగ్గరవుతుంది” అన్నాడు. దర్శనం అయిన తర్వాత ఇక్కడికే వచ్చేయమని చెప్పాడు.

బస్ స్టేషన్ కిటకిట లాడుతూంది. దాని పక్కన సుమారు ముఫై ఎకరాల విస్తీర్ణంలో పెద్ద పెద్ద షెడ్లు వేశారు. సామాన్య ప్రజానీకం అక్కడే వంటలు చేసుకుంటున్నారు. అక్కడే నడుం వాలుస్తున్నారు. పిల్లలకు అక్కడే ఊయ్యాలలు కట్టారు. ఒక్కో కుటుంబం ఒక్కో మేర తమ సరంజామా అంతా పెట్టుకున్నారు. వాళ్లు కదా నిజమైన భక్తులు! అని అనిపించింది. ఏ కంఫర్ట్స్ లేకుండా, ఎర్ర బస్సుల్లో, జనరల్ కంపార్టుమెంట్లల్లో ప్రయాణించి వచ్చి, దైవ దర్శనం చేసుకుంటున్నారు. వారివారి ముఖాల్లోనూ కించిత్తు అసహనంగాని, ఇబ్బంది పడుతున్న ఫీలింగ్ కాని కనబడలేదు.

ఒక చోట వరుసగా కౌంటర్లున్నాయి. కొన్ని పాదరక్షలకు, కొన్ని సెల్ ఫోన్లకూ. వాటి మీద ఫ్రం.. టు అని నంబర్లున్నాయి, తిరిగి తీసుకోనేటప్పుడు, మనకిచ్చిన నంబరు ప్రకారం తీసుకోవచ్చు. రెండు చోట్ల మావి ఇచ్చి రశీదులు తీసుకొన్నాము. ‘నిశ్శుల్క్!’

ఒక మూడు వందల మీటర్లు దూరంలో సోమనాథ మందిరం సమున్నతంగా కనబడుతూంది. దారిలో లాన్స్, చెట్లు, బాగా పెంచారు. అక్కడ కళాత్మకమైన మంటపాలున్నాయి. వాటి స్తంభాలు లతలతో, పూలతో చెక్కారు.

మందిరం చాలా విశాలంగా ఉంది. ఆ ముందు రోజే మహాశివరాత్రి. ఐదురోజుల పాటు స్వామి వారికి ఉత్సవాలు జరుపుతారట. భక్తులు విశేష సంఖ్యలోనే వచ్చారు.

క్యూలో ప్రవేశించాము. “జై భోలే నాథ్! జై సోమనాథ్!” అంటూ భక్తులు పారవశ్యంగా నినదిస్తున్నారు. ఒక గంటలోపే శివదర్శనం అయింది. జ్యోతిర్లింగం దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. చుట్టూ ‘ఆర్చి’ లాగా కట్టి దీపాలు వెలిగించారు. మహా శివరాత్రి సందర్భంగా స్వామికి విశేషాలంకరణ చేశారు. మందిరాన్నంతా గోపురాలతో సహా సీరియలై లైట్లతో అలంకరించారు. రాత్రయితే ఆ వైభవం చూడడానికి బాగుంటుంది. విష్ణు దర్శనానికి శివ దర్శనానికి తేడా మాకర్ధమైంది. శివుని దగ్గర ఎటువంటి ఉద్వేగాలు కలగవు. మనస్సు ‘శమము’తో నిండిపోయింది. వైరాగ్య ప్రియుడైన మహా దేవుడు ఆయన. బోళా శంకరుడు.

ఆలయం సముద్రాన్ని ఆనుకొనే ఉంది. ప్రాకారం దగ్గర నుంచి అనంత సాగరం కనబడుతూంది. అక్కడ గోడ కూడ ఎత్తు తక్కువగా ఉంది. క్రిందికి చూస్తే, అలలు వచ్చి, మందిర ప్రాకారాన్ని వేగంగా తాకి వెనక్కు వెళ్లిపోతున్నాయి. సోమనాథుని దర్శనం కోసం సముద్రుడు ఆరాటపడుతున్నట్లు నా కనిపించింది. మావాడితో అదే అంటే..

“అందుకేరా నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంటుంది! ఎంత బాగా చెప్పావురా!” అని మెచ్చుకున్నాడు.

“మరి.. ప్రతిదీ వివరించి చంపుతానని..”

“చాల్లే, ఆపు. ఊరికే ఏదో అలా అన్నానులే! నీతో వచ్చినందుకు కదా, ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి” అన్నాడు వాడు. పది నిమిషాలు సముద్రాన్ని చూస్తూ గడిపాము.

వెనక్కు వస్తూ ఒక మంటపంలో కాసేపు కూర్చున్నాము. అక్కడ ఇద్దరు దంపతులు కూర్చుని తెలుగులో మాట్లాడుకుంటున్నారు. వారిని పలకరించాము. వారిది వరంగల్ ఆట. మాకు ప్రసాదం ఇచ్చారు.

మందిరంలో అక్కడ కూడ ఆలయ ప్రాశస్త్యం చరిత్రను వివరించే బోర్డులున్నాయి. వాటిని ఇంగ్లీషు మరియు గుజరాతీ భాషల్లో వ్రాసి ఉన్నారు.

సోమనాథ మందిరం వెరావల్ లోని ప్రభాస్ పటాన్‍లో ఉంది. పురాతన సంస్కృతి శిలాశాసనాల్లో దానిని ప్రభాసప పట్టణమని, జ్యోతిర్గింగ తీర్థమని పేర్కొన్నారు. మహాభారతంలోని అరణ్యపర్వంలో దీనిని సౌరాష్ట్ర తీరంలోని గొప్ప శివక్షేత్రంగా వర్ణించారు వ్యాసులవారు. ఇది గిర్ సోమనాథ్ జిల్లాలో ఉంది.

ప్రస్తుతం మనం దర్శిస్తున్న నిర్మాణం 1951లో పూర్తయ్యింది. ఎన్నోసార్లు 11వ శతాబ్దం నుండి, మహమ్మద్ గజనీలాంటి ముస్లిం పాలకుల దండయాత్రలలో ఆలయం ధ్వంసం కావడం, పునర్నిర్మించుకోవడం జరిగాయి. సర్దార్ వల్లభాయి పటేల్ గారు, ప్రథమ భారత హోంమంత్రి, మందిర పునర్మిర్మాణానికి ఆదేశించారు. కాని దాన్ని చూడకముందే, ఆయన మరణించారు.

సోమ అంటే చంద్రుడని అర్ధం. సోమనాథుడు అంటే చంద్రునికి అధిపతి, చంద్రకళాధరుడు. శివపురాణంలోని 13వ అధ్యాయంలో ‘జనసంహిత’ అనే చోట, జ్యోతిర్లింగాలలో అన్నింటికంటే ప్రథమస్థానంలో సోమనాథ్ ఉంది. స్కంద పురాణగతమైన వారణాసి మహత్యంలో ‘శతరుద్రసంహిత’ లో, ‘కోటిరుద్రసంహిత’లో దీని ప్రస్తావన, ప్రాశస్త్యం వివరించబడింది.

కాళిదాసు మహాకవి, తన రఘువంశ కావ్యములో దీనిని సోమనాథ – ప్రభాస తీర్థముగా అభివర్ణించాడు. ఇక్కడ సముద్రంలో మూడు నదులు కలుస్తాయి. కపిల, హిరణ్, సరస్వతి. సోముడు అంటే చంద్రుడు. ఒక శాపవశాన తన కాంతిని కోల్పోయి. సరస్వతీ నదిలో స్నానమాచరించి పునఃతేజస్సును పొందినాడని స్థలపురాణం చెబుతూంది. ప్రభాస – అంటే కాంతి, తేజస్సు అని అర్ధం.

1026 సంవత్సరంలో భీమ 1 పరిపాలనలో, గజనీ మహమ్మద్ దండయాత్ర చేసి, జ్యోతిర్లింగాన్ని పగులగొట్టి, ఇరవై లక్షల బంగారు దీనారాలను కొల్లగొట్టుకుపోయాడు. ఆయనను ఎదిరించిన యాభైవేల మంది శివభక్తులను చంపేశాడు. 1172లో కుమారపాలమహారాజు మందిరాన్ని పునర్నర్మించాడు. నాణ్యమైన ఎర్రరాతితో, విలువైన రాళ్లు పొదిగాడు. 1665లో ఔరంగజేబు మళ్లీ మందిరాన్ని ధ్వంసం చేశాడు.

19వ శతాబ్దంలో విల్కీకాలిన్స్ అనే రచయిత ‘ది మూన్‌స్టోన్’ (చంద్రకాంత శిల) అనే నవల రాశాడు. అది 1990లలో మన ఇంటర్మీడియట్ విద్యార్ధులకు నాన్‌డిటెయిల్డ్ పాఠ్యాంశంగా ఉండేది. నేను ఇంగ్లీషు లెక్చరర్‌గా నర్సీపట్నం (‍boys) జూనియర్ కాలేజీలో పని చేస్తున్నపుడు దాన్ని విద్యార్థులకు బోధించాను. అందులో ఆ రత్నాన్ని సోమనాథ్ ఆలయం నుంచే అపహరించినట్లు కాలిన్స్ రాశాడు. చాలా ఉత్కంఠ రేపే నవల అది. మొదటి అపరాధ పరిశోధక నవల అని దానికి పేరు.

1950లో అక్కడి శిధిలాలను తొలగించి, అక్కడున్న మసీదును దూరంగా షిఫ్ట్ చేసి, ప్రస్తుత మందిరాన్ని నిర్మించారు. 1951, మే 11న భారత ప్రథమ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గారు భూమి పూజ చేశారు.

మందిరం నిర్మాణంలో తేనెరంగు రాయిని వాడారు. మందిర ప్రధాన గోపురం 155 అడుగుల ఎత్తు ఉంటుంది. దాని మీద ఉన్న కలశం బరువు పది టన్నులు.

ఈ వివరాలన్నీ తెలుసుకొని మా హృదయాలు బరువెక్కాయి. ఇంత చరిత్ర గల, భారతదేశంలోని ప్రథమ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొనే భాగ్యం మాకు కల్గించినందుకు ఆ మహాదేవునికి జోతలు సమర్పించాము.

(ఫోటోలు – ఇంటర్‍నెట్ నుంచి సేకరణ)

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here