గుజరాత్ రాజస్థాన్ పర్యటనానుభూతులు-6

0
8

[2023 ఫిబ్రవరి నెలలో గుజరాత్, రాజస్థాన్ లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

అక్కడి నుంచి బరోడా మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీకి తీసుకువెళ్లాడు మనోజ్. అందులో బరోడా సంస్థానాన్ని పరిపాలించిన గైక్యాడ్ వంశీయులకు సంబంధించిన ఎన్నో అతి పురాతన కళారూపాలు, దుస్తులు, ఆయుధాలు, పాత్రలు, పుష్పపాత్రలు (flower vases) ప్రదర్శనకు ఉన్నాయి. అంతా తిరుగుతూ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఒక గదిలో ఒక ఈజిప్షియన్ మమ్మీని కూడా చూశాము. గైక్వాడ్ రాజుల, రాణుల నిలువెత్తు తైలవర్ణచిత్రాలు చాలా ఉన్నాయి.

మ్యూజియం భవనాలు ఎరుపురంగుతో ఠీవిగా సమున్నతంగా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి బయట ప్లే ఏరియాలున్నాయి. మొత్తం చూడడానికి గంట పైగా పట్టింది. ఒక చోట సన్నని గ్రిల్‌లో అమర్చిన నోటీసు బోర్డు ఉంది. దాని దగ్గర నిలబడి క్షుణ్ణంగా చదివాము. దాన్ని బట్టి మాకు మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ గురించిన ఎన్నో విషయాలు తెలిశాయి.

సాయాజీగంజ్ లోని డాక్ బంగళా సమీపంలో, కామాటిబాగ్‌లో ఈ మ్యూజియం నిర్మించారు. దీనిని మహారాజా సాయాజీరావ్ గైక్వాడ్ III (1863-1939 AD) స్థాపించారు. ఆయన శాంతికాముకుడు. విద్యావ్యాప్తి కోసం ఎంతో పాటుపడ్డాడు. విద్య, పరిశ్రమల ద్వారా సంపదను సృష్టించాలని ఆయన అభిప్రాయం. ఎన్నో గ్రంథాలయాలు, కళాభవన్, సంస్కృత మహా విద్యాలయ, ప్రాచ్య భాండాగారం ఆయన కాలంలో రూపుదిద్దుకున్నాయి.

మ్యూజియం, ఆర్డ్ గ్యాలరీ రెండు వేర్వేరు రెండంతస్తుల భవనాలు. స్థానిక మరాఠా శిల్పరీతులకు దగ్గరగా, కర్ర ఫ్రేమ్ వర్క్, ఎర్రని ఇటుకలతో కట్టిన గోడలతో ఎంతో రాజసం ఉట్టిపడేలా ఉంటాయవి. గ్రౌండ్ ఫ్లోర్‌లో కొంత యూరోపియన్ శైలి, దక్షిణం వైపు మొట్లు మొగలుల శైలిలో కట్టారు.

దీనిని 1894లో కట్టారు. దీనికి స్ఫూర్తి లండన్ లోని విక్టోరియా & అల్బర్ట్ మ్యూజియం, సైన్సు మ్యూజియంలు. ఆర్ట్ గ్యాలరీలో అత్యంత విలువైన ఒరిజినల్ కలెక్షన్స్, ప్రఖ్యాత బ్రిటీష్ పెయింటర్లు జె.ఎం.డబ్ల్యు టర్నర్, జాన కాన్‌స్టేబుల్ లాంటి దిగ్గజాలు వేసిన చిత్రాలున్నాయి. ఐదవ శతాబ్దానికి చెందిన అరుదైన అకోటా కంచు పాత్రలు, విగ్రహాలున్నాయి. వాటిలో 68 జైన ప్రతిమలు, గుప్తుల కాలం నాటి కంచు విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ. తీర్థంకరుడైన పార్శ్వనాధుని విగ్రహం, ధర్మచక్రం, సింహవాహిని యైన అంబిక, సరస్వతీదేవి విగ్రహాలు మనల్ని కళ్లు తిప్పకోనివ్వవు. ఆర్ట్ లవర్స్‌కు దీని విజిట్ ఒక పండగే.

అక్కడి నుంచి ‘సాయాజీబాగ్’కు వెళ్లాము. మ్యూజియంకు అతి దగ్గర. దాన్ని కామాటీ బాగ్ అంటారు కూడా. దాన్ని కూడా సాయాజీ రావ్ గైక్వాడ్ -3 మహారాజు ఏర్పాటు చేశారు. పశ్చిమ భారతంలోని అతి పెద్ద ఉద్యానవమట. వందెకరాల విస్తీర్ణంలో ఉంది. అంతా తిరిగి చూసే టైం లేదు. ఒక పూల గడియారం పెద్దది (floral clock) మాత్రం చూసి, వెనుదిరిగాము.

తర్వాత మా మాజిలీ ‘కీర్తిమందిర్’. మహారాజా సాయాజీరావ్ గైక్వాడ్ స్మృత్యర్ధం దాన్ని నిర్మించారు. ఆ వంశీయుల బస్ట్ సైజు విగ్రహాలు అక్కడ నెలకొల్పారు. కీర్తి మందిర్ ఇంటీరియర్స్ చాలా కళాత్మకంగా ఉన్నాయి. పెద్ద పెద్ద స్తంభాలు. పై కప్పు అంతా carvings అద్భుతంగా ఉన్నాయి. అన్ని చోట్ల వీడియోలు ఫోటోలు తీశాము.

కీర్తి మందిర్ ను 1936లో నిర్మించారు, సాయాజీ మహరాజు పరిపాలన సిల్వర్ జుబ్లీ సందర్భంగా. భవనం ‘E’ షేప్‌లో ఉంది. పై శిఖరం 35 మీటర్లు ఎత్తుంది. లోపల ఎన్నో బాల్కనీలు, టెర్రెస్‌లు అత్యంత సుందరంగా నిర్మించారు.

  

అక్కడి నుంచి ‘సుర్‌సాగర్’ సరస్సుకు వెళ్లాము. దాన్ని ‘చాంద్ తలావ్’ అని కూడ అంటారట. 18వ శతాబ్దంలో దాన్ని పునరుద్ధరించారు. సరస్సు నిండా అన్ని కాలాల్లో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. దాని మధ్యలో 120 అడుగుల ఎత్తైన అత్యంత మనోహరమైన శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. దాన్ని ‘వడోదర మహానగర్ సేవాసదన్’ వారు నిర్మించారట. సరస్సులోనే, నీరు ఎక్కువైనపుడు పంపటానికి చాలా అండర్ వాటర్ గేట్స్ అమర్చారు.

అక్కడి నుంచి ‘కీర్తిస్తంభ్’ చూడడానికి వెళ్లాం. మహారాజా సాయాజీ గైక్వాడ్ 60 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా దాన్ని 1935లో నిర్మించారు. పింక్ కలర్‌లో ఉండే సంగధ్ శిలతో నిర్మించిన ఆ స్తూపం చాలా బాగుంది. దాని పక్కనే ‘పోలో’ మైదానం.

తర్వాత ‘రాయ్‌పురా టవర్’ చూశాము. దాన్ని ‘మహారాణి చిమ్నాబాయి టవర్’ అని కూడా అంటారు. వడోదర నగరంలోని అత్యంత ప్రముఖ ల్యాండ్‌మార్క్ అది. దాన్ని 1986లో నెల కొల్పారు. అది ఐదంస్తుల శిఖరం. నాలుగో అంతస్తు మీద, నాలుగు వైపులా పెద్ద గడియారాలు అమర్చారు. ఆకాశాన్నంటేంత ఎత్తంది ఆ టవర్.

అప్పుడు ఏడున్నరయింది. ఆత్మారామ్‌జీ స్నాక్స్ కోసం గొడవ చేస్తున్నాడు లోపల. డ్రైవరుకు చెప్పాను.

“సార్, ఇక్కడకు దగ్గర్లో ‘గుప్తా సమోసావాలా’ అనే దుకాణం ఉంది. వడోదరలో చాలా ఫేమస్. చిన్న సందులో ఉంటుంది. కారు వెళ్లదు. నేను మెయిన్ రోడ్ మీద ఆపుతాను. మీరు వెళ్లి తినేసి రండి” అన్నాడు.

‘గుప్తా సమోసావాలా’ చాలా రష్‌గా ఉంది. రకరకాల సమోసాలు వేడి వేడిగా ఇస్తున్నారు. నేను పెద్దది ఒక కార్న్ సమోసా, ఒక ఆనియన్ బోండా తిన్నాను. విశేషమేమేంటే మా యోగానందులవారు, సమోసాలో ఉన్నది మొక్కజొన్న గింజలని తెలిసి, తామూ ఒకటి తిని, దాన్ని ధన్యం చేశారు. పక్కనే ఇలాచీ టీ తాగాము.

రూము చేరేసిరికి ఎనిమిది. స్నానాలు చేసి, మెయిన్ రోడ్‌లో నడుచుకుంటూ వెళ్లాము. అక్కడ ‘దోశ మేళా’ అని బోర్డు కనబడింది. ప్రాణం లేచి వచ్చింది. వాళ్ల దగ్గర ‘మూంగ్ దాల్ దోశ’ కూడ ఉంది. అంటే పెసరట్టు. కాని ఉప్మా కాంబినేషన్ వారికి తెలియనట్లుంది పాపం. ఆనియన్ పెసరట్టు, విత్ బట్టర్ ఆర్డర్ చేశాము. చాలా బాగుంది. తర్వాత పక్కనే సాల్ట్ లస్సీ విత్ మసాలా తాగాము. వదోదరలో ఒక్క లక్ష్మీ విలాస్ ప్యాలెస్ మాత్రం మిగిలిపోయింది.

రూంకు వెళ్లి పడుకున్నాం.

మర్నాడు ఉదయం ఆరు గంటలకే తయారై, అక్కడికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘స్చాచ్యూ ఆప్ యూనిటీ’ని చూడడానికి బయలుదేరాం. సిటీలోనే ఒక చోట ఆగి ‘బినా చీనీ’ కాఫీ తాగాము. ఎనిమిది లోపలే చేరుకున్నాము. అక్కడ పార్కింగ్ ఏరియాను చూసి మతిపోయింది మాకు. అంత పొద్దున్నే వందల సంఖ్యలో కార్లున్నాయి. మా కారును పార్క్ చేయడానికి పావుగంట పట్టింది. అంతా చూసి కారు దగ్గరికే రమ్మన్నాడు డైవరు.

అక్కడి నుంచి స్టాచ్యూ ఉన్న చోటు ఐదు కిలో మీటర్లుంటుంది. ఏదైనా తినేసి పోతే మంచిదనిపించి, అక్కడ చూస్తే, హోటళ్లేమీ లేవు. కాని రోడ్డు పక్కన కొందరు పోహా, గుజరాతీ టెప్లా అమ్ముతున్నారు. టెప్లా అంటే మన తపేలాంటు లాంటిది. దాంట్లో పాలకూర, ఉల్లిపాయలు సన్నగా తరిగి వేశారు. మెత్తగా చాలా రుచిగా ఉంది. పెద్ద పూరీ సైజులో వేడిగా ఉన్నాయి. మూడు తిన్నాము. మూడు ఒకే ప్లేట్ 50 రూపాయలు. చక్కని బ్రేక్‌ఫాస్ట్ దొరికిందనుకొని సంతోషించాము.

అక్కడి నుంచి స్టాచ్యూ దగ్గరకి GSRTC వారు ఉచిత బస్సులు నడుపుతున్నారు. కాని అవి కొంచెం దూరంలోనే ఆపేస్తారట. ఒక అరకిలో మీటరు నడవాల్సి వస్తందట. మాకు టైం తక్కువగా ఉంది. మేం మళ్లీ వడోదరలో లక్ష్మీవిలాస్ ప్యాలెస్ చూసి తీరాలి.

అక్కడ కొన్ని నీలిరంగు ఎలెక్ట్రిక్ ఆటోలున్నాయి. అవయితే సరిగ్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ టికెట్ కౌంటరు వరకు వెళతాయట. ఛార్జీ 110 రూపాయలు. సమంజసమే అనిపించింది. విశేషం ఏమిటంటే ఆటో డ్రయివర్లందరూ 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలలోపు అమ్మాయిలే. వారికి యూనిఫాం ఉంది. గుజరాత్ టూరిజమ్ వారి చేత ఆథరైజ్ చేయబడన ఆటోలవి.

ఒక దాంట్లో ఎక్కి కూర్చున్నాం. ఆ అమ్మాయి పేరు రుక్మిణీబాయి అట. “మీరు మళ్లీ వెనక్కి వస్తానంటే వెయిట్ చేస్తాను సార్, రెండు వైపుల 220 రూపాయలు ప్లస్ వెయిటింగ్ ఛార్జి 80 రూపాయలు మొత్తం మూడు వందలివ్వండి.” అన్నదా పిల్ల. సరే అన్నాము. ఎలక్ట్రిక్ ఆటో సీటు చాలా సౌకర్యవంతంగా, సోఫాలా ఉంది. స్కూటర్ లా చేతికి యాక్కిలరేటర్. అసలు బడబడ శబ్దమే లేదు. మొత్తగా, నిశ్శబ్దంగా పరుగులు తీయసాగింది. ఆ అమ్మాయి డ్రైవ్ చేస్తూంటే మాకు ముచ్చటేసింది.

“బంగారు తల్లి కదారా!” అన్నా మా వాడితో.

“అవునురా!” అన్నాడు వాడు.

చుట్టూ కొండలు పచ్చగా పసరు కక్కుతూ ఉన్నాయి. నాలుగు లేన్ల రోడ్డు. మధ్యలో డివైడర్ వెడల్పుగా ఉంది. దానిలో అందమైన చెట్లను పెంచారు. ఒక కిలోమీటరు దూరం నుంచే సర్దార్ వల్లభాయి పటేల్ సమున్నత విగ్రహం కనబడసాగింది. దూరంగా సర్దార్ సరోవర్ డ్యాం. పావుగంటలో టికెట్ కౌంటర్ వద్ద దింపింది. “మీరు తిరిగి రావడానికి రెండు గంటలు పైనే పడుతుంది సారి. ఇప్పుడు తొమ్మిది కావస్తోంది. పదకొండుకన్నా ఇక్కడికి కాదు, ఎగ్జిట్ గేటు వద్దకు వచ్చేయండి. నేను అక్కడికి వచ్చి ఉంటాను. నా సెల్ నంబరు తీసుకోండి. మీది ఇవ్వండి. నా ఆటో నంబరు కూడా నోట్ చేసుకోండి” అన్నది. “ఏమయినా అడ్వాన్సు ఇమ్మంటావా బేటీ?” అనడిగితే నవ్వుతూ వద్దంది. చివర్లో తీసుకుంటుందట.

కౌంటర్లో రెండు రకాల టికెట్లున్నాయి. ఒకటి 150 రూపాయలు. విగ్రహం పాదాల క్రింద గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్లి చూడవచ్చు. రెండవది 350 రూపాలు లిఫ్ట్‌లో పైకి వెళ్లి, విగ్రహం తల భాగం వరకు వెళ్లి, పై నుంచి డ్యాం సైట్ చూట్టుపక్కల దృశ్యాలు చూడవచ్చు. 350 రూపాయల టికెట్లు రెండు తీసుకున్నాము. క్యాష్ తీసుకోరట. జీపే, ఫోన్ పే లేదట. కేవలం ATM డెడిట్ కార్డు మాత్రమే స్వీకరిస్తారట. అదేం రూలో మరి!

మా దగ్గర ఉన్న SBI ATM డెబిట్ కార్టులో 700 చెల్లించాము. ఒకాయన మా వద్దకు వచ్చి ఇంగ్లీషులో మర్యాదగా ఇలా అడిగాడు.

“కాకా, నా దగ్గర ATM కార్డ్ లేదు. ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ఒప్పుకోరట. మీరు దయ చేసి నాకు సాయం చేయాలి. మీకు 700 రూపాయలు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేస్తాను. మీ కార్టుతో నాకు నా బార్యకూ రెండు టికెట్లు తీసుకోండి ప్లీజ్!”

“దానికేం భాగ్యం? అలాగే” అన్నాం.

ఆయన భార్య మాకు నమస్కరించింది. ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా ఉందామె.

“బహుత్ బహుత్ శుక్రియా, అంకుల్ జీ!” అన్నది. వాళ్లు హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారట. వారికీ టికెట్లు తీశాము.

నేను ‘స్టాచ్యూ ఆఫ్ యానిటీ’ అంటే ఇంకా ఏదో అనుకున్నా. మన హుసేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం లాగా చాలా ఎత్తైన పటేల్ విగ్రహం ఉంటుందిలే, దాన్ని దూరం నుంచి చూసి రావడమే అనుకన్నా. కాని లేడీ ఆటో డ్రైవర్ అంతా చూసి రావడానికి రెండు గంటలు పడుతుందన్నపుడే అనుమానవం వచ్చింది, అదంత సింపుల్‌గా తేలే వ్యవహారం కాదని.

దూరంగా విగ్రహం కనబడుతూంది. దాని దగ్గరకి వెళ్లడానికి దాదాపు 400 మీటర్లు దూరం ఉన్న ఎంట్రన్స్ దారి ఉంది. అది ఇంచుమించు ముఫై అడుగుల వెడల్పు ఉంది, కొనామొదలూ ఒక ఆర్చిలాగా కప్పబడి ఉంది. అటూ ఇటూ అందమైన స్తంభాలు. రెండు వైపులా కొండలు, లోయలు, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అ దారి పైన వేసిన పై కప్పు చాలా ఆర్టిస్టిక్‌గా ఉంది. దాని అంచులకు ప్రతి ఐదడుగులకూ ఒక అందమైన ఎలక్ట్రిక్ దీపం వేలాడుతుంది. పై కప్పులో కూడ దీపాలు అమర్చారు. చీకటి పడింతర్వాత ఐతే ఆ లైట్ల వైభవం బాగుంటుంది.

దారి కిరువైపులా మూడున్నర అడుగుల వెడల్పున స్టాచ్యూ వరకు మూవింగ్ ప్లాట్‌ఫామ్ ఉంది. అవి వన్ వే. వెళ్లేవాళ్లు ఒక వైపు తిరిగి వచ్చే వాళ్లు మరో వైపు దాని మీద నడవకుండా కదులుతూ వెళ్పోవచ్చు. యూత్ దాన్ని పట్టించుకోకుండా మధ్యలో చకచకా నడుస్తున్నారు. కాని మాలాంటి సీనియర్ సిటిజన్స్‌కు ఆ ఎలక్ట్రానిక్ ప్యారెలల్ ఎస్కలేటర్ (ఇంగ్లీషు అనువాదం కరెక్ట్ కాదని తెలుస్తూనే ఉంది. తెలుగు పదం ఎంత ఆలోచించినా తట్టి చావడం లేదే మరి! స్వయం చాలత పాదచార ఉపరితలం అంటామా పోనీ? అది సంస్కృతమోయే!) చాలా సౌకర్యంగా ఉంది. కుడివైపు దాని మీద హయిగా ప్రయాణించి విగ్రహం వద్దకు చేరుకున్నాం.

నర్మదానది అక్కడి నుంచి అతి మనోహరంగా కనబడుతూంది. సూర్యకాంతి పడి నది నీరు తళతళా మెరుస్తూంది. డ్యాం నిరోధించడం వల్ల కాబోలు నీరు ప్రవహించడం లేదు. రిజర్వాయర్‌లా ఉంది.

విగ్రహం పాదాల లెవెల్‌లో విశాలమైన లాబీ ఉంది. అక్కడ ఎన్నో ఆకర్ణణలున్నాయి. అక్కడ సర్దార్ గారి ముఖం మాత్రం నిలబెట్టబడి ఉంది. అదే పదడుగుల వెడల్పు ఉంది. దానిలో జీవకళ ఉట్టి పడుతూంది. విశాలముగా ఉన్న ఫాలభాగం. తీక్షణమైన కళ్ళతో, భారతావని నంతా ఏకీకరణ చేసిన ఆ మహానుభావుని ముఖ వర్చస్సు ప్రశాంత గంభీరంగా ఉంది.

దాని వెనుకగా విగ్రహాన్ని ఇనాగరేషన్ చేసిన సందర్బంలో చేసిన ఫ్లెక్సీలున్నాయి. అందులో ప్రధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, రాజ్‌నాధ్ సింగ్ ఇంకా ప్రముఖ నాయకులున్నారు. వెంకయ్య నాయుడు అందులో పాంటు టీషర్టు వేసుకొని కుర్రాడిలా ఉన్నారు. ఆ సందర్భానికి ఆ డ్రస్ ఎందుకు ఎంచుకున్నారో. ఆయన మాములుగా, మనం ఎక్కడ చూసినా, తెలుగుతనం ఉట్టిపడేలా, పంచెకట్టుతో ఉంటారు కదా! ఏమోలే ఆయనిష్టం!

ఒక ప్రక్క పెద్ద పెయింటింగ్ ఒక ఫ్రేములో బింగించి ఒక స్టాండ్‌కు అమర్చి ఉంది. అందులో భారత యూనియన్‌లో తమ సంస్థానాలను విలీనం చేసిన రాజులందరూ ఉన్నారు. క్రింద వారి పేర్లను బ్రాకెట్లో వారి రాజ్యాలను రాసి ఉన్నారు. లార్డ్ మౌంట్‌బాటెన్ కూడా ఉన్నాడు. వారందరినీ నయాన భయాన ఇండియన్ రిపబ్లిక్‌లో కలిపిన మేరునగధీరుడు సర్దార్ వల్లభాయి పటేల్ ఉన్నారు. వారిలో కొందరి ముఖాలు సంతోషంగా, కొందరివి భావరహితంగా ఉన్నట్లు నా కనిపించింది. అదే మాట మా వాడితో అంటే,

“అంతే కదరా, స్వచ్ఛందంగా కలిసిన వారు సంతోషంగా ఉంటారు. కలవకపోతే తంతాడని కలిసినవారు మూడీగా ఉంటారు” అన్నాడు వాడు నవ్వుతూ .

“ఊరు అందరిదీ ఒక దారయితే ఉలిపికట్టె దొకదారని, మన నిజాం నవాబు మాత్రం తాను పాకిస్తాన్‌లో కలుస్తానన్నాడు. హైదరాబాద్ ఎక్కడుంది. పాకిస్తాన్ ఎక్కడుంది? మోకాలికీ బోడిగుండుకు ముడి వేసినట్లుంది! ఇలా కాదు వీడితో అని, పటేల్ నిజాం సంస్థానం మీద సైనిక చర్యకు ఆదేశించారు. ఇండియన్ ఆర్మీ వచ్చి గూబవాయ గొడుతుందని తెలియాగనే, చచ్చినట్లు లొంగిపోయాడు సాయుబుగారు!” అన్నాను కోపంగా.

“ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడెందుకురా నీకు కోపం!” అన్నాడు మావాడు నవ్వుతూ.

లాంచీ చాలా విశాలంగా ఉంది. ఒక చోట PLEDGE అని వ్రాసి ఉంది. ఒక కంప్యూటర్ మానిటర్, కీ బోర్డు ఉన్నాయి. ఎదురుగ్గా గోడకు ఐదారు రకాల ప్రతిజ్ఞలు ఇంగ్లీషులో రాసి ఉన్నాయి. మనం విగ్రహాన్ని సందర్శించిన సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞను అక్కడ రికార్డు చేయవచ్చు.

మనం ప్లడ్జ్‌ను సెలెక్ట్ చేసి, మన పేరు, ఊరు, ఇంకా కొన్ని వివరాలు ఎంటర్ చేస్తే, అదంతా ఎదురుగ్గా గోడపై డిస్‌ప్లే అవుతుంది. మేం ఈ క్రింది ప్లెడ్జ్‌ను ఎన్నుకున్నాం.

“I pledge to stand for my identity, as an Indian first to make my India a proud nation.”

“నేను మొదటగా, ఒక భారతీయుడుగానే నా గుర్తింపు కోసం నిలబడతాను, నా భారతదేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేయడానికి.”

ఇంకొంచెం ముందుకు వెళ్లాము. అక్కడ ఒక అందమైన గోడ ఉంది. దాని పేరు ‘wall of unity’ (ఐక్యతా కుడ్యం) దని మీద ఈ సందేశం వ్రాసి ఉంది.

“The soil of the nation as the soul of nation”

“జాతి యొక్క మట్టే జాతి యొక్క ఆత్మ.”

ఎంతో మంది రైతులు విగ్రహం కోసం తమ పొలాల్లోని మట్టిని సమర్పించారట. సర్దార్ కూడ స్వయంగా ఒక రైతే! స్వచ్ఛంద, సామాజిక సంస్థల సహకారంతో 1,69,000 గ్రామాల నుండి పొలాలలోని మట్టిని సేకరించారు.

కొంచెం దూరంలో మరో స్మారక చిహ్నాన్ని చూశాము. దాని మీద ఇలా రాసి ఉంది.

“ Ek Bharath Sreshta Bharath .”

“ఐక్య భారతమే శ్రేష్ఠ భారతం.”

పటేల్ విగ్రహం. The statue of unity, 182 మీటర్ల ఎత్తు ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పైకి వెళ్లడానికి ఒక విశాలమైన లిఫ్ట్ లో ప్రవేశించాము. చాలా పెద్ద లిఫ్ట్ అది. లిఫ్ట్ ఆపరేటర్ ఉన్నాడు. లిఫ్ట్ లో ప్రపంచంలో ఇతర విగ్రహాలు, వాటి వివరాలు, ఎత్తులు ఉన్న ఒక పెయింటింగ్ ఉంది. దాన్ని చదివాము.

  1. స్టాచ్యూ ఆఫ్ లిబర్డీ. యు.ఎస్.ఎ. 93 మీటర్లు. 1886లో నిర్మించారు.
  2. యూషికు దయాబట్సు విగ్రహం. జపాన్. 120 మీటర్లు. 1993లో నిర్మించారు.
  3. స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం చైనా. 153 మీటర్లు.
  4. స్టాచ్యూ ఆప్ యూనిటీ గుజరాత్, ఇండియా 182 మీటర్లు. 2018లో నిర్మించారు.

ఆ లిఫ్ట్‌లో పైకి వెళ్లాము. అక్కడ కూడ విశాలంగా ఉంది. బలమైన పారదర్శిక గ్లాసులు బిగించి ఉన్నాయి. వాట దగ్గరకు పోయి చేతులు పెట్టకుండా ఒక రెండుగులు దూరం వరకు రెయిలింగ్స్ ఉంచారు. అక్కడి నుంచి చూస్తే breath taking అంటారే అలా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం. వివిధ యాంగిల్స్‌లో సర్దార్ సరోవర్ డ్యాంను, నది మీద బ్రిడ్జ్‌ను నర్మాదా నదిని, రిజర్వాయర్‌ను చూశాము. దూరంగా కొండలనడుమ విస్తరించి ఉన్నాయి. నర్మాదనదీ జలాలు. దూరంగా రోడ్డు మెలికలు తిరిగి, చిన్న గీతలా ఉంది. దాని మీద వెళుతున్న వాహనాలు బొమ్మల్లా ఉన్నాయి ఫోటోలు, వీడియోలు తీశాము.

లిఫ్ట్‌లో పదిహేను మంది ఈజీగా వెళ్లొచ్చు. అక్కడ నుంచే విగ్రహానికి దన్నుగా ఉన్న భారీ మెటల్ స్ట్రక్చర్‌ను చాశాము. మనకు పైన కనబడే విగ్రహం వెనుక ఇంత సాంకేతికత ఉందా అని ఆశ్చర్యపోయాము.

లిఫ్ట్‌లో క్రిందికి వచ్చాము. అక్కడ ఒక మినీ థియేటర్ ఉంది. మొత్తం లాబీలో అంతా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండీషన్డ్ చేశారు. ఆ థియేటర్‌లో 30 మంది పడతారంతే. అక్కడ ఒక అరగంట నిడివిగల ఒక డాక్యుమెంటరీ ప్రదర్శిస్తున్నారు. వెళ్లి కూర్చున్నాము. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్‌కు ఎప్పుడు శంఖుస్థాపన చేశారు. దాని నిర్మాణంలోని వివిద దశలు. దాని క్రింద ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ వివరాలు, ఎన్ని వేల ఎకరాలు దాని వల్ల సాగు అవుతూంది. విగ్రహం తయారీ, నెలకొల్పడం ఇలా సవివరంగా ఆ డాక్యుమెంటరీలో చూపించారు. ఒక ఇ-స్క్రీన్ 200 cm x 200 cm కొలతలు గల దాని పై దాన్ని ప్రదర్శించారు. వ్యాఖ్యనం ఇంగ్లీషులో ఉండడం వల్ల మాకు బాగా అర్ధమయింది.

బయటకి వచ్చేశాము. మొత్తం క్యాంపస్ అంతా అత్యంత పరిశుభ్రంగా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఎక్కడా చిన్న కాగితం ముక్క కూడా దొరకలేదు చూద్దామన్నా. చిన్న దుమ్ము కణం కూడాను. అడుగుడునా వాష్‌రూమ్స్ అంతార్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయి. అంతటా సెక్యూరిటీ గార్డ్స్, అప్రమత్తంగా అందరినీ వాచ్ చేస్తున్నారు. సి.సి. కెమోరాలు సరేసరి. వారి వెంట శిక్షణ పొందిన జర్మన్ షెపర్డ్, ల్యాబ్రడార్ జాతికి చెందిన కుక్కలు సంచరిస్తున్నాయి. డామ్ సైట్‌ను చూడడానికి అనువుగా ఒక డెక్ లాంటి ప్రదేశంతో రిక్లైనర్స్, బెంచీలు వేసి ఉన్నాయి. మొత్తానికి అదో విశేష ప్రపంచం. రెండున్నర గంటల తర్వాత ఎగ్జిట్ గేటు వైపు నడవసాగాము. ఒక అద్భుతమైన ప్రదేశాన్ని దర్శించగలిగామన్న తృప్తితో.

ఎక్జిట్ గేటుకి వతల ఒక వెయిటింగ్ ఏరియాను చేరుకున్నాము. వాటర్ బాటిల్స్ కొనాల్సిన పనేలేదు. అడుగుడుగునా మినరల్ వాటర్ అవుట్‌లెట్లు ఉన్నాయి, డిస్పోజబుల్ పేపర్ గ్లాసులతో సహా.

వెయిటింగ్ ఏరియాలో రిలాక్స్ అవుతూ, ఆటో డ్రైవర్ రుక్మీణీ బాయికి ఫోన్ చేశాము, వచ్చేయమని. పావుగంటలో వస్తానని చెప్పిందా అమ్మాయి. అక్కడ ఉన్న నోటీస్ బోర్డులను చదవసాగాము. వాటిని బట్టి మాకు మరిన్ని విషయాలు తెలిశాయి.

అక్కడ నుంచి క్యాక్టస్ గార్డెన్‌కు వెళ్లాము ఆటోలో. అక్కడ 6 లక్షల మొక్కలు, 450 జాతులవి, 25 ఎకరాల విస్తీర్ణంలో పెంచుతున్నారు. వాటి మీద 836 చదరపు మీటర్ల మేర ఒక డోమ్‌ను అందంగా తీర్చిదిద్దారు.

అక్కడ నుంచి రివర్ ర్యాఫ్టింగ్ సైట్‌కు వెళ్లాము. సుడిగుండాలు, మలుపులు మధ్య అతి వేగంగా పడవల్లో రయ్యి రయ్యి మని దూసుకెళుతున్నారు సాహసవంతులైన యవకులు. మాకంత సీన్ లేదు! రెయిలింగ్స్ నానుకొని నిలబడి వారి విన్యాసాలను చూశాము.

సర్దార్ పటేల్ 143వ జన్మదినం సందర్భంగా విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతాన్ని కేవాడియా అంటారు. మొత్తం ఏరియాను ‘ఏక్‌తానగర్’ అంటారు. దాని సౌందర్యాన్ని రాత్రి చూడాల్సిందేనట. ఏక్‌తా ద్వార్ నుంచి డ్యామ్ వరకు 8.5 కిలోమీటర్లు దూరం, రంగు రుంగుల మోటిఫ్స్ దీపాలు వెలిగిస్తారట. నియాన్ లైట్లు కళ్లు, మిరుమిట్లుగొలుపు తాయట. స్టాట్యూ ఆఫ్ యూనిటీ వింధ్య పర్వతాలకూ,సాత్పూరా పర్వత శ్లేణికి మధ్యలో నర్మదా నది ఒడ్డున సమున్నతంగా నిలబడి ఉంటుంది. ఇంకా బట్టర్ ఫ్లై గార్డెన్, ఏక్‌తా నర్సరీ, విశ్వవన్, సర్క్యూట్ హౌస్ అన్నీ బయటి నుంచే చూశాము. అన్నీ తిరగాలంటే ఒక రోజు సరిపోదు. డ్యామ్ మీద అనేక రంగుల కాంతుల వరస నయనానందకరంగా ఉంటుందట. మాకు రాత్రి అవన్నీ చూసే భాగ్యం లేదు.ప్రతి ప్యాకేజీలో కొన్ని పరిమితులుంటాయి!

ప్రతి సంవత్సరం మూడు లక్షల మంది సందర్శకులు విగ్రహాన్ని చూడడానికి వస్తారట. విగ్రహాన్ని స్టీల్ ఫ్రేమింగ్, కాంక్టీటు మరియు ఇత్తడి పూతతో తయారు చేశారు. విగ్రహం పని 31 అక్టోబరు 2013 నాడు ప్రారంభమై 2018లో అక్టోబర్ 30న ముగిసింది. అంటే అయిదేళ్లు పట్టింది. 31 అక్టోబర్ న ప్రారంభోత్సవం చేశారు.

ఈ ప్రాజెక్ట్ ను 2010లో ప్రకటించారు. 2013లో L&T (లార్సెన్ & టూబో) కంపెనీ దీనిని ప్రారంభించింది. మొత్తం నిర్మాణవ్యయం 27 బిలియన్ల ఇండియన్ కరెన్సీ ఖర్చయింది. 422 మిలియన్ల యు.ఎ.స్ డాలర్లకి సమానం. దీనిని రూపొందించిన వారు మన భారతీయ శిల్పి రామ్ వి.సుతార్. నిర్మాణంలో 3000 మంది కార్మికులు, 250 మంది ఇంజనీర్లు పని చేశారు.

భారతీయులందరూ గర్వించ తగిన, సందర్శించతగిన అత్భుతమైన చోటు ఇది. ఎందుకంటే భారతీయులంతా ఒక్కటే అనే సమైక్యతా భావాన్ని ఇది పెంపొందిస్తూ ఉంది. రోజూ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది యాత్రికులు చెల్లంచే టికెట్ ఛార్జీలు ద్వారా, (రెండు రకాల టికెట్ల) సగటున రోజుకు 60 నుంచి డెభై లక్షల రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది.

ప్రతి సోమవారం మెయిన్‌టెనెన్స్ కోసం ఈ చారిత్రిక ప్రదేశం సందర్శకులకు అందుబాటులో ఉండదు.

రుక్మిణీ బాయి మమ్మల్ని కార్ పార్కింగ్ దగ్గర దింపింది. అప్పుడు టైం ఒంటిగంట కావస్తుంది. ఆ అమ్మాయికి ఐదు వందలు ఇస్తే రెండు వందలు వెనక్కు ఇచ్చింది. ఎంత బ్రతిమాలినా అదనపు డబ్బు తీసుకోలేదు. “నీతో ఒక ఫోటో తీసుకుంటాము తల్లీ! నేను ఒక రైటర్‌ను, నీ గురించి ట్రావెలాగ్‌లో రాస్తాను” అంటే సంతోషంగా ఒప్పుకుందా బంగారుతల్లి!

(ఫోటోలు – కొన్ని ఇంటర్‍నెట్ నుంచి సేకరణ, కొన్ని రచయిత తీసినవి)

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here