గుజరాత్ రాజస్థాన్ పర్యటనానుభూతులు-5

1
13

[2023 ఫిబ్రవరి నెలలో గుజరాత్, రాజస్థాన్ లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]మం[/dropcap]దిరానికి దగ్గరలోనే మహారాణి అహల్యాబాయి హోల్కర్ గుడిని దర్శించుకున్నాము. ఆమె మాల్యా రాజ్యానికి రాణి.

ఎన్నో దేవాలయాలు, ధర్మశాలలు కట్టించిన వితరణశీలి. ఆమెను గొప్ప వేదాంతి అంటారు. వితంతువులు తమ భర్తల ఆస్తులకు వారసులని, సంతానం లేకపోతే, దత్తత తీసుకోవచ్చని చట్టం చేసిన మహానుభావురాలు. మాల్యా రాజ్యం, మరాఠా సామ్రాజ్యంలో ఒక భాగమే. 1996లో భారత ప్రభుత్వం ఆమె పేర ఒక తపాలా స్టాంపును వెలువరించింది.

ఆమె భర్త ఖండేరావు హోల్కర్. భర్త, మామగారి మరణం తర్వాత, ఆమె అధికారం చేపట్టి, హోల్కర్ వంశ ప్రతిష్ఠను ఇనుమడింప చేసింది. గుడిలోని ఆమె విగ్రహం అతి సామాన్యంగా, ఒక సగటు గృహిణిదిలా ఉంది.

అప్పుడు 12.30 అయింది. మెయిన్ రోడ్ మీదికి వచ్చేశాము. చెప్పులు, సెల్ ఫోన్లు తీసుకొన్నాము. మెయిన్ రోడ్ వెంట ఇరవైపులా రకరకాల రెస్టారెంట్లున్నాయి. సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అని చూసి దానిలోకి వెళ్లి కూర్చున్నాము. అక్కడ మసాలా దోసెలు పోస్తున్నాడు.

ముందు వడ, సాంబార్ తిన్నాము. తర్వాత మసాలా దోసె. చక్కని రుచికరమైన మజ్జిగ ఇచ్చాడు. ధరలు కూడ తక్కువే. ఖురానాకు ఫోన్ చేశాము. ద్వారకకు మా తిరుగు ప్రయాణం మొదలయింది. మధ్యలో ఒక చోట టీ తాగాము. మేము ద్వారక చేరేసరికి నాలుగున్నరైంది.

“మీరు కాసేపు రెస్టు తీసుకోండి సార్! నేను ఆరు గంటలకు వస్తాను” అని చెప్పి అతడు వెళ్లిపోయాడు. రూంకి పోయి హాయిగా వేడినీళ్లతో స్నానం చేశాము.

సరిగ్గా ఆరు గంటలకు బయలుదేరి, ద్వారకలో మిగిలిన ప్రదేశాలు చూడసాగాము. మొదట స్వామినారాయణ్ మందిర్‌కు తీసుకువెళ్లాడు. చాలా పెద్దది. అక్షరధామ్ తరహాలోనే ఉంది. దాన్ని భక్తి ధామ్ అంటారు.

లోపల కళాత్మకమైన స్తంభాలు పైన నగిషీలు చెక్కిన డోమ్ ఉన్నాయి. అది గోమతీ ఘాట్‌కు బాగా దగ్గరలోనే ఉంది. మందిరం పైకి వెళ్లి వెనుక వైపు నుంచి చూస్తే, సముద్రం చక్కగా కనబడుతుంది. అప్పటికి చీకటి పడింది. సముద్రంలో అక్కడక్కడా ఓడలు లైట్లు వేసుకొని కదలడం చూశాము.

తర్వాత సిద్ధేశ్వర మహాదేవ్ మందిర్‌కు వెళ్లాము. ద్వారకలోని అతి పురాతనమైన శివాలయం అది. ద్వారకాధీశ్ మందిరానికి దగ్గర ఆవరణలో శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక మహా వృక్షం, రావి చెట్టు, దాని క్రింద అగాధమైన ఒక బావిని చూశాము. శివలింగాన్ని మనం చేతితో స్పర్శించవచ్చు.

తర్వాత రామేశ్వర్ మహాదేవ్ మందిర్‌ను దర్శించుకున్నాము. ముందు రోజు గోమతీ ఘాట్‌లో రెండు శివాలయాలు దర్శించాము. అంతటా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ పర్వదినాన అన్ని సార్లు వివిధ రూపాలలో పరమేశ్వరుని దర్శనభాగ్యం కలిగింది మాకు.

తర్వాత రుక్మిణీ మందిర్ చూశాము. అమ్మవారు శాంతస్వరూపిణి. గాయత్రీమందిర్ అయితే చాలా బాగుంది. అది ఒక శక్తి పీఠం. రత్నేశ్వర్ రోడ్డులో ఉంది. 1983లో దీనిని నిర్మించారు.

‘మా గాయత్రి’ అంటారామెను. గర్భగుడిలో గాయత్రీ మాత, సావిత్రీ మాత, కుండలినీ మాత కొలువుదీరి ఉన్నారు. అమ్మవారి విగ్రహం పాలరాతితో చేయబడింది. ఎంతో సుందరంగా ఉంది. మందిరం ఎంతో ప్రశాంతంగా ఉంది. కూర్చుని 21 సార్లు గాయత్రీ మంత్రం జపించాను. అమ్మవారిని స్తుతిస్తూ ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా పాడాను.

శ్లో.

మక్తావిద్రుమహేమనీల

ధవళచ్ఛాయైఃముఖైఃత్రీక్షణైః

యుక్తాం ఇందునిబద్ధరత్నమకుటాం

తత్త్వర్ధవర్ణాత్మికాం

గాయత్రీం వరదాభయాంకుశకళాశ్శుభ్రం

కపాలం గదాం

శంఖం చక్రమదారవిందయుగళం

హస్తైః వహన్తీం భజే!!

నేను శ్లోకాన్ని గానం చేస్తూ ఉండగా, కొందరు భక్తులు వీడియో తీసుకున్నారు, మా యోగాతో సహా. సంస్కృతం కాబట్టి, ఆ గాయత్రి స్తుతి చాలా ప్రసిద్ధం కాబట్టి వారు ఆసక్తి చూపించారు. నేను శ్లోకాన్ని భూపాలరాగంలో పాడాను. ఒక పెద్దాయన నా దగ్గర కొచ్చి

“యే కర్నాటిక్ సంగీత్ హైనా జీ?” అనడిగాడు.

“హజీ!” అని చెప్పాను.

 “హిందూస్తానీ సంగీత్ మే ఏ శ్లోక్ కా రెండరింగ్ అలగ్ రహతా! మై సునావూ?” అని అడిగాడాయన.

“జరూర్ సునాయియే” అన్నాను. అదే శ్లోకాన్ని ఆయన పాడాడు హిందుస్తానీ రాగంలో. ఆ విరుపులు, గమకాలు వేరుగా ఉన్నాయి. మనం హ్రస్వాలుగా ఉచ్చరించే పదాలు వారి భాషలో ఇలా అయ్యాయి.

విద్రమ.. విద్రమ్

హేమ – హేమ్

నీల – నీల్

అలా అన్నమాట. రీతి ఏదైతేనేం, శ్రావ్యత కదా కావల్సింది. ఆయనకు ధన్యవాదాలు చెప్పి, వచ్చేశాము. ఆయనది రాజ్‌కోట్ అట. మేము హైదరాబాద్ నుంచి వచ్చామని తెలిసి సంతోషించాడు. “తెలంగాణా స్టేట్ హైనా? పహాలే ఏక్ హీతా, ఆంధ్రప్రదేశ్. బాద్ మే సపరేట్ హోగయా” అన్నాడు నిజమే కదా!

అప్పుడు ఎనిమిది కావస్తుంది. నాకు ఆకలి వేస్తుంది. స్నాక్స్ జీవిని కదా! మావాడు ఆకలిని జయించినవాడు. బహుశా ‘బల.. అతిబల’ మంత్రాన్ని జపిస్తాడోమో రోజూ. అదే వాడితో అంటే అన్నాడిలా.

“నా మొహం! నాకంత సీనుంటుందా. అదీ నీకు తెలియకుండా? సాయంత్రం ఏం తిన్నా అరిగి చావదురా శర్మా!”

“నాకు చక్కగా అరుగుతుందిలే” అంటూ గాయత్రీ మందిర్ ఎదురుగా, రోడ్డు కట్టువైపున ఉన్న ఒక స్నాక్స్ బండి దగ్గరకు వెళ్లాను. అక్కడ దాల్ వడ (మసాలావడ) వేడి వేడిగా వేస్తున్నాడు. నేను రెండు తిన్నాను. ఫ్రయ్ చిల్లీస్, ప్యాస్‌తో. మావాడు ససేమిరా!

కారెక్కాము. ఖురానా అన్నాడు “సార్, మనం ఇప్పుడు గుజరాత్ రెండో జ్యోతిర్లింగ క్షేత్రం, నాగేశ్వర జ్యోతిర్లింగ్ మందిర్‌కు వెళుతున్నాం. ఇక్కడి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది. అరగంటలోపే వెళ్లిపోతాం. గుడి తొమ్మిదిన్నర వరకు తెరిచే ఉంటుంది. సార్, మీ వల్ల, మహా శివరాత్రి పర్వదినాన రెండు జ్యోతిర్లింగాల దర్శనం కూడా దొరికింది. ధన్యవాదాలు సార్. ”

అతని సంస్కారానికి ముగ్ధులమైనాము.

“ఇక్కడే ఉంటావు కదా?” అంటే “ఉంటాంగాని, టూరిస్టులను డ్రాప్ చేసి వెయిట్ చేస్తాం. అంతే కాని, నిన్న ఈ రోజు మహాశిరాత్రి కాబట్టి, నేనూ దర్శనం చేసుకుంటున్నాను మహాదేవుడిని.”

అరగంటలో చేరుకున్నాము. కారుకు పార్కింగ్ దొరకలేదు. అన్ని కార్లున్నాయి. మమ్మల్ని దిగమని, తాను పార్క్ చేసి వస్తానని చెప్పాడు.

చాలా పెద్ద గుడి, మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. గుడికి మెయిన్ గోపురం కాక ఇంకా రెండు గోపురాలున్నాయి. మొత్తం మందిరాన్ని సీరియల్ లైట్లతో అలంకరించారు. దేదీప్యమానంగా ఉంది. గుడినానుకొని సమున్నతమైన, ధ్యానముద్రలో ఉన్న, పరమేశ్వరుని విగ్రహం ఉంది. దాన్ని తర్వాత చూద్దామూ, ఎలాగూ ఆరుబయటే ఉంది కదా! అనుకున్నాము.

మందిరంలోకి ప్రవేశించాము. క్యూలో జనం బాగానే ఉన్నారు. ఇరవై నిమిషాలు పట్టింది దర్శనానికి. లోపల కళ్లు చెదిరే శిల్పాకృతులు, ఆ స్తంభాల మీద కార్వింగ్స్ అద్భతంగా ఉన్నాయి. పైన డోమ్ సుందరంగా ఉంది. పెద్ద పెద్ద షాండిలియర్స్ వెలుగుతున్నాయి.

లోపలికి సెల్ ఫోన్‌లు అనుమతిస్తున్నారు. సోమనాథ్‌లో అలా కుదరలేదు. చక్కగా మందిరాన్ని లోపల, బయట ఫోటోలు వీడియోలు తీయసాగాము.

సరిగ్గా అప్పడే, మా అదృష్టం, శివునికి ‘మహాహారతి’ ప్రారంభమైంది. గర్భగుడి కొంచెం దిగువన ఉంది. అక్కడి వరకు వెళ్లవచ్చు. నాగేశ్వర్ మహాదేవ్‌ను కేవలం ఐదడుగు దూరం నుంచి దర్శించగలిగాము. స్వామివారు లింగరూపంలో, సర్వాలంకార భూషితులై ఉన్నారు. శివలింగం ముదురు గోధుమ రంగులో ఉంది. ఇరువైపుల అమ్మవార్లు. దాదాపు పదినిమిషాలు పరమాత్మకిచ్చే హారతిని వీక్షించాము. ఎలక్ట్రానిక్ వాయిద్యాలు మోగుతున్నాయి. ఒక పెద్ద దూపార్తిలో ఎన్నో జ్యోతులు వెలిగించి, శివునికి హారతి పట్టారు.

ఒక అలౌకిక మానసికావస్థకు లోనయ్యాము. సోమనాథ్‌లో ఇంత అవకాశం దొరకలేదు. బయటకి వచ్చి, సమున్నత శివుని విగ్రహం దగ్గరకు వెళ్లాము.

చాలా పెద్ద విగ్రహం. దాదాపు 25 మాటర్లు ఎత్తుంది. రెడ్ స్టోన్‌తో చెక్కారు. స్వామి అర్ధనిమిలిత నేత్రడై ధ్యానముద్రలో ఉన్నాడు. విగ్రహానికి ముందు అమర్చిన ఫ్లడ్ లైట్లు కాంతిలో విగ్రహమంతా మెరిసిపోతుంది. స్వామి పద్మాసనంలో ఉన్నారు. ఆయన పాదాలపై భాగంలో ఒక పెద్ద సింహం బొమ్మను చెక్కారు. విగ్రహం దగ్గర ఫోటోలు తీసుకున్నాము. స్వామి మేరువుగా మేము రేణువులుగా అనిపించాము. అంతే కాదు, భగవంతుని ముందు మనమెంత వారము? పరమశివుని చూస్తూంటే అప్రయత్నంగా నా నోట ఈ శ్లోకం వెలువడింది. యథాప్రకారం రాగ యుక్తంగా పాడాను. దానికి ముందు ఆ క్షేత్రాన్ని గురించి క్లుప్తంగా వీడియోలో చెప్పాను. కొందరు భక్తులు నిలబడి శ్లోకాన్ని శ్రద్ధగా విన్నారు, ప్రశంసగా తల ఊపుతూ.

శ్లో.

“కరచరణ కృతంవా కర్మవాక్కాయజంవా

శ్రవణ నయనజంవా, మానసం వాపరాధం

విహితమవిహితంవా, సర్వమేతత్ క్షమస్వా!

శివశివకరుణాబ్ధే! శ్రీమహాదేవ శంభో!

నమస్తే, నమస్తే, నమస్తే నమః”

మా యోగానందునికి శ్లోకం బాగా నచ్చింది. దాని అర్థం అడిగాడు. “తండ్రీ, శివా, కరుణా సముద్రా, కాళ్లు, చేతులు, పనులు, ముక్కు, చెవులు, కళ్లు, మనసు ఇలా వేటితో చేసిననా అపరాధాన్నైనా క్షమించు స్వామీ” అని చెప్పాను. ‘భక్త కన్నప్ప’ సినిమాలో సత్యం స్వరపరచగా, రామకృష్ణ పాడగా, కృష్ణంరాజు ఈ శ్లోకాన్ని అద్భుతంగా అభినయించాడని కూడా చెప్పాను.

మళ్లీ మందిరం ఆవరణలోకి వెళ్లాము. అక్కడున్న వీరభద్రుని దర్శించుకున్నాము. అక్కడ పెద్ద నోటీసు బోర్డులో క్షేత్ర ప్రాధాన్యత, స్థల పురాణం ఉన్నాయి. శ్రద్ధగా చదివాము.

నాగేశ్వర జ్యోతిర్లింగం భారత దేశంలో, గుజరాత్ రాష్ట్రంలో రెండవది. నాగ, నాగిని రూపంలో శివపార్వతులు ఇక్కడ వెలసినారు. లోపల చిన్న వెండి నాగప్రతిమలు అమ్మతున్నారు. అవి స్వామికి, అమ్మవారికి నివేదన చేస్తే, సర్వపాపవిమోచనం, సర్వగ్రహదోషనివారణం అవుతుందట.

స్వామి వారిని ‘ఔంధనాగనాధ్’ అని కూడ పిలుస్తారు. మందిరమంతా రెడ్ స్టోన్ నిర్మాణమే. దగ్గరలో గోపీ తీర్థమనే కొలను ఉంది. గోపికలు శ్రీకృష్ణుని, తమ వలువల నిమ్మని ప్రార్ధించి ఆయనలో లయమైంది ఇక్కడే అని ఐతిహ్యం.

దారుకుడనే రాక్షసుడు సుప్రియుడనే శివభక్తుని బంధించి హింసింస్తూ ఉంటే, ఆ భక్తుడు ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాన్ని జపిస్తూ, శివుని రక్షించమని ప్రార్థించాడట. స్వామి ప్రత్యక్షమై దారుకుని సంహరించి సుప్రియుని కాపాడాడు. స్వయంభువుడై అక్కడే వెలిశాడు. ఇది స్థలపురాణం. ఇక్కడే వాలఖిల్యులు అనే పొట్టి మహర్షులు ఆరాధించారు. ఇది వామన పురాణంలోని, 6వ, 45వ ప్రకరణల్లో ఉంది.

మందిరంలో చెక్కబడిన శిల్పాలలో, రావణుడు కైలాసపర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం, విష్ణువు దశావతారాలు, అర్ధనారీశ్వర, నటరాజు, వీరభద్రుని ఉగ్రరూపం, ముఖ్యమైనవి, సౌరాష్ట్ర తీరంలోని రెండవ జ్యోతిర్లింగ క్షేత్రమిది. కాని ‘దారుకావనం’ లోకేషన్ గురించి వివాదం ఉంది. దారుక అంటే దేవదారువృక్షం.

నాగేశ్వర జోతిర్లింగానికి మూడు ముఖాలు ఉంటాయి. రుద్రాక్షలతో దాన్ని అలంకరిస్తారు. లింగం రుద్రక్ష ఆకారం (oval shape) లింగం ముందు భాగం దక్షిణం వైపు, గోముఖం తూర్పు వైపు ఉంటాయి. నామదేవుడనే వాగ్గేయకారుడు స్వామి పై ఎన్నో కీర్తనలను రచించి, పాడాడు.

ద్వారక నుంచి చేట్ ద్వారక వెళ్లే దారిలో ఈ క్షేత్రం వస్తుంది. శ్రావణ మాసమంతా, మందిరంలో రుద్రమంత్రాన్ని జపిస్తారు.

మా మనసంతా శివభక్తితో నిండిపోయింది. తొమ్మిదింబావుకు కారెక్కి, తొమ్మిది నలభైకి మా ‘రుద్రప్రాజా’ చేరుకున్నాము. “మీరు డిన్నర్ చేసి కాసేపు రిలాక్స్ అవండి సార్. రైలు పదకొండున్నరకన్నారు కదా. ద్వారక స్టేషన్ దగ్గరే, పదినిమిషాలు కూడ పట్టదు. నేను పదకొండుకు వస్తాను” అని చెప్పి వెళ్లిపోయాడు ఖురానా.

మా హోటల్‌లో రెస్టారెంట్ లేదు. ఆర్డర్ చేస్తే రూంకి తెచ్చిస్తారు. కాని మా ఇద్దరికీ, ఆ పొట్లాలు అన్నీ విప్పుకొని, రూంలో తినడం నచ్చదు. ఎదురుగా ‘వందనా వెజ్’ అనే రెస్టారెండ్ ఉంది. అక్కడ గుజరాతీ/మార్వాడీ మిక్స్ ‘థాలీ’ ఉంది unlimited, 150 రూపాయలు. పుల్కా, చనా, గోబీ మసాలా, దాల్, కడీ (మజ్జిగ పులుసు) పులగం (మూంగ్ దాల్ రైస్), వైట్ రైస్, సలాడ్, అమూల్ ఘీ, రెండు పొడులు, రెండు పచ్చళ్లు, పెరుగు లేదు! కాని మిరియాల పొడి కలిపిన అద్భతమైన చిక్కని మజ్జిగ ఇచ్చారు. కొసరి కొసరి వడ్డిస్తున్నారు. మన కాకినాడ సుబ్బయ్య హోటల్‌లో లాగా. ఇది రుచి చూడండి. ఇది కొద్దిగా వేసుకోండి అంటున్నారు అభిమానంగా. పదార్థాలన్నీ పొగలు కక్కుతూ, రుచిగా ఉన్నాయి. వారి ఆదరణ వల్ల వాటి రుచి ఇంకా పెరిగింది. సుష్టుగా భోంచేశాము.

సరిగ్గా పదకొండుకు ఖురానా క్రింద నుండి ఫోన్ చేసాడు. సామాను పెద్దగా లేదు కదా. అహమ్మదాబాద్ లోనే మిగతా బ్యాగులన్నీ పెట్టివచ్చాము. పదకొండు పదికి మమ్మల్ని స్టేషన్ వద్ద దింపి, మాకు నమస్కరించి వెళ్లిపోయాడతడు. అతనికి రెండు వందలు ఇచ్చాము. బలవంత పెట్టితేగాని తీసుకోలేదు.

ప్లాట్‌ఫారం కిటకిటలాడతుంది. అంతా అదే రైలు కోసమే. ఓభా నుంచి వస్తుందా రైలు. ఓభా పక్కనే ఉంటుంది. కాని అది యు.పిలోని గోరఖ్‌పూర్ వరకు వెళుతుంది. రైట్ టైముకే వచ్చింది. మాది B2 థర్డ్ ఏసి. లోయర్ బెర్తులే. ఎక్కి హాయిగా పడుకున్నాము. మర్నాడుదయం ఎనిమిదింబావుకు అహమ్మదాబాద్ చేరాము. రైల్లోనే ముఖాలు కడుకొని, తయారయ్యాము. ఎందుకంటే మాకు అహమ్మదాబాద్‌లో రూం లేదు!

డ్రైవరు మనోజ్ ముందే ఫోన్ చేశాడు. డౌనట్ ట్రావెల్స్ వారి ఏర్పాటు. నేరుగా ‘ఫ్యూరాట్ ఇన్’కి వెళ్లి స్టోర్ రూములో ఉంచిన మా లగేజ్ తీసుకున్నాము. రిసెప్షన్‌లో ఉన్నతనికి కృతజ్ఞతలు చెబితే “ఆమాత్రం టూరిస్టులకు హెల్ప్ చేయలేమా సార్” అన్నాడు వినయంగా. సామానంతా తెచ్చి కారులో పెట్టిన బాయ్‌కి వంద రూపాయలు ఇచ్చాము. బిడియపడుతూ తీసుకున్నాడు.

గుజరాత్, రాజస్థాన్ టూర్‌లో మాకు నచ్చిందిదే. ఎక్కడా రిసార్టు, హోటల్ బాయిస్ యారోగెంట్‌గా లేరు. మనమిస్తే తీసుకుంటారు తప్ప, డిమాండ్ చేయరు. పైగా సర్వీస్‌లో వినయం.

మా కారు మారింది. హోండా XSent 112 కి.మీ దూరంలోని ‘వడోదర’ కు బయలుదేరాము. పూర్వం ‘బరోడా’నే ఇప్పుడు ‘వడోదర’ అంటున్నారు. అది చాలా పెద్ద సిటీ అట. బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా సౌత్ ఇండియన్ రెస్టారెంట్ తీసుకెళ్లమని అడిగాము.

అహమ్మదాబాద్ నగరంలోనే ‘కుముదిని, ది సౌత్ డెలికసీస్’ అన్న హోటల్ దగ్గర ఆపాడు. అక్కడ మన టిఫిన్లన్నీ ఉన్నాయి. ఇడ్లీ సాంబారు, ఆనియన్ రవ్వ దోసె తిన్నాము. చాలా బాగున్నాయి. విశేషమేమిటంటే, షుగర్ లెస్ ఫిల్టర్ కాఫీ కూడ ఉంది. అద్భుతంగా ఉంది. రేట్లన్నీ మన చట్లీన్, మినర్వా కాఫీ హౌస్ లెవెల్లో ఉన్నాయి. సరే, రుచి కావాలి, చౌకగా రావాలంటే కుదరదు కదా!

అహమ్మదాబాద్ వడోదర రోడ్డు ఎనిమిది లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే. పదకొండున్నర కల్లా వడోదర చేరాము. మాకిచ్చిన హోటల్ పేరు ‘ఆల్ఫా ప్యాలెస్’. అది సాయజీగంజ్‌లో, ఫోనిక్స్ కాంప్లెక్స్‌లో, సెవెంత్ ఫ్లోర్‌లో ఉంది. రిసెప్షన్ నంబర్‌కు డ్రైవర్ ఫోన్ చేస్తే ఇద్దరు బోయస్ కారు దగ్గరకి వచ్చారు. సామానంతా తీసుకెళ్లారు. వారి వెంట లిఫ్ట్‌లో వెళ్లాం. లిఫ్ట్ ఎంత పెద్దదంటే ఒక చిన్న రూమంత ఉంది. పన్నెండు మంది ఒకేసారి వెళ్లవచ్చు.

ఫోనెక్స్ కాంప్లెక్స్ చాలా పెద్దది. నగరం నడి బొడ్డున ఉంది. ఆల్ఫాప్యాలెస్ ఏడవ ఫ్లోరంతా ఉంది. చాలా ‘ఫోష్’గా ఉంది. ‘చెకిన్’ అయ్యాము. “లంచ్ చేసి ఒక గంట రెస్ట్ తీసుకోండి. సరిగ్గా మూడు గంటలకు బయలుదేరాలి సార్” అన్నాడు డ్రైవరు.

మళ్లీ క్రిందికి వెళ్లే ఓపిక లేదు. స్నానాలు చేశాము. రూం చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ కూడ ఉంది. లంచ్ కేవలం వైట్ రైస్, దాల్ తడ్కా, దహీ, ఆలూ పాలక్ ఆర్ఢర్ చేశాము. పాకెట్స్ కాకుండా బౌల్స్‌లో నీట్‌గా సర్వ్ చేశాడు. తీనేసి, హాయిగా పావు తక్కువ మూడు వరకు పడుకున్నాము. మూడుంబావుకు తయారై క్రిందికి వెళ్లాము. ఆ రోజు రాత్రి వరకు వడోదరలోని ప్రదేశాలు చూడాలి మరి.

***

మూడున్నరకు EME దక్షిణామూర్తి మందిర్‌కు వెళ్లాము. అది సిటీకి దూరంగా ఉంది. మన సైనిక్‌పురి లాగా అదంతా ఆర్మీ బేస్‌లా ఉంది. ఆర్మీడ్ ఫోర్సెస్ వారి ఆఫీసులు, యుద్ధటాంకులు, కనబడుతున్నాయి. ఇక్కడ మందిరం ఎందుకుంటుంది అని అనుకుంటున్నాము. దక్షిణామూర్తి మందిర్ వచ్చింది.

విశాలమైన వంద ఎకరముల ప్రదేశం. పెద్ద పెద్ద వృక్షాలు ఆవరణను చల్లగా ఉంచుతున్నాయి. మధ్యలో విశాలమైన పచ్చికబయళ్లు, వాటి మధ్యన జలయంత్రాలు (fountains) ఉన్నాయి.

మందిరానికి వెళ్లేదారికి ఇరువైపులా ఏడు ఎనిమిది తొమ్మిది, పది శతాబ్ధాలకు చెందిన అతి పురాతన రాతి విగ్రహాలు నిలబెట్టబడి ఉన్నాయి. వాటిలో కొన్ని శిధిలావస్థకు చేరుకున్నాయి. ప్రతి విగ్రహం క్రింద, దాని పేరు, కాలం, భ్రీఫ్‌గా వివరణ ఉన్న ఫలకం బిగించిబడి ఉంది.

దక్షిణామూర్తి మందిరం పూర్తిగా మెటల్ షీట్లతో ఒక డోమ్ ఆకారంలో నిర్మించారు. దక్షిణామూర్తి విగ్రహం అంత పెద్దది చూడడం నేను అదే మొదటిసారి. దాని ముందు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. కొంచెం దూరంలో రాధాకృష్ణ, శ్రీరామ, హనుమాన్‌ల మందిరాలు కూడ ఉన్నాయి చిన్నవి. వాటినీ దర్శించుకున్నాము.

బయటకి వచ్చి మందిరం ముందున్న ఒక మంటపంలో కూర్చున్నాము.

“దక్షిణామూర్తి అంటే ఏ దేవుడురా శర్మా?” అని అడిగాడు మా యోగానందుడు.

“దక్షిణామూర్తి అంటే సాక్షాత్తు శివ స్వరూపంలోని గురువు. జ్ఞానానికి, అవగాహనకు అధిష్ఠాన దేవత. యోగము, సంగీతము, జ్ఞానము మానవాళికి బోదించిన సద్గురువు. ఏ గురువూ దొరకనివారు దక్షిణామూర్తిని ఆరాధిస్తే జ్ఞానయోగలాభంతో పాటు, ఇహలోకంలో సద్గురువు లభిస్తాడని శాస్త్రవచనం.”

స్వామి దక్షిణంగా చూస్తూ ఉంటాడు. ఇంకా దక్షిణ్యం అంటే కరుణాంతరంగుడని కూడ చెబుతారు. ప్రతి శివాలంయంలో దక్షిణా మూర్తి విగ్రహం ఉంటంది.

రమణ మహర్షులవారు తమ 89వ లేఖలో, దక్షిణామూర్తిని దక్షిణ+ఆమూర్తిగా విశదీకరించారు. దక్షిణ అంటే సమర్థుడు. శరీరానికి కుడి వైపు, హృదయంలో ఉన్నవాడు అని, ఆమూర్తి అంటే రూపం లేనివాడని, నిరాకారుడని రమణులు సెలవిచ్చారు.

మనం చూసిన విగ్రహాన్ని గమనించావా? ఆయన చతుర్భుజుడు. మర్రి చెట్టు క్రింద ఉంటాడు. ఆయన వాహనం లేదా సింహాసనం హరిణం, అంటే జింక. ఆయన చుట్టూ మహర్షులు చేరి ఆయనను సేవిస్తూ ఉంటారు. ఆయన ఒక పాదంతో ‘అపస్మారు’డనే, అజ్ఞానానికి ప్రతిరూపమైన రాక్షసుని మర్దిస్తూ ఉంటాడు. కొన్ని విగ్రహాలలో ఆయన వీణాధరుడుగా, వృషభారూఢుడుగా కూడ దర్శనం ఇస్తాడు.

“అద్భుతంగా చెప్పావు! శివుడే అను!”

“నిస్సందేహంగా! అక్కడ ఏదో శిలాశాసనం ఉంది చూద్దాం పద! ”

ఇద్దరం అక్కడికి వెళ్లాము. మందిరాన్ని 1966లో నిర్మించారు. ఆ ప్రాంతాన్ని ‘ఫతేగంజ్’ అని పిలుస్తారు. దాన్ని ‘మాడరన్ ఆర్కిటెక్చర్’తో కట్టారట. EME అంటే ఏమిటో అక్కడ రాసి ఉంది. Electrical and Mechanical Engineering Corps of the Indian Army. దాన్ని ప్లాన్ చేసి, స్కెచ్ చేసి రూపుదిద్దినవాడు అప్పటి క్రిస్టియన్ కమాండెంట్ బ్రిగేడియర్ ఎ.ఎఫ్ యూగిన్ (EME school). ఆయన దక్షిణామూర్తి భక్తుడట.

మందిరంపై కలశం ఉంటుంది. డోమ్ ఇస్లామిక్ పద్ధతిలో ఉంటుంది. దక్షిణామూర్తి విగ్రహం పైన గల టవర్ క్రైస్తవ సంప్రదాయంలో ఉంటుంది. పైన బంగారు రంగులో ఇంకో శిఖరం ఉంది. అది బౌద్ధమత సిద్దాంతాలకనుగుణంగా ఉంది. మందిర ప్రవేశద్వారం జైనమత సంప్రదాయంలో కట్టబడింది. మందిరంలో జ్వలించే అగ్నిగుండం జోరాష్పియన్ పద్ధతికి చెందినది. ఇలా అన్ని మతాలకూ మందిర నిర్మాణంలో ప్రాతినిధ్యం ఉంది.

మందిరాన్ని ఇప్పటికీ ఇండియన్ ఆర్మీయే నిర్వహిస్తూ ఉండడం విశేషం.

“స్వామి మీద ఏదైనా పద్యం చెప్పు మరి” అన్నాడు మా వాడు. అప్పుడప్పుడు విసుక్కుంటాడు గాని వెధవ, నా పద్యాలు, శ్లోకాలంటే వాడికి చాలా ఇష్టం.

“పద్యం కాదు కాని దక్షిణామూర్తి శ్లోకం ఒకటి పాడతాను. దీనిని ఆదిశంకరులు రచించారు. చాలా శ్లోకాలున్నాయి ఈ స్తోత్రంలో. ఒకటి పాడతాను అందులోంచి!”

శ్లో.

విశ్వం పశ్యంతి కార్యకారణతయా

స్వస్వామిసంబంధతః

శిష్యాచార్యతయా తధైవపితృ

పుత్రాద్యాత్మనా భోదతః

స్వప్నే జాగ్రతివాయ ఏష పురుషో

మయా పరిభ్రామితః

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం

శ్లీ దక్షిణా మూర్తయేనమః

అర్థం చెప్పక పోతే ఎలాగూ వదిలేపెట్టడని అర్థం చెప్పాను.

“కార్య కారణములు అంటే జరిగేది, జరిపించేది వీటి ద్వారా సమస్త విశ్వమును దర్శించేవాడు, శిష్యుడు గురువు, అట్లే తండ్రి కొడుకు వీళ్లందరిలో అభేదమును చేసేవాడు, కలలో మెలకువలో మాయలో పరిభ్రమించే మానవులకు మార్గదర్శి ఐన దక్షిణామూర్తికి నమస్కారము.”

“ఏదో మిడి మిడి జ్ఞానంతో నాకర్థమైనంత వరకు చెప్పానురోయ్! ఆదిశంకరుల స్తోత్రం కాబట్టి ఇంకా లోతైన విషయాలు, నాకు తెలియనివి ఉండవచ్చు” అన్నాను.

“నాకీ మాత్రం చాలు లేరా!” అన్నాడు వాడు.

(ఫోటోలు – కొన్ని ఇంటర్‍నెట్ నుంచి సేకరణ, కొన్ని రచయిత తీసినవి)

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here